నేడు అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం
ఖమ్మం గుమ్మంలో వరద. బెజవాడ కంటిలో బుడమేరు ΄పొంగు. ఆకలి ఆర్తనాదాలు తెలుగువారిని చుట్టుముట్టాయి. ఈ సమయంలో సాయం చేసే చేతులే కాదు దాతృత్వం చూపే గుండెలూ కావాలి. నోట్ బుక్స్ తడిసిపోయిన ఒక చిన్నారికి స్కూల్ బ్యాగ్‌తో మొదలు గుడిసె కూలిన ఒక పేదవాడికి చిన్న ఆసరా వరకూ దాతృత్వంతో సాయం చేయవచ్చు. ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వాలు చేస్తాయి. మనుషులం మనం. ఇవ్వడం తెలిసినవాళ్లం. ఇది ఇవ్వాల్సిన సమయం.
‘దానం చేయడం వల్ల ఎవరూ పేద కాబోరు’ అంటుంది ఆనీ ఫ్రాంక్ అనే యూదు బాలిక. ‘ఎంత దానం ఇస్తున్నావన్నది కాదు... ఎంత ప్రేమగా దానం ఇస్తున్నావన్నదే ముఖ్యం‘ అంది మదర్ థెరిసా. ‘దానమీయని వాడు ధన్యుండుగాడయ’ అన్నాడు వేమన. ‘దానం చేయనివారు భూమికి పెద్ద భారం’ అన్నాడు శ్రీనాథుడు. ‘పిట్టకు చారెడు గింజలు... చెట్టుకు చెంబుడు నీళ్లు... ఇవి అందించడానికి మించిన మానవ జన్మకు పరమార్థం ఏముటుంది’ అంటుంది ఓ కథలోని బామ్మ. దానం మనిషి గుణం. ముఖ్యంగా సాటి మనిషి కష్టకాలంలో ఉన్నప్పుడు దానం చేయడానికి తప్పకుండా ముందుకు రావాలి.
మనది దానకర్ణుడి నేల
మనది దాన కర్ణుడి నేల. ఒకసారి కృష్ణుడు కర్ణుడిని చూడటానికి వెళితే ఆ సమయానికి అతను స్నానానికి సిద్ధమవుతూ రత్నాలు ΄÷దిగిన గిన్నెలో నూనె తలకు రాసుకుంటున్నాడట. కృష్ణుడు ఆ గిన్నె చూసి ‘కర్ణా.. గిన్నె చాలా బాగుంది ఇస్తావా’ అనగానే ఎడమ చేతిలో ఉన్న గిన్నెను ‘తీసుకో’ అని అదే చేత్తో ఇచ్చేశాడట కర్ణుడు. కృష్ణుడు ఆశ్చర్యపోయి ‘అదేమిటి కర్ణా... ఎడమ చేత్తోనే ఇచ్చేశావు’ అనంటే కర్ణుడు ‘అంతే కృష్ణా. దానంలో ఆలస్యం కూడదు. నువ్వు అడిగాక ఎడమ చేతిలో నుంచి కుడి చేతిలోకి మారేలోపు నా మనసు మారొచ్చు. లేదా నాకు మృత్యువు సమీపించవచ్చు. అందుకే ఇచ్చేశాను’ అన్నాడట. లోకంలో ఎందరో చక్రవర్తులు పుట్టి ఉంటారు, గిట్టి ఉంటారు. కాని దానం కోసం నిలిచిన శిభి, బలి చక్రవర్తులే ఇన్ని వేల ఏళ్ల తర్వాత కూడా శ్లాఘించబడుతున్నారు.
వరదల్లో అన్నం పెట్టిన తల్లి
తూర్పు గోదావరి జిల్లాలోని లంకలగన్నవరంలో తరచూ వరదల చేత లేదంటే ΄÷లాలు పండకపోవడం చేత జనం ఆకలితో అల్లాడుతుంటే వారి కోసమని అన్నదానం మొదలెట్టి ఆంధ్రుల అన్నపూర్ణగా కొలవబడుతున్న తల్లి డొక్కా సీతమ్మ (1841–1909)ను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మన దగ్గర ఉన్నది అవసరమున్న వారికి పంచడం వల్ల కలిగే తృప్తి, దొరికే ఆశీర్వచనం దైవికమైనవి. దానాల్లోకెల్లా శ్రేష్ఠమైనది అన్నదానం అంటారు. ఇవాళ వరదల్లో చిక్కుకున్నవారి కోసం అన్నదానం చేయవలసినవారే కావాల్సింది.
స్పందించే హృదయం
మనిషి హృదయానికి ఉన్న గొప్ప లక్షణం స్పందించే గుణం. అదే మానవత్వ గుణం. కరుణ, కనికరం, దయ, సానుభూతి ఇవన్నీ సాటి మనిషి కోసం సాయపడమంటాయి. సాయంలో ఉన్నతమైనది దాతృత్వం. కొందరు అడగకపోయినా దానం చేస్తారు. కొందరు అడిగినా చేయరు. ఉండి కూడా చేయరు. ఒకప్పుడు పెద్ద పెద్ద ఘటనలు జరిగితే సినిమా హీరోలతో మొదలు సామాన్యుల వరకూ స్పందించేవారు. కనీసం నూట పదహార్లు పంపే పేదవారు కూడా ఉండేవారు. ఇవాళ దానం కోసం ప్రొత్సహించే వ్యక్తులు లేరు. తామే తార్కాణంగా నిలవాలని కూడా అనుకోవడం లేదు. వేల కోట్లు ఉన్నవారు కూడా రూపాయి విదల్చకపోతే ఆ సంపదకు అర్థం ఏమిటి?
లక్ష సాయాలు
ఇవాళ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలో వరద బీభత్సంగా ఉంది. పిల్లలకు పుస్తకాల దగ్గర నుంచి వృద్ధులకు మందుల వరకు అన్నీ కావాలి. వంట పాత్రలు నాశనమయ్యాయి. స్టవ్‌లు పాడయ్యాయి. ఇళ్లు కూలిన వారు ఎందరో. పశువులు కొట్టుకుని పోయాయి. చేతి వృత్తుల పరికరాలు, ఉపాధి సామాగ్రి అంతా పోయింది. జనం రోడ్డున పడ్డారు. వీరి కోసం ఎన్ని వేల మంది సాయానికి వస్తే అంత మంచిది. సరిౖయెన చారిటీ సంస్థలకు విరాళాలు ఇచ్చి సాయం అందగలిగేలా చూడటం అందరి విధి. లేదా ముఖ్యమంత్రుల సహాయనిధికే విరాళం ఇవ్వొచ్చు. మన దగ్గర డబ్బు లేకపోతే సమయం అయినా దానం ఇవ్వొచ్చు. సమయం వెచ్చించి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నా చాలు. నేడు ‘అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం’ సందర్భంగా చంద్రునికో నూలుపోగైనా ఇద్దామని సంకల్పిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment