వయసు మీద పడిందని ఓ మూలన కూర్చోలేదు. కృష్ణారామ అనుకుంటూ కాలం వెళ్లదీయలేదు. ఖాళీగా ఉండటమెందుకుని ఓ ప్రోగ్రామ్ పెట్టుకుని ఫుల్ ఎంజాయ్ చేశారు. వృద్ధుల హుషారు చూస్తుంటే గురువారం నాడు ఫుల్ దావత్ చేసుకున్నట్టే కనిపిస్తోంది. ఇక ఈ వేడుక గౌహటిలోని వృద్ధాశ్రమంలో జరిగింది. దీని కోసం ఓ గదిని అందంగా అలంకరించుకుని కూర్చుకున్నారు. కార్యక్రమాన్ని ఉరకలెత్తించడానికి ఇద్దరు వ్యక్తులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రోగ్రాం మొదలుకాగానే ఆటలు పాటలతో హోరెత్తిన ఈ కార్యక్రమంలో వృద్ధులందరూ లోకాన్నే మరిచిపోయారు.
ఇక ఈ వేడుకల్లో ఓ బామ్మ డాన్స్ హైలెట్‌గా నిలిచింది. ఈ ఏజ్‌లోనూ ఏ మాత్రం తగ్గకుండా పాటకు తగ్గట్టుగా స్టెప్పులు వేసి అక్కడ కూర్చున్న వృద్ధ ప్రేక్షకులను అలరించింది. ఈ వీడియోను ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో శుక్రవారం పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. అరవై ఏళ్లు దాటినా పదహారేళ్ల పడుచు పిల్లలా గెంతులేసింది అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వారి శేష జీవితం ఇలాగే ఆనందవంతంగా గడపాలి అని నెటిజన్లు ప్రార్థించారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదురుచూసుంటారు.. ఇక ఇప్పుడైనా సంతోషంగా ఆరోగ్యవంతంగా గడపాలని కోరుకుంటున్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియో ఎంతో మంది హృదయాలను గెలుచుకుందని పలువురు అభిప్రాయపడ్డారు.