మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా రోజుకు ఆరు కేసులు చొప్పున రాగా, బుధవారం 13 కేసులు నమోదయ్యాయి. బాధితులంతా ఆస్పత్రిలో చికిత్స కన్నా హోం ఐసోలేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో హోం ఐసోలేషన్‌లో 41 మంది బాధితులు ఉన్నారు. వీరికి టెలిమెడిసిన్ అనుసంధానం చేసి చికిత్స అందిస్తున్నారు. టెలిమెడిసిన్‌లో ఉండే వైద్యులు ఉదయం, సాయంత్రం కోవిడ్ సోకిన వారి యోగ క్షేమాలు తెలుసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు బీపీ చూసుకోవడం, ఆక్సిజన్ లెవెల్స్ పరిశీలించడం వంటి పనులను విద్యావంతులైతే చేసుకోగలుగుతున్నారు.
కేజీహెచ్‌లో మాత్రమే వైద్య సేవలు
కరోనా బారిన పడిన వారి కోసం కేజీహెచ్‌లో ప్రత్యేక బ్లాక్‌ను కేటాయించారు. 350 పడకలతో ఆ బ్లాక్‌ను తీర్చిదిద్దారు. ఇందులో కోవిడ్ బారిన పడిన గర్భిణులు, పిల్లలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వేర్వేరుగా వార్డులను కేటాయించారు. పడకలు, ఆక్సిజన్, ఇతర మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో కరోనా బాధితులు ఎవరూ చికిత్స తీసుకోవాడం లేదు.
స్వల్ప లక్షణాలతో కరోనా
స్వల్ప లక్షణాలు ఉన్న వారు పరీక్ష చేయించుకుంటే కరోనాగా నిర్ధారణ అవుతోంది. దీంతో ప్రస్తుతం జ్వరం, తలనొప్పి, దగ్గు, ఒళ్లునొప్పులు ఉంటే జనాలు అందోళన చెందుతున్నారు. రెండో వేవ్‌లో మరణాలు సంఖ్య అధికంగా ఉంది. ప్రస్తుతం విశాఖలో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
వైద్యులతో విస్తృతంగా చర్చలు జరిపి నివారణ కోసం పలు చర్యలు చేపట్టారు. బుధవారం నాడు 13 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రోగుల సంఖ్య 1,91,583 మందికి చేరుకుంది. ఇప్పటి వరకు 1,90,389 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 1153 మంది వరకు కోవిడ్‌తో మృత్యువాతపడ్డారు.
అనవసరంగా బయట తిరగొద్దు
ఎలాంటి కరోనా లక్షణాలు ఉన్నా తక్షణం వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ భౌతికదూరం పాటించాలి. తరచూ చేతులను శానిటైజర్ శుభ్రం చేసుకోవాలి. వైరస్ సోకినా భయపడాల్సిన పని లేదు. అనవసరంగా బయట తిరగడం మంచిది కాదు. ఐసోలేషన్‌లో ఉన్న వారు బయట తిరగడానికి వీలు లేదు. బాధితులు సమీపంలో ఉండే వలంటీర్‌కు సమాచారమిస్తే ఉచితంగా మందుల కిట్ అందిస్తారు. టెలిమెడిసిన్ ద్వారా వైద్యులను సంప్రదించి వైద్య సేవలు పొందవచ్చు.
– డాక్టర్ విజయలక్ష్మి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment