
అనకాపల్లి జిల్లాలోని చోడవరం కోర్టు సంచలన తీర్పు
2015లో బిళ్లలమెట్ట రైవాడ రిజర్వాయర్ వద్ద హత్య
బీర్ బాటిల్‌తో చిన్నారి పీక కోసిన నిందితుడు
సాక్షి, అనకాపల్లి: పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బాలిక వేపాడ దివ్య (7) హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ అనకాపల్లి జిల్లా చోడవరం అదనపు జిల్లా న్యాయమూర్తి రత్నకుమారి మంగళవారం తీర్పుచెప్పారు. బాధితుల తరఫున పీపీ ఉగ్గిన వెంకట్రావ్ వాదించారు. వేపాడ మురుగన్, ధనలక్ష్మి దంపతులు మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లిలోని గొల్లపేట వీధిలో హోటల్ నిర్వహించేవారు. వారి ఒక్కగానొక్క కుమార్తె దివ్య (7) స్థానిక ఉషోదయ స్కూల్లో యూకేజీ చదువుకుంటోంది.
హోటల్లో పనిచేయడానికి ధనలక్ష్మికి వరుసకు సోదరుడయ్యే ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన గుణశేఖర్ సుబ్బాచారిని పనికి కుదుర్చుకున్నారు. సుబ్బాచారి పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనను ధనలక్ష్మి, మురుగన్ దంపతులు పనిలో నుంచి తొలగించారు. దీంతో వారిపై సుబ్బాచారి కక్షగట్టాడు. 2015లో డిసెంబర్ 23న స్కూల్‌కు వెళ్లి వచ్చిన దివ్య సాయంత్రం నుంచి కనిపించడంలేదని తల్లిదండ్రులు దేవరాపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఎవరి మీదన్నా అనుమానం ఉందా అని మురుగన్ దంపతులను అడగ్గా సుబ్బాచారిపై వారు అనుమానం వ్యక్తం చేశారు. 2015 డిసెంబర్ 24న బిళ్లాల మెట్ట వద్ద ఓ బాలిక మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు చెప్పారు. మృతదేహంపై కత్తితో కోసిన గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. బాలికను దివ్యగా గుర్తించి, సుబ్బాచారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దివ్యను తానే హత్య చేసినట్లు నేరాన్ని ఒప్పుకొన్నాడు.
బీరు సీసాతో పీక కోసి హత్య..
23న దివ్య చదువుకుంటున్న ఉషోదయ స్కూల్ దగ్గరికి వెళ్లి, ఆమెకు రూ.20 ఇచ్చి గారెలు కొనుక్కోమన్నానని, అక్కడ నుంచి దివ్యను రైవాడ జలాశయం సమీపంలోని బిళ్లలమెట్ట కొండ వద్దకు తీసుకువెళ్లి పగలకొట్టిన బీరు సీసాతో పీక కోసి హత్య చేశానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. నిందితుడిపై గతంలో ఒంగోలులో వాహన దొంగతనం కేసు కూడా ఉంది. హత్య కేసును విచారణ జరిపిన చోడవరం 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి బాలిక హత్యకు కారణమైన నిందితుడిని సెక్షన్ 302 ఐపీసీ ప్రకారం దోషిగా నిర్థారిస్తూ పైవిధంగా శిక్ష విధించారు.