![A Wife Files Complaint On Her Husband Circle Inspector In Nalgonda](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/photo3.jpg.webp?itok=dEnIxbZB)
శాలిగౌరారం: అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడంతోపాటూ మరో మహిళను రెండో వివాహం చేసుకుని తనను వేధిస్తున్నాడని ఓ మహిళ ఆబిడ్స్ సీఐ నర్సింహపై ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం బండమీదిగూడెంకు చెందిన కప్పల సోమలింగయ్య–అంజమ్మ కుమార్తె సంధ్యకు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామానికి చెందిన కుంభం నర్సింహకు 2012 లో వివాహం జరిగింది. నర్సింహ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆబిడ్స్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
వివాహ సమయంలో కట్నకానుకలు మొత్తం అప్పజెప్పారు. పెళ్లయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడని సంధ్య ఆవేదన వ్యక్తం చేసింది. తట్టుకోలేక 2024 జూన్‌లో తల్లిగారింటికి వచ్చి తన భర్తపై 2024 డిసెంబర్18న నల్లగొండ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానంది. అక్కడ చర్యలు తీసుకోకపోవడంతో 2024 డిసెంబర్ 24న శాలిగౌరారంలో ఫిర్యాదు చేశానంది.
ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో గల తన కుమార్తెను చూసేందుకని ఈ నెల 4న పాఠశాలకు వెళ్లి తన కూతురిని తల్లిగారింటికి తీసుకుని వచ్చానని తెలిపింది. దీంతో తన కుమార్తె కిడ్నాప్‌నకు గురైందని నర్సింహ సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సరూర్‌నగర్ ఎస్‌ఐ మారయ్య, ఏఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి, మహిళా హెడ్‌కానిస్టేబుళ్లు శుక్రవారం బండమీదిగూడెం వచ్చి తనను విచారించి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారని సంధ్య తెలిపింది.
చదవండి: డబ్బులు ఇచ్చి.. భర్త కాళ్లు విరగ్గొట్టించిన భార్య
ఈ విషయమై ఆబిడ్స్ సీఐ నర్సింహ వివరణ కోరగా, తన భార్యతో గొడవలు జరుగుతున్నాయిని దీంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించానని తెలిపారు. ప్రస్తుతం తమ కేసు కోర్టులో ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment