
ప్రేమికుల రోజంటే యువ హృదయాల గురించే మాట్లాడుకుంటారు. వారి ఆశలు, ఆనందాల గురించే ప్రస్తావిస్తుంటారు. మలివయసులో ఒంటరితనంతో బాధపడుతున్న పెద్దలు... తోడును కోల్పోయిన జీవితాల్లో వెలుగులు నింపడం గురించి ఆలోచిస్తున్నామా?!తీరిక లేని మన జీవితాల్లో నుంచి వారిని దూరం పెడుతున్నాం సరే, వారి మదిలో దాగున్న ప్రేమలను, బాధలను అర్ధం చేసుకుంటున్నామా?!
ఆరుపదుల వయసులో మనసున మనసై బతుకున బతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ .. అని కోరుకుంటున్న ఒంటరి పెద్దల ప్రేమలనూ గౌరవిద్దామా... ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మలి వయసులో చిగురించిన తమ ప్రేమను ఫలప్రదం చేసుకున్న కొన్ని జంటల ప్రేమ కథల గురించి చెబుతున్నారు తోడూనీడా వ్యవస్థాపకురాలు రాజేశ్వరి.
ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అనేది ఇటీవల జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. గౌహతిలోని ప్రమోద్ తాలూక్దార మెమోరియల్ వృద్ధాశ్రమంలో ఉంటున్న 71 ఏళ్ల పద్మేశ్వర్ గోలాకు పాటలు పాడటం హాబీ. ఆ వృద్ధాశ్రమంలో గోలా స్వరానికి మంత్రముగ్ధురాలైన 65 ఏళ్ల జయప్రభ బోరా అతన్ని ఇష్టపడింది. అతను ఆమెను ‘జాన్’ అని పిలుస్తాడు. ఆమె అతన్ని ‘బాబు’ అని పిలుస్తుంది. గోలాకు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. జయప్రభకు మాత్రం పిల్లలున్నారు. భర్త ఎప్పుడో చనిపోయాడు. బోరా పిల్లలు, మనవలు కూడా ఈ అవ్వ–తాత పెళ్లి జరిపించి, వారి ఆనందంలో తామూ పాలు పంచుకున్నారు.
సాయంగా మారిన ప్రేమ
రాజమండ్రి అర్బన్ నారాయణపురానికి చెందిన మాడుగుల మూర్తి వయసు 65 ఏళ్లు. నూడుల్స్ బండి నడుపుకునే చిరువ్యాపారి. ఎప్పుడో కుటుంబాన్ని వదిలి బయటకు వచ్చేశాడు. ఆరోగ్యం సహకరించడం లేదు. ఒంటరిగా జీవించలేక స్థానికంగా ఉండే స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో చేరారు. ఆశ్రమంలోకి వచ్చాక కూడా ఎవరితోనూ మాట్లాడకుండా అనాసక్తంగా రోజులు గడుపుతుండేవారు. కడప జిల్లా కమ్మలగుంటకు చెందిన 68 ఏళ్ల గుజ్జుల రాములమ్మ అదే ఆశ్రమంలో కొన్నాళ్లుగా ఉంటున్నారు.
ఆశ్రమంలో ఆరోగ్యం బాగోలేని వారికి తనకు చేతనైనంతలో సేవలు చేస్తుండేది. కొన్నినెలలుగా సేవలు అందిస్తున్న రాములమ్మతో మూర్తికి మానసిక బంధం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆశ్రమ నిర్వాహకులను కలిసి, తమ మనసులో మాట చె΄్పారు. ప్రేమలకు వయసుతో పనిలేదు. మానసికంగా ‘మాకోసం ఒకరున్నారు’ అనే భావన జీవించడానికి కొత్త శక్తిని ఇస్తుంది. ఒంటరి పెద్దలు కోరుకుంటున్న జీవనాన్ని అందించడానికి వారి కుటుంబసభ్యులూ అండగా నిలవాల్సిన సమయమిది.
సాయంగా ఉండాలనుకున్నాం..
అనారోగ్యంగా ఉండి, ఆసుపత్రికి వెళ్లాలన్నా అక్కడ మీతోపాటు ఎవరినైనా వచ్చారా..’ అని డాక్టర్లు అడుగుతున్నారు. కొన్నాళ్లుగా నాకు సాయంగా రాములమ్మ ఉంటోంది. ఏ విషయంలోనైనా ఆమెకు సాయంగా నేనూ ఉంటాను అని చె΄్పాను. ఇద్దరమూ ఒకరికి ఒకరం తోడుగా ఉందామనుకుని, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆశ్రమం వాళ్లు మమ్మల్ని అర్ధం చేసుకున్నారు. అంతా కలిసి ఈ మధ్యే మా ఇద్దరికీ దండలు మార్చి, అందరి సమక్షంలో పెళ్లి చేశారు. ఇప్పుడు మాకు ఒకరున్నారనే తోడు, జీవనానికి భరోసా ఉంది.
– మూర్తి, రాములమ్మ
మనసులో మాట పంచుకోవడానికి...
మలివయసు ప్రేమకథలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. తోడు–నీడ వేదికగా మలివయసు జంటలను కలుపుతున్నాను. ఆరు పదుల వయసు దాటినా, వారిలో అంతటి ప్రేమ ఉందా అనే ఆశ్చర్యమూ కలుగుతుంది. ఈరోజుల్లో పిల్లలు కూడా పెద్దల పెళ్లికి అంగీకరిస్తున్నారు. కానీ, ఇంకా సమాజం అంగీకరించడంలేదు. ఆ వయసు లో ప్రేమ–పెళ్లి అవసరమా? అంటున్నారు. మలివయసులో అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏదో భయం, దిగులు ఆవరిస్తుంది. బాగోలేనప్పుడే మరొకరి అవసరం ఉంటుంది. ఇరవైల్లో చేసుకునేదే ప్రేమ పెళ్లి కాదు.. అరవైల్లోనూ ఎమోషనల్ రిలేషన్ కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది.
– రాజేశ్వరి, తోడు నీడ వ్యవస్థాపకురాలు
Comments
Please login to add a commentAdd a comment