Indias 1st Child Liver Transplantee: పాతికేళ్ల క్రితం కాలేయ మార్పిడితో పునర్జన్మ పొందిన బాలుడు ఇప్పుడు అదే వైద్యరంగంలో డాక్టర్ అయ్యాడు. అవయవ మార్పిడి అద్భుత విజయానికి సజీవ సాక్ష్యంగా నిలిచాడు. భారతదేశపు మొట్టమొదటి విజయవంతమైన పీడియాట్రిక్ కాలేయ మార్పిడి గ్రహీత అయిన తమిళనాడుకు చెందిన సంజయ్ కందసామి వైద్య విద్యను అభ్యసించి డాక్టరుగా సొంతూరు కాంచీపురంలో విజయవంతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ 1998లో 20 నెలల చిన్నారిగా ఉన్నప్పుడు కందసామికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడిని నిర్వహించింది. తద్వారా దేశంలోనే మొట్టమొదటి పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్‌ప్లాంటీగా కందసామి నిలిచాడు.
ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేస్తున్న కృషిని దగ్గర నుంచి చూసి తాను కూడా వైద్యుడు కావాలనుకున్నానని కందసామి మీడియా ప్రకటనలో తెలిపారు. డాక్టరుగా తాను కూడా రోగుల ప్రాణాలు కాపాడటంలో భాగం కావాలని, జీవితంలో ఎటువంటి సవాలునైనా అధిగమించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలవాలని భావించినట్లు పేర్కొన్నారు.
దేశంలో మొదటి బాలుడు
తమిళనాడులోని కాంచీపురానికి చెందిన కందసామి బైలరీ అట్రేసియా అనే కాలేయ రుగ్మతతో జన్మించాడు. ఇది లివర్ ఫెయిల్యూర్‌కి దారితీయడంతో కాలేయ మార్పిడి చేయాల్సిన అవసరం వచ్చింది. దీంతో కందసామి తండ్రి కాలేయాన్ని ఇచ్చేందుకు ముందుకువచ్చారు. ఆ తర్వాత న్యూ ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో నిపుణుల బృందం మార్పిడిని విజయవంతంగా నిర్వహించింది. దేశంలో లివర్ ప్లాంటేషన్ చేయించుకున్న మొట్టమొదటి బాలుడు కందసామే.
లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్నవారు దీర్ఘకాలం సాఫీగా జీవించవచ్చు అనేదానికి కందసామి ఒక అద్భుతమైన ఉదాహరణని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో గ్రూప్ మెడికల్ డైరెక్టర్, సీనియర్ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ అనుపమ్ సిబల్ అన్నారు. కందసామి కాలేయ మార్పిడి ఆపరేషన్ తన కెరీర్‌లో గర్వించదగిన క్షణాలలో ఒకటిగా పేర్కొన్నారు మరో డాక్టర్, మేదాంత లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ ఏఎస్ సోయిన్.
కందసామి విజయవంతమైన ఆపరేషన్ తర్వాత అపోలో ఆసుపత్రి వైద్యులు ఇప్పటి వరకు 4,300 కాలేయ మార్పిడి ఆరరేషన్‌లు విజయవంతంగా నిర్వహించారు. ఇందులో 515 మంది పిల్లలు ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment