ఉప నదుల్లో లభ్యత నీటి వినియోగానికి సర్కారు ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది ఉప నదులైన పాలేరు, మున్నేరులలో లభించే జలాలను వీలైనంత వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ రెండు ఉప నదు ల్లో కలిపి లభ్యతగా ఉన్న 74 టీఎంసీల్లో వీలైనంత ఎక్కువ నీటిని రాష్ట్ర అవసరాలకు మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తక్షణమే ఎక్కడికక్కడ చెక్‌డ్యామ్‌లు కట్టాలని, వీలును బట్టి బ్యారేజీలు కూడా నిర్మించాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. పాలేరు ఉప నది వరంగల్ జిల్లా కొడకండ్ల ప్రాంతంలో పుట్టి ఖమ్మం జిల్లాలో ప్రవేశిస్తుంది. దీని పరిధిలో 18 టీఎంసీల నీటి లభ్యత ఉండగా..
పాలేరు రిజర్వాయర్ ద్వారా 4 టీఎంసీలు, ఇప్పటికే నిర్మించిన 10 చెక్‌డ్యామ్‌ల ద్వారా మరో 3 టీఎంసీల నీటిని విని యోగించుకుంటున్నారు. మిగతా నీరంతా కృష్ణాలో కలసి ఏపీకి వెళుతోంది. దీంతో మరో 8 చెక్‌డ్యామ్‌లు కట్టి మరో ఒకటి రెండు టీఎంసీలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక మున్నేరు వాగు నర్సంపేట ప్రాంతంలో మొదలై బయ్యారం మీదుగా ప్రవహించి విజయవాడ వద్ద కృష్ణానదిలో కలుస్తోంది.
మున్నేరులో అత్యధికంగా 56 టీఎంసీల లభ్యత ఉంటున్నా... వైరా కింద 4 టీఎంసీలు, పాకాల కింద 3, లంకసాగర్ ప్రాజెక్టు కింద ఒక టీఎంసీ మాత్రమే వినియోగిస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే 6 చెక్‌డ్యామ్‌లున్నా వాటిద్వారా వాడుతున్న నీరు చాలా తక్కువ. ఈ క్రమంలో ఇక్కడ కొత్తగా 7 నుంచి ఎనిమిది చెక్‌డ్యామ్‌లు కట్టి రెండు మూడు టీఎంసీలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పెద్ద సంఖ్యలో చెక్‌డ్యామ్‌లు కట్టినా.. నీటి వినియోగం తక్కువగా ఉండే దృష్ట్యా ఒక బ్యారేజీ కూడా కట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే నీటిపై ఏపీ ప్రాజెక్టు!
మున్నేరు, పాలేరుల వరద నీటిని ఒడిసి పట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తాగునీటి అవసరాలను తీర్చాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రకాశం బ్యారేజీకి ఎగువన, పులిచింతలకు దిగువన పాలేరు, మున్నేరు నీటిని వినియోగిస్తూ వైకుంఠపురం బ్యారేజీని నిర్మించనుంది. వైకుంఠపురం వద్ద పది టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మిస్తే.. గుంటూరు జిల్లాతో పాటు తెలంగాణలోని నల్లగొండ జిల్లాలోనూ మూడు గ్రామాలు ముంపునకు గురవుతాయి. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి తెలంగాణ అంగీకరించదనే నిర్ణయానికి వచ్చిన ఏపీ.. నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించాలని భావిస్తోంది. అయితే ఇరు రాష్ట్రాలు కూడా ఈ రెండు ఉపనదుల నీటిని విని యోగించుకునేందుకు పూనుకోవడం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోననే చర్చకు దారితీస్తోంది.
మున్నేరు, పాలేరును ఒడిసిపడదాం
Published Fri, Jul 15 2016 3:27 AM | Last Updated on Mon, Aug 20 2018 9:21 PM
Advertisement
Advertisement