
పిల్లల కోసం ఫెర్టిలిటీ సెంటర్‌ను
ఆశ్రయించిన భార్యాభర్తలు
8వ నెలలో కవలలతో సహా తల్లి మృతి
ముగ్గురి ప్రాణాల విలువ రూ.4 లక్షలు కట్టిన ఆస్పత్రి యాజమాన్యం
డాబాగార్డెన్స్: పిల్లల కోసం కలలు కన్న ఒక నిరుపేద దంపతులకు ఫెర్టిలిటీ సెంటర్ తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఇందుకోసం తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకపోగా.. కడుపులో పెరుగుతున్న కవలలతో సహా తల్లి కూడా మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఆ ముగ్గురు ప్రాణాల విలువను రూ.4 లక్షలుగా వెలకట్టి ఆస్పత్రి యాజమాన్యం చేతులు దులుపుకుంది. బాధితుడు తెలిపిన వివరాలివి..
అనకాపల్లి జిల్లా మాకవరపాలెం ఎస్సీ కాలనీకి చెందిన గెంజి వరహాలు బాబు ఓ కంపెనీలో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఎనిమిదేళ్ల కిందట లక్ష్మితో అతనికి వివాహం జరిగింది. పిల్లలు లేకపోవడంతో బాధపడుతున్న వరహాలు బాబుకు.. అదే కంపెనీలోని ఒక సహోద్యోగి రామ్‌నగర్‌లోని ఆరాధ్య ఆస్పత్రి గురించి చెప్పాడు. అక్కడ చికిత్స తీసుకుంటే పిల్లలు పుడతారని చెప్పడంతో.. వరహాలు బాబు, లక్ష్మి దంపతులు ఎనిమిది నెలల కిందట ఆరాధ్య ఆస్పత్రిని సంప్రదించారు.
ప్రారంభంలో ఆస్పత్రి యాజమాన్యం రూ.2,25,000 ఖర్చు అవుతుందని చెప్పగా.. తమ ఆర్థిక పరిస్థితిని వివరించడంతో రూ.2,10,000కు అంగీకరించింది. వరహాలు బాబు పరీక్షల కోసం మరో రూ.12 వేలు చెల్లించాడు. పరీక్షలు పూర్తయ్యాయి. లక్ష్మికి రూ.12 రోజుల పాటు రోజుకు ఒక ఇంజక్షన్ చొప్పున 12 ఇంజక్షన్లు వేశారు. అప్పటి నుంచి ప్రతి నెలా పరీక్షల కోసం మాకవరపాలెం నుంచి నగరానికి వెళ్లొస్తూ ఉండేవారు. ప్రయాణాలు, వైద్య ఖర్చులు, మందులు, స్కానింగ్‌ల కోసం నెలకు దాదాపు రూ. 20 వేల వరకు ఖర్చు చేసేవారు.
నాలుగో నెలలో లక్ష్మి గర్భంలో ముగ్గురు పిల్లలు ఉన్నారని వైద్యులు చెప్పడంతో సంతోషించిన ఆ దంపతులు.. ఇద్దరు పిల్లలు చాలని కోరారు. దీంతో వైద్యులు ఒక పిండాన్ని తొలగించారు. ఆ తర్వాత ఆరు నెలల వరకు తల్లి, పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారు. 7వ నెలలో నిర్వహించిన పరీక్షల్లో లక్ష్మికి మధుమేహం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్యుల సూచనల మేరకు ఆహార నియమాలు పాటించినప్పటికీ.. సరైన పోషకాహారం లేక పిల్లల ఎదుగుదల సరిగా లేకపోయింది. దీంతో ఆస్పత్రి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
ముందే చెప్పి ఉంటే..
కాగా.. గత ఆదివారం రాత్రి లక్ష్మికి తీవ్రమైన విరేచనాలు మొదలయ్యాయి. సోమవారం ఉదయం వరకు అవి ఆగకపోవడంతో ఆందోళన చెందిన వరహాలు ఆస్పత్రికి ఫోన్ చేసినా స్పందన రాలేదు. ఉదయం 8 గంటల తర్వాత స్పందించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తీసుకురావాలని సూచించారు. మధ్యాహ్నానికి ఆస్పత్రికి చేరుకున్న లక్ష్మిని మొదట 6వ అంతస్తులో, తర్వాత 3వ అంతస్తుకు మార్చారు.
పరిస్థితి విషమించడంతో స్కానింగ్ చేయగా కడుపులో ఇద్దరు పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పిల్లలు చనిపోయినా భార్యను కాపాడమని వేడుకున్న వరహాలు బాబుకు చెప్పకుండానే అదే రోజు రాత్రి లక్ష్మిని అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం లక్ష్మి తుదిశ్వాస విడిచింది. భార్యను, కడుపులోని ఇద్దరు పిల్లలను కోల్పోయిన వరహాలు బాబు కన్నీరుమున్నీరుగా విలపించాడు.
పిల్లల కోసం వస్తే.. పిల్లలతో పాటు భార్యా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఆవేదననను చూసి కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యాన్ని నిలదీస్తే.. ముగ్గురి ప్రాణాలకు కలిపి రూ.4 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించాడు. ప్రతి నెలా పరీక్షలు చేస్తూ లక్షలు వసూలు చేసిన యాజమాన్యం.. చివరికి తల్లి శరీరం సహకరించడం లేదని చెప్పడం దారుణమని వరహాలు బాబు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ముందే చెప్పి ఉంటే ఈ ప్రయత్నమే చేసేవాళ్లం కాదని, ముగ్గురు ప్రాణాలను రూ.4 లక్షలకు వెలకట్టడం దారుణమని ఆమె రోదించింది.