Kandaswamy
-
కాలేయ మార్పిడితో బతికిన బాలుడు.. డాక్టర్ అయ్యాడు!
Indias 1st Child Liver Transplantee: పాతికేళ్ల క్రితం కాలేయ మార్పిడితో పునర్జన్మ పొందిన బాలుడు ఇప్పుడు అదే వైద్యరంగంలో డాక్టర్ అయ్యాడు. అవయవ మార్పిడి అద్భుత విజయానికి సజీవ సాక్ష్యంగా నిలిచాడు. భారతదేశపు మొట్టమొదటి విజయవంతమైన పీడియాట్రిక్ కాలేయ మార్పిడి గ్రహీత అయిన తమిళనాడుకు చెందిన సంజయ్ కందసామి వైద్య విద్యను అభ్యసించి డాక్టరుగా సొంతూరు కాంచీపురంలో విజయవంతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ 1998లో 20 నెలల చిన్నారిగా ఉన్నప్పుడు కందసామికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడిని నిర్వహించింది. తద్వారా దేశంలోనే మొట్టమొదటి పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్‌ప్లాంటీగా కందసామి నిలిచాడు. ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేస్తున్న కృషిని దగ్గర నుంచి చూసి తాను కూడా వైద్యుడు కావాలనుకున్నానని కందసామి మీడియా ప్రకటనలో తెలిపారు. డాక్టరుగా తాను కూడా రోగుల ప్రాణాలు కాపాడటంలో భాగం కావాలని, జీవితంలో ఎటువంటి సవాలునైనా అధిగమించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలవాలని భావించినట్లు పేర్కొన్నారు. దేశంలో మొదటి బాలుడు తమిళనాడులోని కాంచీపురానికి చెందిన కందసామి బైలరీ అట్రేసియా అనే కాలేయ రుగ్మతతో జన్మించాడు. ఇది లివర్ ఫెయిల్యూర్‌కి దారితీయడంతో కాలేయ మార్పిడి చేయాల్సిన అవసరం వచ్చింది. దీంతో కందసామి తండ్రి కాలేయాన్ని ఇచ్చేందుకు ముందుకువచ్చారు. ఆ తర్వాత న్యూ ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో నిపుణుల బృందం మార్పిడిని విజయవంతంగా నిర్వహించింది. దేశంలో లివర్ ప్లాంటేషన్ చేయించుకున్న మొట్టమొదటి బాలుడు కందసామే. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్నవారు దీర్ఘకాలం సాఫీగా జీవించవచ్చు అనేదానికి కందసామి ఒక అద్భుతమైన ఉదాహరణని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో గ్రూప్ మెడికల్ డైరెక్టర్, సీనియర్ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ అనుపమ్ సిబల్ అన్నారు. కందసామి కాలేయ మార్పిడి ఆపరేషన్ తన కెరీర్లో గర్వించదగిన క్షణాలలో ఒకటిగా పేర్కొన్నారు మరో డాక్టర్, మేదాంత లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ ఏఎస్ సోయిన్. కందసామి విజయవంతమైన ఆపరేషన్ తర్వాత అపోలో ఆసుపత్రి వైద్యులు ఇప్పటి వరకు 4,300 కాలేయ మార్పిడి ఆరరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. ఇందులో 515 మంది పిల్లలు ఉండటం గమనార్హం. -
కలెక్టర్‌పై హత్యాయత్నం
సాక్షి, తిరువణ్ణామలై: తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్‌పై శనివారం మధ్యాహ్నం ముగ్గురు వ్యక్తులు హత్యాయత్నం చేశారు. కలెక్టర్ కందస్వామి విధులు పూర్తి చేసుకుని ఎదురుగా ఉన్న బంగ్లాకు కాలి నడకన బయలుదేరారు. ఆయన వెనుక పీఏ బాబు, జబేదార్ కొద్ది దూరంలో నడిచి వస్తున్నారు. కలెక్టర్ బంగ్లా ప్రాంగణంలోకి ప్రవేశించగానే వెనుక నుంచి ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆయనపై దాడి చేసేందుకు యత్నించగా కలెక్టర్ అదుపు తప్పి కింద పడ్డారు. గమనించిన కలెక్టర్ పీఏ కేకలు వేయడంతో బంగ్లాలో కాపలా ఉన్న పోలీసులు, సిబ్బంది పరుగున వచ్చి ఆ ముగ్గురినీ పట్టుకున్నారు. వారిని తిరువణ్ణామలై నార్త్ పోలీసులకు అప్పగించారు. వారి వద్ద ఉన్న కత్తి, మిరప పొడి, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాడికి పాల్పడిన వారు కాంచీపురం జిల్లా కండిగ గ్రామానికి చెందిన శివ, మణిగండన్, తిరుప్పూరు జిల్లా తంబూరుకు చెందిన సంతోష్‌లుగా గుర్తించారు. వీరు విల్లుపురంలోని బంధువుల ఇంటికి వచ్చారని, తిరువణ్ణామలైలో ఓ బారులో మద్యం సేవిస్తున్నపుడు ఓ వ్యక్తితో ఘర్షణ పడ్డారని, అతన్ని హత్య చేసేందుకు వెంబడించారని, అతని చొక్కా, కలెక్టర్ వేసుకున్న చొక్కా ఒక్కటిగా ఉండటంతో హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులను ప్రత్యేకంగా విచారించేందుకు అడిషనల్ ఎస్పీ రవళి ప్రియ, డీఎస్పీ దేవనాథన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించారు. కలెక్టర్‌కు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
'రజనీకాంత్‌ను వృద్ధాశ్రమంలో చేర్చండి'
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి చిత్రం విడుదలైనా... ఆ సినిమా గురించి రోజుకో వార్త వెలువడుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ యువకుడు తాను మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే... రజనీకాంత్‌ను తమిళ నిర్మాతల నుంచి కాపాడి వృద్ధాశ్రమంలో చేర్చాలంటూ చెన్నై వడపళినికి చెందిన కందస్వామి అనే వ్యక్తి నగర పోలీస్ కమిషనర్ కు రెండురోజుల క్రితం ఓ వినతిపత్రం సమర్పించాడు. 'రజనీకాంత్ హీరోగా ఇటీవల విడుదలైన కబాలీకి ఎక్కువగా ప్రచారం చేసి వెంటనే చూడాలనే ఆసక్తిని రేకెత్తించారు. దీంతో అశోక్ నగర్ లోని కాశీ థియేటర్లో రూ.1200లకు టికెట్ కొని కబాలి సినిమా చూశాను. అయితే హీరో రజనీకాంత్, దర్శకుడు రంజిత్ ఇద్దరూ మోసం చేశారు. 66 ఏళ్ల సీనియర్ సిటిజన్ అయిన రజనీకాంత్ చేత ఫైట్స్ చేయించి నిర్మాత, దర్శకులు నన్ను చిత్రవధ చేశారు. సీనియర్ సిటిజన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తమిళ నిర్మాతల నుంచి రజనీకాంత్ ను కాపాడి వృద్ధాశ్రమంలో చేర్చండి.' అంటూ కందస్వామి వినతిపత్రంలో పేర్కొన్నాడు. -
చిల్లర ఇచ్చి .. చుక్కలు చూపించాడు
అధికారి సహనానికి పరీక్ష రూ.10వేలకు రూ.10ల నాణేలు చెన్నై: ఓ స్వతంత్య్ర అభ్యర్థి సరదాగా ఒక ఎన్నికల అధికారి పని పట్టాడు. డిపాజిట్టు చెల్లింపులో అధికారి సహనానికి పరీక్షపెట్టాడు. ఇంతకూ సంగతి ఏమిటంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ ఘట్టం శుక్రవారం ఆరంభమైంది. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి డిపాజిట్టుగా రూ.10వేలు చెల్లించాల్సి ఉంది. చెన్నై విల్లివాక్కం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కందస్వామి షెనాయ్‌నగర్‌లోని ఎన్నికల కార్యాలయానికి వెళ్లారు. రూ.10వేల డిపాజిట్టు మొత్తాన్ని రూ.10 నాణేల రూపంలో తెచ్చారు. ఏడు కిలోలకు పైగా బరువున్న వంద నాణేలను ఎన్నికల అధికారి కుమారవేల్‌కు అందజేశారు. సదరు అధికారి తన సహాయక సిబ్బందికి ఆ నాణేలను సరిచూడాల్సిందిగా కోరారు. లెక్క సరిపోవడంతో నామినేషన్‌ను స్వీకరిం చి అభ్యర్థిని పంపివేశారు. అభ్యర్థి కందస్వామి మీడియాతో మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకే ఎన్నికల్లో పోటీచేస్తున్నాని, డిపాజిట్టు మొత్తం కోసం స్నేహితులు, బంధువులను ఆశ్రయించగా వారి ద్వారా అందిన నాణేలను అధికారికి సమర్పించానని తెలిపారు. అందండీ నాణేల వెనుక ఉన్న కథ. -
అమ్మా! నాకెందుకీ శిక్ష..?
నాగలాపురం: ఇదిగో ఇక్కడ ఫొటోలో కుమిలి కుమిలి ఏడుస్తున్న బాలుడి జీవితం ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. కన్న తల్లి చేసిన తప్పిదానికి అతడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. తండ్రి హత్యోదంతం గురించి తెలిసినా ఎవరికీ చెప్పలేదని హతుని బంధువులు ఆ బాలుడిని చీదరించుకుంటున్నారు. మరోవైపు- బాలుడిని చేరదీస్తే తమను చిన్నచూపు చూస్తారని నిందితురాలి కుటుంబ సభ్యులు అతడి దరికే రావడం లేదు. దీంతో ‘అమ్మా! నాకెందుకీ శిక్ష?’ అని పోలీస్‌స్టేషన్ నాలుగు గోడల మధ్య ఆ బాలుడు కుమిలిపోతున్నాడు. దీనికి తోడు హతుడి బంధువులు పోలీస్‌స్టేషన్‌కొచ్చి శాపనార్థాలు పెడుతుండడం ఆ పసి మనసును కుంగదీ స్తోంది. వివాహేతర సంబంధాలు మానవ సంబంధాలను, కుటుంబాలను ఎంతగా విచ్ఛిన్నం చేస్తాయో చెప్పడాని కి ఇదో ఉదాహరణ. మండలంలోని గోపాలపురానికి చెందిన కందస్వామి తల్లి సుమతి వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడి సహకారంతో తన భర్త మునయ్యను వారం క్రితం హతమార్చడం విదితమే. దీంతో ఆమె కుమారుడు కందస్వామి(14) తండ్రి ప్రేమకు శాశ్వతంగా దూరమయ్యాడు. తల్లి జైలు పాలైంది. విచారణ నిమిత్తం అతడిని నాగలాపురం పోలీసులు తమ అదుపులో ఉంచుకున్నారు. ఈ నేపథ్యం లో, తన తల్లి కన్నతండ్రినే హతమార్చినా ఆ విషయాన్ని దాచాడని తండ్రి తరపున బంధువులు కందస్వామి సంరక్షణకు ముందుకు రావడం లేదు. తమ కుమార్తె అల్లుడిని హతమార్చి తమ పరువు తీసిందని కందస్వామి తాత య్య సైతం అతడిని తమతో తీసుకెళ్లేం దుకు నిరాకరించారు. హత్య కేసు దర్యా ప్తు పరంగా కందస్వామిని ప్రశ్నించడం తప్పితే అతడి సంరక్షణ, బాగోగుల వ్యవహారం తమది కాదని విచారణ నిమిత్తం వచ్చిన పుత్తూరు డీఎస్పీ నాగభూషణరావు, సత్యవేడు సీఐ భక్తవత్స లం తేల్చిచెప్పారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న కందస్వామి భవితవ్యం ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. బంధువులున్నా అనాథగా మిగిలాడు. ఎక్కడికెళ్లాలో తెలియని పరిస్థితి. కేవీబీపురం మండలం జ్ఞానాం బకండ్రిగలోని తన తండ్రి సంబంధీకుల ఇళ్లకు వెళ్తానని కందస్వామి చెబుతున్నా వారు మాత్రం ససేమిరా అంటుండటం గమనార్హం!