'రజనీకాంత్ను వృద్ధాశ్రమంలో చేర్చండి'
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి చిత్రం విడుదలైనా... ఆ సినిమా గురించి రోజుకో వార్త వెలువడుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ యువకుడు తాను మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే... రజనీకాంత్ను తమిళ నిర్మాతల నుంచి కాపాడి వృద్ధాశ్రమంలో చేర్చాలంటూ చెన్నై వడపళినికి చెందిన కందస్వామి అనే వ్యక్తి నగర పోలీస్ కమిషనర్ కు రెండురోజుల క్రితం ఓ వినతిపత్రం సమర్పించాడు.
'రజనీకాంత్ హీరోగా ఇటీవల విడుదలైన కబాలీకి ఎక్కువగా ప్రచారం చేసి వెంటనే చూడాలనే ఆసక్తిని రేకెత్తించారు. దీంతో అశోక్ నగర్ లోని కాశీ థియేటర్లో రూ.1200లకు టికెట్ కొని కబాలి సినిమా చూశాను. అయితే హీరో రజనీకాంత్, దర్శకుడు రంజిత్ ఇద్దరూ మోసం చేశారు. 66 ఏళ్ల సీనియర్ సిటిజన్ అయిన రజనీకాంత్ చేత ఫైట్స్ చేయించి నిర్మాత, దర్శకులు నన్ను చిత్రవధ చేశారు. సీనియర్ సిటిజన్స్కు తమిళనాడు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తమిళ నిర్మాతల నుంచి రజనీకాంత్ ను కాపాడి వృద్ధాశ్రమంలో చేర్చండి.' అంటూ కందస్వామి వినతిపత్రంలో పేర్కొన్నాడు.