దేశంలో ఉన్న ఎన్నో సమస్యలకు సైన్స్, సృజనాత్మకతల సమర్థ మేళవింపుతో మంచి పరిష్కారాలు కనుక్కోవచ్చు. అయితే శాస్త్రవేత్తలు రూపొందించినవే కాదు, గ్రామీణ స్థాయిలో అతితక్కువ ఖర్చుతో కూడుకున్న, కేవలం అవసరానికి తగ్గ సృజనాత్మక పరిష్కారాలూ మనదగ్గర ఉన్నాయి. వీటన్నింటినీ సాధారణ ప్రజలు వారి అవసరానికి తగ్గట్టు అభివృద్ధి పరిచారు. మరి ఈ అట్టడుగు స్థాయి పరిష్కారాలూ, డీప్ టెక్ వంటి అత్యాధునిక పరిష్కారాలూ వేర్వేరుగా ఎదగాల్సిందేనా? ఈ రెండింటినీ మేళవించలేమా? ఈ కీలకమైన ప్రశ్నకు సమాధానం వెతికేందుకు ఒక ప్రయత్నం మొదలైంది. ఢిల్లీలో జరిగిన ‘పీపుల్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇన్నొవేషన్స్’ ఇందుకు వేదికైంది.
భారత్ కేవలం 140 కోట్ల జనాభా ఉన్న దేశం మాత్రమే కాదు, సవాలక్ష సమస్యలతో కూడినది కూడా. సైన్స్, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకతల సమర్థ మేళవింపు, వినియోగాలతో ఈ సమస్యలకు పరిష్కారాలు కను క్కోవచ్చు. కూడు, గూడు, ఆరోగ్యం, స్వచ్ఛమైన గాలి, నీరు, సమాచార వినిమయం, విద్యుత్తు, విద్య, వ్యవసాయం వంటి అనేక మౌలిక అంశాలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు అవ సరం. అలాగని వీటికి పరిష్కారాలు, సాంకేతిక పరిజ్ఞానాలు అస్సలు లేవని కాదు. ఉన్నవి అందరికీ అందుబాటులో లేవు, లేదా భరించ గలిగే స్థాయిలో లేకపోవచ్చు. ఈ రెండు సాధ్యమైనా అవి అంత సుస్థిరమైనవి కాకపోవచ్చు.
ఒకవైపు మనకు సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పరిష్కారం ఉండ వచ్చు కానీ, కొత్త పరికరాలు, పరిష్కారాలన్నీ ఆధునిక టెక్నాలజీలతో కూడుకున్నవి. ఇప్పుడేమో అన్నింటికీ ‘డీప్ టెక్’ అన్నది అలవడి పోతోంది. ఇవన్నీ ఇంజినీరింగ్ రంగంలోని వేర్వేరు శాఖల్లో వచ్చిన తాజా మార్పుల ఆధారంగా రూపొందినవే. డీప్ టెక్ అన్నా అది కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, హ్యాప్టిక్స్, రోబోటిక్స్, బ్లాక్‌చెయిన్, బిగ్ డేటా వంటి ఎదుగుతున్న ఇంజినీరింగ్ రంగ సాంకేతిక పరిజ్ఞానాలే.
ఇంకోవైపు... గ్రామీణ స్థాయిలో అతితక్కువ ఖర్చుతో కూడు కున్న, కేవలం అవసరానికి తగ్గ సృజనాత్మక పరిష్కారాలూ ఉన్నాయి. వీటన్నింటినీ శాస్త్రవేత్తలు కాకుండా... స్థానిక సమస్యలకు సాధారణ ప్రజలు అభివృద్ధి చేసిన పరిష్కారాలు. ప్రశ్న ఏమిటంటే... ఈ అట్టడుగు స్థాయి పరిష్కారాలూ... డీప్ టెక్ వంటి అత్యాధునిక పరి ష్కారాలూ... వేర్వేరుగా ఎదగాల్సిందేనా? రెండూ కలిసి పనిచేయగల స్థితి ఉందా?.
ఈ కీలకమైన ప్రశ్నకు సమాధానం వెతికేందుకు ఇప్పుడిప్పుడే ఒక ప్రయత్నం మొదలైంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న టెక్నాలజీ ఇన్‌క్యుబేటర్ ‘సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ ప్లాట్‌ఫామ్స్’; ప్రొఫెసర్ అనిల్ గుప్తా స్థాపించిన ‘గ్రాస్‌రూట్ ఇన్నొవేషన్స్ అగ్‌మెంటేషన్ నెట్‌వర్క్’ (జీఐఏఎన్) సంయుక్తంగా ఇటీవల ఏర్పాటు చేసిన ‘పీపుల్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇన్నొవేషన్స్’ ఇందుకు వేదికైంది. అట్టడుగు స్థాయి సృజనాత్మక ఆవిష్కరణలు, శాస్త్రాధారిత ఆవిష్కరణలు రెండింటినీ ప్రదర్శించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో ఇరు పక్షాలు ఒకరి నుంచి ఇంకొకరు నేర్చుకునేందుకు, సామాజిక అవసరాల కోసం పరస్పర సహకారంతో కృషి చేసేందుకు అవకాశం కల్పించడం కూడా ఇందులో ఉన్నాయి.
బహుళార్థక ఆహార శుద్ధి యంత్రాన్ని తయారు చేసిన ధరమ్‌వీర్‡ కంబోజ్ (యమునా నగర్), గ్యాస్‌బండను సులువుగా మోసుకెళ్లేం దుకు మడిచే యంత్రం సిద్ధం చేసిన ముష్తాక్ అహ్మద్ దార్(కశ్మీర్)... కుంగుబాటు సమస్య పరిష్కారానికి ఓ వేరబుల్ యంత్రాన్ని తయారు చేసిన స్టిమ్ వేదా న్యూరోసైన్సెస్‌కు చెందిన యల్లాప్రగడ రమ్య, లక్ష్య సహాని, సీలింగ్ ఫ్యాన్‌కు చిన్న పరికరాన్ని అమర్చడం ద్వారా వాయు కాలుష్యాన్ని తొలగించగల ‘స్వచ్ఛ.ఐఓ’ స్థాపకుడు కరణ్ రావులతో ఇక్కడ చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూస్తాం.
ఇలాంటి వేదికలు ఇరు పక్షాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు బాగా ఉపయోగపడతాయి. ఒక వర్గం టెక్నాలజీ సంస్థలు, ఇన్‌క్యుబేటర్స్, వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ వంటి అధికారిక సంస్థల నుంచి వచ్చే ఆవిష్కరణలు ఒక వర్గంగా ఉంటే... అట్టగు వర్గాల సృజనశీలుర సామాజిక, విద్య, ఆర్థిక నేపథ్యం వేర్వేరుగా ఉంటోంది. తమ ఆవిష్కరణలను పరిశీలించే, పరీక్షించే, నిర్ధారించే ఏర్పాట్లు వీరి వద్ద అస్సలు ఉండవు. చాలామంది పాఠశాల విద్య కూడా పూర్తి చేసి ఉండరు. అయితే ఇవి వాస్తవికంగా ఉంటాయి. బాగా అవసరం అనుకున్న సమస్యలకు పరిష్కారాలుగా ఉంటాయి. తగిన సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో వీటిని మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
కొన్నేళ్లుగా అట్టడుగు వర్గ సృజనశీలురకు జీఐఏఎన్ వంటి సంస్థలు సహాయ, సహకారాలు అందిస్తున్నాయి.
ఉదాహరణకు ధరమ్‌వీర్ కంబోజ్ ఫుడ్ ప్రాసెసర్ ఇప్పుడు వందల మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేరింది. వారు మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ఏటా కోట్లలో ఆదాయమూ సంపాదిస్తున్నారు. అంతేకాదు... ఈ ఫుడ్ ప్రాసెసర్ ఇప్పుడు ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలకు ఎగుమతి అవుతోంది కూడా. ఒకప్పుడు ఢిల్లీ వీధుల్లో రిక్షా తొక్కిన ధరమ్‌వీర్ ఇప్పుడు ఈ స్థాయికి చేరడం నిజంగానే స్ఫూర్తిదాయకం. బంకమట్టితో చేసిన ఫ్రిడ్జ్‌లాంటి పరికరం ‘మిట్టీ కూల్’ కూడా ఇలాంటి ఓ గ్రాస్‌రూట్ ఉత్పత్తే. మార్కెట్‌లోనూ ఇది మంచి విజయం సాధించింది.
సామాజిక అవసరాలకు టెక్నాలజీ ఆసరా..
సామాజిక అవసరాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కొత్తేమీ కాదు. 1970లలోనే మొదలైంది. దేశంలోని సైన్స్ అండ్ టెక్నా లజీ సంస్థలు గ్రామీణ పేదలకు చేసిందేమీ లేదన్న స్పృహ కలిగిన శాస్త్రవేత్తలు కొంతమంది పారిశ్రామికవేత్తలతో కలిసి కొన్ని కార్య క్రమాలు చేపట్టారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు) అధ్యాపకుడు ఏకేఎన్ రెడ్డి ‘అప్లికేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టు రూరల్ ఏరియాస్’ (అస్త్ర) పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. అధిక సామర్థ్యమున్న పొయ్యి ఒకదాన్ని ఏకేఎన్ రెడ్డి అభివృద్ధి చేశారు. కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు.
1980లలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కూడా సామాజిక అవస రాల కోసం టెక్నాలజీ వాడకాన్ని మొదలుపెట్టంది. రైల్వే రిజర్వేషన్ల కంప్యూటరీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ టెలిఫోన్ ఎక్సేంచీజీలు, వాతావరణ అంచనా కోసం సూపర్ కంప్యూటర్ల వాడకం అప్పుడే మొదలైంది. భారతీయుల సమస్యకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారానికి ‘సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్’ (సీ–డాట్) ఓ అద్భుత నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో టెలిఫోన్ల సంఖ్య తక్కువగా ఉండటం, నెట్‌వర్క్ కూడా అంత బాగా లేకపోవడం తెలిసిందే. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న టెలిఫోన్ ఎక్సేంచీజీలను వాడు తూండటం దీనికి కారణం. ఈ విదేశీ ఎక్సేంచీజీలు అధిక ఉష్ణో గ్రతలను, ఎక్కువ కాల్స్‌ను తట్టుకునేలా డిజైన్ చేయలేదు. ఎయిర్ కండీషనర్ ఉంటేనే వీటిని ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉండేది. కాల్స్ సంఖ్య ఎక్కువైతే పని చేయడం ఆగిపోయేది. ఈ సమస్యలకు పరిష్కా రంగా అతితక్కువ విద్యుత్తును ఉపయోగించుకునే సర్క్యూట్ల ద్వారా సీ–డాట్ ఓ డిజిటల్ స్విచ్‌ను తయారు చేసింది. ఫలితంగా బయటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీ సెల్సియస్ దాటినా టెలిఫోన్ ఎక్సేంచీజీలు నిరాఘాటంగా పనిచేసేవి.
ఈ నేపథ్యంలో అసంఘటిత రంగంలో ఉన్న సృజనశీలురను వెలికితీసేందుకు అహ్మదాబాద్ ఐఐఎం అధ్యాపకుడు ప్రొఫెసర్ అనిల్ గుప్తా ఓ వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. 1990లలో అట్ట డుగు వర్గాల అసలైన సృజనలను గుర్తించి, పరీక్షించి, నిర్ధారించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఈ సృజనశీలురను అధికారిక వ్యవస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలతో అనుసంధానించేందుకూ, తద్వారా వారి ఉత్పత్తులు, ఆవిష్కరణలను మరింత మెరుగు పరిచేం దుకూ ఏర్పాట్లు చేశారు. ఇరవై ఏళ్లుగా వేల మంది సృజనశీలురలను గుర్తించడం... వారి ఆవిష్కరణలను వాణిజ్య స్థాయికి తీసుకురావడం జరిగింది. ఇన్నొవేషన్ ఫెస్టివల్ కూడా సృజన శీలురలను టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లతో అనుసంధానిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఏతావాతా... అడ్డంకులను బద్దలు కొట్టాల్సిన సమయమిది!
దినేశ్ సి. శర్మ, వ్యాసకర్త విజ్ఞానశాస్త్ర వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment