పూర్వస్థితికి చేరిన మున్నేరు ముంపు ప్రాంతాలు
ఇళ్లు కోల్పోయిన వారు అద్దె ఇళ్లలోకి
బాధితులకు కొనసాగుతున్న దాతల సాయం
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్ మండలంలో మున్నేరు వరద ముంపు బాధితులకోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు ఖాళీ అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో వరద నీరు తగ్గడంతో ముంపు బాధితులంతా పునరావాస కేంద్రాలను వీడి ఇళ్లకు చేరుకున్నారు. ఈనెల 1న మున్నేరుకు వచి్చన భారీ వరదలతో ఖమ్మం నగరంలోని 13 డివిజన్లతో పాటు ఖమ్మం రూరల్ మండలంలోని 20 కాలనీలు నీట మునిగాయి. వందలాది ఇళ్లను వరద ముంచెత్తగా.. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలోని రామన్నపేట ప్రభుత్వ పాఠశాల, జూబ్లీ క్లబ్, స్వర్ణభారతి కల్యాణ మండపం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ధంసలాపురం పాఠశాలల్లో 8,200 మందికి, ఖమ్మం రూరల్ మండలంలో టీసీవీ రెడ్డి ఫంక్షన్‌హాల్, రామ్‌లీలా ఫంక్షన్‌హాల్, పోలేపల్లి స్ఫ్రింగ్ లీఫ్ పాఠశాల, సాయిబాబా ఆశ్రమంలో 2,300 మందికి ఆశ్రయం కలి్పంచి ఇన్నాళ్లూ భోజనం సమకూర్చారు.
బాధితులు వెళ్లిపోవడంతో కేంద్రాల మూసివేత
వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు పూర్తికావడం, ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకోవడంతో పునరావాస కేంద్రాలను వీడి ఇళ్లకు చేరుకున్నారు. ఈనెల 10 వరకు ప్రభుత్వ యంత్రాంగం పునరావాస కేంద్రాలను నిర్వహించగా.. బాధితులు ఇళ్లకు వెళ్లిపోతుండడంతో శుక్రవారం పూర్తిగా మూసివేసింది. అయితే, ఇళ్లు పూర్తిగా నేలమట్టమైన వారు మాత్రం ఎక్కడకు వెళ్లాలో దిక్కుతోచక.. మిగిలిన ఒకటి, అరా సామగ్రితో చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు.
కొనసాగుతున్న దాతల చేయూత
వరద బాధితులకు పలువురు నిత్యావసరాలతో పాటు భోజనం అందిస్తున్నారు. అనేక మంది ఇళ్లను కోల్పోయి వండుకునేందుకు సామగ్రి లేక భోజనం కోసం ఇబ్బంది పడుతుండగా.. వారికి స్వచ్ఛంద సేవా సంస్థలు భోజనం సమకూరుస్తున్నాయి. శుక్రవారం కూడా ఖమ్మం రూరల్ మండలంలోని రాజీవ్ గృహకల్ప, ఖమ్మంలోని వెంకటేశ్వరనగర్‌లో బాధితులకు పలు సంస్థల ద్వారా భోజనం సమకూర్చారు.
Comments
Please login to add a commentAdd a comment