Narendra Modi: మనమే ప్రపంచ సారథులం | Narendra Modi: Modi addresses Indian diaspora in New York | Sakshi
Sakshi News home page

Narendra Modi: మనమే ప్రపంచ సారథులం

Published Mon, Sep 23 2024 4:32 AM | Last Updated on Mon, Sep 23 2024 4:32 AM

Narendra Modi: Modi addresses Indian diaspora in New York

అనుసరించే రోజులకు చెల్లు 

భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగంలో ప్రధాని మోదీ 

కిక్కిరిసిపోయిన న్యూయార్క్‌లోని నాసౌ కొలోజియం 

42కుపైగా రాష్ట్రాల నుంచి తరలివచ్చిన ఎన్నారైలు 

ఎన్నారైలకు ప్రపంచమంతా జేజేలు కొడుతోందన్న మోదీ 

భారత కీర్తి పతాకను ఎగరేస్తున్నారని కితాబు

న్యూయార్క్‌: ‘‘అన్ని రంగాల్లోనూ ఇతరులను అనుసరించిన పాత రోజులను దాటుకుని గత పదేళ్లలో భారత్‌ ఎంతో ప్రగతి సాధించింది. ఇతర దేశాలకు మార్గదర్శకత్వం వహించే స్థాయికి చేరుకుంది. ప్రపంచ సారథిగా ఎదుగుతోంది. అవకాశాల ఇంకెంతమాత్రమూ కోసం ఎదురు చూడటం లేదు. అవకాశాలను సృష్టించుకుంటూ సాగుతోంది. అంతులేని అవకాశాలకు నెలవుగా మారింది. 

ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో ఇతర దేశాలను ముందుండి నడిపిస్తోంది’’ అని ప్రధాన నరేంద్ర మోదీ అన్నారు. ఈ అద్భుత ప్రగతిలో విదేశాల్లోని భారతీయులది అత్యంత కీలక పాత్ర అంటూ కొనియాడారు. వారి త్యాగాలు వెలకట్టలేనివని అభిప్రాయపడ్డారు. అమెరికాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లో భారతీయ అమెరికన్లతో ప్రధాని భేటీ అయ్యారు. 

స్థానిక నాసౌ వెటరన్స్‌ కొలోజియం స్టేడియంలో జరిగిన ఈ సమావేశానికి ఎన్నారైలు పోటెత్తారు. న్యూయార్క్, పరిసర న్యూజెర్సీ నుంచేగాక మొత్తం 42 రాష్ట్రాలనుంచి 13,000 మందికి పైగా సభకు హాజరయ్యారు. సమావేశం ఆద్యంతం ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆయన వేదికపైకి చేరుకున్న తర్వాత కూడా నిమిషాల పాటు కరతాళ ధ్వనులు ఆగకుండా కొనసాగాయి. అనంతరం మోదీ మాట్లాడుతూ వారి అభిమానం తనను కదిలించివేసిందన్నారు. 

ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మన భారతీయులు నాపై ఇలా చెప్పలేనంతటి ఆదరాభిమానాలు, ఆప్యాయత కురిపిస్తూనే ఉన్నారు. దీనికి శాశ్వతంగా రుణపడిపోయాను’’ అని చెప్పారు. భారత, అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో ఇండయన్‌ అమెరికన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మోదీ ప్రసంగం గంటా పది నిమిషాల పాటు సాగింది.

 ప్రసంగం పొడవునా సభికులు పదేపదే చప్పట్లు కొడుతూ, నినాదాలు చేస్తూ సందడి చేశారు. అంతకుముందు వేదికపై ‘ద ఎకోస్‌ ఆఫ్‌ ఇండియా – అ జర్నీ త్రూ ఆర్ట్‌ అండ్‌ ట్రెడిషన్‌’ పేరిట 382 మంది జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కళాకారుల ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. గ్రామీ అవార్డు విజేత చంద్రికా టాండన్, గాయక సంచలనం రెక్స్‌ డిసౌజా, తెలుగు సినీ దర్శకుడు, గాయకుడు దేవీశ్రీ ప్రసాద్‌ తదితరులు వీటిలో పాల్గొన్నారు. 

భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నాం 
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గి వరుసగా మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టడాన్ని మోదీ ప్రస్తావించారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోందన్నారు. భారత ప్రగతి కోసం ఈసారి అత్యంత భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నట్టు చెప్పారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన తాను ఈ స్థాయికి ఎదుగుతానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. 

‘‘విధి నన్ను రాజకీయాల్లోకి తీసుకొచి్చంది. అనుకోకుండా గుజరాత్‌కు సీఎం అయ్యాను. ఆ రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు సేవలందించిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించాను. తర్వాత దేశ ప్రజలు నన్ను ప్రధానిని చేసి మరింత పెద్ద బాధ్యత కట్టబెట్టారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘దేశ ప్రగతికి, సుపరిపాలనకు నా జీవితాన్ని అంకితం చేశాను.

 అధ్యక్షుడు జో బైడెన్‌ శనివారం నన్ను దగ్గరుండి ఆహా్వనించి మరీ తన ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆయన చూపిన గౌరవం నన్నెంతగానో కదిలించింది. అది 140 కోట్ల పై చిలుకు భారతీయులకు దక్కిన గౌరవం. అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులకు, వారి నిరంతర కృషికి దక్కిన గౌరవం’’ అన్నారు. దశాబ్దాల క్రితం తొలిసారి తాను అమెరికాకు వచ్చిన రోజులను మోదీ గుర్తు చేసుకున్నారు. 

ప్రపంచ శాంతిలో కీలక పాత్ర 
అంతర్జాతీయంగా ఆధిపత్యం సాగించడం భారత అభిమతం కాదని మోదీ అన్నారు. అయితే ప్రపంచ ప్రగతిలో, శాంతి సాధనలో కీలక పాత్ర పోషించేందుకు మాత్రం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ‘అందరికీ సమ దూరం’ అన్నది పాత విధానం. ‘అందరితోనూ సమాన సాన్నిహిత్యం’ అన్నదే నవభారత నినాదం’ అని వివరించారు. ఇది యుద్ధాలకు సమయం కాదని పునరుద్ఘాటించారు. ‘‘భారత్‌ అంటే ఫైర్‌ కాదు.

 ప్రపంచానికి వెలుగునిచ్చే సూరీడు’’ అన్నారు. బోస్టన్, లాస్‌ ఏంజెలెస్‌ నగరాల్లో నూతనంగా కాన్సులేట్లను ప్రారంభించనున్నట్టు ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు. గతేడాది ప్రకటించిన సియాటెల్‌ కాన్సులేట్‌ ఇప్పటికే ప్రారంభమైందని గుర్తు చేశారు. అమెరికాకు ఫార్మా, విద్యా రంగాల్లో రాజధానిగా బోస్టన్‌కు పేరుంది. ఇక లాస్‌ ఏంజెలెస్‌ హాలీవుడ్‌కు పుట్టిల్లన్నది తెలిసిందే.

పుష్ప... వికసిత భారత్‌! 
‘‘వికసిత భారత్‌ అంటే ‘పుష్ప’. ప్రోగ్రెసివ్, అన్‌స్టాపబుల్, స్పిరిచ్యువల్, హ్యుమానిటీ, ప్రాస్పరస్‌’’ అంటూ మోదీ కొత్త నిర్వచనమిచ్చారు. దీనికి సభికుల నుంచి బ్రహా్మండమైన స్పందన వచి్చంది. అలాగే, ‘‘ఏఐ అంటే కూడా ఆస్పిరేషనల్‌ ఇండియా. ఏఐ అంటే అమెరికన్‌ ఇండియన్స్‌’’ అని కొత్త నిర్వచనాలిచ్చారు.

అమెరికాను మించిన భారత 5జీ మార్కెట్‌ 
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌ అద్భుత ప్రగతి సాధిస్తూ దూసుకెళ్తోందని మోదీ అన్నారు. ఫలితంగా కేవలం రెండేళ్ల వ్యవధిలోనే భారత 5జీ మార్కెట్‌ అమెరికాను కూడా మించిపోయిందని వివరించారు. మేడిన్‌ ఇండియా 6జీ టెక్నాలజీపై కూడా భారత్‌లో పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ‘‘ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత మొబైల్‌ బ్రాండ్లన్నీ దాదాపుగా భారత్‌లోనే తయారవుతున్నాయి. భారత సెమీ కండక్టర్‌ చిప్‌లను అమెరికా దిగుమతి చేసుకునే రోజులు ఎంతో దూరంలో లేవు. ప్రపంచమంతా మేడిన్‌ ఇండియా చిప్‌ల మీదే ఆధారపడి నడవనుంది. ఇది మోదీ గ్యారెంటీ’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement