సాక్షి, తిరువణ్ణామలై: తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్‌పై శనివారం మధ్యాహ్నం ముగ్గురు వ్యక్తులు హత్యాయత్నం చేశారు. కలెక్టర్ కందస్వామి విధులు పూర్తి చేసుకుని ఎదురుగా ఉన్న బంగ్లాకు కాలి నడకన బయలుదేరారు. ఆయన వెనుక పీఏ బాబు, జబేదార్ కొద్ది దూరంలో నడిచి వస్తున్నారు.
కలెక్టర్ బంగ్లా ప్రాంగణంలోకి ప్రవేశించగానే వెనుక నుంచి ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆయనపై దాడి చేసేందుకు యత్నించగా కలెక్టర్ అదుపు తప్పి కింద పడ్డారు. గమనించిన కలెక్టర్ పీఏ కేకలు వేయడంతో బంగ్లాలో కాపలా ఉన్న పోలీసులు, సిబ్బంది పరుగున వచ్చి ఆ ముగ్గురినీ పట్టుకున్నారు. వారిని తిరువణ్ణామలై నార్త్ పోలీసులకు అప్పగించారు. వారి వద్ద ఉన్న కత్తి, మిరప పొడి, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
దాడికి పాల్పడిన వారు కాంచీపురం జిల్లా కండిగ గ్రామానికి చెందిన శివ, మణిగండన్, తిరుప్పూరు జిల్లా తంబూరుకు చెందిన సంతోష్‌లుగా గుర్తించారు. వీరు విల్లుపురంలోని బంధువుల ఇంటికి వచ్చారని, తిరువణ్ణామలైలో ఓ బారులో మద్యం సేవిస్తున్నపుడు ఓ వ్యక్తితో ఘర్షణ పడ్డారని, అతన్ని హత్య చేసేందుకు వెంబడించారని, అతని చొక్కా, కలెక్టర్ వేసుకున్న చొక్కా ఒక్కటిగా ఉండటంతో హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
నిందితులను ప్రత్యేకంగా విచారించేందుకు అడిషనల్ ఎస్పీ రవళి ప్రియ, డీఎస్పీ దేవనాథన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించారు. కలెక్టర్‌కు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కలెక్టర్‌పై హత్యాయత్నం
Published Sat, Sep 16 2017 7:07 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
Advertisement