కాలేయ క్యాన్సర్ వచ్చిందంటే చాలు... రోగికి ఇక రోజులు దగ్గరపడ్డాయనేది సాధారణంగా ప్రజల్లో ఒక అపోహ. కానీ... వ్యాధి ఉన్న భాగాన్ని తొలగించి, కాలేయ మార్పిడిలోలాగే ఆరోగ్యకరమైన భాగాన్ని ఉంచేస్తే అది మళ్లీ మామూలు సైజుకు పెరుగుతుంది. ఈ తరహా శస్త్రచికిత్సతో అనవసరంగా, నిరర్థకంగా పోతున్న ఎన్నో ప్రాణాలు నిలబడతాయంటున్నారు ప్రొఫెసర్ టామ్ చెరియన్. కానీ ఈ వైద్యం ఎందరికో అందడం లేదు. చాలామందికి ఈ శస్త్రచికిత్స గురించి తెలియనే తెలియదు. ఈ అవగాహనను ప్రజలందరికీ పంచి, అమూల్యమైన ప్రాణాలను కాపాడటం కోసమే ఈ ప్రత్యేక కథనం.
కాలేయ క్యాన్సర్లతో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కేవలం ఒక్క మనదేశంలోనే ప్రతీఏటా 1.50,000 నుంచి 2.10,000 మంది కాలేయ క్యాన్సర్లతో ప్రాణాలొదులుతున్నారు. కానీ కేవలం అవగాహన లోపంతోనే ఇన్ని ప్రాణాలు పోతున్నాయని, వీటిలో చాలా ప్రాణాలను రక్షించవచ్చునంటున్నారు ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్. ఎంపిక చేసిన 51 మంది రోగులపై నిర్వహించిన శస్త్రచికిత్సతో వారు కొత్త ఊపిరిపోసుకున్నారు. అంతేకాదు... వారిలో కేవలం 10% మందిలో మాత్రమే వ్యాధి మళ్లీ తిరగబెట్టింది. ఈ చికిత్స గనక చాలామందికి అందితే నిరర్ధకంగా పోతున్న ఎన్నో ప్రాణాలు నిలబడతాయంటున్నారాయన.
కాలేయ (లివర్) క్యాన్సర్లలో హెపాటోసెల్యులార్ క్యాన్సర్లు మొదలుకొని కొలాంజియోకార్సినోమా వరకు అనేక రకాలున్నాయి. మిగతా క్యాన్సర్లతో పోలిస్తే కాలేయానికి సంబంధించిన క్యాన్సర్ వచ్చి అది అడ్వాన్స్‌డ్ దశకు చేరిందంటే దాన్ని తుదిమజిలీ (టెర్నినల్ ఇల్‌నెస్)గానే అందరూ అనుకుంటారు. ఇది చాలావరకు నిజమే అయినా మరీ అంతగానూ నిరాశపడాల్సిందేమీ లేదని భరోసా ఇస్తున్నారు ప్రొఫెసర్ డాక్టర్ టామ్‌చెరియన్. అధునాతనమైన ఇమేజింగ్ ప్రక్రియలు, సాంకేతికంగా సంక్లిష్టమైన, అత్యంత ఉన్నత ప్రమాణాలతో కూడిన శస్త్రచికిత్సతో అడ్వాన్స్‌డ్ దశగా పరిగణించే వ్యాధితో బాధపడుతున్న 51 మంది రోగుల ప్రాణాలు కాపాడగలిగారాయన.
ఈ రోగుల ప్రత్యేకత ఏమిటి?
శస్త్రచికిత్సకు ఎంపిక చేసిన ఈ రోగుల గ్రూపును ఒకసారి పరిశీలిస్తే కాలేయ క్యాన్సర్ రోగుల భవిష్యత్తు ఎంత ఆశాజనకంగా ఉందో తెలుస్తుంది. వీళ్లలో చాలామంది దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు (క్రానిక్ లివర్ డిసీజ్) లేదా సిర్రోసిస్‌తో బాధపడుతున్నవారు. మామూలుగానైతే వీరికి శస్త్రచికిత్స చేయడం అంటే అది సాధ్యం కాదనే భావన ఉంటుంది. ఇక వీరిలో ముగ్గురు నలుగురు 70 ఏళ్లకు పైబడ్డవారు. ఆ వయసులో సిర్రోసిస్ వచ్చిన వారికి శస్త్రచికిత్స చేస్తే వారు తట్టుకోలేరనేది మరొక అపోహ. చాలా పెద్ద పెద్ద సెంటర్లలో సైతం వారికి ఆపరేషన్ సాధ్యం కాదంటూ పెద్ద పెద్ద డాక్టర్లూ తేల్చేశారు. అంటే వాళ్లంతా ఏదో నిర్లక్ష్యంతో ఆ మాట అన్నారని చెప్పలేం. ఎందుకంటే ఈ రంగంలో వచ్చిన అధునాతన ఇమేజింగ్ ప్రక్రియలు, ఆపరేషన్ తాలూకు సునిశితత్వాల గురించి వారికీ తెలియకపోవడమే ఇందుకు కారణం. ఇలాంటి గ్రూపులో అందరికీ శస్త్రచికిత్స అయ్యాక కనీసం 2% నుంచి 3% కేసుల్లోనైనా మరణం సంభవించడం సాధారణంగా జరుగుతుంది. అయితే అదృష్టవశాత్తూ అందరి శస్త్రచికిత్సలూ విజయవంతమయ్యాయి. అందరూ జీవిస్తూ ఉన్నారు. మంచి ప్రమాణాలతో కూడిన ఉన్నతస్థాయి శస్త్రచికిత్స టెక్నిక్, ఆపరేషన్ అయ్యాక తీసుకున్న జాగ్రత్తలు (పోస్ట్ ఆపరేటివ్ కేర్) లాంటి ఎన్నో అంశాలు ఈ గ్రూపుపై నిర్వహించిన శస్త్రచికిత్సలు విజయవంతమయ్యేందుకు తోడ్పడ్డాయి. వీరిలో కొందరైతే కేవలం 10 రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యారు. వారు తమ తమ రోజువారీ పనులు చేసుకుంటున్నారు. సాధారణంగా పరిశోధనాత్మకంగా ఇలా కొత్త శస్త్రచికిత్స ప్రక్రియలను లండన్, న్యూయార్క్ వంటి చోట్ల నిర్వహిస్తుంటారని వింటుంటాం. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే జరిగింది. ఇక ఈ శస్త్రచికిత్సలోని సాంకేతికత పురోగతిని, నైపుణ్యాలను ఎందరో డాక్టర్లకు అందేలా చేసి, ఎన్నో ప్రాణాలు నిరర్థకంగా పోకుండా కాపాడటమే ఇప్పటికి మన ముందున్న సవాలు.
ఎలా ఉపయోగపడుతుందీ శస్త్రచికిత్స?
కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలో కొంత కాలేయభాగాన్ని మాత్రమే అమర్చితే... అది మళ్లీ పూర్తి కాలేయంగా రూపొందుతున్నదన్న విషయం తెలిసిందే. సరిగ్గా ఇదే తరహా విధానాన్ని కాలేయంలోని క్యాన్సర్ తొలగింపునకూ వర్తింపజేశారు డాక్టర్ టామ్ చెరియన్. తాను ఎంపిక చేసుకున్న 50 మంది రోగులకు ఈ తరహా శస్త్రచికిత్సలు నిర్వహించారు. వీరిలో అందరూ కాలేయ క్యాన్సర్‌నుంచి విముక్తులయ్యారు. ఒక్కటంటే ఒక్క మరణమూ సంభవించలేదు. అయితే ఒక్కమాట. కాలేయ క్యాన్సర్లతో బాధపడుతున్న లక్షలాది రోగులతో పోలిస్తే బతికి బయటపడ్డవారి సంఖ్య చాలా చాలా చిన్నది. కానీ ఇదే భవిష్యత్తుకు ఆశారేఖ అయ్యింది. కాలేయ క్యాన్సర్ అంటే మరణమే అనే జనంలోని ఒక అపోహను తుడిచిపెట్టే సందర్భం వచ్చింది. ఇదే పద్ధతిని అనుస
రిస్తే అనవసరంగా కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి. ఇప్పటికి ఇదే మంచి శుభవార్త.
శస్త్రచికిత్సే ఎందుకు?
కాలేయ గడ్డలు (ట్యూమర్స్) చాలామటుకు కీమోకు గానీ, రేడియోథెరపీకి గానీ ఒకపట్టాన లొంగవు. కాబట్టి ఆ ప్రక్రియలతో వ్యాధి నయం చేయడం సాధ్యం కాదు. ఇక శస్త్రచికిత్స అయితే వాటిని తొలగించడానికి సాధ్యమవుతుంది. అయితే ఇంతగా సంక్లిష్టమైన ఈ శస్త్రచికిత్స నిర్వహించగలిగే నైపుణ్యం ఉన్న శస్త్రచికిత్సకులు పెద్దగా లేకపోవడంతో పాటు, దీని గురించి ప్రజల్లో అవగాహన లేమి, కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అనంతర దుష్పరిణామాలతో నివారించడానికి సాధ్యమయ్యే ఎన్నో మరణాలు అనవసరంగా చోటుచేసుకుంటున్నాయి.
ప్రొఫెసర్ టామ్ చెరియన్,
నేషనల్ డైరెక్టర్, హెచ్‌పీబీ సర్జరీ అండ్
లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, కేర్ హాస్పిటల్స్ గ్రూప్ అండ్
ప్రొఫెసర్ అండ్ సర్జన్, నిమ్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment