munneru
-
పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి..
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్ మండలంలో మున్నేరు వరద ముంపు బాధితులకోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు ఖాళీ అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో వరద నీరు తగ్గడంతో ముంపు బాధితులంతా పునరావాస కేంద్రాలను వీడి ఇళ్లకు చేరుకున్నారు. ఈనెల 1న మున్నేరుకు వచి్చన భారీ వరదలతో ఖమ్మం నగరంలోని 13 డివిజన్లతో పాటు ఖమ్మం రూరల్ మండలంలోని 20 కాలనీలు నీట మునిగాయి. వందలాది ఇళ్లను వరద ముంచెత్తగా.. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలోని రామన్నపేట ప్రభుత్వ పాఠశాల, జూబ్లీ క్లబ్, స్వర్ణభారతి కల్యాణ మండపం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ధంసలాపురం పాఠశాలల్లో 8,200 మందికి, ఖమ్మం రూరల్ మండలంలో టీసీవీ రెడ్డి ఫంక్షన్‌హాల్, రామ్‌లీలా ఫంక్షన్‌హాల్, పోలేపల్లి స్ఫ్రింగ్ లీఫ్ పాఠశాల, సాయిబాబా ఆశ్రమంలో 2,300 మందికి ఆశ్రయం కలి్పంచి ఇన్నాళ్లూ భోజనం సమకూర్చారు. బాధితులు వెళ్లిపోవడంతో కేంద్రాల మూసివేత వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు పూర్తికావడం, ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకోవడంతో పునరావాస కేంద్రాలను వీడి ఇళ్లకు చేరుకున్నారు. ఈనెల 10 వరకు ప్రభుత్వ యంత్రాంగం పునరావాస కేంద్రాలను నిర్వహించగా.. బాధితులు ఇళ్లకు వెళ్లిపోతుండడంతో శుక్రవారం పూర్తిగా మూసివేసింది. అయితే, ఇళ్లు పూర్తిగా నేలమట్టమైన వారు మాత్రం ఎక్కడకు వెళ్లాలో దిక్కుతోచక.. మిగిలిన ఒకటి, అరా సామగ్రితో చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. కొనసాగుతున్న దాతల చేయూతవరద బాధితులకు పలువురు నిత్యావసరాలతో పాటు భోజనం అందిస్తున్నారు. అనేక మంది ఇళ్లను కోల్పోయి వండుకునేందుకు సామగ్రి లేక భోజనం కోసం ఇబ్బంది పడుతుండగా.. వారికి స్వచ్ఛంద సేవా సంస్థలు భోజనం సమకూరుస్తున్నాయి. శుక్రవారం కూడా ఖమ్మం రూరల్ మండలంలోని రాజీవ్ గృహకల్ప, ఖమ్మంలోని వెంకటేశ్వరనగర్‌లో బాధితులకు పలు సంస్థల ద్వారా భోజనం సమకూర్చారు. -
సాయం పెంచండి.. ఖమ్మం ముంపు బాధితుల విజ్ఞప్తి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మున్నేరు ముంపు నష్టం లెక్క కట్టలేని స్థాయిలో ఉందని.. కానీ ప్రభుత్వం ఇస్తామంటున్న సాయం సరిపోయేలా లేదని వరద బాధితులు వాపోతున్నారు. నిత్యావసరాలు, దుస్తుల నుంచి ఎలక్ట్రానిక్ సామగ్రిదాకా ఏదీ మిగల్లేదని.. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ పనికి వెళ్తే తప్ప పూటగడవని పరిస్థితుల్లో ఉన్న తమ బతుకులు గాడిన పడాలంటే సర్కారు ఆర్థిక సాయాన్ని మరింత పెంచాలని కోరుతున్నారు. వరద ముంపునకు గురై ఎనిమిది రోజులు దాటినా ఇంకా ఎలాంటి సాయం అందలేదని వాపోతున్నారు.సాయం కోసం ఎదురుచూస్తూనే..మున్నేరు ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా కొలిక్కిరాలేదు. ఇళ్లను, మిగిలిన సామగ్రిని శుభ్రం చేసుకునేందుకే బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎవరైనా వచ్చి ఏదైనా సాయం అందిస్తారా అంటూ ఎదురుచూస్తున్నారు. మున్నేరు, ఆకేరు ఇతర వాగులకు వచ్చిన వరదతో ఖమ్మం జిల్లాలో 15,201 ఇళ్లు నీట మునగగా.. 70 వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. ఎవరిని కదిలించినా.. సర్వం కోల్పోయి, మళ్లీ మొదటి నుంచి జీవితం ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఇళ్లలోని ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్, టీవీ, మిక్సర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, మంచాలు, టేబుల్స్, నిత్యావసరాలు అన్నీ పాడైపోయాయని అంటున్నారు. ఏళ్లకేళ్లుగా కూడబెట్టుకుని సమకూర్చుకున్న సామగ్రి అంతా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రూ.16,500 సాయం అందిస్తే, తాత్కాలిక ఉపశమనమే ఉంటుందని.. ఇక తమ బతుకులు గాడినపడేది ఎలాగని వాపోతున్నారు.పొలాల పరిహారమూ పెంచాలి..వరదల వల్ల సాగుకోసం చేసిన పెట్టుబడులు పూర్తిగా నష్టపోయామని.. ఇప్పుడు మళ్లీ పెట్టుబడులు అవసరమని రైతులు చెప్తున్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు ఇస్తామన్న పరిహారాన్ని పెంచాలని కోరుతున్నారు. ముఖ్యంగా కొన్నిచోట్ల పొలాల్లో ఇసుక మేటలు, రాళ్లు చేరాయని.. వాటిని తొలగించాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుందని అంటున్నారు. అలాంటప్పుడు పరిహారం ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు.పాలేరు వరదతో ఆరు ఎకరాల్లో వరి కొట్టుకుపోయింది. పొలం కోతకు గురై ఇసుక మేట వేసింది. కరెంటు మోటార్లు, స్తంభాలు కూడా కొట్టుకుపోయాయి. రూ.4 లక్షలకుపైనే నష్టం జరిగింది. ప్రభుత్వం ఇస్తామన్న పరిహారంతో ఇవన్నీ సరిచేసుకునేదెట్లాగో తెలియడం లేదు.– బీరెల్లి సుధాకర్‌రెడ్డి, మల్లాయిగూడెం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లాఈ సాయం సరిపోదు..ఖమ్మం ధంసలాపురానికి చెందిన నిడిగుండ నరేశ్–ఈశ్వరమ్మలకు ఇద్దరు పిల్లలు. రోజూ పనికి వెళ్తేనే కుటుంబం గడిచేది. మున్నేరు వరదతో ఇంటి పునాది కోతకు గురై గోడలు పడిపోయాయి. ఇంట్లోని టీవీ, ఫ్రిడ్జ్, కూలర్, గ్యాస్ సిలిండర్ అన్నీ కొట్టుకుపోయాయి. ప్రభుత్వం ఇస్తామంటున్న ఆర్థిక సాయంతో కోలుకునేది ఎలాగని నరేశ్ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం దయ చూపితేనే..ఖమ్మం మోతీనగర్‌కు చెందిన కస్తూరి సంతోష–రమేశ్ కూలి పనులు వెళ్లి జీవిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. మున్నేటి వరదతో ఇంటి ప్రహరీ కూలిపోగా, తలుపులు ఊడిపోయి సామగ్రి కొట్టుకుపోయింది. ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదని.. తమపై ప్రభుత్వం దయచూపితేనే కోలుకుంటామని వారు వాపోతున్నారు.ఆదుకుంటేనే మనుగడఖమ్మం వెంకటేశ్వర నగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు తోపుడు బండిపై కూరగాయలు అమ్మడంతోపాటు చిన్న కిరాణాషాపు నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు. మున్నేటి వరదతో ఇంట్లో సామాన్లతోపాటు కిరాణా షాపులోని సామగ్రి అంతా కొట్టుకుపోయాయి. «అధికారులు వచ్చి పేర్లు రాసుకెళ్లినా ఇంకా ప్రభుత్వ సాయం అందలేదని.. సర్వం కోల్పోయిన తాము సాధారణ స్థితికి వచ్చేలా ప్రభుత్వమే ఆదుకోవాలని వెంకటేశ్వర్లు కోరుతున్నాడు. -
ఖమ్మం జిల్లాకు మరోసారి మున్నేరు ముప్పు
సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లాకు మరోసారి మున్నేరు ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం, మున్నేరు వద్ద నీటిమట్టం 16 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి హెచ్చరికలు జారీచేశారు. 24 అడుగులు చేరితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని తెలిపారు. మరో 24 గంటల పాటు మున్నేరు ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇల్లు ఖాళీ చేసి పునరావస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు.మరోవైపు, వర్షాలతో ప్రకాష్ నగర్ బ్రిడ్జి డ్యామేజ్ అవ్వడంతో పూర్తిగా రాకపోకలు నిలిపివేసిన అధికారులు..రోడ్డు మధ్యలో గోడ నిర్మించారు. మరమ్మత్తులు పూర్తయ్యేంతవరకు రాకపోకలు స్తంభించనున్నాయి. ఖమ్మం- కోదాడ , విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మున్నేరు ముప్పు.. గ్రామాలకు అలెర్ట్మున్నేరులో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు.. వరద ప్రభావిత గ్రామాలైన కంచల, ఐతవరం, దామూలూరుతో పాటు పలు గ్రామాల ప్రజలను అలెర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం నందిగామ వద్ద మున్నేరుకు 65,000 క్యూసెక్కుల వరద చేరింది. 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై నీరు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. -
TG: రెండు జిల్లాలో భీకర వర్షం.. ఈ రాత్రి ఎలా గడిచేనో..
సాక్షి, ఖమ్మం/మహబూబాబాద్: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల నుంచి కోలుకునేలోపే మరోసారి మహబూబాబాద్, ఖమ్మంలో శనివారం మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షం ధాటికి ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది.ఇక, శనివారం సాయంత్రం నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రం సహా బయ్యారం మండలంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో, జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. అటు.. బయ్యారంలో జగ్నతండా జల దిగ్బంధమైంది. అన్ని వైపుల నుంచి వరద చుట్టుముట్టడంతో తండాలోని ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాల వలన మరోసారి పెరుగుతున్న మునేరు వాగు ప్రవాహం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటోందన్నారు. అవసరమైతే సహాయక శిబిరాలు మళ్లీ తెరవాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలు వెంటనే అక్కడినుండి తరలి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు వెళ్లాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సూచనలను పాటించి, తగినంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులతో సంప్రదించాలని కోరారు. అధికారులు వెంటనే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు, ప్రజలకు సహాయ సేవలు నిరంతరం అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. Inatensive Heavy rain in Mahabubabad bro now pic.twitter.com/3JQBEnpwLP— MKS Goud (@KothaMukesh2) September 7, 2024 మరోవైపు.. ఖమ్మంలో కూడా మరోసారి పరిస్థితి దారుణంగా మారాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్నేరుకు వరద పెరిగే అవకాశం ఉంది. శనివారం అర్ధరాత్రి తర్వాత మున్నేరు ఉధృతి పెరిగే సూచనలు ఉండటంతో కేఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. కమిషనర్.. అధికారులను అందరినీ అత్యవసరంగా ఆఫీసుకు పిలిపించారు. ముంపు ప్రాంతాలను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు ప్రజలకు సూచించారు. Water level is rising in munneru due to heavy rains in mahabubabad and warangal.* Munneru river* Date: *07.09.2024*Time : 7.26 PMWater level: 8.75'ft1st warning 16.00 ft 2nd Warning 24.00ft. Trend:- steadyదాన్వాయిగూడెం, రమణపేట,… pic.twitter.com/mngqnDTD9U— Municipal Commissioner (@MC_Khammam) September 7, 2024 #Mahabubabad #Telangana has again got very heavy rain and many places in #Khammam as well as #Yellandu catchment of #Munneru is getting heavy rains in the last 2 hours. Strict vigil required along Munneru sub-basin. @APSDMA @10NDRF @CWCOfficial_FF @ndmaindia pic.twitter.com/3yErRTI7Vj— S Lakshminarayanan (@sln_1962) September 7, 2024 -
సర్వే.. నామ్ కే వాస్తే..!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పట్టణం, రూరల్ మండలాల్లో చేపట్టిన ముంపు బాధితుల సర్వే నామ్‌కే వాస్తేగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే కోసం వచ్చిన సిబ్బంది కేవలం పేర్లు, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, ఇంట్లోకి నీరు ఎంత వరకు వచ్చిందనే వివరాలు మాత్రమే తీసుకుంటున్నారని చెప్తున్నారు. భారీ వరదలతో పదులకొద్దీ ఇళ్లు నేలమట్టం అయ్యాయని.. వందల సంఖ్యలో ఇళ్ల గోడలు కూలి, కిటికీలు, తలుపులు ధ్వంసమై తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇళ్లలోని సామగ్రి అంతా తడిసి, కొట్టుకుపోయి నష్టపోయామని గుర్తు చేస్తున్నారు. సర్వే సిబ్బంది ఇవేవీ నమోదు చేయడం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల సాయం కోసం మాత్ర మే ఈ సర్వే చేస్తే.. తాము కోల్పోయిన ఇళ్లు, నష్టపోయిన సామగ్రికి పరిహారం అందనట్లేనా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని కోసం మళ్లీ సర్వే ఏదైనా చేస్తారా, సాయం అందుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.పేర్లు నమోదు చేయడం లేదంటూ..మున్నేరు వరదతో ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలాల్లో 70 కాలనీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొత్తంగా 15,777 ఇళ్లు వరద తాకిడికి గురైనట్టు అంచనా. ఈ ముంపును తేల్చేందుకు 172 మంది ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొంటున్నారు. ఈ ప్రక్రియ శుక్రవారం నాటికి కొలిక్కి వ చ్చిందని అధికార యంత్రాంగం చెబుతోంది. కానీ సర్వే మొదలుపెట్టిన తొలి రోజున చాలామంది ఇళ్లలో లేకపోవ డంతో వందలాది మంది పేర్లు నమోదు కానట్టు తెలుస్తోంది. తర్వాత కూడా దాతలు ఇచ్చే వస్తువులు, భోజనం అందుకోవడానికి వెళ్లినవారు, కుటుంబం మొత్తం పునరావాస కేంద్రాల్లోనే ఉన్న వారు చాలా మంది తమ పేరు ముంపు బాధితుల జాబితాలో నమోదుకాలేదని వాపోతున్నారు. నమోదవకుంటే ప్రభుత్వమిచ్చే రూ.10వేలు కూడా అందవేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏ అధికారి కూడా.. రాలేదు..వరదలు వస్తున్నాయని సమాచా రం ఇవ్వలేదు. తెలిసినవారు ఫోన్ చేస్తే నిద్రలో లేచి కట్టుబట్టలతో బయటికి పరుగెత్తాం. వరదలు తగ్గి ఐదు రోజులైనా మా ప్రాంతానికి ఏ అధికారి కూడా రాలేదు. మా దగ్గర సర్వే జరగకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం అందుతుందో, లేదో తెలియడం లేదు.– రేష్మ, పద్మావతినగర్, ఖమ్మంసర్వే లేదు.. సాయం లేదు..రెండు రోజుల నుంచి మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికా రులు సర్వే చేశారు. మా ప్రాంతానికి మాత్రం రాలేదు. అక్కడికి వెళ్లి అధికారులను అడిగితే ‘వస్తారు.. మీ ఇంటి దగ్గరే ఉండు’ అని చెప్పారు. సర్వేలో నమోదైతేనే సాయం అందుతుందని కొందరు అంటున్నారు. మరి మా వివరాలు ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు సాయం చేస్తారో తెలియడం లేదు. – పాటి ప్రదీప్‌కుమార్, వెంకటేశ్వరనగర్, ఖమ్మం -
ఆశలు పోయి.. ఆవేదనే మిగిలి..
ఖమ్మం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇళ్లలో, కాలనీల్లో మోకాళ్లలోతు బురద పేరుకుపోయింది. ఎంతగా ఎత్తిపోస్తున్నా తగ్గడం లేదు. బురద, చెత్తాచెదా రం కారణంగా డ్రైనేజీలూ మూసుకుపోయి ఉన్నాయి. ఒక్కపూట తిండి కోసం, గుక్కెడు మంచి నీళ్ల కోసం కూడా అల్లాడుతు న్నామని బాధితులు వాపోతున్నారు. అధికారులెవరూ తమ ప్రాంతాలకు రాలేదని, ఎలాంటి సాయం అందలేదని ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. పెద్దతండా, జలగంనగర్, బొక్కల గడ్డ, వెంకటేశ్వర కాలనీలలో పరిశీలించగా.. అంతటా బాధితుల నుంచి ఇదే మాట. ‘‘మాకు ఇక ఏడ్చేందుకూ కన్నీళ్లు కూడా లేవు..’’ అని వెంకటేశ్వర కాలనీలో అక్కి మంగమ్మ వాపోయింది. ‘‘మా ఇళ్లు గుర్తుపట్టలేనంతగా దెబ్బ తిన్నాయి. నాలుగు రోజులుగా కట్టుబట్టలతో ఉన్నాం. ఇదేం పాపమో మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు..’’ అని కె.సరిత, శీలం ప్రియాంక, ఎం.మమత, సత్యమ్మ బావురు మన్నారు. కాలనీ వైపు ఎవరొచ్చినా.. ఏదైనా సాయం చేస్తారేమోనని ఆశగా చూస్తున్నామని పేర్కొన్నారు.బురద ఎత్తిపోస్తూ.. ఆరోగ్యం దెబ్బతిని..ఇళ్లలో పేరుకున్న బురద ఎత్తిపోస్తూ, సామగ్రిని శుభ్రం చేసుకుంటున్న క్రమంలో చాలా మంది ముంపు బాధితులకు ఎలర్జీలకు లోనయ్యారు. కాళ్లు, చేతులపై పుండ్లు ఏర్పడ్డాయి. అలా ఏర్పడ్డ పుండ్లను చూపిస్తూ డి.లలిత, నారాయణమ్మ, రమణమ్మ కన్నీటి పర్యంతం అయ్యారు. ఫంగస్ వ్యాధులే దీనికి కారణమని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. డ్రైనేజీలు పూడుకుపోయి.. తీవ్ర దుర్గంధంలో..వరద ప్రభావిత కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. బురద నిండి నడవడమూ కష్టంగా మారింది. అన్నీ చిన్న చిన్న కాలనీలు కావడంతో కార్పొరేషన్ వాహనాలు రావడం లేదు. అక్కడి పేదలే రాత్రింబవళ్లు బురద ఎత్తిపోస్తున్నారు. వరద వచ్చిన ఐదు రోజుల తర్వాత ప్రభుత్వం నిత్యావసరాలు, దుప్పట్లను సరఫరా చేసినా.. అవి సరిపోని పరిస్థితి. బురద, చెత్తాచెదారంతో కాలనీల్లో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే అంటువ్యాధులు వ్యాపిస్తాయని సహాయక శిబిరాల్లోని వైద్యులు హెచ్చరిస్తున్నారు కూడా. ఇక్కడి నుంచి రోజూ 300 ట్రాక్టర్ల చెత్తను డంప్‌యార్డ్‌లకు పంపుతున్నామని వరంగల్ నుంచి వచ్చిన శానిటేషన్ సూపర్వైజర్ చందు తెలిపారు.అధికారుల జాడే లేదంటూ..వరదలపై అప్రమత్తం చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని బాధితులు మండిపడుతున్నారు. ముంపు తర్వాత కూడా అధికారులెవరూ తమ దగ్గరకు రాలేదని వెంకటేశ్వర కాలనీకి చెందిన పార్వతమ్మ వాపోయారు. ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి సాయం లేదని.. శాంతినగర్‌లోని చుట్టాల ఇంటికెళ్లి తినివస్తున్నామని, ఎన్నాళ్లిలా తింటామని జి.నాగమణి కన్నీళ్లు పెట్టింది. కూలీ పనిచేసే వడ్లకొండ సూరమ్మ మూడుగదుల రేకుల ఇల్లు కూలిపోయింది. ఆ ఇంటిని చూస్తూ ఆమె కన్నీళ్లుపెడుతూనే ఉంది. తల్లితండ్రి గుండెపోటుతో చనిపోతే ఒక్కడే ఉంటున్న కిరణ్ ఇల్లు కూలిపోయింది. చదువుకున్న సర్టిఫికెట్లు కూడా నీటిపాలై ఆవేదనలో పడిపోయాడు.‘పండుగ’కూ వరద ముంపుఖమ్మం పట్టణం, రూరల్ మండలాలను ముంచేసిన వరద.. ఈసారి వినాయక చవితి పండుగనూ ముంచేసింది. ముంపు కాలనీల్లో ఏటా వీధివీధినా వినా యక విగ్రహాలతో నవరాత్రులను ఘనంగా జరుపు కొనేవారు. కానీ ఈసారి వరదల కలకలంతో పండుగ కళ దూరమైంది. వినాయక విగ్రహాలు, పూజా సామ గ్రి విక్రయించేవారు కూడా నిరాశలో పడిపోయారు. కాలేజీల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో బాధితులు వస్త్రాలు, సామగ్రి ఆరబెట్టుకో వడం కనిపించింది. వరదలకు ముందే కాలనీల ప్రజలు వినాయక విగ్రహాల కోసం ఆర్డర్లు ఇచ్చారని.. అవన్నీ క్యాన్సిల్ అయ్యాయని విగ్రహాల తయారీదా రు హరికుమార్ వాపోయారు.‘పాత సామాన్లు కొంటాం’!కొందరికి అంతులేని ఆవేదన.. మరికొందరికి ఎంతో కొంత ఆశ. ముంపు ప్రాంతాల్లోనివారు వరదల్లో తడి సి, పాడైపోయిన సామగ్రిని ఓ మూలకు పడేస్తున్నా రు. ఈ నేపథ్యంలో పాత సామాన్లు కొనే వారి హడా వుడి పెరిగింది. ఆటో ట్రాలీలకు మైకులు పెట్టుకుని ‘పాత సామాన్లు కొంటాం. విరిగిన వస్తువులు, కుర్చీ లు కొంటాం..’ అంటూ తిరుగుతున్నారు. ఇది చూసి బాధితులు మరింత ఆవేదనకు లోనవుతున్నారు. -
ఒక శిబిరం.. ఎన్నో కన్నీళ్లు
నిండా ఆరు నెలలు కూడా నిండని పసికందు పునరావాస కేంద్రంలో చీరతో కట్టిన ఊయలలో గుక్కపెట్టి ఏడుస్తోంది. ఆరేళ్ల చిన్నారి నిహారిక కన్నీళ్లు పెట్టుకుంటూనే తన చిట్టి చేతులతో ఊయల ఊపుతూ తమ్ముడిని బుజ్జగిస్తోంది. ‘‘తమ్ముడికి అమ్మ ఉదయం పాలిచ్చి వెళ్లింది. ఇప్పుడు ఆకలేసి ఏడుస్తున్నాడు. ఏం చేయాలి’’ అంది ఆ చిన్నారి నిహారిక. ఖమ్మంలోని జలగంనగర్‌కు చెందిన నర్సింహ, భవాని దంపతుల ఇల్లు వరదలో మునిగిపోయింది. ఆ కాలనీలో, ఇంట్లో అంతా బురద, చెత్తా చెదారం మేట వేసింది. దీంతో పిల్లలను వెంట తీసుకెళ్లలేక.. వారిని పునరావాస కేంద్రంలోనే వదిలి, ఇంట్లో బురద ఎత్తిపోసేందుకు వెళ్లారు.గణేశ్ అనే యువకుడికి తీవ్ర జ్వరం. పునరావాస కేంద్రంలోనే ఓ కిటికీకి సెలైన్ వేలాడదీసి ఆయనకు పెట్టారు. గణేశ్‌కు డెంగీ లక్షణాలు ఉన్నాయని, ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్య సిబ్బంది చెప్తున్నారు. ఆ యువకుడి తల్లిదండ్రులు వరద ముంచేసిన ఇంటిని శుభ్రం చేసుకునేందుకు వెళ్లారు. ఆస్పత్రికి తీసుకెళ్లేవారెవరూ లేక.. పునరావాస కేంద్రంలోనే బిక్కుబిక్కుమంటున్నాడు.ఏదులాపురానికి చెందిన 70 ఏళ్ల గురవయ్యకు రెండు రోజులుగా నీళ్ల విరేచనాలు. కళ్లు పీక్కుపోయాయి. మాట పెగలడం లేదు. కాళ్లలో సత్తువ కూడా లేదు. పునరావాస కేంద్రంలో వైద్య సిబ్బంది ఇచి్చన మాత్రలు వేసుకుని ఓ పక్కన ఒత్తిగిల్లుతున్నాడు. అక్కడున్న వారిలో 12 మందికి శుక్రవారం ఉదయం నుంచీ ఇలా విరేచనాలు మొదలయ్యాయని గురవయ్య చెప్పాడు. ఆహారం వల్లనో, నీటితోనో గానీ.. నానా అవస్థలు పడుతున్నామని వాపోయాడు..ఖమ్మం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఖమ్మంలోని పునరావాస కేంద్రంలో వరద ముంపు బాధితుల కష్టాలివి.. ఇంటికెళ్లే పరిస్థితి లేక, పునరావాస కేంద్రంలో పెడుతున్న ఆహారం తినలేక, రాత్రుళ్లు నిద్రకూడా సరిగా లేక నానాయాతన పడుతున్నారు. కేంద్రంలో అన్ని వసతులు కలి్పంచామని అధికారులు చెప్తున్నా.. కానీ అన్నీ ఇబ్బందులేనని బాధితులు వాపోతున్నారు. బిక్కుబిక్కుమంటూ గడుపుతూ.. వరదలతో ముంపునకు గురైన ఖమ్మంలోని జలగంనగర్, పలు ఇతర కాలనీల వాసులకు సమీపంలో రామ్‌లీలా ఫంక్షన్ హాల్లో పునరావాసం కల్పించారు. 1,500 మందిని ఆ కేంద్రానికి తరలిస్తే.. శుక్రవారం ఉదయం వంద మంది కూడా కనిపించలేదు. ఉన్న వారంతా చిన్న పిల్లలు, వృద్ధులే. యువకులు, తల్లిదండ్రులు ముంపు బాధితులు ఇళ్లను, సామగ్రిని శుభ్రం చేసుకోవడానికి.. పిల్లలు, వృద్ధులను పునరావాస కేంద్రాల్లోనే వదిలేసి ఇళ్లకు వెళ్తున్నారు. రాత్రికల్లా తిరిగి వస్తున్నారు. అంతదాకా పిల్లలు, వృద్ధులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అమ్మా ఎప్పుడొస్తావ్! ‘అమ్మా ఎప్పుడొస్తావ్. ఇక్కడ ఉండలేకపోతున్నాను’.. పదేళ్ల ప్రణవి ఏడుస్తూ సెల్ఫోన్లో తల్లిని అడుగుతోంది. ‘‘చస్తే చస్తాం.. ఇంటికెళ్లి పోవాలనిపిస్తోంది..’’ అన్నారో 75 ఏళ్ల పెద్దాయన. వారిని ఇంకా వరద బీభత్సం వెంటాడుతూనే ఉంది. ఏం జరిగిందో, ఇకపై జరుగుతుందో తెలియడం లేదంటూ ఆందోళన కనిపిస్తోంది. ఆడుతూ, పాడుతూ ఉండే పిల్లలు పునరావాస కేంద్రంలో కాలు కదపకుండా ఉండలేకపోతున్నారు. గుక్కెడు నీళ్లు తాగాలన్నా ఎవరినో అడగాలి. బుక్కెడు బువ్వ కోసమూ లైన్లో నిలబడాలి. ఇక్కడ ముద్ద నోట్లోకి వెళ్లడం లేదని వినేష్, పల్లవి, సుధ వాపోయారు. ‘జ్వరం వచి్చందని చెప్పుకునే తోడు లేదు. తిన్నావా? అని అడిగే దిక్కు లేదం’టూ వృద్ధులు కన్నీళ్లు పెడుతున్నారు. అలా తినాలంటే ఎలా? తాగునీటి డ్రమ్ముల్లో దోమలు, కీటకాలు, వంటశాలలో తడి, దుర్వాసన. వండే, వడ్డించే గరిటలు కిందే పెడుతుండటంతో అంటుతున్న మట్టి. హడావుడిగా వంట. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల కూరలు.. అన్నం కోసం లైన్ కట్టాలి. అయిపోతే వండి తెచ్చేవరకు అలాగే నిరీక్షించాలి. పెట్టినంతే తినాలి. కడుపు నిండలేదని మళ్లీ అడిగినా ఉండదు.. ఇదీ సహాయక శిబిరాల్లో పరిస్థితి. ఇదంతా చూస్తూ ఖర్మకాలి వచ్చామంటూ వృద్ధులు వాపోతున్నారు. కలో గంజో తాగి ఇంటి దగ్గర ఉండటమే నయమంటున్నాడు సుబ్బయ్య.కాళ్లు లాగుతున్నాయని వెళ్తే పారాసిటమాల్ ఇచ్చారని చెప్పారో వృద్ధుడు. మూడు రోజులుగా చలి జ్వరంతో బాధపడుతున్నా చెప్పుకోలేని పరిస్థితి ఉందని బావురుమన్నారు మరో వృద్ధుడు. అమ్మానాన్నలు రాగానే చిన్నారులు గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నారు. ఇంటికి తీసుకెళ్లాలంటూ మారాం చేస్తున్నారు. ఇంటి నిండా బురద ఉందని చెప్పినా పిల్లలు వినడం లేదని సుశీల అనే మహిళ వాపోయింది.నా ఖమ్మం కోసం నేను!వినాయక మండపాల వద్ద సామగ్రి సేకరణకు బాక్స్‌లు.. కలెక్టర్ వినూత్న ఆలోచనఖమ్మం సహకారనగర్: ఖమ్మం జిల్లాలో వరద ముంపుతో నష్టపోయిన వారికి అందరూ అండగా నిలబడాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన గూగుల్ మీట్ ద్వారా జిల్లా వ్యాప్తంగా అధికారులతో ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా ‘నా ఖమ్మం కోసం నేను’ పేరిట కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ మేరకు ప్రతీ గణేశ్ మండపం వద్ద ఒక బాక్స్ ఏర్పాటు చేయాలని, అందులో ముంపు బాధితుల కోసం దుస్తులు, చెప్పులు తదితర ఉపయోగపడే సామగ్రి వేసేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా ఆపదలో ఉన్న వారికి అందరం అండగా నిలుస్తామని కలెక్టర్ తెలిపారు. -
ముంచెత్తిన మున్నేరు.. ఖమ్మం కకావికలం
-
డెడ్ స్టోరేజీతో బోసిపోతున్న మానేర్ రిజర్వాయర్
-
శాంతించిన మున్నేరు.. హైదరాబాద్-విజయవాడ హైవే క్లియర్
సాక్షి, ఐతవరం : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. కాగా, వరదల కారణంగా కృష్టా జిల్లాలోని ఐతవరం వద్ద జాతీయ రహదారిపైకి నీరు రావడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో దాదాపు 24 గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ కూడా విజయవాడ-హైదరాబాద్ మధ్య రెగ్యులర్ సర్వీసులను రద్దు చేసింది. ఇక, తాజాగా వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్-విజయవాడ హైవేపై యథావిధిగా వాహనల రాకపోకలు కొనసాగుతున్నాయి. మున్నేరు వరద తగ్గడంతో వాహనాలను పోలీసులు అనుమతించారు. కాగా, అంతకుముందు వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు రక్షించారు. ఇది కూడా చదవండి: బోరుమంటున్న మొరంచపల్లి.. సర్వం కోల్పోయిన దీనస్థితి.. -
హైదరాబాద్-విజయవాడ హైవేపై యథావిధిగా వాహన రాకపోకలు
-
ఐతవరం వద్ద జాతీయ రహదారిపై రాకపోకలు బంద్
-
హైదరాబాద్- విజయవాడ రహదారిపై స్తంభించిన రాకపోకలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తెలుగు రాష్ట్రాలను వానలు వదలడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ ఇక్కడ అని కాకుండా దాదాపుగా అన్ని చోట్ల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్థంభించింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్ జిల్లాలో మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామసమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై(హైదరాబాద్-విజయవాడ)అడుగు మేర వరద నీరు చేరింది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వన్‌వేలోనే ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లిస్తున్నారు. వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొందరు వాహనదారులు వరద నీటిలోనే తమ వాహనాలను ముందుకు నడిపిస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐతవరం వద్ద పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. కంచికచర్ల మండలం కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు వరద ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద ఈ మూడు నదులు కలిసి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయితే సమయం గడుస్తున్నా కొద్ది వరద మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఐతవరం దగ్గర పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో ముందస్తుగా టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. చదవండి: రెడ్ అలర్ట్.. మరో 24 గంటలు అతి భారీ వర్షాలు -
భారీ వర్షాల ఎఫెక్ట్.. టెన్షన్ పెడుతున్న మున్నేరు, పాలేరు
సాక్షి, ఖమ్మం: గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రోడ్లు తెగిపోయాయి. రోడ్డు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరు తీవ్రరూపం దాల్చింది. వివరాల ప్రకారం.. మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రస్తుతం మున్నేరు నీటి మట్టం 19 అడుగులకు చేరుకుంది. ఈ క్రమంలో 18 అడుగులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్. దీంతో, బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఇదే సమయంలో అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నాయబజార్ కాలేజీ, స్కూల్‌తో పాటు ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లాలోని పాలేరు పూర్తి స్థాయిలో నిండిపోయింది. పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం పూర్తి స్థాయిలో 23 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత నీటి మట్టం 23.25గా ఉన్నట్టు తెలుస్తోంది. పాలేరుకు ప్రస్తుత ఇన్ ఫ్లో 12,438 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 10, 614 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు.. రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం ఓపెన్ కాస్ట్‌లలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జేవీఆర్ ఓసీలో 60 వేల టన్నులు, కిష్టారం ఓసీలో 16 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం : 23 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 23.5 బేతుపల్లి పెద్దచెరువు పూర్తిస్థాయి నీటిమట్టం : 16 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 16.1 పెదవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం : 19 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 11 కిన్నెరసాని రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం : 407 అడుగులు (8.4 టీఎంసీలు) ప్రస్తుత నీటిమట్టం : 402.2 అడుగులు (7.85 టీఎంసీలు) తాలిపేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం : 74 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం : 72.11 మీటర్లు -
మున్నేరు, పాలేరును ఒడిసిపడదాం
ఉప నదుల్లో లభ్యత నీటి వినియోగానికి సర్కారు ప్రణాళికలు సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది ఉప నదులైన పాలేరు, మున్నేరులలో లభించే జలాలను వీలైనంత వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ రెండు ఉప నదు ల్లో కలిపి లభ్యతగా ఉన్న 74 టీఎంసీల్లో వీలైనంత ఎక్కువ నీటిని రాష్ట్ర అవసరాలకు మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తక్షణమే ఎక్కడికక్కడ చెక్‌డ్యామ్‌లు కట్టాలని, వీలును బట్టి బ్యారేజీలు కూడా నిర్మించాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. పాలేరు ఉప నది వరంగల్ జిల్లా కొడకండ్ల ప్రాంతంలో పుట్టి ఖమ్మం జిల్లాలో ప్రవేశిస్తుంది. దీని పరిధిలో 18 టీఎంసీల నీటి లభ్యత ఉండగా.. పాలేరు రిజర్వాయర్ ద్వారా 4 టీఎంసీలు, ఇప్పటికే నిర్మించిన 10 చెక్‌డ్యామ్‌ల ద్వారా మరో 3 టీఎంసీల నీటిని విని యోగించుకుంటున్నారు. మిగతా నీరంతా కృష్ణాలో కలసి ఏపీకి వెళుతోంది. దీంతో మరో 8 చెక్‌డ్యామ్‌లు కట్టి మరో ఒకటి రెండు టీఎంసీలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక మున్నేరు వాగు నర్సంపేట ప్రాంతంలో మొదలై బయ్యారం మీదుగా ప్రవహించి విజయవాడ వద్ద కృష్ణానదిలో కలుస్తోంది. మున్నేరులో అత్యధికంగా 56 టీఎంసీల లభ్యత ఉంటున్నా... వైరా కింద 4 టీఎంసీలు, పాకాల కింద 3, లంకసాగర్ ప్రాజెక్టు కింద ఒక టీఎంసీ మాత్రమే వినియోగిస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే 6 చెక్డ్యామ్లున్నా వాటిద్వారా వాడుతున్న నీరు చాలా తక్కువ. ఈ క్రమంలో ఇక్కడ కొత్తగా 7 నుంచి ఎనిమిది చెక్‌డ్యామ్‌లు కట్టి రెండు మూడు టీఎంసీలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పెద్ద సంఖ్యలో చెక్‌డ్యామ్‌లు కట్టినా.. నీటి వినియోగం తక్కువగా ఉండే దృష్ట్యా ఒక బ్యారేజీ కూడా కట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నీటిపై ఏపీ ప్రాజెక్టు! మున్నేరు, పాలేరుల వరద నీటిని ఒడిసి పట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తాగునీటి అవసరాలను తీర్చాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రకాశం బ్యారేజీకి ఎగువన, పులిచింతలకు దిగువన పాలేరు, మున్నేరు నీటిని వినియోగిస్తూ వైకుంఠపురం బ్యారేజీని నిర్మించనుంది. వైకుంఠపురం వద్ద పది టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మిస్తే.. గుంటూరు జిల్లాతో పాటు తెలంగాణలోని నల్లగొండ జిల్లాలోనూ మూడు గ్రామాలు ముంపునకు గురవుతాయి. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి తెలంగాణ అంగీకరించదనే నిర్ణయానికి వచ్చిన ఏపీ.. నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించాలని భావిస్తోంది. అయితే ఇరు రాష్ట్రాలు కూడా ఈ రెండు ఉపనదుల నీటిని విని యోగించుకునేందుకు పూనుకోవడం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోననే చర్చకు దారితీస్తోంది. -
మానవత్వం మంటగలిసింది
కన్నబిడ్డలకు భారమైన తల్లి మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం వృద్ధాశ్రమంలో చేర్పించిన పోలీసులు ఖమ్మం క్రైం : తొమ్మిది నెలలపాటు మోసి.. వారు ప్రయోజకులు అయ్యేంతవరకు పెంచి.. వారికి బతకటానికి మార్గం చూపించిన కన్నతల్లి కుమారులకు భారంగా మారింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. నలుగురు కొడుకులు ఉన్న ఆమెకు తిండి పెట్టలేక వెళ్లగొట్టారు. 95 ఏళ్ల వయసున్న ఆమెను చిన్నపిల్లలా చూసుకోవాల్సిన కొడుకు, కోడళ్లు కాదుపొమ్మన్నారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ పండు ముదుసలి ఖమ్మంలోని మున్నేరులో పడి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఖమ్మంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. కృష్ణా జిల్లా నందిగామ మండలం చందర్లపాడుకు చెందిన ఉడుతా వెంకమ్మ(95)కు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరకీ వివాహాలయ్యాయి. భర్త సుబ్బయ్య మృతిచెందిన తరువాత వెంకమ్మ పరిస్థితి దారుణంగా తయారైంది. నలుగురు కొడుకులు ఆమెను పట్టించుకోవటం మానేశారు. ఒకరికొకరు పోటీపడి తమకు సంబంధం లేదంటూ వేధించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఉంటున్న కుమారుడు శ్రీనివాసరావు ఇంటికి ఇటీవల వచ్చింది. అయితే కొడుకు, కోడలు సూటిపోటి మాటలతో వేధిస్తూ .. ‘నీకు భోజనం పెట్టలేము.. ఖమ్మంలో ఉన్న నీ కూతురు వద్దకు వెళ్లు’ అని బలవంతంగా పంపించారు. ఆర్థిక సమస్యలతో సతమతవుతున్న కూతురు ఇంటికి వెళ్లి.. వారికి భారం కావడం ఇష్టం లేని వెంకమ్మ ఇక తనకు చావే శరణ్యం అని భావించింది. ఖమ్మం బస్టాండ్ నుంచి ఆటోలు కాల్వొడ్డులోని మున్నేరు వద్దకు వచ్చి అందులో పడి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించగా సీఐ రెహమాన్, ఎస్ఐ సర్వయ్య అక్కడికి చేరుకుని వెంకమ్మను స్టేషన్‌కు తీసుకెళ్లారు. వివరాలు తెలుసుకుని వాసవి వృద్ధాశ్రమ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తితో మాట్లాడి అందులో చేర్పించారు. వైరాలో ఉన్న ఆమె కుమారుడిని పిలిచి కౌన్సెలింగ్ ఇస్తామని సీఐ తెలిపారు. -
మున్నేరు ‘ముంపు’ సమస్య పరిష్కరిస్తా
వైఎస్సార్సీపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శీనన్న ఖమ్మంలో వైఎస్సార్సీపీ - సీపీఎం మహాప్రదర్శన వేలాది మందితో రోజంతా సాగిన ర్యాలీ అడుగడుగునా నీరాజనం ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: ఖమ్మంనగరంలో మున్నేరు ముంపు బాధిత సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని, కాంక్రీట్ గోడ నిర్మిస్తానని వైఎస్సార్సీపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలో త్రీటౌన్‌లో వైఎస్సార్సీపీ - సీపీఎం ఆధ్వర్యంలో మహాప్రదర్శన నిర్వహించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి కూరాకుల నాగభూషణం ఆధ్వర్యంలో ప్రకాష్‌నగర్ లో ఈ ప్రదర్శన ప్రారంభమైంది. అక్కడి నుంచి శ్రీకృష్ణ మందిరం, పెట్రోల్‌బంక్, శ్రీనివాసనగర్, అయ్యప్ప గుడి, బంజారా కాలనీ, మాంట్‌ఫోర్ట్ పాఠశాల, బోస్‌సెంటర్, గ్రెయిన్ మార్కెట్ రోడ్, సుందరయ్యనగర్, పంపింగ్‌వెల్ రోడ్, మార్కెట్ రోడ్, జహీర్‌పుర, వాసవీ గార్డెన్, శ్రీవాసవి ఫంక్షన్‌హాల్, బురదరాఘవాపురం, మోతీనగర్, మంచికంటినగర్, వెంకటేశ్వరనగర్, బీరప్ప గుడి, లారీ ఆఫీస్, సారధినగర్, జూబ్లీపుర, బొక్కలగడ్డ వరకు వరకు సాగింది.ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన ఈ యాత్రకు దారి పొడవునా ప్రజలు ఘనస్వాగతం పలికారు. ర్యాలీ ముగింపు సందర్భంగా బొక్కలగడ్డలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇప్పిస్తానని అన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి రాజన్న చూపిన మార్గంలో జగనన్న ఆధ్వర్యంలో కృషి చేస్తానని అన్నారు. అనంతరం కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమం లో సీపీఎం జిల్లా నాయకురాలు అఫ్రోజ్ సమీనా, డివిజన్ కార్యదర్శి ఎర్ర శ్రీకాంత్, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి నిరంజన్‌రెడ్డి, సాధు రమేష్‌రెడ్డి, నగర అధ్యక్షుడు తోట రామారావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ముస్తఫా, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర్లు, ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల పరిశీలకురాలు షర్మిలాసంపత్, సీపీఎం డివిజన్ నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, ఎర్ర గోపి, ఎస్కే సైదులు, కొప్పుల రాములు, బండారి యాకయ్య, మద్దె సత్యం, రామారావు, వైఎస్సార్సీపీ నగర ప్రధాన కార్యదర్శి తుమ్మా అప్పిరెడ్డి, ఈర్ల ప్రసాద్, తిరుపాల్‌యాదవ్, పుచ్చకాయల వీరభద్రం, బాణాల లక్ష్మణ్, ఆరెంపుల వీరభద్రం, నారుమళ్ల వెంకన్న, కొత్తగుండ్ల శ్రీలక్ష్మి, షకీనా, జిల్లేపల్లి సైదులు, ప్రభావతి, జంగాల శ్రీను, ఉపేంద్రరెడ్డి పాల్గొన్నారు. శ్రీనివాసనగర్ ప్రాంతంలో పొంగులేటి శీనన్న ఎమ్మెల్యే అభ్యర్థి కూరాకుల నాగభూషణాన్ని రిక్షా ఎక్కించుకుని తొక్కడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. ఈ ర్యాలీకి అడుగడుగునా ప్రజలు నిరాజనం పట్టారు. ఆద్యంతం వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బొక్కలగడ్డ ప్రాంతంలో పొంగులేటి శీనన్నపై అభిమానులు భారీగా పూలవర్షం కురిపించారు. బీసీ సంక్షేమ సంఘం మద్దతు.. వైఎస్సార్సీపీ - సీపీఎం ర్యాలీకి బీసీ సంక్షేమ సంఘం మద్దతు తెలిపింది. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పిండిప్రోలు రామ్మూర్తి, యువజనసంఘం జిల్లా అధ్యక్షుడు మోడేపల్లి కృష్ణమాచారి పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కూరాకుల నాగభూషణంను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఓర్సు శ్రీనివాస్, జిల్లా ప్రచార కార్యదర్శి దార్న మహేష్, కోశాధికారి రాపోలు రాంబాబు, నాయకులు సంపసాల వెంకటేశ్వర్లు, రామకృష్ణ, రమణ, రామ్మూర్తి పాల్గొన్నారు.