Liver Transplant
-
కాలేయ మార్పిడితో బతికిన బాలుడు.. డాక్టర్ అయ్యాడు!
Indias 1st Child Liver Transplantee: పాతికేళ్ల క్రితం కాలేయ మార్పిడితో పునర్జన్మ పొందిన బాలుడు ఇప్పుడు అదే వైద్యరంగంలో డాక్టర్ అయ్యాడు. అవయవ మార్పిడి అద్భుత విజయానికి సజీవ సాక్ష్యంగా నిలిచాడు. భారతదేశపు మొట్టమొదటి విజయవంతమైన పీడియాట్రిక్ కాలేయ మార్పిడి గ్రహీత అయిన తమిళనాడుకు చెందిన సంజయ్ కందసామి వైద్య విద్యను అభ్యసించి డాక్టరుగా సొంతూరు కాంచీపురంలో విజయవంతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ 1998లో 20 నెలల చిన్నారిగా ఉన్నప్పుడు కందసామికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడిని నిర్వహించింది. తద్వారా దేశంలోనే మొట్టమొదటి పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్‌ప్లాంటీగా కందసామి నిలిచాడు. ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేస్తున్న కృషిని దగ్గర నుంచి చూసి తాను కూడా వైద్యుడు కావాలనుకున్నానని కందసామి మీడియా ప్రకటనలో తెలిపారు. డాక్టరుగా తాను కూడా రోగుల ప్రాణాలు కాపాడటంలో భాగం కావాలని, జీవితంలో ఎటువంటి సవాలునైనా అధిగమించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలవాలని భావించినట్లు పేర్కొన్నారు. దేశంలో మొదటి బాలుడు తమిళనాడులోని కాంచీపురానికి చెందిన కందసామి బైలరీ అట్రేసియా అనే కాలేయ రుగ్మతతో జన్మించాడు. ఇది లివర్ ఫెయిల్యూర్‌కి దారితీయడంతో కాలేయ మార్పిడి చేయాల్సిన అవసరం వచ్చింది. దీంతో కందసామి తండ్రి కాలేయాన్ని ఇచ్చేందుకు ముందుకువచ్చారు. ఆ తర్వాత న్యూ ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో నిపుణుల బృందం మార్పిడిని విజయవంతంగా నిర్వహించింది. దేశంలో లివర్ ప్లాంటేషన్ చేయించుకున్న మొట్టమొదటి బాలుడు కందసామే. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్నవారు దీర్ఘకాలం సాఫీగా జీవించవచ్చు అనేదానికి కందసామి ఒక అద్భుతమైన ఉదాహరణని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో గ్రూప్ మెడికల్ డైరెక్టర్, సీనియర్ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ అనుపమ్ సిబల్ అన్నారు. కందసామి కాలేయ మార్పిడి ఆపరేషన్ తన కెరీర్లో గర్వించదగిన క్షణాలలో ఒకటిగా పేర్కొన్నారు మరో డాక్టర్, మేదాంత లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ ఏఎస్ సోయిన్. కందసామి విజయవంతమైన ఆపరేషన్ తర్వాత అపోలో ఆసుపత్రి వైద్యులు ఇప్పటి వరకు 4,300 కాలేయ మార్పిడి ఆరరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. ఇందులో 515 మంది పిల్లలు ఉండటం గమనార్హం. -
ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు
ఇటీవల సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు రోగాల బారిన పడటం కలవరపెడుతోంది. ఇప్పటికే పలువురు నటీనటులు ప్రాణాంతక వ్యాధుల బారిన పడి కోలుకున్నారు. తాజాగా మరో నటుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మలయాళ నటుడు బాలా కేరళలోని కొచ్చిలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. మలయాళంలో పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ నటించారు బాలా. బాలా ప్రముఖ తమిళ చిత్రనిర్మాత శివ సోదరుడు. అతను ప్రస్తుతం సూర్య చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆస్పత్రికి వెళ్లిన ప్రముఖులు ఉన్ని ముకుందన్, బాదుషా, వినుషా మోహన్ అతని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాత ఎన్ఎమ్ బాదుషా తన ఫేస్బుక్ ఖాతాలో పంచుకున్నారు. బాలా చివరిసారిగా అనుప్ పందళం దర్శకత్వం వహించిన షెఫీక్కింటే సంతోషం చిత్రంలో నటించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రంలో బాలా అమీర్ అనే పాత్రలో కనిపించారు. అనూప్ పందళం స్వయంగా రాసిన ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. అలాగే కొన్ని తమిళ చిత్రాలలో కూడా పనిచేసిన బాలా.. మలయాళ చిత్ర పరిశ్రమలో బలంగా పునరాగమనం చేయాలని భావిస్తున్నారు. బిలాల్, స్థలం, మై డియర్ మచాన్స్ సినిమాలతో బాలా ఫేమ్ సంపాదించారు. -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, కడప: ఎదుటి వారి కష్టం వినాలే కానీ, వెంటనే స్పందించడంలో తన తర్వాతే ఎవరైనా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు నిరూపించుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచర్లకు చెందిన దివాకర్‌రెడ్డి దంపతుల మూడున్నరేళ్ల కుమారుడు యుగంధర్‌రెడ్డికి లివర్ దెబ్బతింది. చాలా మంది వైద్యుల వద్దకు తిరిగారు. ఈ క్రమంలో బెంగుళూరులోని సెయింట్ జాన్ ఆస్పత్రికి వెళ్లగా.. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని, పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దివాకర్‌రెడ్డి కుటుంబం అంత పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించలేని పరిస్థితి. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని కలిశారు. ఆయన శుక్రవారం వైఎస్సార్ జిల్లా లింగాల మండలం పార్నపల్లెకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు బాధిత కుటుంబాన్ని తీసుకుని వచ్చారు. వీరి కష్టం విన్న సీఎం.. వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. తక్షణమే బాలుడికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజును ఆదేశించారు. దీంతో దివాకర్‌రెడ్డి దంపతులు ఆనంద బాష్పాలతో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: టీడీపీ అంతర్గత సర్వే ఏం చెబుతోంది?.. షాక్‌లో మాజీ మంత్రి దేవినేని ఉమా -
AP: ప్రభుత్వ సాయంతో ముగ్గురికి కాలేయ మార్పిడి
సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందించిన సహకారంతో 48 గంటల్లో ముగ్గురికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. సౌత్ ఆసియన్ లివర్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు చేశారు. డాక్టర్ టామ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆ ముగ్గురికీ ఆర్థిక సాయం అందించడంతో వారి ప్రాణాలను కాపాడగలిగామన్నారు. వారికి కాలేయ మార్పిడి చికిత్స చేయకపోతే ప్రాణాలతో ఉండటం కష్టమేనన్నారు. కాగా, 2016 నుంచి తమ ఆస్పత్రిలో 40 కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించామని డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ అన్నారు. -
8 నెలల చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స
సాక్షి, హైదరాబాద్: నవమాసాలు మోసి.. పురిటి నొప్పులతో తల్లడిల్లి.. కూతురికి జన్మనిచ్చిన ఆ తల్లి.. చావుబతుకుల్లో ఉన్న పేగుబంధానికి తన కాలేయాన్ని దానం చేసి మరోసారి ఆమె పునర్జన్మనిచ్చింది. ఉస్మానియా, నిలోఫర్ వైద్యుల బృందం ఎనిమిది నెలల చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇది ప్రపంచంలోనే నాలుగోది కాగా దేశంలోనే మొదటిదని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్ మధుసూదన్ వెల్లడించారు. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రేమలత అంగన్వాడీ వర్కర్. భర్త నారాయణ కూలీ పనులు చేస్తుంటారు. వీరిది మేనరికపు వివాహం. గతంలో ఈ దంపతులకు జన్మించిన తొలి బిడ్డ కాలేయ సంబంధిత వ్యాధితో మరణించింది. వీరి రెండో కూతురు ఎనిమిది నెలల చిన్నారి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. నిలోఫర్ ఆస్పత్రిలో చూపించగా కాలేయ సంబంధిత వ్యాధి ఉన్నట్లు గుర్తించి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వైద్య పరీక్షలు చేసిన ఉస్మానియా సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మధుసూదన్, చిన్నారికి కాలేయ మార్పిడి అవసరమని నిర్ధారించారు. తల్లి కాలేయం నుంచి కొంత భాగాన్ని సేకరించి గత నెల 17న దాదాపు 18 గంటల పాటు శ్రమించి చిన్నారికి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశారు. సాధారణంగా మేనరికపు పెళ్లి, అనువంశికంగా ఇలాంటి జన్యుపరమైన వ్యాధులు సంక్రమిస్తుంటాయని వైద్యులు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి సహకారంతోనే చిన్నారికి కాలేయ మార్పిడి చేసినట్లు వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్సలో పాల్గొన్న వైద్యుల బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ అభినందించారు. బిడ్డ కోసం కాలేయ దానం చేసిన తల్లి ప్రేమలతను వైద్యులు సన్మానించారు. (క్లిక్: ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ..) -
గంట వ్యవధిలో పాస్‌పోర్ట్!
సాక్షి, హైదరాబాద్: అత్యవసర సేవల కల్పనలో హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం గంట వ్యవధిలోనే పాస్‌పోర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలికకు తప్ప నిసరి కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు ధ్రువీకరించడంతో చికిత్స నిమిత్తం లండన్ వెళ్లాల్సి వచ్చింది. ఈక్రమంలో బాధితురాలి తల్లిదండ్రులు హైదరాబాద్ పాస్‌పోర్ట్ కేంద్రం అధికారులను సంప్రదించడంతో వెంటనే స్పందించిన కార్యా లయ అధికారులు అక్కడికక్కడే దరఖాస్తును ప్రాసెస్ చేసి తదుపరి చర్యలు తీసు కుని కేవలం గంట వ్యవధిలోనే పాస్‌పోర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ కార్యాలయ ఉద్యోగులు విధి నిర్వహణ పట్ల చూపిన అంకితభావం ఫలితం గానే గంటలో పాస్‌పోర్ట్ జారీ చేసి బాధితురాలికి అందించినట్లు చెప్పారు. -
పేద కుటుంబంలో వెలుగు నింపారు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): పుట్టుకతోనే బైలియరీ అట్రేజియా (పిత్తవాహిక మూసుకుపోవడం)తో బాధపడుతున్న 9 నెలల చిన్నారికి అత్యం త ఖరీదైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఉచితంగా చేశారు. సోమవారం కిమ్స్ కాలేయ విభాగపు అధిపతి డాక్టర్ రవిచంద్ సిద్దాచారి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా తిరుమలగిరి గ్రామానికి చెందిన శంకర్, శోభారాణి దంపతులకు పుట్టిన పాపకు నెల రోజులకే కామెర్లు వచ్చాయి. నగరంలోని ఓ ఆస్పత్రిలో పాపకు శస్త్ర చికిత్స చేసినా కామెర్లు తగ్గలేదు. పైగా కాలేయం విఫలమవుతున్న లక్షణాలు కనిపించాయి. దీంతో 2 నెలల క్రితం తల్లిదండ్రులు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి పాపను తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు చిన్నారి బైలియరీ అట్రేజియాతో బాధపడుతోందని గుర్తించారు. దీనికి కాలేయ మార్పిడే పరిష్కారమని సూచించారు. బిడ్డకు కాలేయం ఇచ్చేందుకు తల్లి ముందుకొచ్చినా శస్త్ర చికిత్సకు దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిసి దంపతులిద్దరికీ దిక్కుతోచకుండా పోయింది. వీరి పరిస్థితిని గమనించిన ఆస్పత్రి యాజమాన్యం ఉచితంగా సర్జరీ చేసింది. కోలుకున్నాక చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. -
ఆపదలో భర్త: ప్రేమనే కాదు.. కాలేయాన్ని పంచింది!
సాక్షి, హైదరాబాద్: ఆమె తన భర్తకు ప్రేమనే కాదు.. కాలేయాన్ని కూడా పంచి ఆదర్శంగా నిలిచింది. ఇందుకు లక్డీకాపూల్ గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రి వేదికైంది. ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాలేయ మార్పిడి నిపుణుడు డాక్టర్ రాఘవేంద్రబాబు, సీఈఓ గౌరవ్ఖురానా వివరాలను వెల్లడించారు. ఆపదలో ఉన్న తన భర్తను కాపాడుకునేందుకు ఆ భార్య చేసిన సాహసం నిజంగా అభినందనీయమేనని వైద్యులు అభిప్రాయపడ్డారు. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ముంతాజ్ అదే ప్రాంతానికి చెందిన వెంకటసుబ్బారెడ్డిని 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరి మతాలు వేరు కావడంతో పెద్దలను ఎదిరించాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇరువురు తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు. ఉన్నట్టుండి వారి దాంపత్య జీవితంలోకి అనారోగ్యం రూపంలో పెద్ద ప్రమాదం వచ్చిపడింది. వెంకటసుబ్బారెడ్డికి గుండెపోటు రావడంతో రెండు స్టంట్లు పడ్డాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే కామెర్ల రూపంలో మరో ప్రమాదం ఎదురైంది. దీంతో గతేడాది అక్టోబర్‌లో లక్డీకాపూల్‌లోని గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రికి వచ్చారు. కాలేయం పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించి కాలేయ మార్పిడే పరిష్కారమని సూచించారు. దీంతో కాలేయం దానం చేసేందుకు భార్య ముందుకు రావడంతో మార్చి రెండో వారంలో పది మంది వైద్యులతో కూడిన బృందం విజయవంతంగా చికిత్స చేసింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరినీ డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం వారు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సాధారణంగా ఈ చికిత్సకు రూ.20 లక్షలకుపైగా ఖర్చు అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేని పరిస్థితిలో వారు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేయడంపై భార్యాభర్తలు సంతోషం వ్యక్తం చేశారు. -
కాలేయ క్యాన్సర్... ఇకపై ప్రాణాంతకం కాబోదు!
కాలేయ క్యాన్సర్ వచ్చిందంటే చాలు... రోగికి ఇక రోజులు దగ్గరపడ్డాయనేది సాధారణంగా ప్రజల్లో ఒక అపోహ. కానీ... వ్యాధి ఉన్న భాగాన్ని తొలగించి, కాలేయ మార్పిడిలోలాగే ఆరోగ్యకరమైన భాగాన్ని ఉంచేస్తే అది మళ్లీ మామూలు సైజుకు పెరుగుతుంది. ఈ తరహా శస్త్రచికిత్సతో అనవసరంగా, నిరర్థకంగా పోతున్న ఎన్నో ప్రాణాలు నిలబడతాయంటున్నారు ప్రొఫెసర్ టామ్ చెరియన్. కానీ ఈ వైద్యం ఎందరికో అందడం లేదు. చాలామందికి ఈ శస్త్రచికిత్స గురించి తెలియనే తెలియదు. ఈ అవగాహనను ప్రజలందరికీ పంచి, అమూల్యమైన ప్రాణాలను కాపాడటం కోసమే ఈ ప్రత్యేక కథనం. కాలేయ క్యాన్సర్లతో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కేవలం ఒక్క మనదేశంలోనే ప్రతీఏటా 1.50,000 నుంచి 2.10,000 మంది కాలేయ క్యాన్సర్లతో ప్రాణాలొదులుతున్నారు. కానీ కేవలం అవగాహన లోపంతోనే ఇన్ని ప్రాణాలు పోతున్నాయని, వీటిలో చాలా ప్రాణాలను రక్షించవచ్చునంటున్నారు ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్. ఎంపిక చేసిన 51 మంది రోగులపై నిర్వహించిన శస్త్రచికిత్సతో వారు కొత్త ఊపిరిపోసుకున్నారు. అంతేకాదు... వారిలో కేవలం 10% మందిలో మాత్రమే వ్యాధి మళ్లీ తిరగబెట్టింది. ఈ చికిత్స గనక చాలామందికి అందితే నిరర్ధకంగా పోతున్న ఎన్నో ప్రాణాలు నిలబడతాయంటున్నారాయన. కాలేయ (లివర్) క్యాన్సర్లలో హెపాటోసెల్యులార్ క్యాన్సర్లు మొదలుకొని కొలాంజియోకార్సినోమా వరకు అనేక రకాలున్నాయి. మిగతా క్యాన్సర్లతో పోలిస్తే కాలేయానికి సంబంధించిన క్యాన్సర్ వచ్చి అది అడ్వాన్స్డ్ దశకు చేరిందంటే దాన్ని తుదిమజిలీ (టెర్నినల్ ఇల్నెస్)గానే అందరూ అనుకుంటారు. ఇది చాలావరకు నిజమే అయినా మరీ అంతగానూ నిరాశపడాల్సిందేమీ లేదని భరోసా ఇస్తున్నారు ప్రొఫెసర్ డాక్టర్ టామ్చెరియన్. అధునాతనమైన ఇమేజింగ్ ప్రక్రియలు, సాంకేతికంగా సంక్లిష్టమైన, అత్యంత ఉన్నత ప్రమాణాలతో కూడిన శస్త్రచికిత్సతో అడ్వాన్స్డ్ దశగా పరిగణించే వ్యాధితో బాధపడుతున్న 51 మంది రోగుల ప్రాణాలు కాపాడగలిగారాయన. ఈ రోగుల ప్రత్యేకత ఏమిటి? శస్త్రచికిత్సకు ఎంపిక చేసిన ఈ రోగుల గ్రూపును ఒకసారి పరిశీలిస్తే కాలేయ క్యాన్సర్ రోగుల భవిష్యత్తు ఎంత ఆశాజనకంగా ఉందో తెలుస్తుంది. వీళ్లలో చాలామంది దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు (క్రానిక్ లివర్ డిసీజ్) లేదా సిర్రోసిస్‌తో బాధపడుతున్నవారు. మామూలుగానైతే వీరికి శస్త్రచికిత్స చేయడం అంటే అది సాధ్యం కాదనే భావన ఉంటుంది. ఇక వీరిలో ముగ్గురు నలుగురు 70 ఏళ్లకు పైబడ్డవారు. ఆ వయసులో సిర్రోసిస్ వచ్చిన వారికి శస్త్రచికిత్స చేస్తే వారు తట్టుకోలేరనేది మరొక అపోహ. చాలా పెద్ద పెద్ద సెంటర్లలో సైతం వారికి ఆపరేషన్ సాధ్యం కాదంటూ పెద్ద పెద్ద డాక్టర్లూ తేల్చేశారు. అంటే వాళ్లంతా ఏదో నిర్లక్ష్యంతో ఆ మాట అన్నారని చెప్పలేం. ఎందుకంటే ఈ రంగంలో వచ్చిన అధునాతన ఇమేజింగ్ ప్రక్రియలు, ఆపరేషన్ తాలూకు సునిశితత్వాల గురించి వారికీ తెలియకపోవడమే ఇందుకు కారణం. ఇలాంటి గ్రూపులో అందరికీ శస్త్రచికిత్స అయ్యాక కనీసం 2% నుంచి 3% కేసుల్లోనైనా మరణం సంభవించడం సాధారణంగా జరుగుతుంది. అయితే అదృష్టవశాత్తూ అందరి శస్త్రచికిత్సలూ విజయవంతమయ్యాయి. అందరూ జీవిస్తూ ఉన్నారు. మంచి ప్రమాణాలతో కూడిన ఉన్నతస్థాయి శస్త్రచికిత్స టెక్నిక్, ఆపరేషన్ అయ్యాక తీసుకున్న జాగ్రత్తలు (పోస్ట్ ఆపరేటివ్ కేర్) లాంటి ఎన్నో అంశాలు ఈ గ్రూపుపై నిర్వహించిన శస్త్రచికిత్సలు విజయవంతమయ్యేందుకు తోడ్పడ్డాయి. వీరిలో కొందరైతే కేవలం 10 రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యారు. వారు తమ తమ రోజువారీ పనులు చేసుకుంటున్నారు. సాధారణంగా పరిశోధనాత్మకంగా ఇలా కొత్త శస్త్రచికిత్స ప్రక్రియలను లండన్, న్యూయార్క్ వంటి చోట్ల నిర్వహిస్తుంటారని వింటుంటాం. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే జరిగింది. ఇక ఈ శస్త్రచికిత్సలోని సాంకేతికత పురోగతిని, నైపుణ్యాలను ఎందరో డాక్టర్లకు అందేలా చేసి, ఎన్నో ప్రాణాలు నిరర్థకంగా పోకుండా కాపాడటమే ఇప్పటికి మన ముందున్న సవాలు. ఎలా ఉపయోగపడుతుందీ శస్త్రచికిత్స? కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలో కొంత కాలేయభాగాన్ని మాత్రమే అమర్చితే... అది మళ్లీ పూర్తి కాలేయంగా రూపొందుతున్నదన్న విషయం తెలిసిందే. సరిగ్గా ఇదే తరహా విధానాన్ని కాలేయంలోని క్యాన్సర్ తొలగింపునకూ వర్తింపజేశారు డాక్టర్ టామ్ చెరియన్. తాను ఎంపిక చేసుకున్న 50 మంది రోగులకు ఈ తరహా శస్త్రచికిత్సలు నిర్వహించారు. వీరిలో అందరూ కాలేయ క్యాన్సర్‌నుంచి విముక్తులయ్యారు. ఒక్కటంటే ఒక్క మరణమూ సంభవించలేదు. అయితే ఒక్కమాట. కాలేయ క్యాన్సర్లతో బాధపడుతున్న లక్షలాది రోగులతో పోలిస్తే బతికి బయటపడ్డవారి సంఖ్య చాలా చాలా చిన్నది. కానీ ఇదే భవిష్యత్తుకు ఆశారేఖ అయ్యింది. కాలేయ క్యాన్సర్ అంటే మరణమే అనే జనంలోని ఒక అపోహను తుడిచిపెట్టే సందర్భం వచ్చింది. ఇదే పద్ధతిని అనుస రిస్తే అనవసరంగా కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి. ఇప్పటికి ఇదే మంచి శుభవార్త. శస్త్రచికిత్సే ఎందుకు? కాలేయ గడ్డలు (ట్యూమర్స్) చాలామటుకు కీమోకు గానీ, రేడియోథెరపీకి గానీ ఒకపట్టాన లొంగవు. కాబట్టి ఆ ప్రక్రియలతో వ్యాధి నయం చేయడం సాధ్యం కాదు. ఇక శస్త్రచికిత్స అయితే వాటిని తొలగించడానికి సాధ్యమవుతుంది. అయితే ఇంతగా సంక్లిష్టమైన ఈ శస్త్రచికిత్స నిర్వహించగలిగే నైపుణ్యం ఉన్న శస్త్రచికిత్సకులు పెద్దగా లేకపోవడంతో పాటు, దీని గురించి ప్రజల్లో అవగాహన లేమి, కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అనంతర దుష్పరిణామాలతో నివారించడానికి సాధ్యమయ్యే ఎన్నో మరణాలు అనవసరంగా చోటుచేసుకుంటున్నాయి. ప్రొఫెసర్ టామ్ చెరియన్, నేషనల్ డైరెక్టర్, హెచ్‌పీబీ సర్జరీ అండ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, కేర్ హాస్పిటల్స్ గ్రూప్ అండ్ ప్రొఫెసర్ అండ్ సర్జన్, నిమ్స్, హైదరాబాద్ -
కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత
కొచ్చి: వయానాడ్ ఎంపీ, కేరళ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఐ షానవాస్ కన్నుమూశారు. కొన్ని రోజుల కిందట కాలేయ మార్పిడి చికిత్స కోసం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన షానవాస్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. కేరళకు చెందిన ప్రముఖ న్యాయవాద కుటుంబంలో జన్మించిన షానవాస్ విద్యార్థి నాయకునిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. తొలుత కేరళ విద్యార్థి సంఘంలో పనిచేసిన ఆయన.. యూత్ కాంగ్రెస్‌లో చేరి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు చేపట్టారు. ఆయనకు భార్య జుబ్బదాత్, కుమార్తె అమీనా, కుమారుడు హసీబ్ ఉన్నారు. ఆయన మృతదేహాన్ని ఈ రోజు మధ్యాహ్నంలోపు చెన్నై నుంచి కొచ్చికి తరలించనున్నారు. గురువారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల కేరళ సీఎం పినరాయి విజయన్‌తో పాటు, కేరళ కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు. -
అమ్మా.. నాన్నా.. ఓ వైద్యుడు
సాక్షి, హైదరాబాద్: అమ్మ నవమాసాలూ మోసి జన్మనిస్తే.. తండ్రి తన శరీరంలోని ఓ భాగాన్ని ఇచ్చి పునర్జన్మనిచ్చాడు.. బిడ్డను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు పడుతున్న తపనను చూసిన వైద్యులు తమ వంతు సాయం చేసి ప్రాణం నిలబెట్టారు.. రూ.25 లక్షలు ఖర్చయ్యే కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను ఉచితంగా చేశారు.. నిండు ఆరోగ్యం సమకూరిన చిన్నారి చిరునవ్వునే తమకు బహుమతిగా తీసుకున్నారు.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాంపురం గ్రామానికి చెందిన మాడేపల్లి సతీశ్, మమతల కుమార్తె సౌజన్య (4) గాథ ఇది. ఉస్మానియా ఆస్పత్రి వైద్యుడు మధుసూదన్ ఆధ్వర్యంలో పలువురు వైద్యులు, మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రి, రెండు ఔషధ సంస్థలు ఈ సర్జరీకి సహాయం చేశారు. అరుదైన వ్యాధితో బాధపడుతూ.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాంపురం గ్రామానికి చెందిన దంపతులు మాడేపల్లి సతీశ్, మమత. సతీశ్ వరంగల్‌లోని ఓ సెలూన్లో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. వారి ఒక్కగానొక్క కుమార్తె సౌజన్య (4). ఆమె పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆరోగ్యం సరిగా ఉండకపోవడం, కడుపు ఉబ్బిపోవడంతో చాలా ఆస్పత్రులు తిరిగారు. హైదరాబాద్ నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లారు. అక్కడ వైద్యులు పలు పరీక్షలు చేసి సౌజన్య హెపాటిక్ ఫైబ్రోసిస్ అనే తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతోందని గుర్తించారు. దెబ్బతిన్న కాలేయాన్ని తొలగించి.. ఇతరుల కాలేయం అమర్చాల్సి ఉంటుందని తేల్చారు. ఇందుకు రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. సతీశ్ తమకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని ఆస్పత్రుల్లో చూపితే.. ఈ శస్త్రచికిత్సకు ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారు. దాంతో వారు ఇటీవల పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులను కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారు నిమ్స్‌లో చేర్పించి చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చినా.. తర్వాత పట్టించుకోలేదు. దాంతో సతీశ్, మమత వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. చివరికి ఉస్మానియా ఆస్పత్రిలో ప్రముఖ కాలేయ వైద్యుడు మధుసూదన్‌ను సంప్రదించారు. ఆయన సౌజన్య పరిస్థితిని పరిశీలించి.. కాలేయ మార్పిడి చికిత్స చేసేందుకు అంగీకరించారు. తండ్రి కాలేయం ఆమెకు సరిపడడంతో.. సతీశ్ శరీరం నుంచి కొంత కాలేయాన్ని తీసి సౌజన్యకు అమర్చేందుకు సిద్ధమయ్యారు. తలా ఇంత సాయం చేసి... సతీశ్, మమతలు అప్పటికే తమ బిడ్డ వైద్యం కోసం ఆరేడు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఉన్నారు. ఇప్పుడు శస్త్రచికిత్స కోసం అవసరమైన మందులు, పరికరాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేవని వైద్యుడు మధుసూదన్‌తో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాపను ఎలాగైనా కాపాడాలని భావించిన మధుసూదన్.. తాను కొంత సొమ్మును సర్దారు. పలువురు స్నేహితులు, ఇతర దాతల నుంచి కొంత డబ్బును విరాళంగా సేకరించారు. రెండు ఔషధ కంపెనీలు ఖరీదైన మందులు, సర్జికల్ పరికరాలను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఉస్మానియాలో ‘లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (జీవించి ఉన్న ఓ వ్యక్తి నుంచి కాలేయాన్ని కత్తిరించి.. వెంటనే మరొకరికి అమర్చడానికి)’కు కావాల్సిన మౌలిక వసతులు లేవు. ఆలస్యం చేస్తే పాప ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉండటంతో.. మధుసూదన్ కార్పొరేట్ ఆస్పత్రుల సాయం కోరారు. దీంతో మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రి యాజమాన్యం ముందుకు వచ్చి.. ఆపరేషన్ థియేటర్ సహా ఐసీయూ, ఇన్వెస్టిగేషన్ ఇతర సౌకర్యాలను ఉచితంగా సమకూర్చేందుకు అంగీకరించింది. దీంతో చిన్నారి సౌజన్యను మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ 15 రోజుల క్రితం తండ్రి సతీశ్ నుంచి 130 గ్రాముల కాలేయాన్ని సేకరించి.. సౌజన్యకు విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం తండ్రి, కుమార్తె ఇద్దరూ కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. పలువురు సర్జన్లు, అనెస్థీషియన్లు, ఇతర వైద్య సిబ్బంది పైసా ఆశించకుండా చికిత్సకు తోడ్పాటు అందించారని డాక్టర్ మధుసూదన్ వెల్లడించారు. -
బోసి నవ్వులు పదిలం
సీఎం చొరవతో శ్రీమాన్‌కు విజయవంతంగా కాలేయ మార్పిడి గజ్వేల్: చాలా కాలం తర్వాత ఆ ఇంట బోసి నవ్వులు విరిశాయి. అరుదైన ‘బిలరి అస్టీరియా’ వ్యాధితో బాధపడుతున్న 11 నెలల చిన్నారి శ్రీమాన్ కాలేయ మార్పిడి ఆపరేషన్‌ను పూర్తి చేసుకొని ఇంటికి చేరుకున్నాడు. దేవసాని హనుమాన్‌దాస్, ఉమామహేశ్వరి దంపతుల కుమారుడు శ్రీమాన్‌కు ‘బిలరి అస్టీరియా’వ్యాధి సోకింది. కాలేయ మార్పిడే శరణ్యమని వైద్యులు నిర్ధారించారు. కానీ ఆపరేషన్‌కు రూ.20 నుంచి 30 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిసి, చేతిలో చిల్లిగవ్వ లేక పేద తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 3న ‘సాక్షి’మెయిన్‌లో ప్రచురితమైన కథనం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో చలించిన ఆయన.. తన సహాయనిధి నుంచి రూ. 25 లక్షలు మంజూరు చేశారు. సీఎం చొరవతో ఆపరేషన్ తర్వాత మెరుగైన వైద్యం అందడంతో శ్రీమాన్ కోలుకున్నాడు. గురువారం రాత్రి శ్రీమాన్ ఇంటికి చేరుకోవడంతో సందడి నెలకొన్నది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ సీఎం చొరవ వల్లే తమ కొడుక్కి కొత్త జీవితం వచ్చిందని, జీవితాంతం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని తెలిపారు. -
కిమ్స్‌లో మహారాష్ట్ర యువకుడికి కాలేయ మార్పిడి
హైదరాబాద్: తను కన్నుమూస్తూ మరో ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపాడు ఓ యువకుడు. నెల్లూరుకు చెందిన దినేష్‌రెడ్డి (31) కొంత కాలంగా తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం వారం క్రితం నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చేరాడు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో శుక్రవారం రాత్రి బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అవయవదానానికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో జీవన్‌దాన్‌కు సమాచారమిచ్చారు. జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకుని హైదరాబాద్ కిమ్స్‌లో కాలేయ, గుండె మార్పిడి చికిత్సకు ఎదురు చూస్తున్న ఇద్దరు బాధితులకు సమాచారం ఇచ్చారు. అవయవమార్పిడి చికిత్సకు వారు అంగీకరించడంతో వారికి చికిత్స చేస్తున్న వైద్య బృందం వెంటనే ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరు చేరుకుంది. దాత నుంచి గుండె, కాలేయం, కిడ్నీలను సేకరించింది. రెండు కిడ్నీలను నెల్లూరు కిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులకు అమర్చగా, గుండె, కాలేయాన్ని ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచి ఉదయం 6.30 గంటలకు నెల్లూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 7.30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అటు నుంచి ట్రాఫిక్ పోలీసుల సహాయం (గ్రీన్ చానల్)తో కిమ్స్‌కు తరలించారు. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన 36 ఏళ్ల యువకునికి కాలేయాన్ని విజయవంతంగా అమర్చారు. దాత నుంచి సేకరించిన గుండె స్వీకర్తకు మ్యాచ్ కాలేదు. దాత హైబీపీతో బాధపడుతుండటం, సాధారణంగా 1 సెంటీమీటర్ల మందంలో ఉండాల్సిన గుండె రక్త నాళాలు 1.5 సెంటిమీటర్ల మందంలో ఉండటం వల్ల అవయవమార్పిడికి పనికి రాలేదు. దీంతో గుండె మార్పిడి చికిత్సను విరమించుకున్నట్లు కిమ్స్ సీఈవో భాస్కర్‌రావు వెల్లడించారు. -
ఉస్మానియాలో కాలేయ మార్పిడి
యువతికి పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు సాక్షి, హైదరాబాద్ : ఓ నిరుపేద యువతికి ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసి పునర్జన్మను ప్రసాదించారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో ఆదివారం డిశ్చార్జ్ చేశారు. కుషాయిగూడకు చెందిన కావ్య(20) నగరంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. తరచూ కామెర్లు, పొట్ట ఉబ్బడం వంటి సమస్యలతో బాధపడుతోంది. చికిత్స కోసం ఇటీవల ఉస్మానియా ఆస్పత్రిలోని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ మధుసూదన్‌ను ఆశ్రయించింది. శరీరంలో కాపర్ శాతం ఎక్కువ ఉండటం వల్లే కాలేయ పనితీరు దెబ్బతిన్నట్లు ఆయన గుర్తించారు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్స ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. ఆ మేరకు జీవన్‌దాన్ నెట్వర్క్, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స అందించారు. కాగా, గొల్లపల్లి వద్ద ఈ నెల 4న జరిగిన ప్రమాదంలో గాయపడి ఉస్మానియాలో చేరిన ఎస్.శ్రీనివాస్(40) బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరుకున్నట్లు వైద్యు ధ్రువీకరించారు. జీవన్‌దాన్ సిబ్బంది సూచన మేరకు శ్రీనివాస్ అవయవాలను దానం చేసేందుకు ఆయన భార్య ఈశ్వరమ్మ అంగీకరించారు. చావు బతుకుల మధ్యకొట్టుమిట్టాడుతున్న కావ్యకు శ్రీనివాస్ కాలేయాన్ని అమర్చాలని వైద్యులు నిర్ణయించారు. మధుసూదన్ నేతృత్వంలోని వైద్యుల బృందం రఘురామ్, కోదండపాణి, రవిమోహన్, ప్రసూన, పాండు, మాధవి, బేబీరాణి ఈ నెల 5న సుమారు పది గంటల పాటు శ్రమించి ఈ కాలేయాన్ని అమర్చారు. ఇదిలావుంటే... బాధితురాలి సోదరి గౌతమి(14) కూడా ఇదే సమస్యతో బాధపడుతోంది. ఆమెకు కూడా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని డాక్టర్ మధుసూదన్ తెలిపారు. -
‘చిట్టితల్లి’కి కాలేయ మార్పిడి
జ్ఞానసాయికి చెన్నై గ్లోబల్ హెల్త్ సిటీలో శస్త్ర చికిత్స తండ్రి నుంచి కాలేయం సేకరించిన వైద్యులు సాక్షి, చెన్నై/ములకల చెరువు: పుట్టుకతోనే కాలేయ వ్యాధితో బాధ పడుతున్న తమ బిడ్డ బాధ చూడలేక..ఆపరేషన్ చేయించే స్తోమత లేక దిక్కు తోచని స్థితిలో కారుణ్య మరణానికి అనుమతించాలంటూ కోర్టును ఆశ్రయించిన ఆ తల్లిదండ్రుల మొర ప్రభుత్వాన్ని కదిలించింది. చిట్టితల్లి జ్ఞానసాయికి (9 నెలలు) చెన్నై గ్లోబల్ హెల్త్ సిటీలో శనివారం కాలేయ మార్పిడి చికిత్స జరిగింది. డాక్టర్ మహ్మద్ రేల నేతృత్వంలో 12 మంది వైద్యులబృందం ఈ శస్త్ర చికిత్స నిర్వహించింది. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం బత్తలాపురం రైల్వేస్టేషన్‌కు చెందిన రమణప్ప, సరస్వతి దంపతుల తొమ్మిది నెలల కుమార్తె జ్ఞానసాయి కాలేయ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. తమ చిట్టితల్లికి మెరుగైన వైద్యం అందించేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో కారుణ్య మరణానికి అనుమతించాలని రమణప్ప కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం మీడియా దృష్టికి రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు తగిన చర్యలు తీసుకోవాలంటూ గ్లోబల్ ఆస్పత్రి చైర్మన్ రవీంద్రనాథ్‌కు సూచించింది. దీంతో జ్ఞానసాయిని జూన్ 27న చెన్నైలోని గ్లోబల్ హెల్త్ సిటీకి తీసుకొచ్చారు. డాక్టర్ రేల నేతృత్వంలోని వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించి కాలేయ మార్పిడి అనివార్యమని తేల్చింది. శనివారం ఉదయం శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు తండ్రి రమణప్ప కాలేయంలో కొంత భాగాన్ని సేకరించి జ్ఞానసాయికి అమర్చారు. అవయవ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగియడంతో సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో జ్ఞానసాయిని ఐసీయూకు మార్చారు. శస్త్ర చికిత్సలు ఇద్దరికి చక్కగా జరిగాయని, ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. 24 గంటల తరువాత పూర్తి వివరాలను ప్రకటిస్తామని గ్లోబల్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
వచ్చే నెలలో జ్ఞానసాయి లివర్ మార్పిడి
చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం బత్తలాపురానికి చెందిన చిన్నారి జ్ఞానసాయి కాలేయ మార్పిడికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొమ్మిది నెలల ఈ బాలిక కోసం ఆమె తండ్రి రమణప్ప తన కాలేయ దానానికి అనుమతి కోరుతూ బుధవారం తంబళ్లపల్లె కోర్టులో దరఖాస్తు చేశారు. ఇందుకు కోర్టు అఫిడివిట్ మంజూరు చేసింది. జ్ఞానసాయి ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రం చెన్నై గ్లోబల్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. తండ్రి రమణప్ప కాలేయం చిన్నారికి సరిపోయినట్లు అక్కడ డాక్టర్లు పరీక్షలు నిర్వహించి తెలిపినట్లు సమాచారం. ఇందులో భాగంగా 2011 శస్త్ర చికిత్స సవరణ చట్టం ప్రకారం ఒక వ్యక్తి అవయవాలు మరో వ్యక్తికి దానం చేయడం కోసం స్థానికంగా ఉండే కోర్టులో అనుమతి పొందాలి. శస్త్ర చికిత్స కోసం చెన్నై గ్లోబల్ హాస్పిటల్ యజమాన్యం కోర్టులో అనుమతి పొందడం కోసం కొన్ని పత్రాలను చిన్నారి కుటుంబ సభ్యులకు ఇచ్చారు. పత్రాలతో బుధవారం చిన్నారి కుటుంబ సభ్యులు తంబళ్లపల్లె కోర్టులో అఫిడవిట్ మంజూరు కోసం కోర్టుకు విన్నవించారు. జడ్జి వాసుదేవ్ అనుమతి ఇస్తూ అఫిడవిట్‌ను మంజూరు చేశారు. ఆగస్టు మొదటి వారంలో శస్త్ర చికిత్స... చిన్నారి జ్ఞానసాయి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స ఆగస్టు మొదటి వారంలో నిర్వహించనున్నట్లు గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు తెలిపినట్లు చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసి చిన్నారి తల్లీదండ్రులతో సమావేశం నిర్వహించనున్నారు. కమిటీ శస్త్ర చికిత్స తేదీని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతుందన్నారు. -
జ్ఞానసాయికి ఉచితంగా చికిత్స
- కాలేయ మార్పిడికి ముందుకొచ్చిన గ్లోబల్ ఆస్పత్రి - ప్రభుత్వమే ఖర్చును భరిస్తుందన్న సీఎం సాక్షి, హైదరాబాద్/అమరావతి: పుట్టుకతోనే కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న చిన్నారి జ్ఞానసాయికి చికిత్స చేసేందుకు గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు ముందుకొచ్చారు. పైసా ఖర్చు లేకుండానే కాలేయ మార్పిడి చేయనున్నట్లు ప్రకటించారు. చిత్తూరుజిల్లా ములకలచెరువు మండలం బత్తలాపురానికి చెందిన రమణప్ప, సరస్వతి దంపతుల ఎనిమిది నెలల చిన్నారి జ్ఞానసాయి పుట్టుకతోనే అరుదైన కాలేయ సంబంధ వ్యాధి(బిలియరి అట్రీషియా)తో బాధపడుతోంది. దీనిపై ‘సాక్షి’ రాసిన కథనానికిగ్లోబల్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ రవీంద్రనాథ్సహా ప్రముఖ కాలేయ మార్పిడి నిపుణుడు డాక్టర్ మహ్మద్రేలా స్పందించారు. పైసా ఖర్చులేకుండా చెన్నై గ్లోబల్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్ గోబల్ ఆస్పత్రిలో పాప ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. వైద్య ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందన్న సీఎం : ఇదిలా ఉండగా జ్ఞానసాయి వైద్యానికయ్యే ఖర్చులన్నింటినీ భరిస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. జ్ఞానసాయిపై వచ్చిన కథనాన్ని ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందిస్తూ..చికిత్స అందించడానికి అవసరమైన నగదును సీఎం సహాయనిధి నుంచి మంజూరుచేయాలని అధికారుల్ని ఆదేశించారు. గ్లోబల్ హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి చికిత్సకు ఏర్పాట్లు చేయాలని కోరారు. ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన జ్ఞానసాయి తల్లిదండ్రులు తంబళ్లపల్లె: చిన్నారి జ్ఞానసాయికి ‘సాక్షి’ చేయూతనిచ్చింది. ఆమె దీనస్థితి గురించి, సాక్షి పలు వార్తా కథనాలు రాసింది. దీనికి గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యం, సీఎం స్పందించడంలో పాటు స్పందించిన దాతలు విరాళాలను చెక్కుల రూపంలో రూ.16 వేలు, రూ.పదివేలు చొప్పున ఆర్థిక సాయాన్ని జ్ఞానసాయి తండ్రి రమణప్పకు అందజేశారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’కి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
నిమ్స్‌లో గుండె, కాలేయ మార్పిడి టవర్స్
- నిమ్స్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవంలో మంత్రి లక్ష్మారెడ్డి - రూ.36 కోట్లతో మరిన్ని వైద్య పరికరాల కొనుగోలు - స్టెమ్‌సెల్ రీసెర్చ్ సెంటర్, అధునాతన డయాగ్నొస్టిక్స్ ల్యాబ్ సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్)లో గుండె, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సల కోసం మరో రెండు అధునాతన టవర్స్ నిర్మిస్తామని వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. నిమ్స్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అంతకు ముందు నిమ్స్‌లో అందుతున్న వైద్య సదుపాయాలు... రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఏఎంసీ, సూపర్‌స్పెషాలిటీ, ఎమర్జెన్సీ మిలీనియం బ్లాక్, పాత భవనం ఇలా అన్ని వార్డుల్లోనూ తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆస్పత్రి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల చరిత్రలో దేశంలోనే తొలి స్టెమ్‌సెల్ థెరపీ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ సెంటర్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మిలీనియం బ్లాక్‌లో అడ్వాన్స్డ్ డయాగ్నొస్టిక్ ల్యాబ్‌ను ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే రూ.27 కోట్లతో వివిధ వైద్య పరికరాల కొనుగోలుకు ఆదేశాలు జారీ చేశామని, మరో రూ.36 కోట్ల విలువ చేసే వైద్య పరికరాల కొనుగోలుకు త్వ రలోనే టెండర్లు పిలవనున్నామన్నారు. బీబీనగర్ నిమ్స్‌లో ఇప్పటికే ఓపీ సేవలు ప్రారంభించామని, త్వరలోనే ఇన్ పేషెంట్ సర్వీసులను కూడా అందజేస్తామని అన్నారు. వచ్చే ఏడాది నుంచి బీబీనగర్ నిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించనున్నట్లు తెలి పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుండె, కాలేయ, మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తూ ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కల్పిస్తున్నామన్నారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఇప్పటి వరకు కేడావర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లు మాత్రమే జరుగుతున్నాయని, ఇకపై లైవ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లు కూడా చేయనున్నట్లు పేర్కొన్నారు. మంత్రి వెంట వైద్య, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి రాజేశ్ తివారి, నిమ్స్ డెరైక్టర్ మనోహర్‌తో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు. ఇదిలా ఉంటే వైద్యసేవల్లో జరుగుతున్న జాప్యం, ఆస్పత్రిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు కొంత మంది ఆరోగ్యశ్రీ రోగులు యత్నించగా సెక్యురిటీ సిబ్బంది వారిని నిలువరించారు. అధికారుల తీరుపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేయడం కొసమెరుపు. -
బ్రెయిన్‌డెడ్ మహిళ అవయవదానం
విశాఖపట్నం: బ్రెయిన్‌డెడ్ అయిన మహిళ అవయవాలు దానం చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. వివరాలు.. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలుకు చెందిన వారణాసి సూర్యలక్ష్మి (52) వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తూ బైక్‌పై నుంచి కిందపడింది. దీంతో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. దాంతో ఆమెను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఆమెకు బ్రెయిన్‌డెడ్ అయిందని వైద్యులు గుర్తించారు. దీంతో ఆమె అవయవాలు దానం చేయాలని సూర్యలక్ష్మీ భర్త రమణమూర్తి నిర్ణయించారు. ఆ విషయాన్ని ఆయన వైద్యులకు వెల్లడించారు. అయితే హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి కాలేయం అవసరమైంది. ఈ విషయాన్ని యశోదా వైద్యులు కేజీహెచ్ ఆసుపత్రి వైద్యులకు తెలిపారు. దాంతో స్థానిక మణిపాల్ ఆస్పత్రి వైద్యులు ఆమె అవయవాలను సేకరించి హైదరాబాద్‌కు కాలేయాన్ని ఇండిగో ఫ్లైట్‌లో తరలించారు. -
కిమ్స్‌లో కాలేయ మార్పిడి
మంగళగిరి నుంచి శంషాబాద్‌కు విమానంలో తరలింపు పోలీసుల సహకారంతో రోడ్డు బ్లాక్ చేసి కిమ్స్‌కు చేరిక హైదరాబాద్: కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి నగరానికి చెందిన కిమ్స్ వైద్యబృందం విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసింది. కాలేయ మార్పిడి 6 నుంచి 8 గంటల్లోపే చేయాల్సి ఉన్నందున కిమ్స్ వైద్యులు అవయవదాత నుంచి సేకరించిన కాలేయాన్ని విజయవాడ నుంచి విమానంలో తీసుకొచ్చి.. నగరంలో పోలీసుల సాయంతో రోడ్లపై ట్రాఫిక్ ఆపివేసి ఆసుపత్రికి తెచ్చి సకాలంలో ఆపరేషన్ నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడి విజయవాడ ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ధనమ్మ(54)ను వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. జీవన్‌దాన్ సిబ్బంది అవయవదానంపై బంధువులకు అవగాహన కల్పించడంతో వారు అందుకు అంగీకరించారు. వెంటనే కిమ్స్ వైద్యులు విజయవాడ చేరుకుని మధ్యాహ్నం 2.30 గంటలకు దాత శరీరం నుంచి కాలేయాన్ని సేకరించి ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచారు. ఆలస్యం చేయకుండా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సాయంత్రం 5.30కు బయలు దేరిన విమానం 6.20కి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో గ్రీన్‌చానల్ ద్వారా రాత్రి 7.10 గంటలకు కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే కిమ్స్‌లో చికిత్స పొందుతున్న 43 ఏళ్ల వ్యక్తికి ఆపరేషన్ థియేటర్లో ఛాతీ భాగాన్ని తెరిచి ఉంచారు. డాక్టర్ ఎంబీవీ ప్రసాద్ నేతృత్వంలోని వైద్యబృందం బాధితునికి కాలేయాన్ని విజయవంతంగా అమర్చింది.