
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కరణ అప్పీల్‌లో రిటైర్డ్ అడిషనల్ డీసీపీ జోగయ్య (63)కు హైకోర్టు సామాజిక శిక్ష విధించింది. ముషీరాబాద్‌లోని ‘హోం ఫర్ ది ఏజ్డ్’వృద్ధాశ్రమంలో 3 నెలలపాటు ప్రతి శని, ఆదివారం అక్కడి వృద్ధులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడంతోపాటు వారితో కొద్దిసేపు గడపాలని ఆదేశించింది. జోగయ్య సేవ చేసిన వివరాలను పేర్కొంటూ హోం నిర్వాహకులు నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
కోర్టుధిక్కరణ కేసులో సింగిల్ జడ్జి రూ.5 వేలు జరిమానా విధించడాన్ని సవాల్ చేస్తూ జోగయ్య దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం మళ్లీ విచారించింది. జోగయ్య ఇప్పటికే పదవీ విరమణ చేశారని, ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదని ఆయన తరఫున న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ‘పదవీ విరమణ చేసినంత మాత్రాన ఆయన చేసిన తప్పు ఒప్పుకాదు. సామాజిక సేవకు ముందుకొస్తే ఆయనకు జరిమానా విధిస్తూ ఇచ్చిన తీర్పును కొట్టివేసే అంశాన్ని పరిశీలిస్తాం’అని ధర్మాసనం స్పష్టం చేసింది. సామాజిక సేవకు సిద్ధమని ఆదినారాయణరావు తెలపడంతో సింగిల్ జడ్జి విధించిన శిక్షను కొట్టేస్తున్నామని తీర్పునిచ్చింది.
అసలేం జరిగిందంటే...
నగరంలోని సెయింట్ జోసఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ల మధ్య నెలకొన్న వివాదంలో, సొసైటీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోరాదని 2010లో పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అయినా నారాయణగూడ అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఉన్న జోగయ్య హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారు.