Liver problem
-
జన్మనిచ్చింది... కాలేయం ఇచ్చింది...
నాంపల్లి: కన్నకొడుకు కాలేయ సమస్యతో మంచంపట్టడంతో తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇచ్చి పునర్జన్మనిచ్చింది ఓ తల్లి. ఉస్మానియా, నిలోఫర్ ఆసుపత్రుల వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి ఆ బాలుడికి కాలేయ మార్పిడి చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండ వనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్, అమల దంపతుల కుమారుడు మాస్టర్ చౌహాన్ ఆదిత్య(03) పుట్టుకతోనే పిత్తాశయ ధమని, కాలేయసమస్యతో బాధపడుతున్నాడు. దీంతో బాలుడిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు కాలేయ మార్పిడి కోసం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, కాలేయమారి్పడి బృందం, నిలోఫర్ వైద్యు లు కలిసి ఈ నెల 3న ఆదిత్యకు కాలేయమారి్పడి చికిత్సను విజయవంతం చేశారు. ప్రస్తుతం తల్లి, కుమారుడు ఆరోగ్యంగానే ఉన్నారు. వారిని మంగళవారం ఓజీహెచ్ నుంచి డిశ్చార్జి చేశారు. ఇదే శస్త్రచికిత్స కార్పొరేట్ ఆసుపత్రిలో నిర్వహించి ఉంటే రూ.30 లక్షలు అయ్యేవని, కూలిపని చేసుకుని జీవించే తమ జీవితాల్లో ఉస్మానియా, నిలోఫర్ ఆసుపత్రి వైద్యులకు వెలుగులు నింపారంటూ బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
శరీరంతోపాటు కాలేయం బరువు కూడా.. సిర్రోసిస్ నివారణ ఇలా..
Liver Cirrhosis: సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ... కొంతమంది బరువు కూడా పెరుగుతుంటారు. దేహం బరువు పెరగడం అంటే లోపల కాలేయం బరువు కూడా పెరుగుతోందని గ్రహించాలి. అదెలాగంటే... దేహంలో కొవ్వు పేరుకుంటుందంటే, కాలేయంలోనూ కొవ్వు పెరుగుతోందన్నమాట. ఆ కొవ్వు కణాలు కాలేయంలోని రక్తప్రవాహానికీ అడ్డురావడంవల్ల సిర్రోసిస్ ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కాలేయానికి ఉండే సహజ ఆకృతి, దాని సహజమైన రంగు దెబ్బతిని జిగురు జిగురుగా, పచ్చరంగుకు మారిపోవచ్చు. సిర్రోసిస్ లక్షణాలు: ఒంటిపై భాగంలో రక్తనాళాలు సాలీడు ఆకృతిలో బయటకు కనిపించడం. దీర్ఘకాలం పాటు ఆకలి లేకుండా బాగా నీరసంగా, నిస్సత్తువగా అనిపిస్తుండటం. పొట్టలో విపరీతంగా గ్యాస్ పేరుకుంటుండటం. కళ్లు పసుపురంగుకు మారుతుండటం. ఈ లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్‌ను సంప్రదిస్తే అల్ట్రాసౌండ్ అబ్డామిన్, లివర్‌ఫంక్షన్ టెస్ట్ వంటివి చేసి, సమస్య ఉందా, లేదా అన్నది నిర్ధారణ చేస్తారు. నివారణ కోసం : ఈ పరిస్థితికి చేరువ కాకుండా... ఆరోగ్యంగా ఉన్నప్పుడే కాలేయం ఆరోగ్యాన్ని పరిరక్షించుకుని, సిర్రోసిస్ను నివారించుకునేందుకు చేయాల్సినవి. వాకింగ్ వంటి వ్యాయామాలు చేస్తూ బరువును ఎప్పుడూ నియంత్రించుకోవడం. ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండటం. మందులు వాడేటప్పుడు డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోవాలి. సొంతవైద్యం, ఆన్ కౌంటర్ మెడిసిన్స్ తీసుకోవడం మానేయాలి. అన్ని పోషకాలు ఉండే మంచి సమతులాహారం తీసుకోవడం. పోషకాలలో అన్ని విటమిన్లతో పాటు మరీ ముఖ్యంగా విటమిన్–బి కాంప్లెక్స్ ఉండే ఆహార ధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. -
Salman Rushdie: వెంటిలేటర్‌పై రష్దీ.. ఒక కన్ను కోల్పోయే ప్రమాదం
న్యూయార్క్: భారత మూలాలున్న ప్రముఖ రచయిత, బుకర్ బహుమతి విజేత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ది సతానిక్ వర్సెస్ రచన తర్వాత దశాబ్దాలుగా ఇస్లామిక్ బెదిరింపులను ఎదుర్కొంటున్న రష్దీపై ఓ ఆగంతకుడు అమెరికాలో చర్చావేదికపైనే కత్తితో విచక్షణారహితంగా దాడిచేసిన విషయం విదితమే. రక్తసిక్తమైన రష్దీకి వాయవ్య పెన్సిల్వేనియాలోని యూపీఎంసీ హ్యమాట్ సర్జరీ సెంటర్ ఆస్పత్రి వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 20 సెకన్ల వ్యవధిలో ఆగంతకుడు వెనుక 15 సార్లు కత్తితో పొడిచినట్లు తెలుస్తోంది. ‘గంటలపాటు ఆయనకు శస్త్రచికిత్స కొనసాగింది. మెడ భాగంలో కత్తిపోట్ల కారణంగా మెడ నుంచి చేతిలోకి వచ్చే నరాలు తెగిపోయాయి. ఒక కన్ను కోల్పోయే ప్రమాదం ఉంది. పొత్తికడుపుపై కత్తిగాటుతో కాలేయం దెబ్బతింది’ అని సల్మాన్ రష్దీ ప్రతినిధి ఆండ్రూ విలే న్యూయార్క్ టైమ్స్ వార్తాసంస్థతో చెప్పారు. పశ్చిమ న్యూయార్క్‌లోని చౌటాకా ఇన్స్టిట్యూట్లో రష్దీపై దాడి చేసిన వ్యక్తిని 24 ఏళ్ల హదీ మతార్‌గా గుర్తించారు. అతడిపై హత్యాయత్నం, దాడి సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. 150 ఏళ్ల చరిత్రలో తొలి దారుణం ‘150 ఏళ్ల లాభాపేక్షలేని విద్యా సంస్థ చరిత్రలో ఇలా దాడి జరగడం ఇదే తొలిసారి’ అని చౌటౌకా ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు మైఖేల్ హిల్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. సంస్థలో జరిగే కార్యక్రమాలకు భద్రత పెంచాలంటూ గతంలోనే విజ్ఞప్తులు వచ్చాయన్న వార్తలను ఆయన కొట్టేపారేశారు. అయితే, కార్యక్రమ నిర్వాహకులు అక్కడ ఎలాంటి సెక్యూరిటీ సెర్చ్ చేయలేదని, మెటల్ డిటెక్టర్లు లేవని, బ్యాగుల తనిఖీ విధానం లేదని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పడం గమనార్హం. ‘ఇరాన్ నేత అయోతొల్లా హత్య ఆదేశాలిచ్చినా రష్దీ తన స్వేచ్ఛా గళాన్ని వినిపించారు. ఈ కష్టకాలంలో రష్దీ ధైర్యాన్ని, అంకిత భావాన్ని వేనోళ్లా పొగడాల్సిన సమయమిది’ అని కౌంటర్ ఎక్స్‌ట్రీమిజమ్ ప్రాజెక్ట్ సీఈవో మార్క్ వ్యాఖ్యానించారు. ఉగ్రసంస్థల ఆర్థికమూలాలను దెబ్బతీయాలంటూ కౌంటర్ ఎక్స్‌ట్రీమిజమ్ ప్రాజెక్ట్ అనే లాభాపేక్షలేని ప్రభుత్వేతర సంస్థ పనిచేస్తోంది. దాడిపై ఇరాన్ మౌనం రష్దీని చంపాలంటూ దాదాపు దశాబ్దం క్రితం దేశ సుప్రీం లీడర్ అయోతొల్లా ఇచ్చిన ఫత్వాను ఇన్నాళ్లకు ఓ ఆగంతకుడు అమలుకు యత్నించాడన్న వార్తలపై ఇరాన్ పెదవి విప్పలేదు. ‘ఫత్వాను అమలుచేసే ప్రయత్నం జరిగింది’ అంటూ పొడిపొడిగా ఒక ప్రకటనను మాత్రం శనివారం ఇరాన్ అధికారిక మీడియా వెలువరించింది. ‘ ఇలాంటి ఘటనలు ఇరాన్‌ను అంతర్జాతీయ సమాజం నుంచి దూరం చేస్తాయి’ అని ఇరాన్ మాజీ దౌత్యవేత్త మాషల్లా సెఫాజదీ అన్నారు. దాడిపై వెల్లువెత్తిన నిరసనలు ఘటనను భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిగా సాహిత్యలోకం అభివర్ణించింది. రచయితల గొంతు నొక్కే, హింసాత్మక, అణచివేత ధోరణులపై ముక్తకంఠంతో తమ తీవ్ర నిరసనను వ్యక్తంచేశారు. అత్యంత హేయమైన చర్యగా బుకర్ ప్రైజ్ విజేత, రచయిత్రి గీతాంజలి శ్రీ వ్యాఖ్యానించారు. నీల్ గైమన్, అమితవ్ ఘోష్, స్టీఫెన్ కింగ్, జీన్ గెరీరో తదితరులు దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. రష్దీ త్వగా కోలుకోవాలని కోరుకున్నారు. జాగర్‌నాట్ బుక్స్, పెంగ్విన్ రాండమ్ హౌస్ ఆఫ్ ఇండియా వంటి పలు పబ్లిషింగ్ సంస్థలూ ఘాటుగా స్పందించాయి. ఎవరీ హదీ మతార్? న్యూజెర్సీలోని ఫెయిర్‌వ్యూ ప్రాంతంలో మతార్ నివసిస్తున్నాడు. మతార్ ఎందుకు దాడి చేశాడనే కారణాలను వెతికే పనిలో అమెరికా ఎఫ్‌బీఐ, స్థానిక దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. ‘ఘటనాస్థలిలోని బ్యాక్ ప్యాక్, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సెర్చ్ వారెంట్ తీసుకునే పనిలో అధికారులు ఉన్నారు. దాడి ఘటన వెనుక ఎవరూ ఉండకపోవచ్చని, మతార్ ఒక్కడికే ఇందులో ప్రమేయముందని అధికారులు ప్రాథమికంగా విశ్వసిస్తున్నారు. లెబనాన్ మూలాలున్న మతార్ నేర చరిత్రపై వివరాలు సేకరిస్తున్నాం’ అని పోలీస్ ట్రూప్ కమాండర్ మేజర్ ఎజీన్ జె. స్టాన్జ్యూస్కీ చెప్పారు. అయితే, అతని సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలించగా కొన్ని విషయాలపై స్పష్టత వచ్చింది. షియా ఉగ్రవాదులకు ముఖ్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కు మతార్ సానుభూతిపరుడని తెలుస్తోందని దర్యాప్తులో భాగంగా ఉన్న ఒక ఉన్నతాధికారి ఎన్బీసీ న్యూస్‌తో చెప్పారు. మతార్ వాడుతున్న సెల్‌ఫోన్ మెసేజింగ్ యాప్‌లో ఇరాన్ కమాండర్ ఖాసిమ్ సులేమానీ ఫొటోను దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. సులేమానీ ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్కు సైన్యాధికారిగా ఉన్నాడు. రష్దీ రాసిన రచనను ఇరాన్ 1988లో నిషేధించిన విషయం తెల్సిందే. ఇంత భద్రత అవసరమా? గతంలో రష్దీ వ్యాఖ్య హత్యా బెదిరింపుల నేపథ్యంలో ఆయనకు కల్పించిన అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై ఒకానొక దశలో అసహనం వ్యక్తంచేశారని న్యూయార్క్ పోస్ట్ ఒక కథనం ప్రచురించింది. చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్లో ఒక సారి రచయితల సదస్సు జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చిన రష్దీ మాట్లాడారు. ‘ఇంత మందితో నాకు భద్రత కల్పించడం నిజంగా అవసరమా? నాకైతే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది. నాకు ఇంతగా అదనపు భద్రత అవసరమని నేనెప్పుడూ అడగలేదు. గతంలో ఎలాంటి భద్రతా లేకుండానే ఇక్కడొకొచ్చాను. ఇప్పుడు ఇదంతా వృథా ప్రయాస. అయినా, భద్రత అవసరమైన రోజులను నేనెప్పుడో దాటేశాను’ అని ఆనాటి సభలో అన్నారు. -
పిత్తాశయంలో రాళ్లెందుకు వస్తాయి? పరిష్కారాలేమిటి?
Why Do Stones Form In Gallbladder: గాల్‌బ్లాడర్‌ను తెలుగులో పిత్తాశయం అంటారు. ఇది కాలేయం (లివర్)తో పాటు ఉండే కీలకమైన అవయవం. కొందరిలో పిత్తాశయంలో రాళ్లు వస్తాయి. ఇవి ఎందుకు వస్తాయో, అలా వచ్చినప్పుడు పరిష్కారాలేమిటో తెలుసుకుందాం. నిజానికి పైత్యరసం (బైల్ జ్యూస్) కాలేయంలోనే ఉత్పత్తి అవుతుంది. ఇలా లివర్‌లో పుట్టిన ఈ పైత్యరసాన్ని గాల్‌బ్లాడర్ నిల్వ ఉంచుతుంది. అక్కడి నుంచి బైల్ డక్ట్ అనే పైప్ ద్వారా చిన్న పేగుకు సరఫరా అయ్యేలా చూస్తుంది. అక్కడ కొవ్వులు జీర్ణం కావడం కోసం ఈ బైల్ జ్యూస్ ఉపయోగపడుతుంది. మనం తీసుకునే ఆహారంలో కొవ్వులూ, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, వాటిని చిన్న చిన్న ముక్కలైపోయి జీర్ణమయ్యేలా ఈ బైల్‌జ్యూస్ చూస్తుంది. ఇలా జరిగే క్రమంలో ఒకవేళ ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన కొవ్వులు ఉంటే... వాటిని గాల్‌బ్లాడర్ మళ్లీ స్వీకరించి, తనలో స్టోర్ చేసుకుంటుంది. కొన్నిసార్లు ఆ కొవ్వులు అక్కడే, అలాగే పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఒకేచోట పోగుబడి రాళ్లలా మారవచ్చు. ఇలా ఏర్పడే ఈ రాళ్లు పిత్తాశయం నిర్వహించే విధులకు ఆటంకంగా మారవచ్చు. అంటే బైల్‌జ్యూస్ స్రావాలకు అడ్డుపడే ప్రమాదం ఉందన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుందంటే... మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా కొవ్వులు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం అనేది మొదటి ప్రధాన కారణం. అలాగే మన జన్యువులు (జీన్స్), ఊబకాయం, పెయిన్‌కిల్లర్స్ ఎక్కువగా వాడటం, ప్రెగ్నెన్సీ రాకుండా మహిళలు వాడే పిల్స్ కూడా గాల్‌స్టోన్స్‌కు కొంతవరకు కారణాలే. డయాబెటిస్, జీర్ణ సమస్యలతో బాధపడేవాళ్లు ఈ గాల్‌బ్లాడర్ స్టోన్స్ సమస్యకు లోనయ్యే అవకాశాలు ఎక్కువ. ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏమిటంటే... కిడ్నీలో మాదిరిగా ఇవి పూర్తిగా రాళ్లలాంటివి కావు. ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన చిన్న చిన్న ఘనపదార్థాలన్నీ ఒక ఉండగా మారి రాళ్లను తలపిస్తుంటాయి. కొందరిలో ఇవి పైత్యరసం ప్రవహించే డక్ట్ (పైత్యవాహిక)కు అడ్డు తగిలి నొప్పిని కలగజేయవచ్చు. మరికొందరిలో ఇవి ఏర్పడినా ఎలాంటి నొప్పీ ఉండకపోవచ్చు. అలా నొప్పి అనిపిస్తేగానీ... ఇవి ఏర్పడ్డ విషయం తెలియదు. కొందరిలో ఇంకేదైనా సమస్య కోసం వైద్య పరీక్షలు చేయించినప్పుడు ఈ సమస్య బయటపడవచ్చు. చికిత్స ఏమిటి? నిజానికి గాల్‌బ్లాడర్‌లో స్టోన్స్ వచ్చిన వాళ్లలో ఎలాంటి నొప్పీ లేకపోతే వారికి చికిత్స కూడా ఏమీ అవసరం లేదు. కానీ నొప్పి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా శస్త్రచికిత్స చేసి వీటిని తొలగించాల్సి ఉంటుంది. మందులతో తగ్గడం జరగదు. నొప్పి తీవ్రంగా వచ్చేవారు డాక్టర్ సలహా మేరకు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించుకోవడం అవసరం. అశ్రద్ధ చేస్తే గాల్‌బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్ ఏర్పడటం, కామెర్లు (జాండిస్) రావడం, పాంక్రియాస్ వాపునకు గురికావడం లేదా కడుపులో తీవ్రమైన నొప్పి రావచ్చు. శస్త్రచికిత్స అవసరమనే నిర్ధారణ ఎలా? తొలుత నిర్వహించిన వైద్య పరీక్షల్లో పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయని తెలిసినప్పుడు, మరోసారి అల్ట్రాసౌండ్ లేదా ఎమ్‌ఆర్‌సీపీ స్కాన్ చేసి లివర్, గాల్బ్లాడర్లలో వాటి తీరుతెన్నులను పరిశీలిస్తారు. అలాగే గాల్‌బ్లాడర్ పనితీరును తెలుసుకునేందుకు ‘హెచ్ఐడిఏ’ పరీక్షను కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య పరిజ్ఞానంతో చేసే శస్త్రచికిత్స ద్వారా ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారాన్ని అందించవచ్చు. ఇది మేజర్ శస్త్రచికిత్స కూడా కాదు. కేవలం ఒక్కరోజు మాత్రమే ఆసుపత్రిలో ఉంటే చాలు. -డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ -
చిన్నారి చికిత్సకు సీఎం రూ.17.5 లక్షల సాయం
శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా): బిడ్డకు పచ్చకామెర్లు.. ఒళ్లంతా దద్దుర్లు.. జన్యుపరమైన లివర్ సమస్య.. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేయించాల్సిన పరిస్థితి.. దీనికి తోడు భారీ ఖర్చు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇలాంటి స్థితిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారిని ఆదుకుని రూ.17.5 లక్షలు విడుదల చేయడంతో చిన్నారి ప్రాణాలు నిలిచాయి. దీంతో ఆ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. శనివారం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డితో కలిసి వారు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తిలోని బీపీ అగ్రహారానికి చెందిన జగదీష్, లక్ష్మి దంపతులకు మునీశ్వర్ (10 నెలలు) అనే బాబు ఉన్నాడు. చిన్నారికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డిని కలిసి సహాయం కోరారు. ఆయన వెంటనే స్పందించి వారిని చెన్నైలోని గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రికి పంపారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు జన్యుపరమైన లివర్ సమస్య ఉన్నట్టు నిర్ధారించారు. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేయాల్సి వస్తుందని, అందుకు సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. ఎమ్మెల్యే చొరవ, చిన్నారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రూ.17.5 లక్షలకు ఆపరేషన్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బియ్యపు సీఎం జగన్మోహన్రెడ్డికి విన్నవించగా ఆయన వెంటనే రూ.17.5 లక్షలను ఆస్పత్రికి చెల్లించడానికి అధికారులకు అనుమతి ఇచ్చారు. వైద్యులు చిన్నారి తండ్రి నుంచి 20 శాతం లివర్ తీసుకుని.. చిన్నారికి లివర్ మార్పిడి చేశారు. 12 గంటలపాటు శ్రమించి ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు సీఎం వైఎస్ జగన్‌కు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
కాలేయ వాపుతో జాగ్రత్త.. లక్షణాలు లేకుండానే ముంచేస్తుంది!
శరీరంలో కీలకమైన భాగం కాలేయం (లివర్). ఈ అవయవం మనకు తెలియకుండానే ‘హెపటైటీస్’ (లివర్ వాపు)కు గురి అవుతోంది. దీంతో చాలా మంది అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి. కాలేయంను కాపాడుకుంటే పది కాలాల పాటు ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు. సాక్షి, కడప: ‘హెపటైటీస్’ వ్యాధి సోకిందని తెలియక చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. కొంతమందిలో వ్యాధి తీవ్రత పెరగడంతో మృత్యువాత పడుతున్నారు. ఈ వ్యాధి నివారణకు.. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ప్రతి ఏటా జూలై 28వ తేదీన ప్రపంచ హెపటైటీస్–బి నివారణ దినోత్సవంను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. ‘హెపటైటీస్’ అంటే... ‘హెపటైటీస్’ ఇది కాలేయంకు సంబంధించిన వ్యాధి. వైద్య భాషలో ‘హెప’ అంటే లివర్, టైటీస్ లేదా ఐటస్ అంటే వాపు అని అర్ధం. ఎ, బి, సి, డి, ఇ అనే ఐదు రకాల వైరస్ల సమూహమే ‘హెపటైటీస్’. అందులో ఎ, ఈ వైరస్ కలుషిత నీరును తాగడం, కలుషిత ఆహరంను తీసుకోవడం వలను వస్తుంది. ‘డి’ అంటే డెల్టా వైరస్. ఇది హెపటైటీస్‌కు చెందిన ఒక వైరస్. ఈ వైరస్లు ప్రమాదకరమైనవి కావు. బి, సి వైరస్‌లే అనారోగ్యానికి దారి తీస్తాయి. చాప కింద నీరులా... ఈ వ్యాధి చాప కింద నీరులా ప్రవేశిస్తుంది. అసలు ఈ వ్యాధి ఉందని చాలా మందికి తెలియదు. వ్యాధి ఉందని తెలిసేలోపు ‘లివర్’ తీవ్ర ఇన్ఫెక్షన్కు గురి అవుతోంది. దీంతో వ్యాధి సోకిన వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి లోనవుతున్నారు. బాధితుల్లో దాదాపు 70 శాతం మందికి ఇన్ఫెక్షన్ బాగా ముదిరిన తరువాతనే అసలు విషయం తెలుసుకుంటున్నారు. ఈ వైరస్ల కారణంగా దశల వారీగా కాలేయ వాపు, లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. ఇందుకు ‘హెపటైటీస్’. కారణం. ఎందుకు వస్తుందంటే... ► సురక్షితంకాని ఇంజక్షన్లు వాడటం. ► శుధ్ధి లేని రక్త మారి్పడి.. ► హెపటైటీస్ వ్యాధి సోకిన తల్లి నుంచి బిడ్డకు.. ► అవాంచిత సెక్స్ వలన. ► ఒకరు ఉపయోగించిన బ్లేడ్లు, రేజర్లు, టూత్ బ్రెష్‌లు వాడటం వలన. ► కలుషితమైన నీరు, ఆహరం తీసుకోవడం వలన. లక్షణాలు.. ► కామెర్లు, జ్వరం తదితర అనారోగ్య సమస్యలు ఉంటాయి. ► చాలా మందిలో వ్యాధి లక్షణాలు కనిపించవు. ► వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే కడపు నొప్పితో పాటు కడుపు ఉబ్బరం ఉంటుంది. రక్తపు వాంతులు అవుతాయి. తీసుకోవలసిన జాగ్రత్తలు... ► హెపటైటీస్ నిర్ధారణ రక్త పరీక్ష చేసుకోవాలి. ► ముందస్తు టీకా వేయించుకోవాలి. ► ఈ వ్యాధి సోకిన వారు క్రమం తప్పకుండా చికిత్స చేసుకోవడం వలన హెపటైటీస్‌ను నివారించవచ్చు. క్రమం తప్పకుండా టీకా వేయాలి హెపటైటీస్ నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి బిడ్డ జన్మించిన 24 గంటల్లోపు టీకాను వేస్తున్నాం. తరువాత ఐదు టీకాల మిశ్రమం కలిగిన ‘పెంటావాలెంట్’ టీకాను ఆరు వారాలకు, 10 వారాలకు, 14 వారాలకు ఒక సారి ఒక డోసు చొప్పున వ్యాక్సిన్ వేస్తున్నాం. ఈ పెంటావాలంట్ టీకా హెపటైటీస్–బితో అంటే కామెర్లతో పాటు కోరింత దగ్గు, ధనుర్వాతం, న్యుమోనియా నివారణకు పనిచేస్తుంది. ఈ టీకా 10 సంవత్సరాల వరకు పని చేస్తుంది. తరువాత ఒక బూస్టర్ డోస్‌ను వేయాలి. ప్రతి బూస్టర్ డోసు ఐదేళ్ల పాటు పనిచేస్తుంది. ఈ వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. వైద్యుల సూచనల ప్రకారం టీకా వేయాలి. – డాక్టర్ అనిల్‌కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి -
ఆపదలో భర్త: ప్రేమనే కాదు.. కాలేయాన్ని పంచింది!
సాక్షి, హైదరాబాద్: ఆమె తన భర్తకు ప్రేమనే కాదు.. కాలేయాన్ని కూడా పంచి ఆదర్శంగా నిలిచింది. ఇందుకు లక్డీకాపూల్ గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రి వేదికైంది. ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాలేయ మార్పిడి నిపుణుడు డాక్టర్ రాఘవేంద్రబాబు, సీఈఓ గౌరవ్ఖురానా వివరాలను వెల్లడించారు. ఆపదలో ఉన్న తన భర్తను కాపాడుకునేందుకు ఆ భార్య చేసిన సాహసం నిజంగా అభినందనీయమేనని వైద్యులు అభిప్రాయపడ్డారు. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ముంతాజ్ అదే ప్రాంతానికి చెందిన వెంకటసుబ్బారెడ్డిని 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరి మతాలు వేరు కావడంతో పెద్దలను ఎదిరించాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇరువురు తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు. ఉన్నట్టుండి వారి దాంపత్య జీవితంలోకి అనారోగ్యం రూపంలో పెద్ద ప్రమాదం వచ్చిపడింది. వెంకటసుబ్బారెడ్డికి గుండెపోటు రావడంతో రెండు స్టంట్లు పడ్డాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే కామెర్ల రూపంలో మరో ప్రమాదం ఎదురైంది. దీంతో గతేడాది అక్టోబర్‌లో లక్డీకాపూల్‌లోని గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రికి వచ్చారు. కాలేయం పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించి కాలేయ మార్పిడే పరిష్కారమని సూచించారు. దీంతో కాలేయం దానం చేసేందుకు భార్య ముందుకు రావడంతో మార్చి రెండో వారంలో పది మంది వైద్యులతో కూడిన బృందం విజయవంతంగా చికిత్స చేసింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరినీ డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం వారు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సాధారణంగా ఈ చికిత్సకు రూ.20 లక్షలకుపైగా ఖర్చు అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేని పరిస్థితిలో వారు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేయడంపై భార్యాభర్తలు సంతోషం వ్యక్తం చేశారు. -
ఫ్యాటీ లివర్.. పారా హుషార్...
కరోనాతో మారిన పరిస్థితులు, జీవనశైలుల కారణంగా శారీరక శ్రమ ఆహారపు అలవాట్లలో తీవ్రమైన మార్పుల వల్ల కొన్ని అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయి. వాటిలో ఒకటి ఫ్యాటీ లివర్. ప్రపంచవ్యాప్తంగా యువతలో ఫ్యాటీ లివర్ సమస్య బాగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న అపోలో స్పెక్ట్రా ఆసుపత్రికి చెందిన వైద్యులు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డా. జగన్మోహన్రెడ్డి అందిస్తున్న విశేషాలు, సూచనల సమాహారం... కీలకం...కాలేయం.. మానవ శరీరంలోని అతిపెద్ద అంతర్గత అవయవం కాలేయం. ఈ ఒక్క అవయవం మన ఆరోగ్యంపై ఎన్నో రకాలుగా ప్రభావం చూపిస్తుంది. కుడివైపు దిగువన పక్కటెముకల కిందుగా ఉండే ఈ అవయవం...అనేక ప్రధాన విధులు నిర్వర్తిస్తుంది. శరీరంలో తయారయే హానికారక రసాయనాలను తొలగించడంతో పాటు బైల్ అనే లిక్విడ్‌ను అది తయారు చేస్తుంది. అలాగే ఆహారంలోని కొవ్వును కరిగించడంలో సహకరిస్తుంది. అవసరమైనప్పుడు వెంటనే శక్తిని అందించేందుకు వీలుగా గ్లూకోజ్ నిల్వలను ఉంచుతుంది. ఇన్ని కీలక విధులు నిర్వర్తిస్తున్నా వైద్య పరమైన జాగ్రత్తల విషయంలో దీన్ని మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేస్తుంటాం. అలాంటి నిర్లక్ష్యాల వల్ల వచ్చే సమస్యల్లో ఫ్యాటీ లివర్ ఒకటి. ఆల్కహాలిక్/నాన్ ఆల్కహాలిక్లకూ... హాని కలిగించే స్థాయిలో ఆల్కహాల్ సేవించేవారిలో ఎక్కువగా ఫ్యాటీ లివర్ సమస్య కనిపిస్తుంది. అయితే ఫ్యాటీ లివర్ సమస్య నాన్ ఆల్కహాలిక్ లకూ వస్తుంది. ఎవరికైతే బాడీ ఇండెక్స్ మాస్ ఎక్కువగా ఉంటుందో అలాగే సరైన శారీరక శ్రమ లేని వారిలో కూడా ఇది కనిపిస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే తగిన విధమైన చికిత్స అందించకపోతే అది ఫైబ్రోసిస్‌కి దారి తీస్తుంది. తద్వారా ఇది కాలేయాన్ని మచ్చలు పడేలా చేస్తుంది. మరింత ముదిరితే ఇది సిర్రోసిస్ అనే పరిస్థితికి దారి తీసి ఆరోగ్యాన్ని కోలుకోలేని విధంగా దిగజారుస్తుంది. ఈ సమస్య ఉన్నవారిలో చాలా మంది అది ఉన్నట్టుగా తెలియదు. లక్షణాలు ఉన్నప్పటికీ... దాన్ని గుర్తించలేం. అయితే అన్నీ కనిపించాలని కూడా లేదు. క్రమబద్ధమైన రక్త పరీక్షల ద్వారా దాన్ని ముందస్తుగానే గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది. లక్షణాలు... స్వల్పంగా నొప్పి లేదా కుడివైపు పొట్ట ప్రాంతంలో నిండుగా ఉన్నట్టు అనిపించడం. ఎఎస్‌టి, ఎఎల్‌టి వంటి లివర్ ఎంజైమ్స్ స్థాయిల్లో పెరుగుదల ఇన్సులిన్ స్థాయిలు బాగా పెరగడం ట్రైగ్లిజరైడ్స్ స్థాయిల పెరుగుదల నాన్ ఆల్కహాలిక్లో ఫ్యాటీ లివర్ పెరిగితే.. స్టీటోహెపటైటిస్ అనే పరిస్థితికి దారి తీస్తుంది. ఇది ఫ్యాటీ లివర్ తర్వాత దశ. అధికంగా కొవ్వు పేరుకోవడం వల్ల కాలేయ మంట వస్తుంది. దీని లక్షణాలు ఇలా ఉంటాయి. ఆకలి మందగించడం వాంతి లేదా వికారంగా ఉండడం పొట్టలో భరించలేని నొప్పి చర్మం, కళ్లు పచ్చ బడడం కడుపులో ఇబ్బంది (ద్రవాలు పేరుకుపోవడం వల్ల) ఆరోగ్యకరమైన రీతిలో శరీరపు బరువు మెయిన్‌టెయిన్ చేసే వారిలో కూడా నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు కూడా ఫ్యాటీ లీవర్‌కు కారణమవుతుంది. అలాగే ఆరోగ్యకరమైన రీతిలో బాడీ మాస్ ఇండెక్స్ మెయిన్‌టెయిన్ చేసేవారిలో కూడా మొత్తంగా ఆరోగ్యాన్ని మెయిన్‌టెయిన్ చేయడం ముఖ్యం. శరీరపు బరువు తగ్గితే లివర్ ఫ్యాట్ కూడా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆహారపు క్రమశిక్షణ ద్వారా వ్యాయామం ద్వారా దీన్ని సాధించవచ్చు. ఫ్యాటీ లివర్ రాకుండా... ప్రతి రోజూ ఏదో ఒక రకమైన వ్యాయామం చేయడం అనేది లివర్ ఫ్యాట్‌ని నివారించేందుకు ఉత్తమ మార్గం. వ్యాయామం, రెసిస్టెన్స్ ట్రైనింగ్ లు లివర్ సెల్స్‌లో పేరుకున్న కొవ్వుల్ని తగ్గించగలవు. రోజులో కనీసం 30 నిమిషాల పాటు ఏదో ఒక రకమైన శారీరక శ్రమ చేసినట్లయితే లివర్‌లోని కొవ్వు నిల్వలు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే రిఫైన్డ్ కార్బొహైడ్రేట్స్ అతిగా తీసుకోవడం ప్రస్తుతం యువతో బాగా పెరిగింది. ఈ రిఫైన్డ్ కార్బొహైడ్రేట్స్ లివర్‌లో ఫ్యాట్‌ని పెంచుతాయి. అధిక బరువున్న వారు, ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారు ఇవి తీసుకుంటే అది మరింతగా లివర్ని డ్యామేజ్ చేస్తుంది. వీటిని తగ్గిస్తే ఆ మేరకు ఫ్యాటీ లివర్ పెరిగే అవకాశాలు తగ్గిపోతాయి. తీయని ద్రవపదార్ధాలు కూడా కాలేయంపై ప్రభావం చూపుతాయి. సోడా తదితర గ్యాస్ నింపిన పానీయాలు పెద్ద పరిమాణంలో ఫ్రక్టోజ్‌ను కలిగి ఉంటాయి. ఫ్రక్టోజ్‌ను ఎక్కువగా తీసుకుంటే అది కాలేయం చుట్టూ కొవ్వు పేరుకునేలా చేస్తుంది. ఈ పరిస్థితి పెద్దలతో పాటు చిన్నారుల్లో కూడా కనిపిస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన కాలేయాన్ని కలిగి ఉండడం అనేది అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా శరీరంలోని ప్రతి అవయవం పనితీరును గమనిస్తూ దాని ఆరోగ్యంగా ఉంచేందుకు వీలుగా ప్రతి వ్యక్తి మంచి ఆహారం/నిద్ర అలవాట్లతో తమ దినచర్యను దీర్చిదిద్దుకోవడం అవసరం. డా.జగన్మోహన్రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి, కొండాపూర్, హైదరాబాద్ -
చిన్నారికి సోనూ సూద్ భరోసా
డోర్నకల్: కరోనా కారణంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తున్న సినీ నటుడు సోనూసూద్‌ను ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన ఓ కథనం కదిలించింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామానికి చెందిన దేశబోయిన నాగరాజు, శ్రీలక్ష్మి దంపతుల కుమారుడు హర్షవర్థన్ (06) లివర్ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు. ఆయనకు లివర్ మార్పిడి చేయాలని, ఇందుకోసం రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఈ విషయాన్ని గత నెల 22న ‘సాక్షి’వరంగల్ టాబ్లాయిడ్లో ‘చిన్న వయస్సు.. పెద్ద జబ్బు’ఆరేళ్ల బాలుడికి లివర్ సమస్య’శీర్షికన కథనం ప్రచురితమైంది. అయితే, మహబూబాబాద్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న హర్షవర్ధన్ తండ్రి నాగరాజు అంత మొత్తం వెచ్చించలేని పరిస్థితి ఉంది. తన సహచర ఉద్యోగులు రూ.2 లక్షల వరకు సమకూర్చారు. అయినా హర్షవర్ధన్ చికిత్సకు పెద్ద ఎత్తున డబ్బు అవసరముంది. దీంతో మహబూబాబాద్ డిపో కండక్టర్ల ఐక్య వేదిక ఆధ్వర్యాన నాగరాజు, శ్రీలక్ష్మి దంపతులు గురువారం హైదరాబాద్‌లో షూటింగ్‌కు వచ్చిన సినీ నటుడు సోనూసూద్‌ను కలిశారు. హర్షవర్థన్ ఆరోగ్య పరిస్థితిని వివరించడంతో పాటు ‘సాక్షి’క్లిప్పింగ్‌ను ఇవ్వగా, అక్కడే ఉన్న నటులు బ్రహ్మాజీ, శ్రీనివాస్‌రెడ్డి తెలుగు కథనాన్ని సోనూసూద్‌కు వివరించారు. దీనిపై స్పందించిన ఆయన.. హర్షవర్ధన్ లివర్ మార్పిడి కోసం జరిగే శస్త్రచికిత్స అయ్యే ఖర్చులు మొత్తం భరిస్తానని హామీ ఇచ్చారు. అక్కడికక్కడే అపోలో ఆస్పత్రి వైద్యులతో ఫోన్లో మాట్లాడి అవసరమైన వైద్యసాయం అందించాలని సోనూసూద్ కోరారు. దీంతో హర్షవర్థన్ తల్లిదండ్రులు నాగరాజు, శ్రీలక్ష్మి, ఆర్టీసీ కండక్టర్ల ఐక్య వేదిక నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
‘మా బిడ్డను ఆదుకోండి సారూ..’
సాక్షి, గొల్లపల్లి : ముద్దుగా ఉన్న పాపాయికి పెద్ద కష్టమొచ్చింది.ఆడుతూ పాడుతూ.. హాయిగా ఉండాల్సిన ఆ చిన్నారి కాలేయ సంబంధిత వ్యాధితో కొట్టుమిట్టాడుతోంది. ఆపరేషన్ చేయాల్సిందేనని హైదరాబాద్‌లోని వైద్యులు తేల్చగా ఆరోగ్యశ్రీకి వ్యాధి అర్హత లేక, డబ్బులు కట్టేందుకు ఆర్థికస్థోమత లేక కన్నోళ్లు కన్నీరు మున్నీరవుతున్నారు. గుండె దిటవు చేసుకుని తమ బిడ్డను ఆదుకోవాలని దయార్థ హృదయులను వేడుకుంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన నిరుపేదలు షిండే శారద–నరేశ్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. బతుకుదెరువు కోసం 15 ఏళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా నుంచి గొల్లపల్లి వలస వచ్చారు. ఇక్కడే నివాసం ఏర్పర్చుకుని ఓటుహక్కు, రేషన్‌కార్డు, ఆధార్ కార్డు కల్గి ఉన్నారు. పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. తల్లి శారద ఏడాది క్రితం మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ పలు ఆసుపత్రులు చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో పాటు ఖరీదైన వైద్యం అందకపోవడం మృతి చెందింది. నాన్నే అన్నీ తానై వారిని సాకుతున్నాడు. నలుగురు పిల్లలను తల్లి లేని లోటు తీర్చేందుకు నమ్ముకున్న సీస కమ్మరి వృత్తితో వచ్చిన పదో పరకతో జీవనాన్ని సాగిస్తున్నారు. వీరిలో చిన్నదైన నాలుగేళ్ల కూతురు ఐశ్వర్య కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతోంది. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకట తరగతి చదువుతున్న ఈ బాలిక పుట్టిన రెండేళ్ల నుంచే ఈ జబ్బు తీవ్రతతో అస్వస్థతకు గురవుతుంది. వయస్సు పెరిగిన కొద్దీ జబ్బు పెరిగిపోతోంది. భార్య చనిపోయినప్పటి నుంచి భర్తకు వీరి ఆలనా పాలన కష్టంగా మారింది. కూతురుకు ఎలాగైనా వ్యాధి నయం చేయాలనే ఆ తండ్రి మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి రూ.లక్ష వరకు ఖర్చు చేసుకున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రిలో చూపించగా, వెంటనే ఆపరేషన్ చేయాలని అందుకు రూ.3 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే వ్యాధిలో లేదని కార్డు వర్తించదని తేల్చి చెప్పారు. కొద్ది రోజుల నుంచి ఐశ్వర్యకు మలమూత్ర విసర్జనలకు కూడా వెళ్లడం లేదని కడుపు ఉబ్బుతోందని వాపోయాడు. తన కూతురును ఎలా బతికించుకునేది అని నరేష్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. దాతలు, ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ స్పందించాలని వేడుకుంటున్నాడు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థికంగా చేయూతనిచ్చి ఆదుకోవాలని కోరుతున్నాడు. చిన్నారిని ఆదుకునేందుకు ఆర్థికసాయం చేయాలనుకునే వారు ఫోన్ నంబర్ 9000404115కు కాల్ చేయాలని కోరారు. -
‘ప్రస్తుతం 25శాతం కాలేయంతోనే జీవిస్తున్నాను’
బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను 25శాతం కాలేయంతోనే జీవిస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా బిగ్ బీ ‘స్వస్థ్ ఇండియా’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు నాకు క్షయ(టీబీ), హెపటైటిస్ బీ వ్యాధులు ఉండేవి. అయితే నాకు ఈ వ్యాధులు సోకినట్లు దాదాపు ఎనిమిదేళ్ల పాటు నేను గుర్తించలేకపోయాను. హెపటైటిస్ వల్ల అప్పటికే నా కాలేయం 75శాతం పాడయ్యింది. తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల ఇలా జరిగింది. ప్రస్తుతం నేను 25శాతం కాలేయంతోనే జీవిస్తున్నాను. టీబీకి చికిత్స ఉంది. కానీ ముందుగా గుర్తించకపోవడం వల్ల నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. తరచుగా వైద్య పరీక్షలు చేయించుకుంటుంటే.. ఇలాంటి వ్యాధుల్ని ముందుగానే పసిగట్టవచ్చు. తగిన చికిత్స తీసుకోవచ్చు’ అన్నారు. అంతేకాక ‘నాలా మరొకరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఇప్పుడీ విషయాల గురించి వెల్లడించాను. ప్రతి ఒక్కరు తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఫలితంగా వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి సులభంగా నివారించవచ్చు’ అని పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అమితాబ్ కీలక పాత్రలో నటించిన ‘సైరా’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ నటిస్తున్నారు. (చదవండి: ఇండియాలో ఆయనే మెగాస్టార్) -
లంఖణం పరమౌషధమే!
ఉపవాసం అద్భుతమైన ఔషధమని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. సైన్స్ కూడా దాన్ని ధ్రువీకరించింది. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఉపవాసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలకు కారణమేమిటో స్పష్టం చేస్తోంది. ఆహారం తీసుకోకపోవడం వల్ల మన కాలేయం, అస్థిపంజర కండరాలపై ప్రభావం పడుతుందని ఇది కాస్తా జీవక్రియల ప్రక్రియను దృఢపరుస్తుందని అంటున్నారు పాలో సాసోన్ కోర్సీ అనే శాస్త్రవేత్త. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలు, ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని విశ్లేషించారు. మారిపోయే శరీర వాతావరణానికి తగినట్టుగా శరీరంలోని గడియారం కొన్ని మార్పులు చేసుకుంటూ శరీర స్థితిని కాపాడుతూ ఉంటుందని.. ఆహారం ఈ గడియారాన్ని ప్రభావితం చేస్తుందని వివరించారు కోర్సీ. నిరాహారం వల్ల ఇందుకు సంబంధించిన జన్యువులు చైతన్యవంతం అవుతున్నాయని అస్థిపంజర కండరాలు వీటిల్లో ఒకటని చెప్పారు. ఎలుకలకు 24 గంటలపాటు ఆహారం ఇవ్వకుండా తాము ఒక ప్రయోగం చేశామని ఈ సమయంలో శరీరం మొత్తమ్మీద ఆక్సిజన్ వినియోగం తక్కువైపోగా.. ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోనూ తేడాలు వచ్చాయని ఆహారం తీసుకోగానే పరిస్థితి మొదటికి వచ్చిందని కోర్సీ తెలిపారు. -
లివర్ ట్యూమర్లతో కాలేయం పాడైందట..
లివర్ కౌన్సెలింగ్ నా వయసు 55 ఏళ్లు. నాకు మద్యం తాగే అలవాటు ఉంది. అయితే కొన్ని నెలల క్రితం నాకు ఆరోగ్యపరమైన సమస్యలు రావడంతో డాక్టర్ సలహాలతో మద్యం పూర్తిగా మానేశాను. అయినా ఇంకా అనారోగ్యం వెంటాడుతూనే ఉంది. మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆయన కొన్ని పరీక్షలు చేసి ‘లివర్ ట్యూమర్’ కారణంగా లివర్ పాడైందనీ, అలాగే ‘అల్ఫా పెటోప్రొటీన్’ అత్యధికంగా లక్షకు మించిపోయిందని, దాంతో లివర్ సరిగా పనిచేయడం మానేసిందని తెలిపారు. లివర్ మార్పిడి చేసుకోకపోతే బతకడం కష్టమని కూడా చెప్పారు. కుటుంబానికి నేనే ఆధారం. నాకు తగిన సలహా ఇవ్వండి. – కె. వెంకటాచారి, సిద్ధిపేట మీరు తెలిపిన వివరాల ప్రకారం మీ లివర్ కండిషన్ చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని చెప్పవచ్చు. లిక్కర్ లివర్‌కు ప్రధాన శత్రువు. అతిగా మద్యం సేవించే అలవాటు వల్ల లివర్ పూర్తిగా డ్యామేజీ అవుతుంది. లివర్ క్యాన్సర్ లేదా లివర్ సిర్రోసిస్ బారిన పడుతుంది. మీరు మద్యాన్ని మానివేసే సమయానికే మీ కాలేయం బాగా పాడైపోయి ఉండవచ్చు. కాలేయం క్షీణత అనేది మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశ (చైల్డ్ గ్రేడ్–ఏ)లో లివర్‌పై ట్యూమర్లు దాడి చేసినట్టు గుర్తించి, సరైన చికిత్స అందిస్తే దాదాపు 70 శాతం వరకు దానిని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పటికే ట్యూమర్లు మళ్లీ తిరగబడినా, లివర్‌కు మాత్రం ఐదేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. రెండో దశలో ట్యూమర్ల పరిమాణం పెరిగి చికిత్సకు ఇబ్బందిగా మారుతుంది. అప్పుడు కేవలం కాలేయ మార్పిడి ద్వారానే పేషెంట్‌ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. అది కూడా ట్యూమర్లు ఐదు సెంటీమీటర్ల కంటే తక్కువ సైజులో ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఫలితం దాదాపు 70 – 80 శాతం మేరకు ఉంటుంది. ఇక చివరిదైన మూడోదశకు వస్తే... లివర్ ట్రాన్స్‌ప్లాంట్ తప్ప వేరే మార్గమే లేదు. ఈ పరిస్థితిలో పేషెంట్‌కి వివిధ స్టేజెస్‌లో, రకరకాల చికిత్స విధానాల్ని అవలంబించాల్సి వస్తుంది. ట్యూమర్ల కారణంగా లివర్ పూర్తిగా చెడిపోవడం జరిగింది. కాబట్టి దాని చుట్టుపక్కల కూడా వాటి ప్రభావం ఉంటుంది. అలాగే ట్యూమర్ల వ్యాధిని కూడా నియంత్రించాలి. ఇందుకు పరిస్థితిని బట్టి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ముందే కీమోథెరపీ లేదా రేడియోథెరపీలు చేసి కాలేయానికి ఉన్న ట్యూమర్లను పూర్తిగా తొలగించి, వాటిని నిర్వీర్యం చేస్తారు. దాంతో పేషెంట్ శరీరం కాలేయ మార్పిడి చేసే పరిస్థితికి చేరుకుంటుంది. అప్పుడు శస్త్రచికిత్స నిర్వహించి రోగికి మ్యాచ్ అయిన లివర్‌ను అమర్చుతారు. లివర్ లభ్యత రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీ బ్లడ్గ్రూప్నకు సరిపోలిన వారు ముందుకు రావాలి. దీన్ని ‘లైవ్ డోనార్’ అని అంటారు. ఇది సురక్షితమైన విధానం. రెండోది ‘కెడావర్ డోనార్’ అంటారు. దీనికి దాతలపై ఆధారపడాల్సి వస్తుంది. అది లభించినప్పుడు డాక్టర్లు సర్జరీని నిర్వహిస్తారు. ఇక ఆలస్యం చేయకుండా ముందుగా మీరు నిపుణులైన వైద్యుడిని సంప్రదించి లివర్ ఏ స్టేజ్‌లో ఉందో పరీక్షల ద్వారా తెలుసుకొని వెంటనే తగిన చికిత్సను పొందండి. మద్యంతో కాలేయం దెబ్బతింది... పరిష్కారం చెప్పండి మావారి వయసు 53 ఏళ్లు. గడచిన 25 ఏళ్ల నుంచి మద్యం అలవాటు ఉంది. రెండేళ్ల కిందట తీవ్ర అనారోగ్యానికి గురైతే ఆసుపత్రిలో చేర్పించాం. లివర్ దెబ్బతిన్నదని చెప్పారు. తాగడం మానేయమన్నారు. లేదంటే లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఆయన మానలేకపోయారు. ఇటీవల తరచూ చాలా నీరసంగా ఉంటుందంటున్నారు. ఎక్కువగా నిద్రపోతున్నారు. తిండి బాగా తగ్గించారు. మావారి సమస్యకు పరిష్కారం చెప్పండి. – ప్రసూన, షాద్‌నగర్ మితిమీరిన మద్యపానం వల్ల మీ భర్త కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నది. కాలేయం తనకు నష్టం కలిగిస్తున్న అలవాట్లు, వ్యాధులను గుర్తించి, వాటిని సరిచేసుకోడానికి రోగికి చాలా అవకాశం ఇస్తుంది. మద్యపానం వంటి అలవాట్ల వల్ల దెబ్బతిన్నా, తొలిదశలో యథావిధిగా పనిచేస్తుంది. కానీ నిర్లక్ష్యం చేసినా, నష్టం కలిగించే అలవాటును మానకపోయినా దాని పనితీరు పూర్తిగా దెబ్బతింటుంది. వ్యాధుల వల్ల కాలేయానికి జరిగిన నష్టాన్ని బట్టి దానిని మూడు స్థాయిలుగా గుర్తిస్తారు. వాటిని ఎ, బి, సి ‘చైల్డ్ పగ్ స్టేజెస్’ అంటారు. ‘ఎ’ చైల్డ్ స్థాయిలోనే డాక్టర్ వద్దకు రాగలిగితే మందులతో, అలవాట్లలో మార్పులతో చికిత్స చేసి, కాలేయ పనితీరును పూర్తి సాధారణ స్థాయికి పునరుద్ధరించవచ్చు. మొదటి రెండు (ఎ, బీ ఛైల్డ్ స్టేజెస్) స్థాయిల్లోనూ చాలావరకు తిరిగి కోలుకోవడానికి కాలేయం అవకాశం ఇస్తుంది. బీ, సీ స్థాయిలలో వస్తే వ్యాధి తీవ్రత, వ్యక్తి తట్టుకోగల శక్తిని అంచనావేసి, కాలేయమార్పిడి చికిత్సను సిఫార్సు చేస్తారు. మీరు తెలిపిన వివరాలు, లక్షణాల ప్రకారం రెండేళ్ల క్రితమే మీ భర్త కాలేయ వ్యాధి ‘బి’ స్థాయికి చేరుకున్నది. మద్యం మానలేకపోవడం వల్ల అది చివరిదశ ప్రారంభంలోకి ప్రవేశించినట్లు ఉన్నది. ఇప్పుడు మద్యం పూర్తిగా మానివేయడంతో పాటు కాలేయ మార్పిడి చికిత్స ఒక్కటే ఆయనను కాపాడగలదు. కాబట్టి మీరు ఆందోళన పడకుండా మీ డాక్టర్‌ను సంప్రదించి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు సిద్ధం కండి. కాలేయ క్యాన్సర్ వంశపారంపర్యమా? నా వయసు 24 ఏళ్లు. మా తాతగారి కాలం నుంచి కుటుంబంలో చాలామందికి కామెర్ల వ్యాధి వచ్చినట్లు పెద్దలు చెబుతుంటారు. మా కుటుంబంలో చాలామంది కాలేయ క్యాన్సర్‌తోనే చనిపోయారు. నాకు కూడా చిన్నప్పుడు కామెర్లు వచ్చాయి. కామెర్లు వచ్చినవాళ్లందరికీ తర్వాత కాలేయ క్యాన్సర్ వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. నివారణ మార్గాలేమిటి? దయచేసి చెప్పండి. – జగన్నాథరావు, నిజామాబాద్ కామెర్లు వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. కానీ వంశపారంపర్యంగా వచ్చే ఫ్యాటీలివర్ మాత్రం చాలామందిలో ఒక రకమైన క్యాన్సర్‌కు కారణమవుతుంది. మితిమీరిన మద్యం అలవాటు (నాలుగైదేళ్లకు పైబడి), హెపటైటిస్ ఎ, బి, సి, ఇ... అనే వైరస్ల వల్ల చాలా ఎక్కువ మంది మొదట కామెర్ల వ్యాధికి గురవుతుంటారు. వీటిలోనూ హెపటైటిస్ – ఎ, ఇ వైరస్ల వల్ల హఠాత్తుగా కామెర్లు వచ్చి మరణించే ప్రమాదం ఉంటుంది. కామెర్ల వ్యాధిని గుర్తించడంలో ఆలస్యం చేసినా లేదా నాటు మందులు వాడినా కాలేయానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. అది దీర్ఘకాలంలో ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. కాలేయ క్యాన్సర్ అనగానే అది మితిమీరిన మద్యం అలవాటు వల్ల వచ్చే వ్యాధి అని చాలామంది అనుకుంటారు. కానీ ఒక రకం క్యాన్సర్ మాత్రమే ఇలా అదుపు లేని ఆల్కహాల్ వల్ల వస్తుంది. చాలారకాల కాలేయ క్యాన్సర్లకు హెపటైటిస్ వైరస్లు కారణం అవుతున్నాయి. హెపటైటిస్ సోకినా కొంతమంది దాన్ని చాలా ఏళ్ల వరకు గుర్తించలేకపోతుంటారు. అలాంటి సమయాల్లో 20 – 30 ఏళ్ల తర్వాత కాలేయ క్యాన్సర్ బయటపడుతుండవచ్చు. బహుశా మీ కుటుంబంలోనూ ఈ విధంగా ఎక్కువ మందికి క్యాన్సర్ వచ్చి ఉండవచ్చు. కామెర్లకు ఇప్పుడు మంచి ఫలితాలు ఇవ్వగల మంచి మందులు అందుబాటులోకి వచ్చాయి. కానీ దీర్ఘకాలం పాటు వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం పరిస్థితి విషమించే ప్రమాదం ఉన్నందున కామెర్లు వచ్చినవారు తప్పనిసరిగా డాక్టరుకు చూపించుకొని తగిన చికిత్స తీసుకోవాలి. ఇక కాలేయ క్యాన్సర్ విషయానికి వస్తే కలుషితమైన ఆహారపదార్థాలు తినడం, ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, వంశపారంపర్యంగా వచ్చే ఫ్యాటీలివర్ డిసీజ్ వల్ల కాలేయం దెబ్బతిని... క్యాన్సర్ వస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది. శరీరంలో కొంత కొవ్వు ఉండటం సహజమే. కానీ శరీరపు బరువులో అది పది శాతాన్ని మించినప్పుడు ఫ్యాటీ లివర్ వస్తుంది. మధ్య వయసు, ఊబకాయం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువ. హీమోక్రొమటోసిస్ (శరీరంలో ఇనుము ధాతువు పెరిగిపోవడం), చాలాకాలంగా తగ్గకుండా ఉన్న హెపటైటిస్ వ్యాధుల వల్ల కూడా కాలేయానికి క్యాన్సర్ సోకవచ్చు. కారణం ఏదైనా సరే కామెర్లు కనిపించగానే తగిన పరీక్షలు చేయించుకొని, డాక్టర్లతో చికిత్స చేయించుకోవడం ద్వారా కాలేయం దెబ్బతినకుండా చూసుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో కాలేయ క్యాన్సర్‌ను నివారించుకోవచ్చు. డాక్టర్ బాలచంద్రన్ మీనన్, సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, కాలేయ వ్యాధులు అండ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగం, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
మా బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టండి
అమృతవారిపల్లె(ఓబులవారిపల్లె) : మండలంలోని అమృతవారిపల్లె గ్రామానికి చెందిన తలపల సుభాషిణి, తలపల వెంకటేష్ దంపతులకు మూడవ సంతానం దేవాన్ష్ (12 నెలలు). పుట్టిన మూడు నెలల నుంచి కడుపు ఉబ్బుతుండటంతో తిరుపతిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కాలేయవ్యాధి అని వైద్యులు నిర్ధారించారు. అప్పటినుంచి చికిత్స చేయిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం తమిళనాడు లోని రాయవేలూరుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచిం చారు. వ్యవసాయ కూలి పనులు చేసుకునే వెంకటేష్ సుమారు రూ.3లక్షలు ఖర్చుచేసి వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో కాలేయానికి శస్త్రచికిత్స చేయించారు. అయినా కాలేయ సమస్య తగ్గకపోవడంతో మళ్లీ వేలూరు సీఎంసీకి వెళ్లమని వైద్యులు తల్లిదండ్రులకు తెలిపారు. అప్పుచేసి దేవాన్ష్ కు వైద్యం చేయించినా ఫలితం లేకపోగా.. మళ్లీ వైద్యం చేయించే స్థోమత లేకపోయినా..బిడ్డను బతికించుకోవాలనే తపనతో హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అయితే కాలేయ మార్పిడి చేసేందుకు రూ.25లక్షలు ఖర్చు అవుతుందని వీలైనంత త్వరగా చేయించాలని వైద్యులు తెలపడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఇంటికి చేరుకున్నారు. అప్పటినుంచి కాలేయ మార్పిడికి ఒక్కసారిగా అంత డబ్బులు లేకపోవడంతో చికిత్స చేయించలేక ఇంటివద్దనే ఉంటూ మందులు వాడుతున్నారు. దేవాన్ష్ ఏమి తిన్నా కూడా కడుపు ఉబ్బి పెద్దది అవుతుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. చిన్నారి కాలేయమార్పిడికి దాతలు సహకరించి ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ప్రాణాయామం
ఉజ్జయి ప్రాణాయామం ఈ ప్రాణాయామాన్ని సాధన చేస్తే గొంతు, ముక్కు, చెవుల సమస్యలతోపాటు టీబీ, కఫం, ఉబ్బసం, ఉదర సంబంధిత రోగాలు కూడా నయమవుతాయి. మెదడు వేడి తగ్గుతుంది. శ్వాసకోశ వ్యవస్థ, కాలేయం శక్తిమంతం అవుతాయి. వీర్యపుష్టినిస్తుంది. ఇంకా గుండె వ్యాయామం చేసినట్లే. ఎలా చేయాలంటే... వజ్రాసనం లేదా పద్మాసన స్థితిలో కూర్చుని వెన్నెముకను నిటారుగా ఉంచాలి. ఎడమచేతిని చూపుడు వేలిని, బొటన వేలిని చివరలను కలిపి ఉంచేలా (చిన్ముద్రలో) ఉంచి ఆ చేతిని ఎడమ తొడ మీద పెట్టాలి. కుడి చేతి చూపుడు వేలు, మధ్య వేలిని మూసి బొటన వేలితో ముక్కు కుడిరంధ్రాన్ని, ఉంగరపు వేలు, చిటికెన వేలితో ఎడమ రంధ్రాన్ని పాక్షికంగా మూయాలి. ఇప్పుడు కళ్లు మూసుకుని గొంతుతో శబ్దం చేస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. పూర్తిగా శ్వాస తీసుకున్న తర్వాత ముక్కు రంధ్రాలను పూర్తిగా మూసి శక్తి మేరకు అంతర కుంభకం (పొట్ట కండరాలను కదిలించడం) చేయాలి. ఆ తర్వాత తల పెకైత్తి శబ్దం చేస్తూ శ్వాసను వదలాలి. శబ్దం మధురంగా ఉండాలి. అంతేతప్ప తీవ్రస్థాయిలో ఉండకూడదు. ఇలా పది నుంచి 12 సార్లు చేసిన తరవాత విశ్రాంతి తీసుకోవాలి. గమనిక: మొదటి దశలోనే 10 రౌండ్లు చేయడం కష్టం. కాబట్టి ఐదారు రౌండ్లతో సరిపెట్టి, నిదానంగా పెంచుకోవాలి.శ్వాసను తీసుకునేటప్పుడు, వదిలేటప్పుడు కూడా ముక్కు రంధ్రాలను పాక్షికంగా మూసి ఉంచాలి. శబ్దం మొదటి నుంచి చివరి వరకు మృదువుగా ఒకే స్థాయిలో ఉండాలి. హెచ్చుతగ్గులు ఉండకూడదు. -
దత్తుపై దయచూపండి..
ప్రస్తుతం ప్రాణాపాయ పరిస్థితి శస్త్రచికిత్స చేయాలంటే రూ.25 లక్షలు అవసరం అప్పులు చేసి, ఉన్నదంతా ఖర్చుపెట్టిన తల్లిదండ్రులు ఏమీ చేయలేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు ఆదిలాబాద్ రిమ్స్ : పంతొమ్మిదేళ్ల వయసులో చలాకిగా ఉండాల్సిన ఆ యువకుడు.. మంచానికే పరిమితమయ్యాడు. ఆ వయసులో అందరిలా తాను చదువుకోవాలని.. ఆటలాడాలని.. ఆశ ఉన్నా అనారోగ్యం అతడి పాలిట శాపంగా మారింది. లివర్ చెడిపోయి అతని బతుకు దుర్భరంగా మారింది. పొట్ట ఉబ్బి, కాళ్లు, చేతులు వాపులతో అసలు నడవడానికే ఇబ్బంది పడుతున్నాడా యువకుడు. వైద్యం కోసం ఎదురుచూస్తున్నాడు. ఎనిమిదేళ్లుగా అనారోగ్యమే.. ఆదిలాబాద్ పట్టణం రాంనగర్ కాలనీకి చెందిన దుమ్మ వనిత, భగవాండ్లు దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు. గతంలోనే కూతురు హేమలత వివాహం చేయగా, ప్రస్తుతం కుమారుడు దత్తాత్రి డిగ్రీ తతీయ సంవత్సరం చదువుతున్నాడు. 2008లో జాండీస్ రావడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు దత్తుకు లివర్ పాడైపోయిందని తెలిపారు. దీంతో ప్రతీ నెల ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చికిత్సలతో ప్రతీ నెల దాదాపు రూ.20 వేల ఖర్చు వచ్చేది. ఇలా ఏడాది పాటు వైద్యం చేయించుకున్నారు. అక్కడ నయం కాకపోవడంతో మళ్లీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చూపించారు. మళ్లీ హైదరాబాద్‌లోని మెడిసిటీలో మూడేళ్ల పాటు చికిత్స చేయించుకున్నారు. ఇలా మూడేళ్లలో రూ.2 లక్షలు ఖర్చయ్యాయి. అక్కడ నుంచి మళ్లీ వార్దాలో నెలరోజుల పాటు చికిత్స అందించారు. ఇలా ప్రతినెల ఆస్పత్రులు చుట్టూ తిరిగిన వ్యాధి నయం కాలేదు. ఇప్పటి వరకు రూ.10 లక్షల వరకు ఖర్చు చేసినట్లు దత్తు తల్లిదండ్రులు తెలుపుతున్నారు. ఇప్పటికే బ్యాంకులో రూ. 2 లక్షలు అప్పుతీసుకోగా, రూ. 3 లక్షల వరకు ప్రై వేట్ అప్పులు చేసి కొడుకు చికిత్స అందిస్తున్నారు. ఉస్మానియా, యశోద ఆస్పత్రులకు వెళ్లినా ప్రయోజనం లేదు. రూ.25 లక్షల వరకు చెల్లిస్తే శస్త్రచికిత్స చేస్తామని ప్రైవేట్ ఆస్పత్రులు చెప్పడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. ప్రస్తుతం రెండు నెలలుగా దత్తు మంచానికి పరిమితమయ్యాడు. రిమ్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స తీసుకుంటున్నాడు. దత్తు తండ్రి భగవాండ్లు ఔట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదత్తుకు సపర్యాలు చేస్తూ ఇంట్లోనే ఉంటోంది. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఎవరైనా దాతలు ఆదుకుని తమ కొడుకును కాపాడాలని ఆ తల్లిదండ్రులు వనిత, భగవాండ్లు వేడుకుంటున్నారు. -
చిన్నారి జ్ఞానసాయి శస్త్రచికిత్సకు ఏర్పాట్లు
చెన్నై: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 6 నెలల చిన్నారి జ్ఞానసాయి చికిత్సకు సాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిలో జ్ఞానసాయిని డాక్టర్ రేల పరీక్షించారు. ప్రస్తుతం పాప పరిస్థితి మామూలుగానే ఉందని అన్నారు. చిన్నారి తల్లిదండ్రుల కాలేయం పరిశీలించిన తర్వాత శస్త్రచికిత్సకు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అయితే శస్త్ర చికిత్సకు 10 నుంచి 15 రోజుల సమయం పడుతుందని గ్లోబల్ హాస్పటల్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. కాలేయ సమస్య కారణంగా మెర్సీకిల్లింగ్‌కు అనుమతించాలని గతంలో జ్ఞానసాయి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
నా బిడ్డను కాపాడండి
- ఓ పేద తండ్రి వేడుకోలు - రూ.25 లక్షలు ఉంటేనే లివర్ మార్పిడి సాధ్యమన్న వైద్యులు - ఇప్పటికే రూ.7లక్షలు అప్పు - ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు ధర్మవరం అర్బన్: ‘లివర్ సమస్యతో బాధపడుతున్న మా బిడ్డను ఆదుకోండి’ అంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. ధర్మవరం పట్టణంలోని తారకరామాపురంలో నివసిస్తున్న షేక్ ఖాజా మోహిద్దిన్, రఫి మున్నిసా దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. ఖాజా టైలరింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశారు. మూడో అమ్మాయి షేక్ ఇంతియాజ్ బీ వయస్సు 17ఏళ్లు. ఈమె 2003లో అనారోగ్యంతో బాధపడుతుండడంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో లివర్ ఆపరేషన్ చేయించారు. తరువాత 2008లో మరోసారి లివర్ సమస్యతో అనారోగ్యానికి గురైంది. అప్పుడు హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో మరోసారి ఆపరేషన్ చేయించారు. అయినా ఇంతియాజ్బీకి జబ్బు తగ్గలేదు. లివర్ పూర్తిగా చెడిపోవడంతోపాటు కడుపు మీద పెద్ద కణితి పెరిగింది. 2014లో బెంగళూరులోని బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు లివర్ పూర్తిగా చెడిపోయిందని, లివర్ మార్పిడి చేయాలని తేల్చిచెప్పారు. దీనికి రూ.25లక్షలు వరకు ఖర్చు వస్తుందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే రూ.7లక్షలు అప్పులు చేసి వాటికి వడ్డీలు చెల్లించలేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఖాజామోహిద్దిన్ రూ.25 లక్షలు తేలేనని బోరున విలపించాడు. ప్రతి నెలా రెండుసార్లు వైద్య పరీక్షలు చేసేందుకు రూ.10 వేలు వరకు వెచ్చిస్తూ కళ్లముందు కూతురు నరకయాతన పడుతుంటే ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోయాడు. వయసు మీద పడటంతో టైలరింగ్ వృత్తిని మానేసి దుప్పట్లు, దుస్తుల వ్యాపారం చేస్తున్నాడు. వచ్చిన సొమ్మంతా కూతురు వైద్యానికే ఖర్చు చేస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. సీఎం, పీఎంకు లేఖలు ఇంతియాజ్బీ వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లెటర్లు రాశారు. కానీ వారు ఎవరూ స్పందించలేదు. దీంతో తన కూతురుకు లివర్ మార్పిడికి రూ.25లక్షలు ఖర్చు అవుతుందని, ఎవరైనా ఆర్థిక సాయం చేయాలని తండ్రి ఖాజామోహిద్దిన్ కోరుతున్నారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న నా కూతురుని ఆదుకునేందుకు ఆపన్నహస్తం అందించాలని వేడుకుంటున్నారు. దాతలు ఎవరైనా 9642238566, 9000220036 ఫోన్ నెంబర్లను సంప్రదించాలన్నారు. తన కూతురు ఇంతియాజ్బీ పేరు మీద ఉన్న ఆంధ్రా బ్యాంక్ అకౌంట్ నెంబరు:010110100118281కు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. -
పాపం చిన్నోడు..
కాలేయ సమస్యతో నాలుగేళ్ల బాలుడి అవస్థ మెరుగైన వైద్యానికి రూ.20 లక్షలు ఆర్థిక స్థోమత లేక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు దాతల కోసం ఎదురుచూస్తున్న పేదకుటుంబం పేద కుటుంబానికి పెద్ద కష్టమొచ్చింది. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ తమ ఇద్దరు సంతానాన్ని పోషించుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. ఇంతలో పిడుగులాంటి వార్త అందడంతో ఒక్కసారిగా చతికిలపడ్డారు. నాలుగేళ్ల బాబుకు కాలేయ మార్పిడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో తల్లడిల్లిపోతున్నారు. మెరుగైన వైద్యం చేయించాలంటే దాదాపు రూ.20 లక్షలు కావాల్సి ఉండడంతో ఏమి చేయాలో పాలుపోక.. దాతల కోసం ఎదురు చూస్తున్నారు. వివరాల ఇలా.. - ఖైరతాబాద్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం యగువమెట్ట గ్రామానికి చెందిన పోకపూడి వెంకటేశ్వర్లు, మంజుల దంపతులు. వీరికి హేమలత(6), హరీష్(4) సంతానం. వ్యవసాయ కూలీగా పని చేస్తూ బతుకీడుస్తున్నారు. ఏడాదిన్నర కిందట బాబు హరీష్ అనారోగ్యం బారిన పడ్డాడు. వెంటనే నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాలలో చేర్పించి వరబీజం ఆపరేషన్ చేయించారు. ఆ తరువాత తరచూ పొట్ట ఉబ్బడం, ముందుకు రావడం ప్రారంభమైంది. ఓసారి ఆడుకుంటూ ఉండగా ముక్కులోంచి రక్తం కారడంతో పడిపోయాడు. హుటాహుటిన బాబును ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు లివర్ సమస్య ఉందని చెప్పారు. ఈనెల 12న హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ గ్లోబల్ హాస్పిటల్‌కు హరీష్‌ను తీసుకొచ్చి సీనియర్ హెపటాలజిస్ట్కు చూపించారు. పరీక్షలు చేసిన అనంతరం బాబుకు ‘క్రానిక్ లివర్ డిసీజ్’ ఉందని.. కాలేయం రాయిలాగా మారిందని... బాబు బతకాలంటే లివర్ మార్పిడి అత్యవసరమని తేల్చి చెప్పారు. లివర్ మార్పిడి చేయకుండా చికిత్స ద్వారా తగ్గించే దశ కూడా దాటిపోయిందన్నారు. ఆపరేషన్‌తోపాటు ఆ తరువాత అయ్యే ఖర్చులకు రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. అంత ఖర్చు చేసే పరిస్థితి లేక ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దాతలెవరైనా ముందుకు వస్తే తమ బాబు బతుకుతాడని వారు అర్థిస్తున్నారు. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు... పోకపూడి మంజుల, సిండికేట్ బ్యాంక్, స్రావిపల్లి, నెల్లూరు జిల్లా అకౌంట్ నెం: 34812210029267, ఐఎఫ్ఎస్సీ: ఎస్వైఎన్డీ0003481’ ఖాతాలో జమచేయవచ్చని ఆ బాలుడి తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, మంజుల కోరుతున్నారు. ఫోన్ ద్వారా అయితే 9652248372 నంబర్ ద్వారా తమను సంప్రదించవచ్చని వారు సూచించారు.