
ఉస్మానియాలో కాలేయ మార్పిడి
యువతికి పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు
సాక్షి, హైదరాబాద్ : ఓ నిరుపేద యువతికి ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసి పునర్జన్మను ప్రసాదించారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో ఆదివారం డిశ్చార్జ్ చేశారు. కుషాయిగూడకు చెందిన కావ్య(20) నగరంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. తరచూ కామెర్లు, పొట్ట ఉబ్బడం వంటి సమస్యలతో బాధపడుతోంది. చికిత్స కోసం ఇటీవల ఉస్మానియా ఆస్పత్రిలోని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ మధుసూదన్‌ను ఆశ్రయించింది. శరీరంలో కాపర్ శాతం ఎక్కువ ఉండటం వల్లే కాలేయ పనితీరు దెబ్బతిన్నట్లు ఆయన గుర్తించారు.
కాలేయ మార్పిడి శస్త్రచికిత్స ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. ఆ మేరకు జీవన్‌దాన్ నెట్‌వర్క్, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స అందించారు. కాగా, గొల్లపల్లి వద్ద ఈ నెల 4న జరిగిన ప్రమాదంలో గాయపడి ఉస్మానియాలో చేరిన ఎస్.శ్రీనివాస్(40) బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరుకున్నట్లు వైద్యు ధ్రువీకరించారు. జీవన్‌దాన్ సిబ్బంది సూచన మేరకు శ్రీనివాస్ అవయవాలను దానం చేసేందుకు ఆయన భార్య ఈశ్వరమ్మ అంగీకరించారు. చావు బతుకుల మధ్యకొట్టుమిట్టాడుతున్న కావ్యకు శ్రీనివాస్ కాలేయాన్ని అమర్చాలని వైద్యులు నిర్ణయించారు. మధుసూదన్ నేతృత్వంలోని వైద్యుల బృందం రఘురామ్, కోదండపాణి, రవిమోహన్, ప్రసూన, పాండు, మాధవి, బేబీరాణి ఈ నెల 5న సుమారు పది గంటల పాటు శ్రమించి ఈ కాలేయాన్ని అమర్చారు. ఇదిలావుంటే... బాధితురాలి సోదరి గౌతమి(14) కూడా ఇదే సమస్యతో బాధపడుతోంది. ఆమెకు కూడా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని డాక్టర్ మధుసూదన్ తెలిపారు.