సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై పోరాడేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఇప్పటివరకూ 70 మేడిన్ ఇండియా ఉత్పత్తులను రూపొందించిందని సంస్థ చైర్మన్ జీ. సతీష్ రెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే తాము ప్రతినెలా 25,000 వెంటిలేటర్లను తయారు చేస్తామని..విదేశాలకు ఎగుమతి చేసేందుకు తాము సిద్ధమని ఆయన వెల్లడించారు. డీఆర్‌డీఓ నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద సర్ధార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్-19 ఆస్పత్రి ఆదివారం ప్రారంభమైన సందర్భంగా సతీష్ రెడ్డి పలు వివరాలు అందించారు. 11 రోజుల్లోనే 250 ఐసీయూ పడకలతో సహా 10000 పడకల ఆస్పత్రిని నిర్మించారు. సకల సదుపాయాలతో కూడిన ఈ ఆస్పత్రిలో రోగులకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
సైనిక సిబ్బంది 24 గంటల పాటు రోగుల సేవల్లో నిమగ్నవుతారని అన్నారు. కాగా ఢిల్లీ కంటోన్మెంట్‌లో డీఆర్‌డీఒఓ నిర్మించిన ఈ ఆస్పత్రిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం సందర్శించారు. మరోవైపు భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు మరింత ఉధృతమవుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే గరిష్టంగా 24,850 తాజా కేసులు వెలుగుచూశాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది. తాజా పాజిటివ్ కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,73, 165గా ఉంది. కాగా కరోనాతో ఒక్కరోజులో 613 మంది మరణించడంతో మరణాల సంఖ్య 19,268కి చేరుకుంది. చదవండి : చైనాకు ధీటుగా.. ఢిల్లీలో
Comments
Please login to add a commentAdd a comment