భర్త వెంకటసుబ్బారెడ్డితో భార్య ముంతాజ్
సాక్షి, హైదరాబాద్: ఆమె తన భర్తకు ప్రేమనే కాదు.. కాలేయాన్ని కూడా పంచి ఆదర్శంగా నిలిచింది. ఇందుకు లక్డీకాపూల్ గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రి వేదికైంది. ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాలేయ మార్పిడి నిపుణుడు డాక్టర్ రాఘవేంద్రబాబు, సీఈఓ గౌరవ్‌ఖురానా వివరాలను వెల్లడించారు. ఆపదలో ఉన్న తన భర్తను కాపాడుకునేందుకు ఆ భార్య చేసిన సాహసం నిజంగా అభినందనీయమేనని వైద్యులు అభిప్రాయపడ్డారు. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ముంతాజ్ అదే ప్రాంతానికి చెందిన వెంకటసుబ్బారెడ్డిని 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఇద్దరి మతాలు వేరు కావడంతో పెద్దలను ఎదిరించాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇరువురు తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు. ఉన్నట్టుండి వారి దాంపత్య జీవితంలోకి అనారోగ్యం రూపంలో పెద్ద ప్రమాదం వచ్చిపడింది. వెంకటసుబ్బారెడ్డికి గుండెపోటు రావడంతో రెండు స్టంట్లు పడ్డాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే కామెర్ల రూపంలో మరో ప్రమాదం ఎదురైంది. దీంతో గతేడాది అక్టోబర్‌లో లక్డీకాపూల్‌లోని గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రికి వచ్చారు. కాలేయం పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించి కాలేయ మార్పిడే పరిష్కారమని సూచించారు.
దీంతో కాలేయం దానం చేసేందుకు భార్య ముందుకు రావడంతో మార్చి రెండో వారంలో పది మంది వైద్యులతో కూడిన బృందం విజయవంతంగా చికిత్స చేసింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరినీ డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం వారు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సాధారణంగా ఈ చికిత్సకు రూ.20 లక్షలకుపైగా ఖర్చు అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేని పరిస్థితిలో వారు సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేయడంపై భార్యాభర్తలు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment