Old Age Home
-
మలి ప్రేమ..: ఔను.. వాళ్లు ఇష్టపడ్డారు
ప్రేమికుల రోజంటే యువ హృదయాల గురించే మాట్లాడుకుంటారు. వారి ఆశలు, ఆనందాల గురించే ప్రస్తావిస్తుంటారు. మలివయసులో ఒంటరితనంతో బాధపడుతున్న పెద్దలు... తోడును కోల్పోయిన జీవితాల్లో వెలుగులు నింపడం గురించి ఆలోచిస్తున్నామా?!తీరిక లేని మన జీవితాల్లో నుంచి వారిని దూరం పెడుతున్నాం సరే, వారి మదిలో దాగున్న ప్రేమలను, బాధలను అర్ధం చేసుకుంటున్నామా?! ఆరుపదుల వయసులో మనసున మనసై బతుకున బతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ .. అని కోరుకుంటున్న ఒంటరి పెద్దల ప్రేమలనూ గౌరవిద్దామా... ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మలి వయసులో చిగురించిన తమ ప్రేమను ఫలప్రదం చేసుకున్న కొన్ని జంటల ప్రేమ కథల గురించి చెబుతున్నారు తోడూనీడా వ్యవస్థాపకురాలు రాజేశ్వరి. ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అనేది ఇటీవల జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. గౌహతిలోని ప్రమోద్ తాలూక్దార మెమోరియల్ వృద్ధాశ్రమంలో ఉంటున్న 71 ఏళ్ల పద్మేశ్వర్ గోలాకు పాటలు పాడటం హాబీ. ఆ వృద్ధాశ్రమంలో గోలా స్వరానికి మంత్రముగ్ధురాలైన 65 ఏళ్ల జయప్రభ బోరా అతన్ని ఇష్టపడింది. అతను ఆమెను ‘జాన్’ అని పిలుస్తాడు. ఆమె అతన్ని ‘బాబు’ అని పిలుస్తుంది. గోలాకు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. జయప్రభకు మాత్రం పిల్లలున్నారు. భర్త ఎప్పుడో చనిపోయాడు. బోరా పిల్లలు, మనవలు కూడా ఈ అవ్వ–తాత పెళ్లి జరిపించి, వారి ఆనందంలో తామూ పాలు పంచుకున్నారు. సాయంగా మారిన ప్రేమరాజమండ్రి అర్బన్ నారాయణపురానికి చెందిన మాడుగుల మూర్తి వయసు 65 ఏళ్లు. నూడుల్స్ బండి నడుపుకునే చిరువ్యాపారి. ఎప్పుడో కుటుంబాన్ని వదిలి బయటకు వచ్చేశాడు. ఆరోగ్యం సహకరించడం లేదు. ఒంటరిగా జీవించలేక స్థానికంగా ఉండే స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో చేరారు. ఆశ్రమంలోకి వచ్చాక కూడా ఎవరితోనూ మాట్లాడకుండా అనాసక్తంగా రోజులు గడుపుతుండేవారు. కడప జిల్లా కమ్మలగుంటకు చెందిన 68 ఏళ్ల గుజ్జుల రాములమ్మ అదే ఆశ్రమంలో కొన్నాళ్లుగా ఉంటున్నారు. ఆశ్రమంలో ఆరోగ్యం బాగోలేని వారికి తనకు చేతనైనంతలో సేవలు చేస్తుండేది. కొన్నినెలలుగా సేవలు అందిస్తున్న రాములమ్మతో మూర్తికి మానసిక బంధం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆశ్రమ నిర్వాహకులను కలిసి, తమ మనసులో మాట చె΄్పారు. ప్రేమలకు వయసుతో పనిలేదు. మానసికంగా ‘మాకోసం ఒకరున్నారు’ అనే భావన జీవించడానికి కొత్త శక్తిని ఇస్తుంది. ఒంటరి పెద్దలు కోరుకుంటున్న జీవనాన్ని అందించడానికి వారి కుటుంబసభ్యులూ అండగా నిలవాల్సిన సమయమిది.సాయంగా ఉండాలనుకున్నాం.. అనారోగ్యంగా ఉండి, ఆసుపత్రికి వెళ్లాలన్నా అక్కడ మీతోపాటు ఎవరినైనా వచ్చారా..’ అని డాక్టర్లు అడుగుతున్నారు. కొన్నాళ్లుగా నాకు సాయంగా రాములమ్మ ఉంటోంది. ఏ విషయంలోనైనా ఆమెకు సాయంగా నేనూ ఉంటాను అని చె΄్పాను. ఇద్దరమూ ఒకరికి ఒకరం తోడుగా ఉందామనుకుని, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆశ్రమం వాళ్లు మమ్మల్ని అర్ధం చేసుకున్నారు. అంతా కలిసి ఈ మధ్యే మా ఇద్దరికీ దండలు మార్చి, అందరి సమక్షంలో పెళ్లి చేశారు. ఇప్పుడు మాకు ఒకరున్నారనే తోడు, జీవనానికి భరోసా ఉంది. – మూర్తి, రాములమ్మమనసులో మాట పంచుకోవడానికి...మలివయసు ప్రేమకథలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. తోడు–నీడ వేదికగా మలివయసు జంటలను కలుపుతున్నాను. ఆరు పదుల వయసు దాటినా, వారిలో అంతటి ప్రేమ ఉందా అనే ఆశ్చర్యమూ కలుగుతుంది. ఈరోజుల్లో పిల్లలు కూడా పెద్దల పెళ్లికి అంగీకరిస్తున్నారు. కానీ, ఇంకా సమాజం అంగీకరించడంలేదు. ఆ వయసు లో ప్రేమ–పెళ్లి అవసరమా? అంటున్నారు. మలివయసులో అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏదో భయం, దిగులు ఆవరిస్తుంది. బాగోలేనప్పుడే మరొకరి అవసరం ఉంటుంది. ఇరవైల్లో చేసుకునేదే ప్రేమ పెళ్లి కాదు.. అరవైల్లోనూ ఎమోషనల్ రిలేషన్ కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది.– రాజేశ్వరి, తోడు నీడ వ్యవస్థాపకురాలు -
వృద్ధాశ్రమంపై ఏలూరు ఎమ్మెల్యే దాష్టీకం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వేధింపుల పర్వం తారాస్థాయిలో కొనసాగుతోంది. ఓ వృద్ధాశ్రమం నిర్వాహకులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడంటూ ముద్ర వేసి అధికారంలోకి వచ్చిన రోజు నుంచీ వేధింపుల తీవ్రత పెంచారు. చివరకు ఆశ్రమం బిల్లులు నగరపాలక సంస్థ నుంచి మంజూరుకాకుండా అడ్డుకోవడంతో పాటు మంగళవారం స్టోర్ రూమ్, మేనేజర్ రూమ్‌కు అధికారులతో సీల్ వేయించి వృద్ధులను వెళ్లిపోవాల్సిందిగా హుకుం జారీ చేయడం పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఏలూరు నగరంలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి సోదరుడు బడేటి బుజ్జి హయాంలో 2017లో నగరపాలక సంస్థ పరిధిలో మెప్మా ద్వారా ‘నిశ్చింత పట్టణ నిరాశ్రయుల సేవా కేంద్రం’ను నగరంలోని పత్తేబాదలో ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ బాధ్యతను మదర్ థెరిస్సా ఫౌండేషన్‌కు అప్పగించి నిర్వహణ కోసం ప్రతి నెలా రూ.50 వేలు నగరపాలక సంస్థ నుంచి మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం ఆశ్రమంలో 48 మంది వృద్ధులున్నారు. వీరికి పూర్తిగా రెండు పూటలా ఆహారం, వసతితో పాటు వైద్యసేవలన్నీ మదర్‌థెరిస్సా ఫౌండేషన్ నిర్వాహకులే ఉచితంగా చూస్తున్నారు. 2017 నుంచి ఈ కేంద్రం కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా యథాతథంగా ఇబ్బంది లేకుండా కొనసాగించారు. ఈ క్రమంలో 2024లో టీడీపీ ఎమ్మెల్యేగా ఏలూరు నుంచి బడేటి చంటి గెలుపొందారు. దీంతో ఆశ్రమంపై వేధింపుల పర్వం తారాస్థాయికి చేరింది. నగరపాలక సంస్థ కూడా ప్రతి నెలా బిల్లులు ఇవ్వకుండా ఏడాదికి రూ.6 లక్షలు చొప్పున ఒకేసారి బిల్లులు మంజూరు చేసింది. అలా మూడేళ్ల నుంచి రూ.18 లక్షల మొత్తం మదర్‌థెరిస్సా ఫౌండేషన్ నిర్వాహకులు రాయి మంగరాజుకు, రాయి విమలాదేవికి రావాల్సి ఉంది. వైఎస్సార్సీపీ పేరుతో వేధింపులు మదర్‌థెరిస్సా ఫౌండేషన్ నిర్వాహకురాలు రాయి విమలాదేవి 37వ డివిజన్ నుంచి గతంలో టీడీపీ నుంచి గెలుపొంది కార్పొరేటర్‌గా పనిచేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే సోదరుడు, అప్పటి టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆశ్రమ బాధ్యతలను నగరపాలక సంస్థ ద్వారా అధికారికంగా అప్పజెప్పారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని సమక్షంలో విమలాదేవి, ఆమె కుమారుడు పార్టీలో చేరారు. ఎక్కడా క్రియాశీలకంగా లేకుండా పూర్తిగా ఆశ్రమ సేవా కార్యక్రమాలకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిర్వాహకులను ఎమ్మెల్యే ముప్పుతిప్పలు పెడుతున్నారు. గతేడాది జూన్‌లో మంజూరైన బిల్లును నగరపాలక సంస్థలో నిలుపుదల చేయించి అప్పటి నుంచి వేధిస్తూనే ఉన్నారు. వేధింపులకు పరాకాష్టగా మంగళవారం ఎలాంటి నోటీసులు, ముందస్తు సమాచారం లేకుండా నగరపాలక సంస్థ అధికారి కృష్ణమూర్తి, సిబ్బంది, త్రీటౌన్ పోలీసుల సహకారంతో ఆశ్రమానికి వచ్చి స్టోర్‌రూమ్, మేనేజర్ రూమ్‌కు సీల్ వేసి వృద్ధులను బయటికి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు. మరోవైపు ఇదే ఆశ్రమ నిర్వహణ బాధ్యతను నగరపాలక సంస్థ ద్వారా మరొకరికి అప్పగించడం గమనార్హం.ఆత్మహత్యే శరణ్యం.. రూ.18 లక్షలు మంజూరైనా బిల్లు ఇవ్వకుండా వేధించడంతో పాటు ఆకస్మాత్తుగా ఖాళీ చేసి వెళ్లిపోండి అంటున్నారు. మొదటి నుంచీ టీడీపీలోనే ఉన్నాం. నా భార్య టీడీపీ కార్పొరేటర్‌గా కూడా పనిచేశారు. తమపై ఉన్న కక్షతో తమనే నమ్ముకుని ఉన్న 48 మంది వృద్ధులను బజారుపాలు చేయడం అన్యాయం. మాకు న్యాయం చేసి వృద్ధులను ఆదుకోవాలి. – రాయి మంగరాజు, ఆశ్రమ నిర్వాహకుడు -
పండుటాకులకు ఎంత కష్టమో..
సాక్షి బృందం, విజయవాడ: అసలే అంతా 70 ఏళ్లపైబడిన వృద్ధులు. అయిన వారి ఆదరణ కోల్పోయి వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అకస్మాత్తుగా విజయవాడను ముంచెత్తిన వరదతో వారంతా ఒక్కసారిగా వణికిపోయారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే నడుములోతు నీరు. ఎటూ కదలలేని స్థితి. చేసేదిలేక ప్రాణాలు అరచేతబెట్టుకుని ఒకరివద్దకు ఒకరు చేరుకున్నారు. చేయి, చేయి పట్టుకుని ఓదార్చుకుంటూ ఒకరికొకరు సహాయం అందించుకున్నారు.ఊతకర్రల సహాయంతో ఆశ్రమం భవనం ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. తిండి లేక, మంచి నీరు లేక, కాలకృత్యాలు తీర్చుకునే దారిలేక నానా అవస్థలు పడ్డారు. మూడు రోజుల తర్వాత బుధవారం కాస్త నీరు తగ్గడంతో వారు మెల్లగా కిందకిదిగారు. ఇప్పటికీ వరద నీరు ఆశ్రమంలో ఉండటంతో ఎలాగోలా మంచాలపైకి చేరి అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. సహాయం కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. అంటు వ్యాధుల భయం.. రాజీవ్ నగర్‌లోని మున్సిపల్ కార్పొరేషన్ వృద్ధాశ్రమంలో 20 మంది ఆశ్రయం పొందుతున్నారు. కొంతమంది కొన్నాళ్లుగా మంచానికే పరిమితమై ఉన్నారు. ఆదివారం ఉదయం వృద్ధాశ్రమంలోకి నీరు చేరడంతో వారంతా భవనం పైకి వెళ్లి తలదాచుకున్నారు. దాదాపు ముప్పై ఆరు గంటల తర్వాత కిందికి దిగినప్పటికీ ఆశ్రమంలో వరద నీరు ఉండడంతో ఒక్కో మంచంపై మూడు పరుపులు వేసి ఎత్తుగా ఏర్పాటు చేసి వాటిపై ఎలాగోలా విశ్రాంతి తీసుకుంటున్నారు. కొందరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండగా మిగిలిన వారు అంటు వ్యాధులు ప్రబలుతాయోమోనని భయపడుతున్నారు. మాతృదేవోభవ వృద్ధాశ్రమంలోనూ వాంబేకాలనీలోని మాతృదేవోభవ వృద్ధాశ్రమం భవనం పూర్తిగా ముంపునకు గురైంది. అకస్మాత్తుగా వ చ్చిన వరదతో కనీసం రోడ్డు మీదకు కాలు పెట్టలేకపోయామని నిర్వాహకురాలు ఎం.దుర్గ చెప్పారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న 35 మంది వృద్ధులను ఎక్కడికీ తీసుకెళ్లలేకపోయామన్నారు. మొదటి రోజు మధ్యాహ్నం వరకు ఫోన్లు పని చేశాయని, అప్పుడే సాయం కోసం ఎంతో మంది అధికారులకు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో డాబా పైనే ఓ టార్పాలిన్‌తో తాత్కాలిక గుడిసెలా ఏర్పాటు చేసి వారందరినీ అక్కడ ఉంచామన్నారు. వారం క్రితం రూ. 2 లక్షల ఖరీదు చేసే నిత్యావసర సరుకులు తీసుకొచ్చానని, వాటిలో కొన్ని వరదకు కొట్టుకుపోగా, మిగిలినవి నీటిలో నాని ఎందుకు పనికిరాకుండా పోయాయని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు కనీసం ఇటు వైపు కన్నెత్తయినా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చరమాంకంలో చెప్పలేనంత కష్టం.. జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులు వరద ముంపు కారణంగా నానా అవస్థలు పడ్డారు. వరద నీటిని దాటి బయటకు వెళ్లలేక, నీట మునిగిన ఇంటిలో ఉండలేక, సమయానికి అన్న పానీయాలు అందక అగచాట్లు చవిచూశారు. ఇప్పుడు వరద నీరు కాస్త తగ్గడంతో కుటుంబ సభ్యుల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు చేరుతున్నారు. సింగ్‌నగర్, కేఎల్‌రావు నగర్, ఊర్మిళానగర్ ప్రాంతాల్లో వృద్ధుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. బంధువుల భుజాల ఊతంతో బయటకు వస్తున్నవారు కొందరైతే,« థర్మా కోల్, లారీ ట్యూబుల సాయంతో ఒడ్డుకు చేరుతున్నవారు మరికొందరు పలు చోట్ల కనిపించారు. ప్రశాంతంగా బతకాల్సిన వయసులో చెప్పలేనంత కష్టంతో వారు ఇబ్బంది పడుతున్నారు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు.. సింగ్‌నగర్ ప్రాంతంలో గత 15 ఏళ్లుగా ఉంటున్నాం. ఎప్పుడూ ఇలాంటి దుర్భర పరిస్థితులు చూడలేదు. వరద నీరు చేరడంతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి. మూడు రోజుల పాటు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూశాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. మర బోట్లు ఏర్పాటు చేశారని వినటమేగానీ ఒక్కటీ కానరాలేదు. శారీరక బలహీనతతో నడవలేని స్థితిలో ఉన్న నేను ప్రాణాలు కాపాడుకునేందుకు చేతి కర్రతో నడుము లోతు నీళ్లలో నడిచి ఒడ్డుకు చేరారు. – జె.వెంకటేశ్వరరావు, సింగ్‌నగర్ -
వృద్ధాశ్రమంలో హీరోయిన్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫ్యాన్స్ ఫిదా (ఫోటోలు)
-
Sanjana Thakur: కామన్వెల్త్ బహుమతి గెలిచిన అమ్మ కథ
ఆధునిక జీవితం అమ్మను ఎక్కడకు చేర్చింది?వృద్ధాశ్రమానికి.ఒకమ్మాయికి వృద్ధాశ్రమంలో నుంచి ఒక తల్లిని ఇంటికి తెచ్చుకోవాలని అనిపిస్తుంది. కాని వృద్ధాశ్రమంలో చూస్తే అందరు తల్లులూ అద్భుతంగా అనిపిస్తారు. ఇంత మంచి తల్లులను ఎందుకు పెట్టారోనని సంజనా ఠాకూర్ రాసిన కథ కామన్వెల్త్ ప్రైజ్ 2024 గెలుచుకుంది. సంజనా ఠాకూర్ పరిచయం.‘స్కూల్ టీచర్లకు నన్ను తిట్టాలని ఉండేది. కాని తిట్టలేకపోయేవారు. సంజనా బాగా చదువుతుంది... హోమ్ వర్క్ చేస్తుంది... కాని క్లాస్ జరుగుతుంటే టేబుల్ కింద కూచుని కథల పుస్తకం చదువుతోంది అని కంప్లయింట్ చేసేవారు. నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే అంత పిచ్చి. మా అమ్మ రోజూ నాకు కథలు చదివి వినిపించేది. నేను మా ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లినా పార్టీలకు వెళ్లినా పుస్తకం పట్టుకుని మూలన కూచునేదాన్ని. చిన్నప్పుడే రాయడం మొదలెట్టాను. ఇప్పుడు ఈ గుర్తింపు రావడం సంతోషంగా ఉంది’ అంటుంది 26 సంవత్సరాల సంజనా ఠాకూర్. ముంబైకి చెందిన సంజన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ లో ఎం.ఎఫ్.ఏ. ఫిక్షన్ చదువుతోంది. ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్’ పోటీల్లో పాల్గొని 2024 సంవత్సరానికి విజేత అయింది.ఐదు లక్షల బహుమతికామన్వెల్త్ దేశాలలోని యువ రచయితలను ఉత్సాహపరచడానికి కామన్వెల్త్ ఫౌండేషన్ ఏటా కథల పోటీ నిర్వహిస్తుంది. 18 ఏళ్లు పైబడిన వారు దీనికి అర్హులు. నేరుగా ఇంగ్లిష్‌లో కాని లేదా ఇంగ్లిష్‌లో అనువాదమైన స్థానికభాష కథగాని పంపవచ్చు. 2500 పదాల నుంచి 5000 పదాల వరకూ కథ ఉండాలి. ఇందులో మళ్లీ ఐదు రీజియన్లకు (ఆఫ్రికా, ఆసియా, కెనడా–యూరప్, పసిఫిక్) ఐదుగురు రీజనల్ విన్నర్స్‌ను ప్రకటిస్తారు. వీరి నుంచి ఓవరాల్ విన్నర్‌ను ఎంపిక చేస్తారు. 2024కు ఆసియా రీజనల్ విన్నర్‌గా నిలిచిన సంజనా ఠాకూర్ ఓవరాల్ విన్నర్‌గా కూడా ఎంపికైంది. నగదు బహుమతిగా 5000 పౌండ్లు గెలుచుకుంది.కథ పేరు ఐశ్వర్యారాయ్‘అమెరికాలో నేనొక బొమ్మల షాపులో తిరుగుతున్నప్పుడు కేవలం అమ్మ బొమ్మలు అమ్మే ఒక షాప్ ఉంటే ఎలా ఉంటుందా అనే ఆలోచన వచ్చింది. అక్కడినుంచి పిల్లలు అమ్మల్ని దత్తత తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన కొనసాగింది. ఇండియాలో పట్టణ సంస్కృతి ఇప్పుడు ఇళ్లల్లో అమ్మకు చోటు లేకుండా చేస్తోంది. ఆమె వృద్ధాశ్రమంలో ఉండాల్సి వస్తోంది. నా కథలో అన్వి అనే అమ్మాయి ఒక వృద్ధాశ్రమానికి వెళ్లి ఒక అమ్మను దత్తత తీసుకోవాలనుకుంటుంది. కాని ఒక్కో అమ్మ ఒక్కో లక్షణంలో గొప్పగా కనిపిస్తుంది. అమ్మలందరూ తమ అనుబంధం రీత్యా ఐశ్వర్యారాయ్ కంటే తక్కువ సౌందర్యవతులు కాదు. ఏ అమ్మ సౌందర్యమైనా బంధం రీత్యా ఐశ్వర్యారాయ్ అంత అందమైనదే. అందుకే ఆ పేరుతోనే కథ రాశాను. వ్యంగ్యం, చెణుకులు ఉండటంతో నా కథను జడ్జిలు మెచ్చుకొని ఉండొచ్చు’ అని తెలిపింది సంజనా.త్వరలో పుస్తకం‘త్వరలో 15 కథలతో నేను పుస్తకం తెస్తాను. ఇప్పటికే రాశాను. అందులో అన్ని కథల్లోనూ తల్లులూ కూతుళ్లు కనిపిస్తారు. వారి భిన్న భావోద్వేగాలు చర్చకు వస్తాయి. ప్రస్తుతం నా థీసిస్‌లో భాగంగా ఈ కథలను సబ్మిట్ చేయగానే పుస్తకం పని మొదలెడతాను. ప్రపంచ సాహిత్యంలో చాలా మంచి రచనలు వస్తున్నాయి. మన దేశం నుంచి అరుంధతి రాయ్ శైలి నాకు బాగా నచ్చుతుంది’ అందామె.సాహిత్యాన్ని ఒక చదువుగా... రచనను ఒక ఉపాధిగా చేసుకోదలిచింది సంజన. -
Pranav Shukla: పండుటాకులే పిల్లలుగా...
దైనందిన జీవితంలో ఎన్నో సందర్భాలు ఎదురవుతుంటాయి. వాటిలో కొన్ని మనల్ని కదిలించి ఆలోచింపచేస్తాయి. మరికొన్ని సందర్భాలు భవిష్యత్‌నే మార్చేస్తాయి. అలాంటి ఓ సంఘటన ప్రణవ్ శుక్లా జీవితాన్ని మార్చేసి సామాజికవేత్తగా తీర్చిదిద్దింది. వందలమంది వృద్ధులను చేరదీసి వారి ఆలన పాలన చూసుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాడు ప్రణవ్. హరియాణలోని ఫరిదాబాద్‌కు చెందిన వ్యక్తి ప్రణవ్ నారాయణ్ శుక్లా. ప్రణవ్ శుక్లా ప్రొఫెసర్ కొడుకు కావడంతో ఇంటర్మీడియట్ తరువాత మెడిసిన్ చదవాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే మెడిసిన్‌లో చేరాడు. కానీ ఫ్యాషన్ డిజైనింగ్‌పై మక్కువ ఏర్పడడంతో నెలరోజుల తరువాత మెడిసిన్ మానేసాడు. ఇది కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో ఎటువంటి ఆర్థిక సాయం చేయలేదు. అయినా తనకిష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్‌ను కష్టపడి చదివి ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. కాలేజీ రోజుల్లో... ప్రణవ్ శుక్లా ఫ్యాషన్ డిజైనింగ్ చదివేటప్పుడు రోజూ కాలేజీకి ట్రైన్లో వెళ్తుండేవాడు. ఒకసారి ట్రైన్ ఎక్కేందుకు ఓక్లా స్టేషన్‌కు చేరుకున్నాడు. అది చలికాలం కావడంతో ప్లాట్‌ఫాం మీద మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ప్లాట్‌ఫాం పైన ఒక మూలన ఒక వృద్ధుడు చలికి వణికిపోతూ అల్లాడిపోతున్నాడు. అదిచూసి చలించిపోయిన ప్రణవ్ తను ఎంతో ఇష్టంతో కొనుక్కున్న జాకెట్‌ను ఆ వృద్ధుడికి ఇచ్చాడు. అప్పుడు అతడి కళ్లలో చూసిన ఆనందం ప్రణవ్‌కు చాలా సంతృప్తినిచ్చింది. తను జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుకున్న తరువాత వృద్ధుల బాగోగులను చూసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఆనందాల, ఆత్మీయతల ఆశ్రమం.. ప్రణవ్ ఉద్యోగంలో చేరాక కొంతమొత్తాన్ని దాచుకుని వృద్ధులకు ఖర్చుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. çకొంతమొత్తం జమయ్యాక.. నిరాశ్రయులైన వృద్ధులకు బియ్యం, పప్పులు, దుస్తులు వంటి నిత్యావసరాలు సమకూర్చేవాడు. అయితే వారి అవసరాలు తీర్చడానికి మరిన్ని సదుపాయాలు అవసరం అని భావించి... 1996లో ‘అనడి సేవా ప్రకల్ప్’ పేరిట ఓల్డేజ్ హోమ్‌ను ఏర్పాటు చేశాడు. అప్పుడు ప్రణవ్‌కు పంతొమ్మిదేళ్లు. వసతి సదుపాయాలు లేక అనాథలుగా మారిన ఒంటరి వృద్ధులను చేరదీసి వసతి, కడుపునిండా ఆహారం పెట్టడం, అవసరమైన ఆరోగ్య అవసరాలు తీర్చుతూ వృద్ధుల జీవననాణ్యతను మెరుగుపరిచాడు. ఒకపక్క ప్రణవ్ ఉద్యోగం చేస్తూనే అనడిని చూసుకునేవాడు. కొన్నాళ్ల తరువాత పూర్తి సమయాన్ని ఆశ్రమానికి కేటాయించడం కోసం 2017లో ఉద్యోగం వదిలేశాడు. అప్పటినుంచి మరింత సమయాన్ని కేటాయించి ఆశ్రమంలోని వారిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకోవడం మొదలు పెట్టాడు. వారికి అవసరమైన వైద్యసదుపాయాలు సకాలంలో అందిస్తూ వారిని ఆనందంగా ఉంచేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. ఆవులు పెంచుతూ... ఆశ్రమాన్ని నడిపేందుకు.. అవసరమైన ఖర్చుల కోసం అనడి ఫారమ్స్ అండ్ గోదామ్ పేరిట ఆవుల పెంపకాన్ని ప్రారంభించాడు. రెండువందల ఆవులను పెంచుతూ.. వాటి ద్వారా వచ్చే పాలు, పెరుగు, నెయ్యిని విక్రయిస్తూ వచ్చిన ఆదాయాన్ని అనడి ఆశ్రమ వృద్ధుల కోసం ఖర్చు చే స్తున్నాడు. గత ఇరవై ఆరేళ్లుగా అనడీలో ఎంతోమంది వృద్ధులు ఆశ్రయం పొందారు. మలివయస్కుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న నలభై ఆరేళ్ల ప్రణవ్ సేవకు గుర్తింపుగా అనేక అవార్డులు, గౌరవ సత్కారాలు దక్కడంలో ఆశ్చర్యం లేదు. అందుకే పిల్లలు వద్దనుకున్నాం కాలేజ్ డేస్‌లో తీసుకున్న నిర్ణయం ఈరోజు ఇంతమందికి ఆశ్రయం కల్పిస్తోంది. పెద్దవారికి సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఆశ్రమంలో నలభైæరెండు మంది వృద్ధులు ఉన్నారు. వారిని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాము. అందుకే నేను, నా భార్య పిల్లలు వద్దు అనుకున్నాము. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ (77) కన్నుమూశారు. పక్షవాతంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేరళ కక్కనాడ్‌లోని వృద్ధాశ్రమంలో ఆయనకు ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు సమాచారం. (ఇది చదవండి: డ్రగ్స్ కేసులు..పబ్బు గొడవలు.. నిత్యం వివాదాల్లో హీరో నవదీప్!) 1976లో స్వప్నదానం సినిమాతో దర్శకుడిగా జార్జ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వ్యామోహం, యవనిక, ఇరకల్, మేళా, ఎలవంకోడు దేశం, మహానగరం, ఆడమింటే వారియెల్లు లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌గా తన తొలి చిత్రం స్వప్నదానం సినిమాకు జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. 2015లో మలయాళ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను కేరళ ప్రభుత్వం జైసీ డేనియల్ అవార్డుతో సత్కరించింది. అంతే కాకుండా కేజీ జార్జ్ కొత్త ఫిల్మ్ మేకింగ్ పాఠశాలను స్థాపించారు. మలయాళ సింగర్ సెల్మా జార్జ్‌ని 1977లో చెన్నైలో వివాహం చేసుకున్నారు. కాగా.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. (ఇది చదవండి: బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి చార్లీ!) -
ఆ ఆశ్రమం..‘మమత’ల కోవెల
నందిగామ(ఎన్టీఆర్ జిల్లా): కన్నబిడ్డలకు భారమై, ఆత్మీయుల ఆదరణకు దూరమై క్షణం ఒక యుగంలా గడుపుతున్న అవ్వాతాతలను అక్కున చేర్చుకుని ‘మమత’ను పంచుతోంది ఎన్టీఆర్ జిల్లా లచ్చపాలెంలోని వృద్ధాశ్రమం. పచ్చని చెట్ల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆశ్రమం నడుస్తోంది. మలిదశలో ఉన్న వారి మనస్సుకు ప్రశాంతతను ఇస్తోంది. సేవే లక్ష్యంగా ఆశ్రమాన్ని నిర్వహిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామానికి చెందిన వేముగంటి మమత. ఆహ్లాదకర వాతావరణంలో ఆత్మీయతలను పంచే వృద్ధాశ్రమంపై ప్రత్యేక కథనం.. సొంతూరుకు ఏదో చేయాలని.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామానికి చెందిన వేముగంటి మమత ప్రస్తుతం హైదరాబాదులో బుక్ డిజైనింగ్ కంప్యూటర్ వర్క్ చేస్తుంటారు. ఆమె భర్త చక్రవర్తి వ్యాపారి. వీరు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. చిన్నతనం నుంచి సేవా దృక్పథం కలిగిన మమత హైదరాబాద్‌లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాను పెరిగిన గ్రామానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో లింగాలపాడు సమీపంలోని లచ్చపాలెం గ్రామంలో 2020 సంవత్సరంలో 50 సెంట్ల స్థలంలో సుమారు రూ.90 లక్షల వరకు వెచ్చించి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అభయం సొసైటీ ద్వారా పి.వి.ఆర్.కె.ప్రసాద్ శేష సదన్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమంలో వృద్ధులకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చారు. సాయంత్రం వేళ ఆహ్లాదం కోసం పచ్చని గార్డెన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆశ్రమంలో 22 మంది ఆశ్రయం పొందుతున్నారు. నందిగామ ప్రాంత వాసుల సహకారం.. సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మమత తన దగ్గర ఉన్న నగదుతో పాటు మరో రూ.30 లక్షల వరకు బ్యాంక్ ద్వారా రుణం తీసుకొని మొత్తం సుమారు రూ.90 లక్షలతో ఆశ్రమ నిర్మాణం పూర్తి చేశారు. ఆమె ఆలోచనకు పలువురు దాతలు సహకారం అందించారు. ఆశ్రమానికి తరచూ వచ్చి వెళుతూ వృద్ధుల బాగోగులు చూసుకుంటున్నారు. నందిగామ చుట్టు పక్కల ప్రాంతాల వారు ఆశ్రమంలో జన్మదిన వేడుకలు, వివాహ మహోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఆశ్రమానికి మరింత అండగా నిలుస్తున్నారు. రెండేళ్ల నుంచి ఇక్కడే నా భర్త 30 ఏళ్ల కిందట చనిపోయాడు. ప్రస్తుతం నాకు 70 సంవత్సరాలు. పిల్లలు ఉన్నప్పటికీ వాళ్లు నన్ను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో రెండేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా. ఇక్కడ నన్ను సొంత తల్లి లాగా చూసుకుంటున్నారు. నాకు ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంటోంది. –కన్నూరి రాజేశ్వరమ్మ, తిరువూరు మరింత అభివృద్ధి చేయాలి చిన్నతనం నుంచి ఎదుటి వారికి సేవ చేయడమంటే ఇష్టం. ఈ ఉద్దేశంతోనే సొంత ఊరిలో ఆశ్రమం ఏర్పాటు చేశా. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయాలి. ఆశ్రమంలో ఉండేవాళ్లు ప్రశాంతంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రకృతి ఒడిలో ఆశ్రమాన్ని నిర్మించాం. –వేముగంటి మమత, ఆశ్రమ నిర్వాహకురాలు -
హనుమాన్ గుడి లేని ఊరు.. పథకాలు అందని ఇల్లు లేదు
సిరిసిల్ల: రాష్ట్రంలో ‘హనుమాన్ గుడిలేని ఊరు, కేసీఆర్ సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో మంగళవారం నాలుగు వందల మంది పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ నీళ్లు, గురుకులాల్లో విద్య, ఆసరా పెన్షన్... ఇలా ఏదో ఒక్క పథకంలో పక్కాగా ప్రతి ఒక్క కుటుంబం లబ్ధిపొందుతోందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనకు ఇది నిదర్శనమన్నారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు ఇస్తామని, డబుల్ బెడ్రూం ఇల్లు రానివారికి ‘రూ.3 లక్షల ఇల్లు’పథకంలో అవకాశం కల్పిస్తామని అన్నారు. స్థలం లేని వారికి స్థలం, ఇల్లు కట్టుకోడానికి నిధులను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. అర్హులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. మోదీకి ఇష్టం లేకున్నా.. మనమే నంబర్ వన్ తెలంగాణ అంటే ప్రధాని మోదీకి ఇష్టం లేకున్నా.. దేశంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా నంబర్ వన్‌గా నిలిచిందని కేటీఆర్ అన్నారు. సోమవారం కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ విభాగంలో రాజన్న సిరిసిల్ల నంబర్ వన్‌గా ఉందని, రెండోస్థానంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా, మూడో స్థానంలో పెద్దపల్లి జిల్లా ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల్లోని కాలేజీ విద్యార్థులకు గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా రెండు వేల మందికి ట్యాబ్‌లు పంపిణీ చేశారు. వేములవాడ నియోజకవర్గంలోని పిల్లలకు మరో 3 వేల ట్యాబ్‌లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఒక్కో ట్యాబ్ విలువ రూ.86 వేలు ఉంటుందన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే పిల్లలు ఐఐటీ, నీట్ ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించాలని, ప్రపంచంతో పోటీ పడేస్థాయికి చేరాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తొలి వృద్ధాశ్రమం రాష్ట్రంలోనే తొలి వృద్ధాశ్రమాన్ని మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేటలో ప్రారంభించారు. ఎస్టీ హాస్టల్ భవనాన్ని రూ.40 లక్షలతో ఆధునీకరించి వృద్ధుల ఆశ్రమం, డే కేర్ సెంటర్‌గా మార్చారు. 25 పడకలతో కూడిన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి యోగా కేంద్రం, ఫిజియోథెరపీ, డాక్టర్ రూం, వ్యాయామ శాల, గేమ్స్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధులతో మంత్రి కేటీఆర్ క్యారంబోర్డు ఆడారు. వారితో కలిసి భోజనం చేశారు. వృద్ధులతో చాలాసేపు ముచ్చటించారు. -
89 ఏళ్ల బామ్మ.. పూర్వీకుల ఇల్లును డే కేర్ సెంటర్‌గా మార్చేసి! స్థానిక యువతులకు....
Manavodaya Pakalveedu- Kerala: ‘వయసు పైబడటంతో ఏ పనీ మునుపటి ఉత్సాహంతో చేయలేకపోతున్నాను’ అనే మాట పెద్దల నోట తరచూ వినిపిస్తుంటుంది. అయితే, కేరళలోని కొట్టాయంలో ఉంటున్న 89 ఏళ్ల ఈ బామ్మను చూస్తే మాత్రం మనమెందుకు ఇలాంటి ఆలోచన చేయలేం అనిపించక మానదు. ఇటీవల 89వ పుట్టినరోజు వేడుకను తనలాంటి వయసు పైబడిన వారి మధ్య ఆనందంగా జరుపుకున్న ఈ బామ్మ పేరు కరుస్సెరిల్ తంకమ్మ. ఐదేళ్ల క్రితం ఆమె తన పూర్వీకుల ఇంటి తలుపులను ఒంటరి వృద్ధ మహిళల సంరక్షణ కోసం వీరిలో ఉత్సాహం నింపడానికి తెరిచింది. ఒంటరితనం నుంచి.. ఒక వయసు దాటాక పిల్లలు స్థిరపడతారు, భాగస్వామి దూరమవుతారు. ఇలాంటి పరిస్థితే తంకమ్మ జీవితంలోనూ జరిగింది. ఆమె రిటైర్డ్ హిందీ టీచర్. ఆమె ఇద్దరు పిల్లలు పట్టణాల్లో స్థిరపడ్డారు. భర్త ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు. కొద్దిరోజులు పిల్లల దగ్గర రోజులు గడిపింది. పిల్లలు ఉద్యోగాల్లో బిజీ. మనవలు, మనవరాళ్లు చదువుల్లో బిజీ. ‘ఈ వయసులో మా రోజులు ఒంటరిగానే గడుస్తుంటాయి. కానీ, మేము కోరుకునేది మరొకరి కంపెనీ మాత్రమే. బిజీగా ఉన్నవారు అన్ని వేళలా అందుబాటులో ఉండలేరు. ఇలా రోజులు గడుస్తున్నప్పుడే వయసు పైబడిన వారి రోజులను ఉత్సాహంగా మార్చడానికి, వారికి నచ్చిన పనుల్లో వారిని నిమగ్నమయ్యేలా చేయాలనే ఆలోచన వచ్చింది’ అని చెబుతారు తంకమ్మ. ఆమెకు కొట్టాయంలో వారసత్వంగా వచ్చిన 200 ఏళ్ల నాటి వారి పూర్వీకుల ఇల్లు ఉంది. ఆ ఇంటిని వృద్ధుల కోసం డే కేర్ సెంటర్‌గా ఉపయోగించాలనుకుంది. దీనివల్ల స్థానిక యువతులకు ఉపాధి కూడా కల్పించవచ్చు అనుకుంది. దీనికి ఆమె పిల్లలు శ్రీకుమార్, సతీష్ కుమార్, గీత మద్దతు పలికారు. వారు ఆ ఇంటి పునరుద్ధరణకు సహకరించారు. దీంతోపాటు ఆమె చొరవ గురించి ప్రచారం చేశారు. చేయదగిన పనులు ‘మా ప్రాంతంలో అమ్మ పరిచయం అవసరం లేదు‘ అని న్యూయార్క్ ఆధారిత సంస్థలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అయిన శ్రీ కుమార్ చెబుతారు. ‘ఆమె టీచర్ కాబట్టి, ఆమె మనకంటే ఎక్కువమందితో కనెక్ట్ అయ్యింది. ఆమె సంపాదన ఇతర మహిళల సాధికారత కోసం ఖర్చుపెట్టడానికి ఇష్టపడే వ్యక్తి. ఈ వయస్సులో కూడా, ఆమె ఈ డే కేర్‌ను విస్తరించడానికి కొత్త ఆలోచనలు చేస్తుంది’ అని ప్రశంసిస్తారు. ఐదుగురు ఉద్యోగులు కొట్టాయంలోని మానవోదయ పాకాలవీడు అని పిలువబడే ఈ ఇల్లు అధికారికంగా స్వచ్ఛంద సంస్థగా నమోదు చేయబడింది. అక్టోబర్ 11, 2017న ఈ ఇంటినుంచి కార్యకలాపాలు ప్రారంభించింది ఈ బామ్మ. ఇక్కడ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడం కోసం ఐదుగురు ఉద్యోగులు డే కేర్‌లో పనిచేస్తున్నారు. ఇక్కడికి వచ్చినవారు క్యాండిల్ లైట్లు, అగరుబత్తులు, పేపర్ బ్యాగులు, డిటర్జెంట్లు, క్లీనింగ్ లోషన్లు తయారు చేస్తారు. తయారు చేసిన ఉత్పత్తులను డే కేర్ సమీపంలోని ఒక దుకాణం ద్వారా విక్రయిస్తారు. ఆ ఆదాయం పూర్తిగా ఈ డే కేర్ కొనసాగించడానికి ఉపయోగిస్తారు. ఉదయం 8 గంటలకు మొదలు ‘ఇంట్లో చేయగల కుట్టుపనిపై ఉచిత కోర్సు కూడా ఇక్కడ లభిస్తుంది. డే కేర్‌లోని ఉద్యోగులందరూ యువతులు. వీరిలో ఇద్దరు సోషల్ వర్క్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు’ అని చెప్పే తంకమ్మ కుమార్తె గీత ప్రతి వారాంతంలో ఇంటికి వెళ్లి తల్లి చేసే కార్యకలాపాలకు సహకరిస్తుంటుంది. పాకలవీడులో ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు వృద్ధులను వారి ఇళ్ల నుండి డే కేర్ వాహనం ద్వారా పికప్ చేయడంతో ప్రారంభమవుతుంది. మొదట ప్రార్థన, తర్వాత ధ్యానం, యోగా సెషన్లో వార్తాపత్రిక చదవడం, అల్పాహారం మొదలవుతుంది. ఆ తర్వాత వారి ఇష్టం మేరకు చేయదగిన పనులను ఎంచుకొని, ఇతరులతో మాట్లాడటం, చదవడం, వ్యవసాయం లేదా ఆటల్లో పాల్గొనవచ్చు. సాయంత్రం కలిసి నడక, కాఫీ తర్వాత ఐదు గంటలకు వారిని వారి వారి ఇళ్లకు తీసుకు వెళతారు. ఇక్కడ ఉన్న వారంతా తమ పిల్లలు విధుల్లోకి వెళ్లిన తర్వాత ఇంట్లో ఒంటరిగా గడిపే స్త్రీలు. వారు ఆరోగ్యాన్ని కాపాడేందుకు, అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయడానికి, ఇక్కడ హెల్త్ క్లినిక్, ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. పగటి పూట డాక్టర్, నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో ఉంటారు. కొత్త వెంచర్‌ను ప్రారంభించడానికి ఈ పనులు ఎప్పుడూ అడ్డు కాదం’టారు తంకమ్మ. చదవండి: Jyotsna Cheruvu: స్థిరత్వమే సక్సెస్ సూత్రం -
అభాగ్యులకు అండగా..
సిద్దిపేటజోన్: అందరూ ఉండి ఏకాకులుగా మారిన వారు కొందరైతే.. విధి వక్రించి ఒంటరి జీవనం గడిపే వారు మరి కొందరు. వృద్ధాప్యంలో తోడూనీడా లేకుండా ఒక భరోసా కోసం ఎదురుచూసే వారికి, అభాగ్యులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్దిపేట జిల్లా కేంద్రంలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. మంత్రి హరీశ్‌రావు చొరవతో సుమారు రూ.కోటి నిధులతో రాష్ట్రంలో ఒక మోడల్‌గా ఈ వృద్ధాశ్రమ ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సిద్దిపేట పరిధి మిట్టపల్లి గ్రామ శివార్లలో ఎకరం స్థలంలో దీన్ని నిర్మించేందుకు పరిశీలన పూర్తి చేశారు. త్వర లో మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కుటుంబ సభ్యుల ఆదరణ కరువైన వృద్ధులకు అండగా ఉండాలన్న ప్రభుత్వ ఆలోచన మేరకు హరీశ్‌రావు ఈ వృద్ధాశ్రమం ఏర్పాటుకు అంకురార్పణ చేశారు. దీని నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసి రూ.కోటి నిధులను మంజూరు చేయించారు. మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో ఈ ఓల్డ్ ఏజ్ హోంను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు వంద మందికి ఆశ్రయం ఇచ్చేలా వసతులతో భవనాన్ని నిర్మించనున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఓల్డ్ ఏజ్ హోం చుట్టూ అందమైన పార్క్ ఏర్పాటు చేయనున్నారు. అభాగ్యులకు ఎంత సేవ చేసినా తక్కువే వృద్ధాప్యంలో ఉన్న అభాగ్యులకు ఒక నీడ ఇవ్వాలనే ఆలోచనకు ప్రతిరూపం ఇది. అనాథ వృద్ధులు, పిల్లలు ఉండీ వారు అందుబాటులో లేక అభాగ్యులైన వారికి ఎంత సేవ చేసినా తక్కువే. వారి బాధలను, ఒంటరిగా ఉన్నామనే ఆలోచనను దూరం చేసేలా ఆనంద నిలయంగా ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తాం. –హరీశ్‌రావు, ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి -
బేబీ కేర్ కేంద్రాల తరహాలో వృద్ధాశ్రమాలు అవసరం
హఫీజ్‌పేట్: పిల్లల బేబీ కేర్ కేంద్రాల తరహాలో వృద్ధాశ్రమాల ఏర్పాటు అవసరమని హైకోర్టు జస్టిస్ జి.రాధారాణి అన్నారు. ఆదివారం కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్‌లోని వృద్ధాశ్రమ 23వ వార్షికోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హైకోర్టు జస్టిస్ రాధా రాణి, సీఆర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, అధ్యక్షుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హాజరై మహాత్మాగాంధీ, చండ్ర రాజేశ్వర్రావుల విగ్రహాలకు నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా జస్టిస్ రాధారాణి మాట్లాడుతూ దేశంలో 15 కోట్ల వృద్ధుల జనాభా ఉందని, 2050 నాటికి అది మరో మూడింతలు పెరుగుతుందని తెలిపారు. సీఆర్ ఫౌండేషన్ నిర్వహించే వృద్ధాశ్రమంలో పెద్ద పెద్ద వారు ఉంటున్నారన్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ వృద్ధాశ్రమాలంటే అనాథాశ్రమాల నడం పొరపాటు అన్నారు. ఉద్యోగాల పేరుతో పిల్లలు దూరంగా ఉన్నప్పుడు, అనేక కారణాల తో పిల్లలు సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు, వారి తల్లిదండ్రులకు తగిన సమయాన్ని కేటాయించలేకపోతున్న నేపథ్యంలో వృద్ధాశ్రమాలు అవసరమని వ్యాఖ్యానించారు. చండ్ర రాజేశ్వర్‌రావు గొప్ప దేశ భక్తుడని కొనియాడారు. రాజేశ్వర్‌రావు మరణానంతరం ఆయన కోరిక మేరకు సీఆర్ ఫౌండేషన్ చిన్న వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. చికిత్సా లయం, గ్రంథాలయం, నీలం రాజశేఖర్‌రెడ్డి రీసెర్చ్ సెంటర్, మహిళా స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలను సీఆర్ ఫౌండేషన్ నిర్వహిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సీఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కార్యద ర్శులు చెన్నమనేని వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరా వు, కార్యదర్శి చెన్నకేశవరావు, హెల్త్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రజినీ తదితరులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులే ఆమె పిల్లలు
కడుపున పుట్టిన వాళ్లు తరిమేసిన తల్లిదండ్రులు ఎక్కడికి పోవాలి? పిల్లల్ని పెంచి పెద్ద చేసి పసి పిల్లల వయసుకు చేరుకున్న ఆ వృద్ధులను ఎవరు ఆదుకోవాలి? ‘నేను మీ తల్లిని’ అంది రాజేశ్వరి. నీలగిరులకు ఎవరైనా ఆహ్లాదం కోసం వెళతారు. కాని పిల్లలు విడిచిన తల్లిదండ్రులు మాత్రం రాజేశ్వరిని వెతుక్కుంటూ వెళతారు. ఆమె నడుపుతున్న హోమ్ వారికి శాశ్వత ఇల్లుగా మారింది. ఊరూరా ఎంతమంది రాజేశ్వరుల అవసరం ఉందో కదా ఇప్పుడు. ఈ కథ 20 ఏళ్ల క్రితం మొదలైంది. ఆ రోజు రామమూర్తి తన ఇంటికి ఒక వృద్ధురాలిని తీసుకుని వచ్చాడు. భార్య రాజేశ్వరితో ‘ఇవాళ నుంచి ఈమె మనతోనే ఉంటుంది’ అన్నాడు. రాజేశ్వరి ‘ఎవరు.. ఏమిటి’ అని భర్తని ఒక్క మాట కూడా అడగలేదు. ‘అలాగే’ అంది. అయితే ఆ వృద్ధురాలు లెప్రెసీ పేషెంట్. ఆమెకు ఆ వ్యాధి ఉందనో, మరే కారణం చేతనో అయినవారు ఆమెను వదిలేశారు. రామమూర్తి, రాజేశ్వరిలకు ఇద్దరు ఆడపిల్లలు. చదువుకుంటున్నారు. ‘లెప్రసీ అంటువ్యాధి ఏమీ కాదు కదా.. అదేం పర్వాలేదులే’ అన్నాడు రామమూర్తి. దానికి కారణం– అతడు హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేస్తూ ఉండటమే. లెప్రసీ పేషంట్స్‌తో ఎలా వ్యవహరించాలో అతనికి తెలుసు. అలా నీలగిరి జిల్లాలో కూనూరుకు పక్కనే ఉండే తెనాలి అనే చిన్న ఊళ్లో ఒక పెద్ద కార్యక్రమానికి తెర లేచింది. తలుపు తట్టండి... తెరవబడును మరో రెండు రోజులకే రామమూర్తి తలుపు తట్టబడింది. రాజేశ్వరి తెరిచి చూస్తే ఎదురుగా మరో వృద్ధురాలు. ‘మా ఇంట్లో నుంచి గెంటేశారు. మీ ఇంట్లో చోటు ఇవ్వండమ్మా’... రాజేశ్వరి గడప నుంచి పక్కకు జరిగి ఆమెను లోపలికి రానిచ్చింది. మరో వారంలో ఇంకో వృద్ధురాలు వచ్చింది. అప్పటికి రాజేశ్వరి భర్తతో మాట్లాడింది. ‘మన ఇంట్లో చోటు చాలదు. మన టీ గార్డెన్లో పెడదాం’ అంది. నీలగిరి జిల్లా టీ తోటలకు ప్రసిద్ధి. రాజేశ్వరికి కూడా చిన్న టీ తోట ఉంది. అందులోనే ఒక గదిలో ఆ ముగ్గురు స్త్రీలను ఉంచారు. చిన్న ఊరు తెనాలి. ఈ విషయం ఆ నోట ఈ నోట చుట్టుపక్కల ప్రాంతాలకంతా పాకిపోయింది. రామమూర్తికి ఎవరో ఒకరు ఫోన్ చేసేవారు. రాజేశ్వరి వారిని అక్కున చేర్చుకునేది. ఇవాళ్టికి దాదాపు ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. రామమూర్తి రిటైర్ అయ్యాడు. వాళ్ల పెద్దమ్మాయి మెడిసిన్ చేసి డాక్టర్‌గా ఉద్యోగం చేస్తోంది. చిన్నమ్మాయి ఇంకా చదువుకుంటూ ఉంది. అయినప్పటికీ రాజేశ్వరి తన సొంత పిల్లలకు కాకుండా ఇంకో అరవై మందికి తన హోమ్‌లో తల్లిగా ఉంటూ సేవ చేస్తోంది. నగలు కుదువ పెట్టి హోమ్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా రిజిస్టర్ చేసి నడపడం తప్పని సరి అని శ్రేయోభిలాషులు చెప్తే ‘ఎంఎన్ ట్రస్ట్’ పేరుతో రిజిస్టర్ చేసి అర ఎకరాలో రెండు షెడ్స్ వేసి అన్ని విధాలా అనుకూలమైన షెల్టర్ హోమ్‌ను నిర్మించారు రామమూర్తి, రాజేశ్వరి. ‘ఇది అనాథ గృహం కాదు. పిల్లల చేత గెంటివేయబడగ దిక్కులేనివారైన తల్లిదండ్రులకు ఆత్మీయ గృహం’ అంటుంది రాజేశ్వరి. ఇది నడపడం ఎలాగా? ‘మన టీ తోట మీద వచ్చే ఆదాయం దీనికే పెడదాం’ అంది రాజేశ్వరి. ఉద్యోగంలో ఉండగా, ఇప్పుడు పెన్షన్ నుంచి రామమూర్తి సగం ఆదాయం ఈ హోమ్‌కే. డాక్టర్‌గా ఉద్యోగం చేస్తున్న కూతురు ఒక ముప్పై వేల వరకూ పంపుతుంది. మొత్తం మీద నెలకు 70 లేదా ఎనభై వేలు సొంత ఖర్చుల మీదే ఈ భార్యాభర్తలు హోమ్‌ను నడుపుతున్నారు. ‘తమిళనాడు ప్రభుత్వం మా హోమ్‌ను గుర్తించింది కాని వాళ్ల నుంచి ఏమీ ఫండ్స్ రావు. ఈ హోమ్స్ కూడా లోన్ తీసుకుని, నా నగలు కుదువ పెట్టి కట్టాం’ అంటుంది రాజేశ్వరి. ఇప్పుడు హోమ్‌లో 60 మంది ఉన్నారు. అతి తక్కువ వయసు అంటే 47. ఎక్కువ వయసు అంటే 90. ‘ఒక్కొక్కరిది ఒక్కో ధోరణి. కొందరు చెప్పిన వెంటనే మాట వింటారు. మరికొందరు మొండిగా ఉంటారు. ఆత్మీయులకు దూరంగా ఉండటం వల్ల వారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అన్నింటినీ ఓపిగ్గా భరిస్తూ వస్తాను’ అంటుంది రాజేశ్వరి. సొంత తల్లిలా హోమ్‌లో ఉన్న సభ్యులకు మూడు పూట్లా టీ ఉంటుంది. సాయంత్రం పలహారం ఉంటుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సరేసరి. నీలగిరి చల్లటి ప్రాంతం కాబట్టి ఎప్పుడూ వేణ్ణీళ్ల ఏర్పాటు ఉంటుంది. వెచ్చటి దుస్తులను ఇస్తుంది రాజేశ్వరి. రెండు పూటలా యోగా చేయిస్తారు. ఉల్లాసం కోసం పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ‘వంట పని దాదాపుగా నేనే చూస్తాను’ అంటుంది రాజేశ్వరి. హోమ్ కోసం ఒక వ్యాన్, ఐదుగురు సిబ్బంది పని చేస్తారు. ‘రెగ్యులర్‌గా హాస్పిటల్‌కు తీసుకెళతాం. అందరికీ ఆధార్ కార్డ్‌లు ఇప్పించాం. ఎవరైనా పోతే అంత్యక్రియలు కూడా నిర్వహిస్తాం’ అంటుందామె. ఇంత పని ఎందుకోసం చేస్తున్నారు ఈ భార్యాభర్తలు. బహుశా ఇది చూపదగ్గ మానవత్వం అనుకోవడం వల్ల కావచ్చు. భావితరాలకు పాఠం వీరి హోమ్‌కు రెగ్యులర్‌గా కొంతమంది వచ్చి విరాళాలు ఇస్తారు. కొందరు స్కూల్ పిల్లలు పుట్టినరోజులు జరుపుకోవడానికి వస్తారు. ‘మీ తల్లిదండ్రులను ఇలా విడిచిపెట్టొద్దు’ అని చెబుతుంది రాజేశ్వరి వారికి. పిల్లల్ని పెద్ద చేయడం కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడతారు. వారిని నిరాకరించి పిల్లలు మరిన్ని కష్టాల్లో నెడతారు. నీలగిరిలో రాజేశ్వరి ఉంది. మీ ఊళ్లో ఎవరున్నారు? -
సామాజిక సేవ చేయండి
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) కె.శామ్యూల్‌కు హైకోర్టు సామాజిక సేవను శిక్షగా విధించింది. అనంతపురం జిల్లాలోని ఏదైనా వృద్ధాశ్రమం లేదా అనాథ ఆశ్రమంలో ఉన్న వారికి వారం రోజుల పాటు భోజన ఖర్చులను భరించాలని ఆయనను ఆదేశించింది. ఆ వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడమంటే కోర్టులను అవమానించడమేనంది. కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేసేలా తగిన చర్యలు చేపట్టాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నోషనల్ సీనియారిటీని కల్పించే విషయంలో అనంతపురం జిల్లాకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పి.వెంకటరమణ 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు నోషనల్ సీనియారిటీ కల్పించాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో వెంకటరమణ గతేడాది కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్.. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, అప్పటి కమిషనర్ చినవీరభద్రుడు, అనంతపురం డీఈవో శామ్యూల్ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల మేరకు వారంతా సోమవారం కోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల అమలులో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, చినవీరభద్రుడు కారణం కాదని న్యాయమూర్తి తేల్చారు. డీఈవో శామ్యూల్ వల్లే కోర్టు ఆదేశాల అమలులో జాప్యం జరిగిందన్నారు. ఇందుకు ఆయనను బాధ్యుడిని చేస్తూ సామాజిక సేవను శిక్షగా విధించారు. -
రిటైర్డ్ అడిషనల్ డీసీపీకి సామాజిక శిక్ష విధించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కరణ అప్పీల్లో రిటైర్డ్ అడిషనల్ డీసీపీ జోగయ్య (63)కు హైకోర్టు సామాజిక శిక్ష విధించింది. ముషీరాబాద్‌లోని ‘హోం ఫర్ ది ఏజ్డ్’వృద్ధాశ్రమంలో 3 నెలలపాటు ప్రతి శని, ఆదివారం అక్కడి వృద్ధులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడంతోపాటు వారితో కొద్దిసేపు గడపాలని ఆదేశించింది. జోగయ్య సేవ చేసిన వివరాలను పేర్కొంటూ హోం నిర్వాహకులు నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కోర్టుధిక్కరణ కేసులో సింగిల్ జడ్జి రూ.5 వేలు జరిమానా విధించడాన్ని సవాల్ చేస్తూ జోగయ్య దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం మళ్లీ విచారించింది. జోగయ్య ఇప్పటికే పదవీ విరమణ చేశారని, ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదని ఆయన తరఫున న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ‘పదవీ విరమణ చేసినంత మాత్రాన ఆయన చేసిన తప్పు ఒప్పుకాదు. సామాజిక సేవకు ముందుకొస్తే ఆయనకు జరిమానా విధిస్తూ ఇచ్చిన తీర్పును కొట్టివేసే అంశాన్ని పరిశీలిస్తాం’అని ధర్మాసనం స్పష్టం చేసింది. సామాజిక సేవకు సిద్ధమని ఆదినారాయణరావు తెలపడంతో సింగిల్ జడ్జి విధించిన శిక్షను కొట్టేస్తున్నామని తీర్పునిచ్చింది. అసలేం జరిగిందంటే... నగరంలోని సెయింట్ జోసఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ల మధ్య నెలకొన్న వివాదంలో, సొసైటీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోరాదని 2010లో పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అయినా నారాయణగూడ అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఉన్న జోగయ్య హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారు. -
దయనీయం: 19 మంది వృద్ధులను..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వృద్ధాశ్రమం నడుపుతున్న ఓ ఎన్జీవో నిర్వాకానికి సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. 19 మంది వృద్ధులను ఓ గదిలో బంధించి.. వారిని తీవ్రంగా కొట్టిన తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు.. పశ్చిమ ఢిల్లీలోని నంగ్లోయిలో ఓ ఎన్జీవో వృద్ధాశ్రమం నిర్వహిస్తోంది. అయితే అక్కడ సరైన సౌకర్యాలు లేవని, వృద్ధులు దయనీయమైన జీవితం గడుపుతున్నారని సంబంధిత మంత్రిత్వ శాఖకు సమాచారం అందింది.(అమానుషం: పోలీసుల ముందే పాశవిక దాడి!) ఈ నేపథ్యంలో ఢిల్లీ స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతం, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఎన్జీవో సభ్యులు వృద్ధులను ఓ చిన్న గదిలో బంధించి, హింసించినట్లు గుర్తించారు. అదే విధంగా కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కనీస నిబంధనలు పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో ఉంచినట్లు తేలింది. దీంతో వెంటనే వాళ్లను అక్కడి నుంచి మరో చోటికి తరలించారు. ఇక ఈ అమానవీయ ఘటనపై తీవ్రంగా స్పందించిన మంత్రి గౌతం తక్షణ విచారణకు ఆదేశించారు. ఎన్జీవో నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కరోనా కంటే చావే శరణ్యమని..
ఇల్లందకుంట(హుజురాబాద్): మండల కేంద్రంలోని వృద్ధాశ్రమంలో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆశ్రమ నిర్వాహకులు, పోలీసులు, అధికారుల కథనం ప్రకారం.. జమ్మికుంట మండలం కోరపల్లి పంచాయతీ పరిధి కాపులపల్లి గ్రామానికి చెందిన పోరెడ్డి అంకిరెడ్డి(77)కి యుక్త వయస్సులోనే వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య తగదాతో విడిపోయారు. అప్పటినుంచి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. గ్రామంలో తన సోదరి కుమారులతో కలిసి జీవనం సాగించేవాడు. ఇంటివద్ద తనను సరిగా పట్టించుకునేవారు లేకపోవడంతో అల్లుళ్ల సహాయంతో మొదట కరీంనగర్‌లోని వృద్ధాశ్రమంలో కొద్ది రోజులు ఉన్నాడు. అనంతరం ఇల్లందకుంట మండల కేంద్రంలో రామసాయి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడంతో 2017లో చేరాడు. సదరు ట్రస్ట్‌లో ఇటీవల ముగ్గురికి కరోనా సోకింది. దీంతో వృద్ధుల బంధువులకు నిర్వాహకులు సమచారం ఇచ్చారు. పీహెచ్సీలో పరీక్షలు చేయించారు. అంకిరెడ్డితో రూంలో ఉన్నవారు ఇంటికి వెళ్లిపోయారు. తనతో పాటు ఉన్నవారు ఇంటికి వెళ్లిపోవడంతో ఒంటరిగా ఉండలేక మనస్తాపం చెంది సోమవారం రాత్రి ఆశ్రమంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంకిరెడ్డి ఆత్మహత్యకు ఆశ్రమ నిర్వాహకులే కారణమంటూ అఖిలపక్ష నాయకులు ఆశ్రమం ఎదుట ఆందోళన చేశారు. అయితే ఆశ్రమంలో కరోనా రావడంతో అందరి కుటుంబ సభ్యులకు సమాచా రం ఇచ్చామని, అంకిరెడ్డి బంధువులకు సమాచారం ఇస్తే స్పందన లేదని, కొన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేసి ఆశ్రమంలో నే ఉంచుకోవాలని, ఇక్కడ చూసుకునేవారు లేరని అన్నట్లు ఆశ్రమ నిర్వాహకుడు ముక్కా వెంకన్న పేర్కొన్నారు. ముందుగా చెప్పినట్లుగానే.. మూడురోజుల క్రితం వృద్ధాశ్రమంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు పరిశీలనకు వచ్చారు. వృద్ధులందరినీ ఇంటికి పంపిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇంటికి వెళ్తే తనను పట్టించుకునేవారు ఎవరూ లేరని, దీని కంటే నాకు చావు శరణ్యమని అక్క డే ఉన్న అంకిరెడ్డి విలపించాడు. తను అన్నట్టుగానే ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు. -
వృద్ధులకు ఉచితంగా ఆశ్రయం
కడుపున పుట్టిన బిడ్డలపై తల్లిదండ్రులకు చనిపోయేంత వరకూ వాత్సల్యం పోదు.. కానీ పిల్లలకు అలా కాదు.. నేటి తరానికి అయితే మరీనూ.. ఉద్యోగంలో బిజీ అనో.. ఎంతోదూరంలో ఉన్నామనో.. ఫ్యామిలీలో సమస్యలనో.. ఆర్థికంగా ఇబ్బందులనో.. తల్లిదండ్రులపై నిర్లక్ష్యం వహిస్తున్నారు.. అమ్మనాన్నలను అనాథలను చేస్తున్నారు.. కొందరైతే సంతానం లేక.. ఆదరించే వారు లేక ఒంటరిగా మిగులుతున్నారు.. అలా ఆదరణ కోల్పోయిన వృద్ధులను ఎంతో వాత్సల్యంతో అక్కున చేర్చుకుంటోంది పాలకోడేరు మండలం గరగపర్రులోని వసుధ వాత్సల్య నిలయం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి, భీమవరం: ఉభయ తెలుగురాష్ట్రాల్లో డబ్బులు తీసుకుని వృద్ధులను ఆదరించేందుకు అనేక ఆశ్రమాలున్నాయి. ఇటువంటి ఆశ్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన రామలింగరాజు పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో వసుధ వాత్సల్య నిలయం పేరుతో ఉచిత అనాథాశ్రమాన్ని ఏర్పాటుచేశారు. సంవత్సరాలు తరబడి ఎంతో శ్రద్ధతో దీనిని నిర్వహిస్తున్నారు. భీమవరం పట్టణానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోని గరగపర్రు గ్రామంలో సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన భవంతులు నిర్మించి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆశ్రయం కల్పిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో.. 2002లో వసుధ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉభయ తెలుగురాష్ట్రాలతో పాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో 46 సేవా సంస్థలను ఏర్పాటు చేసి కుల,మత భేదాలకు తావులేకుండా ఎంతోమంది అభాగ్యులకు సేవలందిస్తున్న రామలింగరాజు స్వగ్రామం గరగపర్రు. అందుకే ఆయన స్వగ్రామంలోనూ వసుధ వాత్సల్య నిలయం ఏర్పాటు చేశా>రు. విశాలమైన ప్రదేశంలో పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహిస్తోన్న ఈ ఆశ్రమంలో ప్రస్తుతం వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది వృద్ధులు, 10 మంది విద్యార్థులూ ఉన్నారు. వీరికి ఉచిత భోజనం, వసతి, వైద్యం అందించడమేగాక విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. విద్యార్థుల్లో కొంతమంది అంధ విద్యార్థులు కూడా ఉన్నారు. వీరందరికీ వేళకు భోజనం పెట్టడమేగాక వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిత్యం వైద్యసేవలందే ఏర్పాటు చేశారు. వృద్ధుల్లో ఓపిక ఉన్నవారు మాత్రం కాలక్షేపం కోసం మొక్కలకు నీరు పోయడం వంటి చిన్నచిన్న పనులు చేస్తుంటారు. నా అన్నవాళ్లు లేకనే.. నా భర్త నాగిరెడ్డి కౌలు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. పిల్లలు కూడా చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న నన్ను వసుధ వాత్సల్య నిలయం ఆదుకుంది. నాలుగేళ్లుగా ఇక్కడ ఉంటున్నా, కన్నబిడ్డల కంటే ఎక్కువగా ఏ కష్టం లేకుండా చూస్తున్నారు. – కొవ్వూరి చెల్లాయమ్మ, పెంటపాడు పనిచేసే ఓపిక లేక.. నా వయస్సు 65 ఏళ్లు. కులవృత్తి చేనేతతో నాభర్త వీరాస్వామి కంటికి రెప్పలా నన్ను చూసుకునేవారు. సంతానం లేదు. ఆయన మరణంతో కొంత కాలం ఇళ్లల్లో పాచి పనిచేసి జీవనం సాగించాను. పనిచేసే ఓపిక నశించి గ్రామస్తుల సలహాతో వాత్సల్య నిలయంలో చేరాను. ప్రస్తుతం ఇక్కడ సంతోషంగా గడుపుతున్నాను. – వింజమూరి విజయలక్ష్మి, ఉండి గ్రామం ఏ లోటు లేకుండా ఆనందంగా.. భార్య, బిడ్డలు దూరం కావడంతో 80 ఏళ్ల వయస్సులో ఒంటరి జీవితం గడపడం దుర్భరంగా మారింది. బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న తరుణంలో ఆత్రేయపురం వసుధ ఫౌండేషన్ కార్యకర్తలు వసుధ వాత్సల్య నిలయానికి పంపించారు. ఏ లోటు లేకుండా అందరితో ఆనందంగా గడుపుతున్నా. – వేగేశ్న సత్యనారాయణరాజు, ఆత్రేయపురం, తూర్పుగోదావరి జిల్లా ఎంతో ఆదరణతో చూస్తున్నారు నా వయస్సు ప్రస్తుతం 75 ఏళ్లు. నన్ను ఆదరించేవారెవరూ లేరు. పనిచేసే ఓపిక లేదు. అగమ్యగోచరంగా జీవితం. ఇటువంటి తరుణంలో 4 సంవత్సరాల క్రితం ఆశ్రమంలో చేరా. రామలింగరాజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ ఎంతో ఆదరణతో చూస్తున్నారు. భగవంతుని ధ్యానిస్తూ ఆనందంగా జీవిస్తున్నాను. – కలికి సుబ్బారావు, చిలకంపాడు అనాథలను ఆదుకోవాలనే.. వసుధ ఫౌండేషన్ ద్వారా అనేక రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అనేక చోట్ల వృద్ధాశ్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నా. సొంతంగా ఆశ్రమం నిర్వహించాలనే సంకల్పంతో 12 ఏళ్ల క్రితం 25 మందితో ఆశ్రమం ప్రారంభించి ప్రస్తుతం 40 మందితో నిర్వహిస్తున్నాం. ఎటువంటి ఆదరణకు నోచుకోని వారిని ఆదరించాలనే సంకల్పంతోనే వృద్ధాశ్రమం ఏర్పాటుచేశాం. – మంతెన రామలింగరాజు, వసుధ ఫౌండేషన్ చైర్మన్ -
మేడ్చల్‌లో వృద్ధాశ్రమం పేరుతో చిత్రహింసలు
-
నాగారంలో దారుణం: వృద్ధులపై పైశాచికం
సాక్షి, మేడ్చల్ : జిల్లాలోని నాగారం సమీపంలోని శిల్పనగర్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చంది. వృధాశ్రమం పేరుతో అక్రమంగా సైకియాట్రిక్ పునరావాస కేంద్రాన్ని నడపుతూ.. వృద్ధులను చిత్రహింసలకు గురి చేస్తున్న వైనం ఆలస్యంగా బయటపడింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సంబంధిత నిర్వాహకులకు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. మల్కాజిగిరి డిసీపీ రక్షిత మూర్తి, ఏసీపీ శివకుమార్ బాధితులను నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. బాధితులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం గత కొంతకాలం నుంచి శిల్పనగర్‌లో పలువురు వృద్ధాశ్రమం నడుపుతున్నారు. అయితే తెరవెనుక మాత్రం జరిగే తంతు వేరు. మానసికంగా సరిగా లేని వారిని బాగుచేస్తాం అని చెప్పి, లక్షల్లో డబ్బులు వస్తూలు చేస్తున్నారు. అంతేకాదు బాధితులకు నరకయాతన చూపిస్తూ తీవ్ర వేధింపులకు గురిస్తున్నారు. చెప్పిన మాట వినకుంటే శరీరంపై నిప్పుతో కాల్చటం లాంటి పైశాచిక చర్యలకు పాల్పడేవారని బాధితులు ఆవేదన ఆరోపిస్తున్నారు. పది నుంచి పదిహేను మంది ఉండాల్సిన గదిలో 50 మందిని నిర్బంధిస్తున్నారని గోడు వెళ్లబోసుకున్నారు. మరోవైపు ఈ అక్రమ ఆశ్రమంలో యువత కుడా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. బరువు తగ్గడం కోసం వచ్చిన వారిని తిండి పెట్టకుండా నరకం చూపిస్తారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులను ఎదురు తిరిగి ప్రశ్నిస్తే గోలుసులతో కట్టి వేస్తారని బాధితుల మాటలో స్పష్టం అవుతోంది. దీనిపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. బాధితులకు మెడికల్ పరీక్షల అనంతరం సంబంధిత కేంద్రాలకు తరలించే పనిలో ఉన్నారు. -
వైభవంగా వృద్ధ జంటకు వివాహం
తిరువనంతపురం : ప్రేమకు, వివాహానికి వయసుతో పనిలేదని మనసులు కలిస్తే మనువాడటంలో తప్పులేదని ఓ వృద్ధ జంట ప్రపంచానికి చాటింది. త్రిసూర్ జిల్లాలోని రామవర్మపురంలోని ఓల్డేజ్ హోం ఈ జంట వివాహానికి వేదికైంది. ఓల్డేజ్ హోంలో ఆశ్రయం పొందుతున్న కొచానియన్ మేనన్ (67), లక్ష్మీ అమ్మాళ్ (65)ల మధ్య చిగురించిన స్నేహం లేటు వయసులో పరిణయానికి దారితీసింది. కేరళ వ్యవసాయమంత్రి వీఎస్ సునీల్ కుమార్ సమక్షంలో శనివారం వీరు ఒకటయ్యారు. ఎర్ర చీర ధరించి, ఆభరణాలతో లక్ష్మీ అమ్మాళ్ పెళ్లి కుమార్తెగా ముస్తాబు అవగా, కొచానియన్ మేనన్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. వృద్ధ జంటకు వివాహాన్ని వేడుకగా జరిపించామని, శుక్రవారం మెహందీ ఫంక్షన్ కూడా నిర్వహించామని ఓల్డేజ్ హూం సూపరింటెండెంట్ జయాకుమార్ చెప్పారు. వివాహ మంటపాన్ని ఏర్పాటు చేశామని ముహుర్తానికి అనుగుణంగా శనివారం ఉదయం 11 గంటలకు వారు పెళ్లి చేసుకున్నారని చెప్పారు. అతిధులకు ఘనంగా విందు ఏర్పాట్లు చేపట్టడంతో వివాహ వేడుక ముగిసిందని ఆమె చెప్పుకొచ్చారు. కాగా వీరికి 30 ఏళ్ల నుంచి పరిచయం ఉండగా గత కొన్నేళ్లుగా టచ్‌లో లేకపోవడం గమనార్హం. 21 ఏళ్ల కింద మరణించిన లక్ష్మీ అమ్మాళ్ భర్త వద్ద కొచానియన్ అసిస్టెంట్‌గా పనిచేసేవారు. భర్త మరణం అనంతరం బంధువుల వద్ద ఉన్న లక్ష్మీ అమ్మాళ్ రెండేళ్ల కిందట ఓల్డేజ్ హోంలో చేరారు. రెండు నెలల కిందట అదే కేర్ హోంలో కొచానియన్ ఆశ్రయం పొందారు. ఇక లేటు వయసులో తాము వైవాహిక బంధంతో ఒకటవడం ఆనందంగా ఉందని, వయసు మీద పడటంతో తాము ఎంతకాలం కలిసి ఉంటామనేది తెలియకపోయినా ఒకరి కోసం మరొకరు ఉన్నామనే భావనతో ఉన్నంతవరకూ సంతోషంగా జీవిస్తామని లక్ష్మీ అమ్మాళ్ చెప్పారు. -
మలి సంధ్యలో మతాబుల వెలుగులు
సాక్షి, హైదరాబాద్: అనాథలు, వృద్ధులకు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న ‘వి ఫర్ ఆర్ఫాన్’ సంస్థ మరోసారి దాతృత్వాన్ని చాటుకుంది. కుటుంబ సభ్యుల నిరాదరణకు లోనై వృద్ధాశ్రమంలో అనాథలుగా కాలం వెళ్లదీస్తున్న దీనుల కళ్లలో కాంతులు నింపింది. ఉప్పల్ సమీపం నారపల్లిలో ఉన్న లహరి వృద్ధాశ్రమంలో శనివారం వి ఫర్ ఆర్ఫాన్ సభ్యులు దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు, అనాథ పిల్లలతో దీపావళి పండుగ జరిపించి వారి మోముల్లో చిరునవ్వులు పూయించారు. అంతేకాదు 25 మంది వృద్ధులకు కొత్త బట్టలు అందించారు. స్వయంగా వృద్ధులకు మిఠాయిలు తినిపించి, వారి చేత దీపావళి బాణసంచా కాల్పించి సంతోషాలు పంచారు. తమకెంతో ఇష్టమైన బిర్యానీని కూడా స్వయంగా తినిపించి సొంత కుటుంబ సభ్యుల్లా ఆప్యాయత చూపడంతో వృద్ధులు కరిగిపోయారు. అందరూ ఉన్న అనాథల్లా గడుపుతున్న తమకు పండుగ ఆనందాన్ని పంచిన వారిని నిండు మనసుతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎంబీసీ డీఎస్టీ నవనిర్మాణ సమితి రాష్ట్ర కన్వీనర్ బెల్లాపు దుర్గారావు అతిథిగా హాజరయ్యారు. చేర్యాల రాకేశ్, చేర్యాల విద్య, యోగిత, ఛార్మ్స్ సంపత్, హరీశ్, మాట్రిక్స్ రమేశ్, బేగంపేట రాజు, సుశీల్, ముకేశ్, కిరణ్, జైహింద్, చందుభాయ్, దుర్గాప్రసాద్, సింగిరాల శ్రవణ్‌కుమార్, నర్సింగ్, దొప్పల నరేశ్ తదితరులు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పడుచు పిల్లలా చిందేసిన బామ్మ
-
బాప్రే.. బామ్మలు!
గుహవటి : వయసు మీద పడిందని ఓ మూలన కూర్చోలేదు. కృష్ణారామ అనుకుంటూ కాలం వెళ్లదీయలేదు. ఖాళీగా ఉండటమెందుకుని ఓ ప్రోగ్రామ్ పెట్టుకుని ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక ఈ వేడుక గతవారం గుహవటిలోని ఓ వృద్ధాశ్రమంలో జరిగింది. వృద్ధుల హుషారు చూస్తుంటే ఫుల్ దావత్ చేసుకున్నట్టే కనిపిస్తోంది. దీని కోసం ఓ గదిని అందంగా అలంకరించుకుని కూర్చుకున్నారు. కార్యక్రమాన్ని ఉరకలెత్తించడానికి ఇద్దరు వ్యక్తులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రోగ్రాం మొదలుకాగానే ఆటలు పాటలతో హోరెత్తిన ఈ కార్యక్రమంలో వృద్ధులందరూ లోకాన్నే మరిచిపోయారు. ఇక ఈ వేడుకల్లో ఓ బామ్మ డాన్స్ హైలెట్‌గా నిలిచింది. ఈ ఏజ్‌లోనూ ఏ మాత్రం తగ్గకుండా పాటకు తగ్గట్టుగా స్టెప్పులు వేసి అక్కడ కూర్చున్న వృద్ధ ప్రేక్షకులను అలరించింది. ఈ వీడియోను ఓ వ్యక్తి ఫేస్బుక్లో శుక్రవారం పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. అరవై ఏళ్లు దాటినా పదహారేళ్ల పడుచు పిల్లలా గెంతులేసింది అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వారి శేష జీవితం ఇలాగే ఆనందవంతంగా గడపాలి అని నెటిజన్లు ప్రార్థించారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదురుచూసుంటారు.. ఇక ఇప్పుడైనా సంతోషంగా ఆరోగ్యవంతంగా గడపాలని కోరుకుంటున్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. -
నటి కన్నుమూత.. కొడుకు జాడలేదు
సాక్షి, ముంబై: దుర్భర పరిస్థితులను ఎదుర్కున్న అలనాటి బాలీవుడ్ నటి గీతా కపూర్(57) ఇక లేరు. శనివారం ఆమె ఉంటున్న వృద్ధాశ్రమంలో కన్నుమూసినట్లు ఫిల్మ్‌మేకర్- సీబీఎఫ్సీ సభ్యుడు అశోక్ పండిట్ వెల్లడించారు. ‘మేం ఆమెను మాములు మనిషిని చేయాలని యత్నించాం. కానీ, కొడుకు-కూతురు గురించి ఆలోచించి ఆమె రోజురోజుకీ కుంగిపోయారు. ఏడాదిగా వారి జాడ కోసం మేం చెయ్యని యత్నంలేదు. అనారోగ్యంతో చివరకు ఆమె కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని కూపర్ ఆస్పత్రిలో ఉంచాం. వారి పిల్లలు, బంధువులు వస్తారేమో రెండు రోజులపాటు ఎదురుచూస్తాం. రానిపక్షంలో మేమే అంత్యక్రియలు జరిపిస్తాం’ అని పండిట్ చెబుతున్నారు. పాకీజా వంటి క్లాసిక్ చిత్రంలో నటించిన(రాజ్‌కుమార్ రెండో భార్య పాత్రలో) గీతా కపూర్‌ను అనారోగ్యం కారణంగా గతేడాది మే నెలలో తనయుడు ముంబై గోరేగావ్‌లోని ఎస్వీఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆపై డబ్బు తేవాలంటూ ఏటీఎంకు వెళ్లిన అతను అటునుంచి అటే పారిపోయాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. ఆపై మీడియా కథనాల ఆధారంగా ఆమె దుస్థితి గురించి తెలుసుకున్న అశోక్ పండిట్ ఆ బిల్లులను చెల్లించి వృద్ధాశ్రమంలో చేర్పించారు. తల్లి మరణం నేపథ్యంలో ఇప్పటికైనా వారు తిరిగొస్తారని వృద్ధాశ్రమంలోని ఆమె సహచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఆమె మీడియాతో చెప్పిన మాటలు... 'అతని చర్యలను తప్పుబట్టడంతో నన్ను కొట్టేవాడు. నాలుగు రోజులకు ఒకసారే అన్నం పెట్టేవాడు. కొన్నిసార్లు నన్ను గదిలో పెట్టి బంధించాడు. నేను వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు నిరాకరించడంతోనే ఇలా చేశాడు. అతడు ఉద్దేశపూర్వకంగా ఆకలితో మాడ్చి.. నేను అనారోగ్యానికి గురయ్యేలా చేశాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు. నా ప్రాణం పోయినా ఫర్వాలేదు. కానీ, ఇప్పుడు నా కొడుకు నాక్కావాలి. ఒక్కసారి చూడాలని ఉంది' అని ఆమె తెలిపారు. -
పరిమళించిన మానవత్వం
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): మానవత్వం పరిమళించింది. ఎంతలా అంటే... కాలువలో దీనావస్థలో పడి ఉన్న వృద్ధురాలికి మెరుపు వేగంతో ఆస్పత్రిలో వైద్యం చేయించడం... అనంతరం ఓ ఆశ్రమానికి తరలించడం... ఇదంతా ఒకే ఒక్క ఫొటో ఆధారంగా గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే... గోపాలపట్నం శివారు కొత్తపాలెం అండర్ పాత్ వే వద్ద 80 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు పడి ఉంది. మలమూత్ర విసర్జనలతో మూలుగుతోంది. ఆమె ఎవరో తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు. మనకెందుకులే అని ముందుకు సాగిపోయారు. అయితే రాత్రి ఏడు గంటల సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి ఇలా వెళ్తూ ఆ వృద్ధురాలిని గమనించాడు. మాట్లాడుదామంటే ఆమె నోట మాట లేదు. దగ్గరకెళ్తే తీవ్రంగా రోత... ఇలా ఉన్న చిత్రాన్ని అతను నేరుగా పోలీస్ కమిషనర్ యోగానంద్‌కు వాట్సాప్‌లో పంపారు. దయచేసి స్పందించాలని కోరాడు. అంతే యోగానంద్ నుంచి గోపాలపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ వైకుంఠరావుకు సమాచారం వచ్చింది. ఆయన ఎస్ఐ శ్రీనివాస్‌మహంతి, సిబ్బందితో హుటాహుటిన కొత్తపాలెం అండర్‌పాత్‌వే వద్దకు చేరుకుని రక్షక్‌లో గోపాలపట్నం ఎస్ఆర్ మల్టీస్పెషాల్టీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ సీఈవో గిరి, వైద్యులను ఒప్పించి ఉచితంగా వైద్యసేవలు చేయించారు. అనంతరం సీఐ వైకుంఠరావు ప్రేమసమాజం యాజమాన్యంతోనూ, పలు వృద్ధాశ్రమాల నిర్వాహకులతోనూ సంప్రదించారు. పెందుర్తిలో ఉన్న లయోలా వృద్ధాశ్రమ నిర్వాహకుడు ప్రకాశరావు స్పందించడంతో అక్కడికి పోలీసులు వృద్ధురాలిని అంబులెన్స్‌లో తరలించారు. అయితే వృద్ధురాలి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. మెరుపువేగంతో పోలీసులు, ఇక్కడి ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది స్పందించిన తీరుకి సీపీ యోగానంద్ వాట్సాప్ ద్వారా ప్రశంసించారు. -
శెభాష్.. షహనాజ్
అశ్వాపురం: కనిపెంచిన తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అనాథలు, అభాగ్యులైన వృద్ధులను చేరదీస్తూ.. మానవత్వం పంచుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.. షహనాజ్‌బేగం. మండల కేంద్రమైన అశ్వాపురంలో 2011 జూన్ 27న మండల పరిధిలోని అమ్మగారిపల్లికి చెందిన షహనాజ్‌బేగం ఆమె సోదరిమణులు వహిదాబేగం, నూర్జహాన్‌బేగం, అరీఫాసుల్తానాలు కలిసి అరీఫా–రోష్ని వృద్ధాశ్రమాన్ని స్థాపించారు. ఆరు నెలలకే ఆమె సోదరిమణులు వ్యక్తిగత కారణాలతో దూరప్రాంతాలకు వెళ్లారు. అప్పటినుంచి షహనాజ్‌బేగమే వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తోంది. అభాగ్యులైన వృద్ధులకు అండగా ఉంటోంది. తమ స్వార్థం కోసమే తాము బతుకుతూ ఇతరుల కష్టాలు తమకెందుకని భావిస్తున్న ప్రస్తుత సమాజంలో వృద్ధులను తన కన్నతల్లిదండ్రులలాగా చూసుకుంటోంది. ఆమె సేవా దృక్పథాన్ని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు అభినందిస్తున్నారు. 7 సంవత్సరాలుగా వృద్ధాశ్రమం నిర్వహణ వృద్ధాశ్రమం స్థాపించినాటి నుంచి తన భర్త సహకారంతో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ ముందుకుసాగుతోంది. మణుగూరు ఏరియా సింగరేణి అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, పురప్రముఖలు, మండల కేంద్ర ప్రజలు, దాతల సహకారంతో వృద్ధులకు ఏడు సంవత్సరాలుగా అన్ని సౌకర్యాలూ అందిస్తోంది. ఒక్కోసారి ఖర్చులు సొంతంగా కూడా భరించాల్సి వస్తోంది. ప్రస్తుతం అరీఫా–రోష్ని వృద్ధాశ్రమంలో 18 మంది వృద్ధులు ఉన్నారు. అద్దె భవనంలో వృద్ధులు ఇబ్బందులు పడవద్దని ఇటీవల షహనాజ్‌బేగం మండలకేంద్రంలోని మంచికంటినగర్‌లో భూమి కొనుగోలు చేసి వృద్ధాశ్రమం భవన నిర్మాణానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, స్థానికుల చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. సేవే.. సంతోషం వృద్ధాశ్రమం నిర్వహిస్తూ.. ఏ దిక్కూ లేని అభాగ్యులైన వృద్ధులకు సేవచేయడం సంతోషంగా ఉంది. నా భర్త ఎస్కే.మెహరాజ్, దాతల సహకారంతో ఇబ్బందులు అధిగమించి ఆశ్రమం నిర్వహిస్తున్నా. అద్దె భవనంలో వృద్ధులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వృద్ధాశ్రమానికి నూతన భవనం నిర్మించేందుకు శంకుస్థాపన చేయించాం. నిర్వహణకు దాతలు çకూడా సహకరించాలి. –షహనాజ్‌బేగం, అరీఫా–రోష్ని వృద్ధాశ్రమం నిర్వాహకురాలు -
మానవత్వాన్ని చాటుతున్న ఆశ్రమం
-
ఆ తల్లి ‘వెళ్లిపోయింది’
కోల్‌సిటీ(రామగుండం): ఆ తల్లిని వదిలించు కోవాలని బతికున్నప్పుడే ప్లాస్టిక్ సంచిలో కట్టి నిర్జన ప్రదేశంలో వదిలేశాడా కొడుకు.. అప్పటి నుంచి వృద్ధాశ్రమంలో ఉన్న ఆ తల్లి శనివారం చనిపోయింది. తల్లి చనిపోయిందని సమాచా రామిచ్చిన స్పందించలేదు. చివరకు పోలీసులు జోక్యం చేసుకొని దహన సంస్కారాలు చేయించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లక్ష్మినగర్‌కు చెందిన రాజోజుల వెంకటాద్రి తన తల్లి జగదాంబను గత నెల 24న ప్లాస్టిక్ సంచి లో పెట్టి నిర్జన ప్రదేశంలో వదిలేసిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని ‘సాక్షి’గత నెల 25న ‘అమ్మను వదిలించుకోవాలని’.. శీర్షికన వెలుగులోకి తీసుకొచ్చింది. నాడు పోలీసులు వచ్చి ఆ తల్లిని తిలక్‌నగర్‌లోని శ్రీధర్మశాస్త్ర వృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు. తీవ్ర అనారోగ్యంతో తల్లడిల్లుతున్న ఆమె శనివారం మృతి చెందింది. విషయాన్ని ఆశ్రమ నిర్వాహకులు కౌటం బాబు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయినా, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్ సీఐ జి. కృష్ణ వచ్చి మృతురాలి కుమారుడు వెంకటాద్రితో పాటు మనవడిని ఆశ్రమానికి పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించగా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నామని చెప్పారు. దీంతో సీఐ దహన సంస్కారాలకు ఆర్థిక సాయం చేశారు. దగ్గరుండి శ్మశానవాటికకు పంపించారు. -
వృద్ధాశ్రమంలో అర్ధరాత్రి జడ్జి తనిఖీలు
-
ఆ నటిని ఓల్డ్ ఏజ్ హోమ్ కు తరలించారు
'పాకీజా' చిత్రంలో తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించిన అలనాటి నటి గీతా కపూర్ ను ఇటు కొడుకు.. అటు కూతురు ఇద్దరూ అనాథగా వదిలేశారు. వృద్ధాప్యంలో ఉన్న ఆమెను తన కొడుకు ఆసుపత్రిలో నిస్సహాయస్థితిలో వదిలేసి వెళ్లడంతో ప్రస్తుతం గీతా కపూర్ ను వృద్ధశ్రమానికి తరలించారు.గీతాజీని చాలా గౌరవప్రదమైన ఓల్డ్ ఏజ్ హోమ్ కు తరలించామని, తల్లిని కొడుకు వదిలిపెట్టడం అతిపెద్ద నేరమని ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ అన్నారు. గత నెల ముంబైలోని గోరేగావ్‌లోని ఎస్వీఆర్ ఆస్పత్రిలో ఆమెను తన కుమారుడు చేర్పించాడు. ఆ తరువాత బిల్లు కట్టేందుకు ఏటీఎం నుంచి డబ్బు తీసుకొస్తానంటూ చెప్పి వెళ్లిపోయిన అతడు ఇంతవరకు తిరిగి రాలేదు. అప్పటి నుంచి ఆమె ఆసుపత్రిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపింది. కుమార్తెకు ఫోన్ చేసినా రాంగ్ నంబర్ అంటూ పెట్టేసింది. దీంతో అనాథగా ఆసుపత్రిలో ఏడుస్తూ ఉండిపోయింది. తనను వదిలించుకోవాలని తన కొడుకు చూసేవాడని, అందుకే తనను ఆస్పత్రిలో వదిలేసి పోయాడని ఆమె మీడియాకు తెలిపింది. 'అతని చర్యలను తప్పుబట్టడంతో నన్ను కొట్టేవాడు. నాలుగు రోజులకు ఒకసారే అన్నం పెట్టేవాడు. కొన్నిసార్లు నన్ను గదిలో పెట్టి బంధించాడు. నేను వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు నిరాకరించడంతోనే ఇలా చేశాడు. అతడు ఉద్దేశపూర్వకంగా ఆకలితో మాడ్చి.. నేను అనారోగ్యానికి గురయ్యేలా చేశాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు' అని ఆమె తెలిపింది. ఇక గీతాకపూర్ కూతురు పూజ కూడా ఈ విషయంలో పట్టనట్టు దూరంగా ఉండటంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆమెను వృద్ధశ్రమానికి తరలించారు. -
అనాధ సేవలో విలువలు చాటిన మాతృమూర్తి
-
కన్నపేగు భారమైంది
కనిపెంచిన కన్న తల్లి వారికి భారమైంది. శక్తి ఉన్నంత వరకు ఊడిగం చేసిన అమ్మ ఇప్పుడు కానిదైంది. ముగ్గురు కొడుకులు ఉన్నా ఏ ఒక్కరూ కనికరించలేదు. చివరి రోజుల్లో బిడ్డల దగ్గర ఉండాలని ఆ కన్నపేగు ఆరాటపడుతున్నా కాదుపొమ్మన్నారు. ఎనిమిది పదుల వయసు సమీపిస్తున్న మాతృమూర్తిని వీధిపాలు చేశారు. ఆ వృద్ధురాలి దీనావస్థను చూసి చలించిన సాక్షి ప్రతినిధి ఆ కొడుకులకు నచ్చచెప్పినా వారి మనసు కరగలేదు. పోలీసులు వచ్చి హెచ్చరించడంతో వృద్ధాశ్రమంలో చేర్పించి చేతులు దులుపుకున్నారే తప్ప ఇంటికి తీసుకెళ్లేందుకు వారి మనసొప్పలేదు -
అభివృద్ధి వేగం పెంచుతాం
కొల్లాపూర్ : 2017లో అభివృద్ధి వేగాన్ని పెంచుతామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్‌లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని మినీ స్టేడియంలో పార్టీ నాయకులు, అధికారుల సమక్షంలో కేక్ కట్ చేసి తినిపించారు. అనంతరం వృద్ధాశ్రమంలోనూ కేక్ కట్‌చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనలో భాగంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, వైస్‌చైర్మన్ ఎక్బాల్, ఎంపీపీ నిరంజన్ రావు, జెడ్పీటీసీ సభ్యుడు హన్మంతునాయక్, సింగిల్‌విండో చైర్మన్లు రఘుపతిరావు, ఖాజామైనొద్దీన్, టీఆర్ఎస్ మండల నాయకులు శేఖర్‌రెడ్డి, బోరెల్లి మహేష్, రహీంపాషా పాల్గొన్నారు. -
ఓల్డేజ్ హోం ముసుగులో...
పశ్చిమబెంగాల్లో పిల్లల స్మగ్లింగ్ చాలా ఎక్కువగా ఉంది. కోల్‌కతాకు ఉత్తరంగా ఉన్న బదూరియా ప్రాంతంలోని ఓ నర్సింగ్‌హోంలో బిస్కట్ల బాక్సులో ముగ్గురు పిల్లలను పెట్టి స్మగ్లింగ్ చేసిన వ్యవహారం దేశాన్ని కుదిపేస్తే.. తాజాగా అదే నగరంలో 10 మంది ఆడ శిశువులను ఒక ఓల్డేజ్ హోంలో దాచిపెట్టిన వైనాన్ని పోలీసులు బయటపెట్టారు. వాళ్లందరినీ రక్షించారు. ఇది కోల్‌కతాకు దక్షిణంగా ఉన్న ఠాకూర్పుకూర్ ప్రాంతంలో జరిగింది. శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో అందిన సమాచారంతో పూర్బాశ అనే ఓ ఓల్డేజి హోం మీద పోలీసులు దాడి చేశారు. అందులో 23 మంది వృద్ధులు ఉంటారు. భవనం పై అంతస్థులో మొత్తం 10 మంది శిశువులు ఉన్నారు. వాళ్లంతా ఒకటి నుంచి పది నెలల లోపు వయసున్నవాళ్లే, అందరూ ఆడపిల్లలే. భవనంలో పైభాగాన్ని భవన యజమాని అద్దెకు ఇచ్చారు. అతడిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. పిల్లల స్మగ్లింగ్ రాకెట్లో ఓ స్వచ్ఛంద సంస్థది ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఆ సంస్థ కార్యాలయం వెనకాల ఉన్న మైదానంలో ఇద్దరు శిశువుల మృతదేహాలను పూడ్చిపెట్టి ఉంచడాన్ని కూడా పోలీసులు కనుగొన్నారు. ఈ రెండు ఘటనలకు మధ్య కోల్‌కతా నగరంలో రెండు నర్సింగ్‌హోంలపై పోలీసులు దాడులు చేశారు. కాలేజి స్ట్రీట్‌లో ఉన్న ఓ నర్సింగ్‌హోంలో సీఐడీ విభాగం అధికారులు 200 అమెరికా డాలర్లు, 2000 హాంకాంగ్ డాలర్లు, 1200 యూరోలు, 15 వేల రూపీలు, కొంత బంగారం కనుగొన్నారు. ఇప్పటివరకు ఈ స్కాంలో 15 మందిని అరెస్టు చేశామని వాళ్లలో కొందరు ఇప్పటివరకు తాము కనుగొన్న నాలుగు కేసుల్లోనూ నిందితులుగా ఉన్నారని సీఐడీ అదనపు డీజీ రాజేష్ కుమార్ తెలిపారు. ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ మొత్తాన్ని ఛేదించే పనిలో ఉన్నామని ఆయన అన్నారు. పిల్లలందరినీ ఈనెల పదో తేదీన ఇక్కడకు తీసుకొచ్చారని ఆశ్రమంలో వృద్ధులకు నర్సుగా వ్యవహరిస్తున్న ఓ మహిళ చెప్పారు. అయితే.. వాళ్లను ఎందుకు తీసుకొచ్చారో మాత్రం తెలియదని అన్నారు. బదురియా ఘటనలో అరెస్టయిన వారిని విచారించినప్పుడు కాలేజి స్ట్రీట్ నర్సింగ్ హోం గురించి సమాచారం వచ్చిందని.. అక్కడివారిని విచారిస్తే ఈ ఓల్డేజి హోం గురించిన సమాచారం తెలిసిందని రాజేష్ కుమార్ చెప్పారు. కొందరు అవివాహిత మహిళలకు డబ్బు ఆశ చూపించి పిల్లలను కన్న తర్వాత వాళ్లను వదిలేసి వెళ్లిపొమ్మంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే, ఆస్పత్రులలో శిశువులను కన్న మహిళలకు.. వారి పిల్లలు చనిపోయారని చెప్పి, అప్పటికే తమ వద్ద ఉన్న మృత శిశువులను చూపిస్తున్నారు. వాళ్ల పిల్లలను కూడా ఎత్తుకొచ్చి స్మగ్లింగ్ చేస్తున్నారు. -
వృద్ధులకు స్వర్గధామం.. జీవన క్షేత్ర ఆశ్రమం
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రకృతి వైద్యం గోఆధారిత వంటలతో సంపూర్ణ భోజనం 30 ఏళ్లలో వేలాది మందికి యోగా శిబిరాలు మల్లికార్జున గురూజీ ఆధ్వర్యంలో ఆశ్రమం ఏర్పాటు కరుణాపురంలో త్వరలో ప్రారంభం కరుణాపురం (స్టేషన్‌ఘన్‌పూర్) : మలిదశలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని అక్కున చేర్చుకునేందుకు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని జీవన క్షేత్ర వృద్ధాశ్రమం సిద్ధమవుతోంది. తమ వద్దకు వచ్చే పండుటాకులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ముస్తాబవుతోంది. వివరాల్లోకి వెళితే.. పెద్ద పెండ్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని కరుణాపురంలో సుమారు 15 ఎకరాల విశాలమైన స్థలంలో, ప్రశాంతమైన వాతావరణంలో సనాతన సంస్కృతి విద్యా కేంద్ర వ్యవస్థాపకులు మల్లికార్జున గురూజీ ఆధ్వర్యంలో జీవన క్షేత్ర వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నేటి ఆధునిక యుగంలో చాలా మంది వృద్ధులు అన్నీ ఉండి కూడా శారీరకంగా, మానసికంగా అనాథలుగా బాధపడుతున్నారు. అయితే వృద్ధాప్యం శాపం కాదని.. మలిదశలో బాల్య వ్యవస్థను తిరిగి పొంది ఆనందంగా, ఆరోగ్యంగా జీవించవచ్చని చెబుతూ ముందుకుసాగేందుకు అన్ని వనరులు సమకూర్చుకుంది జీవనక్షేత్ర వృద్ధాశ్రమం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. వయో వృద్ధులకు సేవ చేస్తూ వారిలో ఆనందాన్ని నింపడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేసేందుకు సిద్ధమైంది. మానసిక ప్రశాంతత.. జీవనక్షేత్ర ఆశ్రమంలో చేరే వారికి గోఆధారిత వంటలతో భోజనం అందించనున్నారు. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రకృతి వైద్యం అందించి నిర్వాహకులు వారికి అండగా నిలువనున్నారు. ఆశ్రమం ఆధ్వర్యంలో ఇప్పటివరకు వేలాది మందికి యోగా శిబిరాలు నిర్వహించి వారికి మానసిక ప్రశాంతత చేకూర్చారు. త్వరలో ప్రారంభంకానున్న ఆశ్రమంలో చేరేందుకు ఇప్పటివరకు 15 మంది వృద్ధులు పేర్లు నమోదు చేసుకున్నారు. వృద్ధులకు సేవ చేసేందుకే.. తమ ఆశ్రమం ఆధ్వర్యంలో 30 ఏళ్లలో వేలాది మందికి యోగా క్యాంపులు నిర్వహించాం. వృద్ధులకు సేవ చేయాలనే లక్ష్యంతోనే కరుణాపురంలో జీవన క్షేత్ర వృద్ధాశ్రమాన్ని నెలకొల్పుతున్నాం. ఆశ్రమంలో చేరే వారికి ప్రతి రోజు యోగా చేయించడంతో పాటు ప్రకృతి వైద్యం అందిస్తాం. అలాగే గోఆధారిత వంటలతో భోజనం అందిస్తాం. 50 ఏళ్లకు పైబడిన స్త్రీ, పురుషులు ఆశ్రమంలో చేరవచ్చు. పూర్తి వివరాలకు 98660-15666, 98484-42355 నంబర్లలో సంప్రదించవచ్చు. - మల్లికార్జున గురూజీ, జీవనక్షేత్ర ఆశ్రమ వ్యవస్థాపకులు -
'రజనీకాంత్‌ను వృద్ధాశ్రమంలో చేర్చండి'
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి చిత్రం విడుదలైనా... ఆ సినిమా గురించి రోజుకో వార్త వెలువడుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ యువకుడు తాను మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే... రజనీకాంత్‌ను తమిళ నిర్మాతల నుంచి కాపాడి వృద్ధాశ్రమంలో చేర్చాలంటూ చెన్నై వడపళినికి చెందిన కందస్వామి అనే వ్యక్తి నగర పోలీస్ కమిషనర్ కు రెండురోజుల క్రితం ఓ వినతిపత్రం సమర్పించాడు. 'రజనీకాంత్ హీరోగా ఇటీవల విడుదలైన కబాలీకి ఎక్కువగా ప్రచారం చేసి వెంటనే చూడాలనే ఆసక్తిని రేకెత్తించారు. దీంతో అశోక్ నగర్ లోని కాశీ థియేటర్లో రూ.1200లకు టికెట్ కొని కబాలి సినిమా చూశాను. అయితే హీరో రజనీకాంత్, దర్శకుడు రంజిత్ ఇద్దరూ మోసం చేశారు. 66 ఏళ్ల సీనియర్ సిటిజన్ అయిన రజనీకాంత్ చేత ఫైట్స్ చేయించి నిర్మాత, దర్శకులు నన్ను చిత్రవధ చేశారు. సీనియర్ సిటిజన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తమిళ నిర్మాతల నుంచి రజనీకాంత్ ను కాపాడి వృద్ధాశ్రమంలో చేర్చండి.' అంటూ కందస్వామి వినతిపత్రంలో పేర్కొన్నాడు. -
కనబడుట లేదు
మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం - కె.సువర్చల ఒక్క నిమిషం ఇది చదవడం ఆపి మీ ఇంట్లో ఇవి మిస్సయ్యాయేమో గమనించండి. 1.చేతి కర్ర 2.పెద్ద నల్లగొడుగు 3.కాశీ తువ్వాలు 4.జపమాల 5.కళ్లద్దాల పెట్టె 6.ముక్కుపొడుం 7.తమలపాకుల సంచీ 8.పడక్కుర్చీ 9.పెన్షన్ బుక్కు 10. ఫైనల్‌గా- మిమ్మల్ని -ఒరే అబ్బాయ్ అనో ఏమిటే అమ్మాయ్ అనో పిలవగలిగే మనిషి.... ఇవేవీ మీ ఇంట్లో లేవా? అయితే మీది న్యూక్లియర్ ఫ్యామిలీ కిందే లెక్క. చంద్రుడు మిస్ కాలేదు. చంద్రుడు వచ్చే వేళ పిల్లలను కూచోపెట్టుకుని కథలు చెప్పే మనిషి మిస్సయ్యింది. సూర్యుడు మిస్ కాలేదు. ఎండ కాసే వేళ అదిలించి ఇంట్లో కూచోబెట్టే మనిషి మిస్సయ్యాడు. పాలు మిస్ కాలేదు. వాటితో వెన్నకాచి ఆ వెన్నను నెయ్యిగా మార్చే అనుభవం మిస్సయ్యింది. చక్కెర మిస్ కాలేదు. ఆ తీపితో ఏ పండుగనాడు ఏ తీపి చేయాలో చెప్పే పెద్దరికం మిస్సయ్యింది. కష్టం వస్తే సలహా. నష్టం వస్తే ఓదార్పు. చిరాకుగా ఉంటే పరిహాసం. పరాకుగా ఉన్నప్పుడు ఒక అనుభవ శకలం... ఇవన్నీ ఇచ్చే పెద్దలు ఇవాళ ఇళ్లల్లో మిస్సవుతున్నారు. ముఖ్యంగా వారి ఆశీర్వాదం కూడా. ఇప్పుడు చీటికి మాటికి గూగుల్‌ను సెర్చ్ చేయడం ఆనవాయితీ. కానీ అతి పెద్ద సెర్చ్ ఇంజన్ల వంటి పెద్దలను మాత్రం ఊళ్లకు పరిమితం చేశాం. పాత ఇళ్లకు పరిమితం చేశాం. వృద్ధాశ్రమాలకు పరిమితం చేశాం. లేదా అనాథాశ్రమాలకు వదిలేశాం. మబ్బును చూసి వాన ఎప్పుడు వస్తుందో చెప్పేవారు, మట్టిబాటను చూసి ఏ గమ్యానికి చేరుస్తుందో చెప్పేవారు, వాలకం చూసి ఎటువంటి మనిషో చెప్పేవారు... ఈ అనుభవసారం మిస్సింగ్. ఇంట్లో తాతయ్య ఉంటే- ఓహో... ఒకనాడు ఎంత పెద్ద రైతు... ఆ రూఫ్ అంతా అలా ఖాళీగా పడి ఉంది కదా... దాని మీద హాంఫట్ అని చిక్కుడు మొక్కలు పెంచగలడు. టొమాటోలను ఎరుపెక్కించగలడు. పొట్లకాయలను పొడుగు పొడుగున పెరిగేలా చేయగలడు. మనుమణ్ణి అగ్రికల్చర్ బీఎస్సీ ఫీజ్ కట్టకుండా ఇంట్లోనే చదివించగలడు. నానమ్మ ఉంటే? దగ్గూ జలుబూ... ఒక్క చిట్కా వైద్యంతో సరి. దడుపు? ఒక్క దడుపు మంత్రంతో సరి. జారి కాలు వాస్తే పసుపూ సున్నం రాస్తే సరి. మనవరాలు ఎంబీబీఎస్ చదవాలంటే మొదటిపాఠం ఇక్కడి నుంచే మొదలు. ఇవాళ చదువు ఉంది. ఫీజుకు డబ్బు ఉంది. కాని ఈ పరంపర పాఠాలే మిస్సింగ్. ఇటీవల షాదీ డాట్ కామ్ వాళ్లు కాబోయే వధూవరుల మనోభిప్రాయం కనుక్కుందామని మొత్తం పాతిక నుంచి ముప్పై అయిదు లోపు వయసున్న 8,500 మందిని సర్వే చేసింది. వారిలో మగవాళ్లు దాదాపు 4,000, స్త్రీలు 4,500. ‘పెళ్లయ్యాక మీరు ఎలా జీవించదలుచుకున్నారు’ అని ఆడవాళ్లను అడిగితే 64 శాతం మంది ‘నా భర్తతో విడిగా’ అని జవాబు చెప్పారు. మగవాళ్లను అడిగితే 44 శాతం మంది ‘నా భార్యతో విడిగా’ అని చెప్పారు. స్త్రీలలో 30 శాతం మంది మాత్రమే అత్తమామలతో పాటుగా అని జవాబు చెప్పారు. మగవాళ్లలో 56 శాతం మాత్రం తమ తల్లిదండ్రులను ఉంచుకుంటాం అంటున్నారు. మగవాళ్ల లెక్క ఆశావహంగా ఉన్నా వారు చేసుకోబోయేది 70 శాతంలోని ‘విడిగా నా భర్తతో’ ఉండాలని ఆశించే అమ్మాయిలనే కాబట్టి ఫలితం పెద్దవాళ్లే అనుభవించాల్సి వస్తోంది. ఇంతకూ ఈ విడిగా అనే కోరిక ఎందుకు? ఇంట్లోని కొడుకు భార్యను తీసుకొని వేరే ఇంట్లో కాపురం పెడితే దానిని ‘వేరు కాపురం’ అంటారు కానీ ‘వేరు కుటుంబం’ అనరు. ఉద్యోగం కోసమో ఉదర పోషణార్థమో వేరే ఊరో దేశమో వెళితే ‘భార్యాపిల్లలను తీసుకెళ్లాడు’ అని అంటారు కానీ ‘కుటుంబాన్ని తీసుకెళ్లాడు’ అనరు. ఇంగ్లిష్‌లో ఫ్యామిలీ అనే మాట వచ్చి ఫ్యామిలీ అంటే సొంత ఫ్యామిలీ అనే అర్థం స్థిరపడింది కానీ ‘కుటుంబం’ అనే మాటకు అర్థం విస్తృతమైనది. ఆ ఊళ్లో ఆ కుటుంబం పెద్దది అంటున్నామంటే- తల్లి తండ్రి కొడుకులు కోడళ్లు మనమలు మనవరాళ్లు బాబాయ్‌లు పెదనాన్నలు... ఇందరు ఉన్నారని అర్థం. ఇందరుగా ఉన్నారని అర్థం. దానినే కుటుంబం అంటారు. ఇవాళ ఇలాంటి కుటుంబాలు లేవు. ఫ్యామిలీలే ఉన్నాయి. కుటుంబాలలోని మైనస్‌లు ఏమిటి? అజమాయిషీ ఎక్కువ. నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. పరిహాసాలు చిన్నబుచ్చటాలు ఉంటాయి. పిల్లలు ఎక్కువ మందికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వంట/ వంటగది మన ఇష్టం కాదు. ఆదాయం/ వ్యయం మన ఒక్కరిది కాదు. మరి న్యూక్లియర్ ఫ్యామిలీలలోని ప్లస్‌లు ఏమిటి? ప్రైవసీ. ఇదే ప్రధానమైనది. మన ఇష్టమొచ్చినట్టు మనం ఉండొచ్చు. ఆర్థికంగా మెరుగ్గా జీవించొచ్చు. పిల్లల చదువుకు తిండికి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఇతర అనుబంధాల నిర్వహణలోని ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ఈ నాలుగైదు కారణాలు ఒక పెద్ద వ్యవస్థను సులభంగా గెలవగలిగాయి. భారతీయ సమాజం సంతృప్త సమాజం. అంటే ఉన్న దాంట్లో సంతోషంగా ఉండే సమాజం. కానీ 21వ శతాబ్దం దేశంలోని కంప్యూటర్‌తోపాటు కొన్ని ఆశలూ ఆశయాలు ఆకాంక్షలు కూడా తెచ్చింది. పిల్లలు బాగా చదువుకోవాలి, అమెరికాకు వెళ్లాలి, ముప్పై ఏళ్లకే సొంత ఇల్లు ఉండాలి, మార్కెట్లోకి వచ్చిన కొత్త బ్రాండ్ కారు పోర్టికోలో పార్క్ చేసి ఉండాలి... ఇవన్నీ ఎప్పుడు వచ్చాయో వేగం పెరిగింది. తక్షణ అనుబంధాలు ప్రధానమయ్యి రక్త సంబంధాలు పలుచనయ్యాయి. వేరేవాళ్ల సంగతి మనకెందుకు ఈ రేస్‌లో మనం ముందుండాలి అని ఎప్పుడు అనుకున్నామో నాన్న అమ్మ అన్న వదినె చిన్నాన్న పెదనాన్న ఇలాంటి ఎగస్ట్రా లగేజ్ లేకుండా భార్య భర్త పిల్లలు అనే చిన్న యూనిట్ ఈ పరుగు పందెంలో సులభంగా గెలవడానికి పరుగుపెట్టింది. కాలుష్యం, ఒత్తిడి, అనారోగ్యం, ఒంటరితనం... ఇవన్నీ ప్రాకారాలుగా కలిగిన నగర జీవితంలో న్యూక్లియర్ ఫ్యామిలీగా బతుకు వెళ్లమార్చడం నేర్చుకుంది. ఇక్కడ తాతకు దగ్గులు ఎవరూ నేర్పరు. అసలు దగ్గడానికి తాత ఉంటే కదా. కానీ ఇది సరైన పద్ధతి కాదు అంటారు సామాజిక విశ్లేషకులు, సాంస్కృతిక అధ్యయనశీలురు, మానసిక వికాస నిపుణులు. ముఖ్యంగా పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర కంటే అమ్మమ్మ తాతయ్య లేదా నానమ్మ తాతయ్యల పాత్ర ముఖ్యం అని అంటారు. కేవలం తల్లితండ్రి మాత్రమే ఉండే ఇంట్లో ఎదిగొచ్చే పిల్లలకు వేరే వాహిక ఉండదు. వాళ్ల ఇష్టాయిష్టాలు నివేదించడానికి అవ్వా తాతలు చాలా ముఖ్యమైన వాహిక అని అంటారు. అలాగే అమ్మా నాన్నల అభీష్టాలను పిల్లల చేత ఒప్పించడంలో కూడా అవ్వా తాతల పాత్ర కీలకమైనదిగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్య దొంతర లేకపోవడం వల్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ఒత్తిడి, వ్యతిరేకత పెరిగిపోతున్నాయనడానికి అనేక ఉదంతాలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే కనుక ఇంట్లో పెద్దవాళ్లు లేకపోతే కనుక పిల్లలు అదుపు తప్పే అవకాశం ఎక్కువ. ఇక విడాకులు పొందిన దంపతుల విషయంలో అయితే ఇది దాదాపు శూన్యంతో సమానం అవుతుంది. అవన్నీ పక్కన పెడితే పిల్లలకు సంస్కృతి ఎలా అందాలి? సంప్రదాయం ఎలా తెలియాలి? ఏది మంచో ఏది మన్నికమైనదో ఏది కార్‌తో ఏది ఆర్తో ఎలా తెలియాలి? ‘మన’ అంటూ ఒకటి ఉందనే అతిశయం బాల్యంలోనే ఏర్పడకపోతే యవ్వనం ఆత్మవిశ్వాసం కోల్పోతుంది. ‘మనది’ అనే ఒక వేరు వేళ్లూనకపోతే ఎదగడం బోలుగా మారుతుంది. ఇవన్నీ తల్లిదండ్రులు చెప్పలేరు. చెప్పడానికి వీలు ఉండదు. ఒకవేళ చెప్పినా పిల్లలు వినరు. అమ్మ పెట్టే ముద్ద తినని పిల్లవాడు నానమ్మ పెట్టే నాలుగు ముద్దలనూ గుటుక్కుమనిపిస్తాడు కదా. ఇదీ అంతే.కానీ రోజులు మారుతున్నాయి. మన దేశంలో గత పదేళ్లుగా కుటుంబాల ఏర్పాటు వ్యవస్థలో అభివృద్ధి మందకొడిగా ఉంది. అలాగే న్యూక్లియర్ ఫ్యామిలీల ఊపు కూడా మందకొడిగా ఉందని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలు న్యూక్లియర్ ఫ్యామిలీల కంటే ఉమ్మడి కుటుంబాలుగా ఉండటంపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాయని ఇటీవలి పరిశోధన. పెళ్లి కావాల్సిన యువతీ యువకుల వేరు కాపురాల కల ఎలా ఉన్నా కష్టకాలంలో ఆదుకునే పెద్ద దిక్కు లేక, ఇంట్లో మాట్లాడే మనిషి లేక, పిల్లల చేయి పట్టుకుని నడిపించే పెద్ది దిక్కు లేక పడే అవస్థతో పోలిస్తే ఉమ్మడి కుటుంబాల్లో ఉండే సంకటాలు చిన్నవి అని భావించే వారు తమ అనుభవాల ద్వారా అందరికీ తెలియ చేస్తున్నారు. తెలుగు సమాజం మరీ ఆ అంచున లేదు. మరీ ఈ అంచున లేదు. మధ్యస్తంగా ఉంది. తమని కన్నవారు తాము కన్నవారు కలిసి ఉండేదే కుటుంబం అని అందరూ తెలుసుకునే రోజు భవిష్యత్తులో రావచ్చు. ఎందుకంటే 1970లలో పోలిస్తే న్యూక్లియర్ ఫ్యామిలీల పెరుగుదల అమెరికాలో ప్రస్తుతం 40 శాతం నుంచి 21 శాతానికి పతనం అయ్యింది. అమెరికానే పెద్దల బాట పట్టినప్పుడు కుటుంబమూలాలు బలంగా ఉన్న మన సమాజం ఆ దారి అంది పుచ్చుకోవడం కష్టమేం కాదు. అదే జరిగినప్పుడు మిస్సింగ్ అనే మాట నిజంగా మిస్సయిపోతుంది. 8,500 షాదీ డాట్ కామ్ సర్వేలో పాల్గొన్న యువతీ యువకులు 64% భర్తతో విడిగా కాపురం ఉండాలని కోరుకుంటున్న మహిళలు 56% తల్లిదండ్రులను తమ వద్దే ఉంచుకుంటామని చెబుతున్న పురుషులు 44% పెద్దలకు దూరంగా విడిగా కాపురం ఉండాలని కోరుకుంటున్న మగాళ్లు -
ఓల్డేజ్ హోంకు బాహుబలి సాయం
టాలీవుడ్ స్టార్ హీరోలు రూట్ మారుస్తున్నారు. ఇన్నాళ్లు జనాలతో కలవడానికి పెద్దగా ఇష్టపడని మన తారలు ఇప్పుడు అభిమానులను కలవడంతోపాటు, సేవా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. ఇప్పటికే ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుండగా మరో యంగ్ హీరో ప్రభాస్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. బాహుబలి సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ప్రభాస్ ఇటీవల వరుసగా ఫ్యాన్ మీట్లను ఏర్పాటు చేస్తున్నాడు. ఈ మధ్యే కమర్షియల్ బ్రాండింగ్లలో కూడా నటించటం మొదలు పెట్టిన ప్రభాస్, సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నాడు. అందులో భాగంగా హైదరాబాద్‌లోని జీసస్ ఓల్డేజ్ హోంకు 5 లక్షల రూపాయల విరాళం అందించాడు. బాహుబలి సక్సెస్ తరువాత గ్యాప్ తీసుకున్న ప్రభాస్, ప్రస్తుతం బాహుబలి 2 కోసం కండలు పెంచే పనిలో ఉన్నాడు. డిసెంబర్ రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. 2016 చివరకల్లా బాహుబలి 2ను ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. -
అనాధ వృద్దులకోసం గ్రామాన్నే కట్టాడు
-
వృద్ధాశ్రమంలో సినీ నటుడు రంగనాథ్ జన్మదిన వేడుక
రసూల్‌పురా (హైదరాబాద్) : టాలీవుడ్ ప్రముఖ నటుడు రంగనాథ్ తన 70వ జన్మదిన వేడుకలను శుక్రవారం పాతబోయిన్‌పల్లిలోని అమ్మ వృద్ధాశ్రమంలో జరుపుకున్నారు. ఆశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కుటుంబసభ్యుల మధ్య కన్నా ఆశ్రమవాసుల మధ్య పుట్టిన రోజు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హీరోకు మాత్రమే ప్రాముఖ్యం ఇచ్చేటువంటి సినిమాలను దర్శక, నిర్మాతలు ప్రోత్సహిస్తున్న కారణంగా నేడు సినిమాలకు మహిళా ప్రేక్షకులు దూరమవుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం కుర్రకారు కోసమే సినిమాలు తీస్తున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో రంగనాధ్ స్నేహితులు శేషు,ఆశ్రమ నిర్వాహకులు కరీమున్నీసా, అయేషా, సాయి పాల్గొన్నారు. -
కన్నబిడ్డలు కాలదన్నారు
పోరుమామిళ్ల : ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధుని పేరు బడిగించల సుబ్బన్న. ఊరు ప్రొద్దుటూరు. ఇతను గతంలో మగ్గం నేసేవాడు. ఇతనికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు. అందరికీ వివాహాలు చేశాడు. వయసు మీద పడటంతో ఏపనీ చేయలేక ఇంటి వద్దే ఓ బంకు పెట్టుకుని జీవిస్తుండగా దాన్ని రెండో కుమారు డు వెంకటసుబ్బయ్య స్వాధీనం చేసుకున్నాడు. కొడుకు, కోడలు కలిసి సుబ్బన్నను గెంటేశారు. పెద్ద కొడుకు శివయ్య మైలవరం మండలం వేపరాలలో మగ్గం నేసుకుంటూ భార్యాబిడ్డలను పోషించుకుంటున్నాడు. ఇక మూడో కుమారుడు మణికంఠ కూడా కడపలో ఉంటున్నాడు. అతను కూడా తండ్రి బాగోగులు పట్టించుకోలే దు. తన కంటే ఇద్దరు పెద్దవాళ్లు ఉండగా వారికి పట్టం ది తనకెందుకు అని కరాఖండిగా చెప్పేశాడు. అంతటితో ఆగకుండా తండ్రిని తీసుకెళ్లి నాలుగు రోజుల క్రి తం కాశినాయన మండలంలోని జ్యోతి క్షేత్రంలో వది లేసి వెళ్లాడు. అతనికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొందరి సాయంతో సోమవారం రాత్రి పోరుమామిళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. తనకు ముగ్గురు కొడుకులున్నా ఎవరూ తనకు అన్నం పెట్టడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. తన భార్య మాత్రం నెల్లూరులో చిరువ్యాపారం చేసుకుంటున్న తన కూతురు లక్ష్మిదేవి వద్ద ఉంటోందని చెప్పాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆసుపత్రి నుంచి డిస్చార్జి అయిన సుబ్బన్నకు ఎటు వె ళ్లాలో దిక్కుతోచలేదు. తనను ఎక్కడైనా వృద్ధాశ్రమంలో చేర్పించండి అని అక్కడున్న వారిని ప్రాధేయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న జ్ఞాన సరస్వతి దేవి ట్రస్టు ప్రతినిధి శ్రీనివాసులు తమ సంస్థ సభ్యులతో కలిసి వృద్ధుడిని తీసుకెళ్లి కడపలోని గుడ్‌హార్ట్ ఫౌండేషన్‌లో చేర్చాడు. కన్నబిడ్డలు కాలదన్నినా తన స్థితిని చూసి స్పందించి వృద్ధాశ్రమంలో చేర్పించిన యువకులకు అతను కృతజ్ఞతలు తెలిపాడు. -
ఒక్కటయిన వృద్ధులు.. హనీమూన్ ట్రిప్
గువాహటి: వృద్ధాశ్రమంలో ఉంటున్న ఇద్దరు వృద్ధులు వివాహం చేసుకున్నారు. అంతేకాదు వారు మేఘాలయ రాజధానిలోని షిల్లాంగ్‌కు హనీమూన్‌కు కూడా వెళ్లారు. శాంతను కుమార్ దాస్(73) మంజు సిన్హా రాయ్(63) గువాహటిలో ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. 'వాళ్లిద్దరి మధ్య తొలిచూపులోనే ప్రేమ చిగురించింది. వృద్ధాశ్రమంలోకి రాగానే వారిమధ్య బంధం ఏర్పడింది. కానీ మాకు మాత్రం ఈ మధ్యకాలంలో మూడు నెలల కిందట తెలిసింది. దీంతో మేం వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించాం' అని ఓల్డేజ్ హోమ్ కార్యదర్శి మోనికా శర్మ తెలిపింది. కుమార్ దాస్ సొంత ప్రాంతం కరీంగంజ్ జిల్లా. పదవీ విరమణ పొందిన ఇంజినీర్ గా ఉండి ఆయన భార్య చనిపోవడంతో 2012 ఈ ఓల్డేజ్ హోంకు వచ్చాడు. ఇక మంజు సిన్హా రాయ్‌ది సమీపంలోని లాల్ గణేశ్ ప్రాంతం. ఆమె కూడా 2012లోనే ఓల్డేజ్ హోంకు వచ్చింది. వారిద్దరికీ పిల్లలు లేరు. వారి వివాహానికి దాదాపు రెండు వేలమంది హాజరై ఆశీర్వదించారు. -
మానవత్వం మంటగలిసింది
కన్నబిడ్డలకు భారమైన తల్లి మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం వృద్ధాశ్రమంలో చేర్పించిన పోలీసులు ఖమ్మం క్రైం : తొమ్మిది నెలలపాటు మోసి.. వారు ప్రయోజకులు అయ్యేంతవరకు పెంచి.. వారికి బతకటానికి మార్గం చూపించిన కన్నతల్లి కుమారులకు భారంగా మారింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. నలుగురు కొడుకులు ఉన్న ఆమెకు తిండి పెట్టలేక వెళ్లగొట్టారు. 95 ఏళ్ల వయసున్న ఆమెను చిన్నపిల్లలా చూసుకోవాల్సిన కొడుకు, కోడళ్లు కాదుపొమ్మన్నారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ పండు ముదుసలి ఖమ్మంలోని మున్నేరులో పడి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఖమ్మంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. కృష్ణా జిల్లా నందిగామ మండలం చందర్లపాడుకు చెందిన ఉడుతా వెంకమ్మ(95)కు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరకీ వివాహాలయ్యాయి. భర్త సుబ్బయ్య మృతిచెందిన తరువాత వెంకమ్మ పరిస్థితి దారుణంగా తయారైంది. నలుగురు కొడుకులు ఆమెను పట్టించుకోవటం మానేశారు. ఒకరికొకరు పోటీపడి తమకు సంబంధం లేదంటూ వేధించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఉంటున్న కుమారుడు శ్రీనివాసరావు ఇంటికి ఇటీవల వచ్చింది. అయితే కొడుకు, కోడలు సూటిపోటి మాటలతో వేధిస్తూ .. ‘నీకు భోజనం పెట్టలేము.. ఖమ్మంలో ఉన్న నీ కూతురు వద్దకు వెళ్లు’ అని బలవంతంగా పంపించారు. ఆర్థిక సమస్యలతో సతమతవుతున్న కూతురు ఇంటికి వెళ్లి.. వారికి భారం కావడం ఇష్టం లేని వెంకమ్మ ఇక తనకు చావే శరణ్యం అని భావించింది. ఖమ్మం బస్టాండ్ నుంచి ఆటోలు కాల్వొడ్డులోని మున్నేరు వద్దకు వచ్చి అందులో పడి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించగా సీఐ రెహమాన్, ఎస్ఐ సర్వయ్య అక్కడికి చేరుకుని వెంకమ్మను స్టేషన్‌కు తీసుకెళ్లారు. వివరాలు తెలుసుకుని వాసవి వృద్ధాశ్రమ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తితో మాట్లాడి అందులో చేర్పించారు. వైరాలో ఉన్న ఆమె కుమారుడిని పిలిచి కౌన్సెలింగ్ ఇస్తామని సీఐ తెలిపారు. -
వృద్ధురాలి బాధలు తెలుసుకుంటున్న కలెక్టర్
కలెక్టర్ జగన్మోహన్ : నమస్కారం.. అమ్మా బాగున్నావా? మీ పేరేంటి? గంగమ్మ : మంచిగున్న అయ్యా.. నా పేరు గంగమ్మ. కలెక్టర్ : ఆరోగ్యం ఎలా ఉంది..? గంగమ్మ : బాగుందయ్యా.. కాళ్ల నొప్పులు ఉన్నాయి. కలెక్టర్ : మందులు వాడుతున్నావా? గంగమ్మ : యావత్మాల్ (మహారాష్ట్ర) గోలీలు వేసుకుంటున్న సారు. కలెక్టర్ : ప్రతిరోజూ కొంత సేపు నడవండమ్మా. ఆశ్రమంలోనే అటూ ఇటూ తిరిగితే కొంత ఆరోగ్యంగా ఉండవచ్చు. కలెక్టర్ : ఏం పెద్దాయన ఏ ఊరు మీది? విఠల్ : సావాపురం సారు.. రెండుమూడేండ్లుగా ఇక్కడే ఉంటున్న. కలెక్టర్ : కొడుకులున్నారా? విఠల్ : ఉన్నా కానీ లేనట్లే సారూ (కంటతడి పెడుతూ). ఆరోగ్యం బాగుంట లేదు. మాకు పింఛన్ ఇప్పించండి. కలెక్టర్ : 65 ఏళ్లు దాటి ఉన్నావు కదా.. తప్పకుండా మీకందరికీ పింఛన్ వచ్చేలా చూస్తా. కలెక్టర్ : అమ్మా ఏం పేరు నీది. పిల్లలున్నారా..? రేవంతి : నాపేరు రేవంతి.. సారూ. పిల్లలున్నరు. కొడుకున్నడు. బిడ్డ ఉంది. కలెక్టర్ : నిన్ను చూడటానికి వస్తారా? రేవంతి : కొడుకు పిల్లలు రారు సారూ.. బిడ్డ పిల్లలు అప్పుడప్పుడు వచ్చి చూసిపొతుంటరు. కలెక్టర్ : భోజనం బాగా పెడుతున్నారా? రేవంతి : పెడుతున్నరు సారు. కలెక్టర్ : మీది ఏవూరు అమ్మా? ఆరోగ్యం ఎలా ఉంది? రాజమ్మ : బీరెల్లి సారూ.. నిర్మల్ దగ్గరుంటది. కాళ్లు చేతులు గుంజుతన్నై. నడవడం కష్టంగా ఉంది. కలెక్టర్ : మందులు ఇస్తున్నారా? రాజమ్మ : గోలీలిచ్చిండ్రు సారు. ఆరోగ్యం బాగలేనప్పుడు ఈ గోలీలు వేసుకోండమ్మ అని చెప్పిండ్రు. కలెక్టర్ : ఏం అమ్మా ఖాళీ సమయంలో ఏం చేస్తారు? కత్రుబాయి : ఉత్తగ కూసుంటము సారు. కలెక్టర్ : ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నారు.. కదా.. వారితో మాట్లాడుతుండండి. మీకు కూడా కొంత ఆనందం కలుగుతుంది. కలెక్టర్ : బాబూ నీ పేరేంటీ? ఏ చదవుకుంటున్నావు. (అనాథ బాలుడితో ముచ్చటిస్తూ..) సాయి : సాయి.. ఐదో తరగతి. కలెక్టర్ : ఏ ఊరు మీది. మీ నాన్న ఏంచేస్తాడు? సాయి : అమ్మ, నాన్న జరమొచ్చి చచ్చిపోయిండ్రు. కలెక్టర్ : బాగా చదువుకుంటున్నావా? సాయి : చదువుకుంటున్న. కలెక్టర్ : బాగా చదువుకోవాలి బాబూ.. (దగ్గరికి తీసుకుంటూ..) కలెక్టర్ : నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నావు? అన్నం తింటున్నావా? అశోక్ : ఆరో తరగతి సారు. కస్తాల రామకృష్ణ కాలనీ స్కూలుకు పోతున్నా.. తింటున్న సారూ.. కలెక్టర్ : నమస్కారం అమ్మా.. వెళ్లొస్తా.. కలెక్టర్ హామీలు.. వృద్ధాశ్రమంలో ఆశ్రమం పొందుతున్న వారందరికీ ప్రభుత్వం మంజూరు చేస్తున్న వృద్ధాప్య పింఛన్లు ఇప్పిస్తా. అనాథ బాలికలు, వివిధ ఘటనల్లో బాధితులుగా మారుతున్న చిన్నారుల కోసం జిల్లాలో మరో ప్రత్యేక ఆశ్రయం ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం.వృద్ధులందరికీ దుప్పట్ల పంపిణీకి చర్యలు తీసుకుంటా. -
1.30 కోట్లకు ముంచేసిన ఫేస్బుక్ ఫ్రెండ్
ఫేస్బుక్లో అకౌంట్ ఉంది కదాని ఎవరు పడితే వాళ్లు పంపిన ఫ్రెండ్ రిక్వెస్టులు ఓకే చేసేస్తే కొంప మునిగిపోతుంది జాగ్రత్త. డెహ్రాడూన్‌లో ఓ మహిళను ఆమె ఫేస్బుక్ స్నేహితుడు ఏకంగా కోటీ 30 లక్షల మేర ముంచేశాడు. వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడానికి 1.5 మిలియన్ డాలర్లు (సుమారు 9 కోట్ల రూపాయలు) సాయం చేస్తానంటూ చెప్పి చివరకు ఆమె వద్ద ఉన్న డబ్బులన్నీ లాగేసుకున్నాడు. డెహ్రాడూన్‌లోని రాం విహార్ ప్రాంతానికి చెందిన బీనా బోర్ ఠాకూర్ అనే మహిళకు అతడు ముందుగా తాను ఇవ్వాల్సిన మొత్తం కావాలంటే ఓ పన్ను చెల్లించాలని చెప్పాడు. ఆ ఉచ్చులో చిక్కుకున్న ఆమె, వివిధ బ్యాంకు ఖాతాలకు ఏకంగా రూ. 1.30 కోట్లు జమచేశారు. ఆ తర్వాత గానీ తాను మోసపోయినట్లు గుర్తించలేకపోయారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓఎన్జీసీలో ఉద్యోగి భార్య అయిన ఠాకూర్ ఫేస్బుక్ వాడతారు. గత సంవత్సరం నవంబర్ నెలలో ఆమెకు రిచర్డ్ ఆండర్సన్ అనే వ్యక్తి ఫ్రెండ్ అయ్యాడు. వాళ్లిద్దరూ ఫోన్లో కూడా చాలాసార్లు చాటింగ్ చేసుకున్నారు. భారతదేశంలోని ప్రజలకు తాను సేవ చేయాలనుకుంటున్నానని చెబుతూ పలు రకాల ప్రతిపాదనలు తెచ్చాడు. చివరకు వృద్ధాశ్రమం ఏర్పాటుకు 9 కోట్లు ఇస్తానని చెప్పినట్లు డెహ్రాడూన్ ఎస్ఎస్పీ అజయ్ రౌతెలా తెలిపారు. కొన్నాళ్ల తర్వాత రిజర్వు బ్యాంకులోని విదేశీ మారకద్రవ్య విభాగం నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. 9 కోట్లమొత్తం వచ్చిందని, అందుకు కొంత పన్ను చెల్లించి ఆ మొత్తం తీసుకోవాలని చెప్పాడు. ఆమె ఆ మొత్తాన్ని వేర్వేరు బ్యాంకుల్లో వేసిన తర్వాత విలియం జార్జి, కెవన్ బ్రౌన్ అనే మరో ఇద్దరు ఫోన్ చేసి, మరింత మొత్తం వేయాలన్నారు. అలా మొత్తం 25 ఖాతాల్లో 1.30 కోట్లను ఆమె డిపాజిట్ చేశారు. చివరకు మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆండర్సన్, జార్జి, బ్రౌన్‌లతో పాటు మరో వ్యక్తిపై 420 కేసు నమోదు చేశారు. ఆమె డిపాజిట్ చేసిన ఖాతాలు చాలావరకు కేరళ, తమిళనాడు, కర్ణాటకలలోనే ఉన్నాయని పోలీసులు గుర్తించారు. -
వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఏకేఎస్ కార్యవర్గం
దాదర్, న్యూస్‌లైన్: స్థానిక ఆంధ్ర కళా సమితి (ఏకేఎస్) కార్యవర్గం నవీముంబైలోని పన్వెల్ లోగల ‘స్నేహకుంజ్ ఆధార్ ఘర్’ అనే వృద్ధాశ్రమాన్ని ఇటీవల సందర్శించింది. సర్వీస్ బ్రింగ్స్ స్మైల్ పేరిట ఆంధ్ర కళా సమితి... ప్రతి నెలా చేపడుతున్న సామాజిక కార్యక్రమంలో భాగంగా పది మంది సభ్యుల బృందం ఉదయం 11.00 గంటలకు అక్కడికి చేరుకుని వృద్ధులు, మానసిక వికలాంగులను పరామర్శించింది. ఈ సందర్భంగా ఈ ఆశ్రమంలోని వారికి బిస్కట్లు, వివిధ రకాల ఫలాలు,అలాగే స్టీల్ ప్లేట్లు, గ్లాసులను బహుమతులుగా అందించింది.. సమితి ప్రధాన కార్యదర్శి పి.ఎస్. జీ.వి. సుబ్రమణ్యం ఆధ్వర్యంలో సభ్యులు కె. వాసుదేవాచార్యులు, డి, శ్రీనివాస్, కిరణ్ కుమార్, వెంకట రెడ్డి, రమేష్ తదితరులు ఈ ఆశ్రమాన్ని సందర్శించినవారిలో ఉన్నారు. ‘సర్వీస్ బ్రింగ్స్ స్మైల్’ పేరిట సమితి చేపడుతున్న సేవా కార్యక్రమాలకు దాతలు శక్తిమేర విరాళాలు అందించి సహకరించాలని ఏకేఎస్ కార్యదర్శి సుబ్రమణ్యం విజ్ఞప్తి చేశారు. దాతలు 09757418822 నంబరుతో సంప్రదించి విరాళాలు అందజేయవచ్చు.