నా బిడ్డను కాపాడండి
- ఓ పేద తండ్రి వేడుకోలు
- రూ.25 లక్షలు ఉంటేనే లివర్ మార్పిడి సాధ్యమన్న వైద్యులు
- ఇప్పటికే రూ.7లక్షలు అప్పు
- ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
ధర్మవరం అర్బన్: ‘లివర్ సమస్యతో బాధపడుతున్న మా బిడ్డను ఆదుకోండి’ అంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. ధర్మవరం పట్టణంలోని తారకరామాపురంలో నివసిస్తున్న షేక్ ఖాజా మోహిద్దిన్, రఫి మున్నిసా దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. ఖాజా టైలరింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశారు. మూడో అమ్మాయి షేక్ ఇంతియాజ్ బీ వయస్సు 17ఏళ్లు. ఈమె 2003లో అనారోగ్యంతో బాధపడుతుండడంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో లివర్ ఆపరేషన్ చేయించారు.
తరువాత 2008లో మరోసారి లివర్ సమస్యతో అనారోగ్యానికి గురైంది. అప్పుడు హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో మరోసారి ఆపరేషన్ చేయించారు. అయినా ఇంతియాజ్‌బీకి జబ్బు తగ్గలేదు. లివర్ పూర్తిగా చెడిపోవడంతోపాటు కడుపు మీద పెద్ద కణితి పెరిగింది. 2014లో బెంగళూరులోని బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు లివర్ పూర్తిగా చెడిపోయిందని, లివర్ మార్పిడి చేయాలని తేల్చిచెప్పారు. దీనికి రూ.25లక్షలు వరకు ఖర్చు వస్తుందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే రూ.7లక్షలు అప్పులు చేసి వాటికి వడ్డీలు చెల్లించలేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఖాజామోహిద్దిన్ రూ.25 లక్షలు తేలేనని బోరున విలపించాడు. ప్రతి నెలా రెండుసార్లు వైద్య పరీక్షలు చేసేందుకు రూ.10 వేలు వరకు వెచ్చిస్తూ కళ్లముందు కూతురు నరకయాతన పడుతుంటే ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోయాడు. వయసు మీద పడటంతో టైలరింగ్ వృత్తిని మానేసి దుప్పట్లు, దుస్తుల వ్యాపారం చేస్తున్నాడు. వచ్చిన సొమ్మంతా కూతురు వైద్యానికే ఖర్చు చేస్తూ అష్టకష్టాలు పడుతున్నారు.
సీఎం, పీఎంకు లేఖలు
ఇంతియాజ్‌బీ వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లెటర్‌లు రాశారు. కానీ వారు ఎవరూ స్పందించలేదు. దీంతో తన కూతురుకు లివర్ మార్పిడికి రూ.25లక్షలు ఖర్చు అవుతుందని, ఎవరైనా ఆర్థిక సాయం చేయాలని తండ్రి ఖాజామోహిద్దిన్ కోరుతున్నారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న నా కూతురుని ఆదుకునేందుకు ఆపన్నహస్తం అందించాలని వేడుకుంటున్నారు. దాతలు ఎవరైనా 9642238566, 9000220036 ఫోన్ నెంబర్లను సంప్రదించాలన్నారు. తన కూతురు ఇంతియాజ్‌బీ పేరు మీద ఉన్న ఆంధ్రా బ్యాంక్ అకౌంట్ నెంబరు:010110100118281కు ఆర్థిక సహాయం చేయాలని కోరారు.