ఐటీడీఏ పీవో బదిలీ | Transfer 'ITDA' PO | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ పీవో బదిలీ

Published Wed, Jan 14 2015 9:54 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

Transfer 'ITDA' PO

భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలం ఐటీడీఏ పీవో దేవరాజన్ దివ్య బదిలీ అయ్యారు. నిజామాబాద్ జాయింట్ కలెక్టర్‌గా ఆమెను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2014 ఫిబ్రవరి 14న భద్రాచలం ఐటీడీఏ పీవోగా బాధ్యతలు చేపట్టిన దివ్య ఏడాది తిరగక ముందే బదిలీ కావటం గమనార్హం. అయితే ఐటీడీఏ పీవోగా దివ్య తనదైన ముద్ర వేసుకున్నారు.

ఇక్కడ విధుల్లో చేరిన కొన్ని రోజులకే సాధారణ ఎన్నికలు రాగా.. అశ్వారావుపేట నియోజకవర్గ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాల నిర్వహణలో తనదైన పాత్ర పోషించి, ఉత్సవాల విజయవంతానికి సహకరించారు. మధ్య దళారులు లేకుండా చేయాలనే తలంపుతో 'ప్రజావాణి' పేరిట యూనిట్ అధికారులందరినీ గిరిజనుల ముంగిటకు పంపించారు. ప్రతి సోమవారం ఐటీడీఏలో నిర్వహించే గిరిజన దర్బార్‌ను ప్రజావాణిగా మార్చి, గిరిజనుల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తుకు యూనిట్ అధికారులు జవాబుదారులుగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ చూపారు.

కార్యాలయానికే పరిమితం కాకుండా గిరిజన గ్రామాల్లో పర్యటనపై ఎక్కువ శ్రద్ధ చూపారు. కొండరెడ్డి గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక నిధులు కేటాయించారు. గిరిజనుల వైద్య సేవలకు పెద్ద దిక్కుగా ఉన్న భద్రాచలం ఏరియా ఆస్పత్రి ఆధునీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఐటీడీఏ నుంచి నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలను కల్పించారు. ైవె ద్యం కోసం వచ్చే వారికి ఇబ్బంది కలుగకుండా అక్కడ నెలకొన్న వర్గపోరుకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆస్పత్రి సూపరింటెండెంట్ మార్పు విషయంలో ఆమె కోటిరెడ్డికి మద్దతుగా నిలిచి పైస్థాయిలో తన వాదన వినిపించారు. రాష్ట్ర విభజనతో విలీన మండలాల్లో ఉన్న ఎటపాక విద్యా సంస్థలను తిరిగి వెన క్కు తీసుకురావడం, భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్లే దారిలో ఉన్న గ్రామాలను తెలంగాణలో క లపడంపై వాదన గట్టిగానే వినిపించారు.

మితిమీరిన స్వేచ్ఛతో గాడితప్పిన పాలన...
గతంలో ఏ అధికారీ ఇవ్వనంత రీతిలో దివ్య యూనిట్ అధికారులకు స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో పాలన గాడితప్పిందనే విమర్శలు ఉన్నాయి. గిరిజనులకు మేలు జరగాలనే ఆకాంక్ష కొంత నిధుల దుబారాకు దారితీసిందనే విమర్శ ఉంది. వివిధ పథకాల కింద వచ్చిన నిధుల ద్వారా గిరిజనలకు మేలు చేకూరితే చాలన్న రీతిలో యూనిట్ అధికారులు అడిగిందే తడవుగా నిధులు కేటాయించారు.

అయితే అవి క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో పర్యవేక్షించలేకపోయారనే అపవాదు ఆమెపై ఉంది. ఆశ్రమ పాఠశాలలు, ఉపాధి హామీ పథ కం, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపట్టిన వివిధ నిర్మాణాలపై క్షేత్ర స్థాయిలో దృష్టి సారించలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో పనిచేసిన పీవోలు క్షేత్ర స్థాయి పర్యటనలు చేసిన సందర్భాల్లో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించే వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. కానీ దివ్య మాత్రం విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, ఉద్యోగులపై కూడా ఉదాసీనంగా వ్యవహరించారనే విమర్శ ఉంది.

దివ్య బయోడేటా
జన్మస్థలం తమిళనాడులోని తిరుచ్చి జిల్లా కేంద్రం.
తల్లిదండ్రులు  నందిని, దేవరాజన్.
తల్లి డెంటిస్ట్. తండ్రి తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డులో రిటైర్డ్‌ఇంజనీర్
12వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో చెన్నైలోని సింథి మోడల్‌స్కూల్‌లో, అనంతరం ఇంజనీరింగ్‌లో బిట్స్ పిలానీలో సీటు సాధించి రాజస్థాన్‌లో 2006లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
2007లో సివిల్స్ రాసి 503 ర్యాంకు సాధించా రు.  ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్‌లో చేరి బరోడాలో శిక్షణ తీసుకుంటూనే రెండవ సారి 2009లో సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 37వ ర్యాంక్ సాధించారు.

ఉత్తరాఖండ్‌లోని లాల్‌బహదూర్‌శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పూర్తి చేసుకొని కృష్ణా జిల్లా ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. అనంతరం భువనగిరి సబ్‌కలెక్టర్‌గా, ఆ తర్వాత హైదరాబాద్ ఈ గవర్‌నెన్స్ డైరక్టర్‌గా,  2014 ఫిబ్రవరి 14న భద్రాచలం ఐటీడీఏ పీవోగా బాధ్యతులు చేపట్టారు.
2008లో బెంగాల్‌కు చెందిన సుధిప్పోను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన బిట్స్ ఫిలానీలో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement