మానవత్వం మంటగలిసింది
కన్నబిడ్డలకు భారమైన తల్లి
మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం
వృద్ధాశ్రమంలో చేర్పించిన పోలీసులు
ఖమ్మం క్రైం : తొమ్మిది నెలలపాటు మోసి.. వారు ప్రయోజకులు అయ్యేంతవరకు పెంచి.. వారికి బతకటానికి మార్గం చూపించిన కన్నతల్లి కుమారులకు భారంగా మారింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. నలుగురు కొడుకులు ఉన్న ఆమెకు తిండి పెట్టలేక వెళ్లగొట్టారు. 95 ఏళ్ల వయసున్న ఆమెను చిన్నపిల్లలా చూసుకోవాల్సిన కొడుకు, కోడళ్లు కాదుపొమ్మన్నారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ పండు ముదుసలి ఖమ్మంలోని మున్నేరులో పడి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించారు.
ఖమ్మంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. కృష్ణా జిల్లా నందిగామ మండలం చందర్లపాడుకు చెందిన ఉడుతా వెంకమ్మ(95)కు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరకీ వివాహాలయ్యాయి. భర్త సుబ్బయ్య మృతిచెందిన తరువాత వెంకమ్మ పరిస్థితి దారుణంగా తయారైంది. నలుగురు కొడుకులు ఆమెను పట్టించుకోవటం మానేశారు. ఒకరికొకరు పోటీపడి తమకు సంబంధం లేదంటూ వేధించడం మొదలు పెట్టారు.
ఈ క్రమంలో ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఉంటున్న కుమారుడు శ్రీనివాసరావు ఇంటికి ఇటీవల వచ్చింది. అయితే కొడుకు, కోడలు సూటిపోటి మాటలతో వేధిస్తూ .. ‘నీకు భోజనం పెట్టలేము.. ఖమ్మంలో ఉన్న నీ కూతురు వద్దకు వెళ్లు’ అని బలవంతంగా పంపించారు. ఆర్థిక సమస్యలతో సతమతవుతున్న కూతురు ఇంటికి వెళ్లి.. వారికి భారం కావడం ఇష్టం లేని వెంకమ్మ ఇక తనకు చావే శరణ్యం అని భావించింది. ఖమ్మం బస్టాండ్ నుంచి ఆటోలు కాల్వొడ్డులోని మున్నేరు వద్దకు వచ్చి అందులో పడి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించగా సీఐ రెహమాన్, ఎస్‌ఐ సర్వయ్య అక్కడికి చేరుకుని వెంకమ్మను స్టేషన్‌కు తీసుకెళ్లారు. వివరాలు తెలుసుకుని వాసవి వృద్ధాశ్రమ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తితో మాట్లాడి అందులో చేర్పించారు. వైరాలో ఉన్న ఆమె కుమారుడిని పిలిచి కౌన్సెలింగ్ ఇస్తామని సీఐ తెలిపారు.