సీఎం జగన్‌కు సెల్యూట్ చేస్తున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితరులు
శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా): బిడ్డకు పచ్చకామెర్లు.. ఒళ్లంతా దద్దుర్లు.. జన్యుపరమైన లివర్ సమస్య.. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేయించాల్సిన పరిస్థితి.. దీనికి తోడు భారీ ఖర్చు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇలాంటి స్థితిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారిని ఆదుకుని రూ.17.5 లక్షలు విడుదల చేయడంతో చిన్నారి ప్రాణాలు నిలిచాయి. దీంతో ఆ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. శనివారం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డితో కలిసి వారు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తిలోని బీపీ అగ్రహారానికి చెందిన జగదీష్, లక్ష్మి దంపతులకు మునీశ్వర్ (10 నెలలు) అనే బాబు ఉన్నాడు.
చిన్నారికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డిని కలిసి సహాయం కోరారు. ఆయన వెంటనే స్పందించి వారిని చెన్నైలోని గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రికి పంపారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు జన్యుపరమైన లివర్ సమస్య ఉన్నట్టు నిర్ధారించారు. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేయాల్సి వస్తుందని, అందుకు సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. ఎమ్మెల్యే చొరవ, చిన్నారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రూ.17.5 లక్షలకు ఆపరేషన్ చేయడానికి ముందుకు వచ్చారు.
ఈ విషయాన్ని ఎమ్మెల్యే బియ్యపు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించగా ఆయన వెంటనే రూ.17.5 లక్షలను ఆస్పత్రికి చెల్లించడానికి అధికారులకు అనుమతి ఇచ్చారు. వైద్యులు చిన్నారి తండ్రి నుంచి 20 శాతం లివర్ తీసుకుని.. చిన్నారికి లివర్ మార్పిడి చేశారు. 12 గంటలపాటు శ్రమించి ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు సీఎం వైఎస్ జగన్‌కు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment