2–డీజీ.. గేమ్‌ చేంజర్‌.. అన్ని స్ట్రెయిన్‌ల మీదా పని చేస్తుంది | Interview With DRDO Chairman Satheesh Reddy Over Anti Covid Drug | Sakshi
Sakshi News home page

2–డీజీ.. గేమ్‌ చేంజర్‌.. అన్ని స్ట్రెయిన్‌ల మీదా పని చేస్తుంది

Published Mon, May 10 2021 2:18 AM | Last Updated on Mon, May 10 2021 10:25 AM

Interview With DRDO Chairman Satheesh Reddy Over Anti Covid Drug - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో ఆశాకిరణంగా నిలుస్తూ.. ‘2డీజీ (2 డీఆక్సి డీ గ్లూకోజ్‌)’ మందును తెస్తున్నట్టు ప్రకటించింది. కరోనా చికిత్సలో ఇది చాలా ప్రభావంతంగా పని చేస్తుందని వెల్లడించింది. దీంతో అందరి దృష్టీ ఈ మందుపై పడింది. అసలు ఈ మందు ఏమిటి, ఎలా తయారు చేశారు. ఎలా పనిచేస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో డీఆర్‌డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డిని ‘సాక్షి’ సంప్రదించింది. ఆ ఇంటర్వ్యూ వివరాలివీ.. 

ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? 
‘2డీజీ’ జనరిక్‌ మాలిక్యూల్‌. కొన్ని ప్రయోగాల్లో భాగంగా దానిని రూపొందించాం. సీసీఎంబీ దగ్గరికి వెళ్లి కరోనాపై టెస్టులు చేయించాం. పనిచేస్తోందని సీసీఎంబీ చెబితే.. క్లినికల్‌ ట్రయల్స్‌కోసం డీజీసీఐకి వెళ్లాం. ఏ మోతాదులో ఇస్తే ఎలా ఉంటుందని రెండు దశలుగా ప్రయోగాలు చేశాం. తర్వాత ఫేజ్‌–3 క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాం. ఫలితాలు బాగా వచ్చాయి. ఈ డ్రగ్‌ వాడితే మూడు రోజుల ముందే కోలుకుంటున్నారు. ఈ ఫలితాలతో డీజీసీఐకి వెళితే.. మందును వాడొచ్చంటూ అత్యవసర అనుమతి ఇచ్చారు. ఉత్పత్తిపై రెడ్డీస్‌ ల్యాబ్స్‌తో సంప్రదింపుల్లో ఉన్నాం. 11, 12 తారీఖుల్లో 10 వేల ప్యాకెట్లు రానున్నాయి. వాటిని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎక్కువ మంది ప్రజలకు అందించేలా చూస్తున్నాం.   చదవండి: (డీఆర్‌డీవో గుడ్‌న్యూస్‌: కరోనా బాధితులకు కొత్త ఔషధం సిద్ధం)

భారీగా తయారు చేయడం వీలవుతుందా? 
‘2డీజీ’ గ్లూకోజ్‌ ఆధారిత మాలిక్యూల్‌. దీని తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు సులువుగానే దొరుకుతాయి. అయితే ఒకేసారి భారీగా ఉత్పత్తి చేయడం కష్టం కావొచ్చు. అన్నీ సమకూరితే నెల రోజుల్లో ఉత్పత్తిని అందుబాటులోకి తేవచ్చు. 

దీనిని గేమ్‌ చేంజర్‌గా భావించొచ్చా? 
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మందును కచ్చితంగా ఓ గేమ్‌ చేంజర్‌గా భావించొచ్చు. దీనితో చికిత్స సులువు అవుతుంది. క్లినికల్‌ ట్రయల్స్‌లో పరిశీలించినప్పుడు చాలా మంచి ఫలితాలు వచ్చాయి. 330 మంది పేషెంట్లకు ఇచ్చి పరిశీలిస్తే.. వారు చాలా త్వరగా ఆక్సిజన్‌ వినియోగం నుంచి బయటికి రావడం, త్వరగా కోలుకోవడం జరిగింది. అయితే ఇది వ్యాధి వచ్చిన తర్వాత తగ్గించడానికి వాడే మందు, వ్యాధి రాకుండా ఆపే మందు కాదు.  

వ్యాక్సిన్లు బ్లాక్‌ మార్కెట్‌కు వెళుతున్నాయి? మరి ఈ మందు సజావుగా జనానికి అందేందుకు మీ ప్రణాళిక? 
తగిన సంఖ్యలో ఉత్పత్తి లేనప్పుడే బ్లాక్‌ మార్కెట్‌ ఏర్పడుతుంది. మేం వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ మందును తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. డిమాండ్‌కు తగినట్టుగా అందుబాటులో ఉంటే.. బ్లాక్‌ మార్కెట్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. 

ప్రాంతాన్ని బట్టి మందు పనిచేసే తీరులో తేడా ఉందా? భద్రత ఎంత? 
దేశవ్యాప్తంగా అన్ని మూలల్లో కలిపి 9, 10 రాష్ట్రాల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ చేశాం. అన్నిచోట్లా మంచి ఫలితాలు వచ్చాయి. ఈ మందు భద్రమైనది కూడా. దీనివల్ల ఏవైనా సైడ్‌ ఎఫెక్టŠస్‌ ఉంటాయా అని రెండు సార్లు పరీక్షించాం. పూర్తిగా భద్రమని గుర్తించాం. 

డీఆర్‌డీవో అంటే రక్షణ సంస్థ అనే భావనే ఉంది. కరోనాకు మందు ఎలా కనిపెట్టారు? 
నిజానికి డీఆర్‌డీవో సైన్యం కోసం పనిచేసే సంస్థ. అయితే సైనికులకు సంబంధించిన ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపేలా లైఫ్‌ సైన్సెస్‌ పరిశోధనలు కూడా ఉంటాయి. వారు తీసుకోవాల్సిన ఆహారం, ఆక్సిజన్‌ తక్కువగా ఉండే ఎత్తైన ప్రాంతాల్లో పనిచేయడం వంటి అన్ని విషయాలపై ప్రయోగాలు చేస్తుంటాం. యుద్ధాలకు సంబంధించి అణు, బయోలాజికల్, కెమికల్‌ వార్‌ వంటివి కూడా ఉంటాయి. ఈ క్రమంలో రేడియేషన్‌ వల్ల వచ్చే నెగెటివ్‌ ఎఫెక్ట్స్‌ను ఎలా తట్టుకోవచ్చనే పరిశోధనలో భాగంగా 2డీజీ మాలిక్యూల్‌పై ప్రయోగాలు చేశాం. తర్వాత ఈ మందు కరోనాపై కూడా పనిచేస్తుందని మా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో గత ఏడాదే సీసీఎంబీతో పరీక్షలు చేయించి.. అనుమతికోసం దరఖాస్తు చేశాం. 

కరోనా మొదటి వేవ్‌ను ఎదుర్కోగలరా? 
ఇలా కరోనా సెకండ్‌ వేవ్‌ వస్తుందని, ప్రభావం ఇంత తీవ్రంగా ఉంటుందన్నది ఎవరికీ తెలియని విషయం. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు కూడా రోగులపై నిరంతరంగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం. అలా చేశాం కాబట్టే.. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న సమయంలో ఈ డ్రగ్‌ రెడీగా అందుబాటులోకి వస్తోంది. 

సెకండ్‌ వేవ్‌ ప్రమాదాన్ని ఇతర దేశాలు గుర్తించినట్టు మనం ఎందుకు కనిపెట్టలేకపోయాం? 
నేను అలా అనుకోవడం లేదు. మనలాగా కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా వచ్చిన దేశాలేమీ లేవు. భారత్‌లో చాలా వేగంగా పెరిగిపోయాయి. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, ఆక్సిజన్‌ అవసరం పడే పేషెంట్ల సంఖ్య ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయింది. ఎవరూ ఊహించనంతగా ఈ స్థాయిలో వచ్చిన ఉధృతిని ఎదుర్కోవడానికి సిద్ధం కావడం కష్టం. అయినా పది పదిహేను రోజుల్లోనే అవసరమైన మేర ఆస్పత్రులు, మందులు, ఆక్సిజన్‌ వంటివి రెడీ చేసుకోవడం గొప్ప విషయమే. 

ఆక్సిజన్‌ జనరేటర్ల తయారీపై డీఆర్‌డీవో దృష్టి పెట్టింది.. ఆ వివరాలు ఏమిటి? 
తేజస్‌ (ఎల్‌సీఏ) విమానాలు అత్యంత ఎత్తులో ప్రయాణిస్తాయి. అక్కడ పైలట్లకు సరిపడా ఆక్సిజన్‌ ఉండదు. అందుకే అక్కడిక్కడ ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయడానికి అత్యాధుకమైన ఆన్‌బోర్డ్‌ ఆక్సిజన్‌ జనరేటర్‌ను తయారు చేశాం. ఆ టెక్నాలజీని ఉపయోగించే భారీగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను రూపొందించాం. వీటిని ఇప్పటికే హిమాలయాలు, ఇతర ఎత్తైన ప్రాంతాల్లో ప్రజలు, ఆస్పత్రులకు ఆక్సిజన్‌ కోసం వినియోగిస్తున్నాం. ఈసారి ఆక్సిజన్‌ అవసరం చాలా ఎక్కువగా ఉండటంతో.. పలు సంస్థలతో కలిసి దేశవ్యాప్తంగా మూడు నెలల్లో 850 ప్లాంట్ల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నాం. 

వ్యాక్సిన్లు విదేశాలకు సరఫరా చేసిన ఖ్యాతి దక్కించుకున్నాం. ఇప్పుడీ మందును ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తారా? 
మన దగ్గర ఇంకా ఉత్పత్తే మొదలు కాలేదు. ముందుగా మన దేశంలో సరిపడా ఉత్పత్తి చేయడంపైనే దృష్టి పెడతాం. మన అవసరానికి మించి ఉత్పత్తి చేయగలిగినప్పుడు.. విదేశాలకు ఇవ్వడమా, ఏం చేయాలన్నది ప్రభుత్వం ఆలోచిస్తుంది. 

‘2డీజీ’ మందు వాడితే.. వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుందా?  
రోగం మన దగ్గరికి రాకుండా తోడ్పడేది వ్యాక్సిన్‌. ఈ మందు రోగం వచ్చాక తగ్గడానికి వాడేది. దానికి దీనికి సంబంధం లేదు. అయితే వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా అందరం వ్యాక్సిన్లు వేసుకోవడం చాలా మంచిది. వ్యాక్సిన్‌ వేసుకున్నాక కోవిడ్‌ వచ్చినా.. ఈ మందును ఉపయోగించవచ్చు. 

ఆక్సిజన్‌ అవసరం ఏమేర తగ్గుతుంది, ఆస్పత్రిలో చేరే అవసరం ఉంటుందా? 
ఈ మందు వాడితే వేగంగా రికవరీ అవుతారు. ఆక్సిజన్‌ పెట్టాల్సిన స్థాయికి వెళ్లే రోగులకు ఆ అవసరం లేకుండా చేస్తుంది. ఒకవేళ అప్పటికే ఆక్సిజన్‌ వాడుతున్నా.. త్వరగా బయటపడేలా చేస్తుంది. అంటే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరాన్ని, ఎక్కువ రోజులు ఉండాల్సిన రావడాన్ని తగ్గిస్తుంది. 

కొత్త కొత్త కరోనా స్ట్రెయిన్లు వస్తున్నాయి? మరి ఈ మందు పనిచేస్తుందా? 
అన్ని స్ట్రెయిన్ల మీద మేం పరీక్షలు చేయలేదు. కానీ ఈ మందు పనిచేసే తీరు వేరు. దీనికి నేరుగా కరోనా వైరస్‌తో సంబంధం లేదు. కరోనా సోకిన మన శరీర కణాల మీద ఈ మందు పనిచేస్తుంది. కణాల్లోకి 2డీజీ ప్రవేశించాక దానిని పూర్తిగా స్తంభింపజేస్తుంది. దాంతో అక్కడ వైరస్‌ పెరగడం ఆగిపోతుంది. అంటే ఏ స్ట్రెయిన్‌ అనే తేడా లేకుండా పనిచేస్తుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement