చిల్లర ఇచ్చి .. చుక్కలు చూపించాడు
అధికారి సహనానికి పరీక్ష
రూ.10వేలకు రూ.10ల నాణేలు
చెన్నై: ఓ స్వతంత్య్ర అభ్యర్థి సరదాగా ఒక ఎన్నికల అధికారి పని పట్టాడు. డిపాజిట్టు చెల్లింపులో అధికారి సహనానికి పరీక్షపెట్టాడు. ఇంతకూ సంగతి ఏమిటంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ ఘట్టం శుక్రవారం ఆరంభమైంది. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి డిపాజిట్టుగా రూ.10వేలు చెల్లించాల్సి ఉంది. చెన్నై విల్లివాక్కం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కందస్వామి షెనాయ్‌నగర్‌లోని ఎన్నికల కార్యాలయానికి వెళ్లారు.
రూ.10వేల డిపాజిట్టు మొత్తాన్ని రూ.10 నాణేల రూపంలో తెచ్చారు. ఏడు కిలోలకు పైగా బరువున్న వంద నాణేలను ఎన్నికల అధికారి కుమారవేల్‌కు అందజేశారు. సదరు అధికారి తన సహాయక సిబ్బందికి ఆ నాణేలను సరిచూడాల్సిందిగా కోరారు. లెక్క సరిపోవడంతో నామినేషన్‌ను స్వీకరిం చి అభ్యర్థిని పంపివేశారు.
అభ్యర్థి కందస్వామి మీడియాతో మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకే ఎన్నికల్లో పోటీచేస్తున్నాని, డిపాజిట్టు మొత్తం కోసం స్నేహితులు, బంధువులను ఆశ్రయించగా వారి ద్వారా అందిన నాణేలను అధికారికి సమర్పించానని తెలిపారు. అందండీ నాణేల వెనుక ఉన్న కథ.