బయటికి తీసిన సేఫ్టీ పిన్ చికిత్స అనంతరం బాలుడు
అఫ్జల్‌గంజ్: ప్రమాదవశాత్తు సేప్టీ పిన్‌మింగిన బాలుడికి శస్త్రచికిత్స చేసి తొలగించిన సంఘటన ఉస్మానియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..కొండన్నగూడ గ్రామానికి చెందిన చంద్రశేఖర్, అనూష దంపతుల కుమారుడు (8 నెలలు) ఆదివారం సాయంత్రం ఆడుకుంటూ సేఫ్టీ పిన్ మింగాడు. దీనిని గుర్తించిన అతడి తల్లిదండ్రులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ఎక్స్‌రే తీసిన వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు.
దీంతో వారు బాలుడిని నీలోఫర్ ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా వైద్యులు ఉస్మానియా ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి రెఫర్ చేశారు. సోమవారం మధ్యాహ్నం ఉస్మానియా ఎమర్జెన్సీ విభాగానికి రాగా, గ్యాస్ట్రో ఎంటరాలజి విభాగాధిపతి డాక్టర్ రమేష్ నేతృత్వంలో 15 నిమిషాల్లోనే ఓపెన్ ఎడ్జ్‌డ్ సేప్టీ పిన్‌ను బయటికి తీశారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ... ఎండోస్కోపి ద్వారా ఫారిన్ బాడీ స్కాన్‌చేసి తీయడం పెద్దవారిలో సహజమే అయినా 8 నెలల పసికందుకు ఎండోస్కోపి ద్వారా ఓపెన్ ఎడ్జ్‌డ్ సేప్టీపిన్ తీసివేయడం క్లిష్టమైన, అరుదైన విషయమన్నారు. చికిత్స నిర్వహించిన డాక్టర్ రమేష్, సహకరించిన ఇతర డాక్టర్లను ఆయన అభినందించారు. తమ బిడ్డను కాపాడిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment