అమ్మా! నాకెందుకీ శిక్ష..?
నాగలాపురం: ఇదిగో ఇక్కడ ఫొటోలో కుమిలి కుమిలి ఏడుస్తున్న బాలుడి జీవితం ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. కన్న తల్లి చేసిన తప్పిదానికి అతడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. తండ్రి హత్యోదంతం గురించి తెలిసినా ఎవరికీ చెప్పలేదని హతుని బంధువులు ఆ బాలుడిని చీదరించుకుంటున్నారు. మరోవైపు- బాలుడిని చేరదీస్తే తమను చిన్నచూపు చూస్తారని నిందితురాలి కుటుంబ సభ్యులు అతడి దరికే రావడం లేదు. దీంతో ‘అమ్మా! నాకెందుకీ శిక్ష?’ అని పోలీస్‌స్టేషన్ నాలుగు గోడల మధ్య ఆ బాలుడు కుమిలిపోతున్నాడు.
దీనికి తోడు హతుడి బంధువులు పోలీస్‌స్టేషన్‌కొచ్చి శాపనార్థాలు పెడుతుండడం ఆ పసి మనసును కుంగదీ స్తోంది. వివాహేతర సంబంధాలు మానవ సంబంధాలను, కుటుంబాలను ఎంతగా విచ్ఛిన్నం చేస్తాయో చెప్పడాని కి ఇదో ఉదాహరణ. మండలంలోని గోపాలపురానికి చెందిన కందస్వామి తల్లి సుమతి వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడి సహకారంతో తన భర్త మునయ్యను వారం క్రితం హతమార్చడం విదితమే. దీంతో ఆమె కుమారుడు కందస్వామి(14) తండ్రి ప్రేమకు శాశ్వతంగా దూరమయ్యాడు.
తల్లి జైలు పాలైంది. విచారణ నిమిత్తం అతడిని నాగలాపురం పోలీసులు తమ అదుపులో ఉంచుకున్నారు. ఈ నేపథ్యం లో, తన తల్లి కన్నతండ్రినే హతమార్చినా ఆ విషయాన్ని దాచాడని తండ్రి తరపున బంధువులు కందస్వామి సంరక్షణకు ముందుకు రావడం లేదు. తమ కుమార్తె అల్లుడిని హతమార్చి తమ పరువు తీసిందని కందస్వామి తాత య్య సైతం అతడిని తమతో తీసుకెళ్లేం దుకు నిరాకరించారు.
హత్య కేసు దర్యా ప్తు పరంగా కందస్వామిని ప్రశ్నించడం తప్పితే అతడి సంరక్షణ, బాగోగుల వ్యవహారం తమది కాదని విచారణ నిమిత్తం వచ్చిన పుత్తూరు డీఎస్పీ నాగభూషణరావు, సత్యవేడు సీఐ భక్తవత్స లం తేల్చిచెప్పారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న కందస్వామి భవితవ్యం ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. బంధువులున్నా అనాథగా మిగిలాడు. ఎక్కడికెళ్లాలో తెలియని పరిస్థితి. కేవీబీపురం మండలం జ్ఞానాం బకండ్రిగలోని తన తండ్రి సంబంధీకుల ఇళ్లకు వెళ్తానని కందస్వామి చెబుతున్నా వారు మాత్రం ససేమిరా అంటుండటం గమనార్హం!