లివర్‌ ట్యూమర్లతో కాలేయం పాడైందట.. | health counciling | Sakshi
Sakshi News home page

లివర్‌ ట్యూమర్లతో కాలేయం పాడైందట..

Published Fri, Apr 6 2018 12:28 AM | Last Updated on Fri, Apr 6 2018 12:28 AM

health counciling - Sakshi

లివర్‌  కౌన్సెలింగ్‌

నా వయసు 55 ఏళ్లు. నాకు మద్యం తాగే అలవాటు ఉంది. అయితే కొన్ని నెలల క్రితం నాకు ఆరోగ్యపరమైన సమస్యలు రావడంతో డాక్టర్‌ సలహాలతో మద్యం పూర్తిగా మానేశాను. అయినా ఇంకా అనారోగ్యం వెంటాడుతూనే ఉంది. మళ్లీ డాక్టర్‌ దగ్గరకు వెళ్లాను. ఆయన కొన్ని పరీక్షలు చేసి ‘లివర్‌ ట్యూమర్‌’ కారణంగా లివర్‌ పాడైందనీ, అలాగే ‘అల్ఫా పెటోప్రొటీన్‌’ అత్యధికంగా లక్షకు మించిపోయిందని, దాంతో లివర్‌ సరిగా పనిచేయడం మానేసిందని తెలిపారు. లివర్‌ మార్పిడి చేసుకోకపోతే బతకడం కష్టమని కూడా చెప్పారు. కుటుంబానికి నేనే ఆధారం. నాకు తగిన సలహా ఇవ్వండి. 
– కె. వెంకటాచారి, సిద్ధిపేట 

మీరు తెలిపిన వివరాల ప్రకారం మీ లివర్‌ కండిషన్‌ చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని చెప్పవచ్చు. లిక్కర్‌ లివర్‌కు ప్రధాన శత్రువు. అతిగా మద్యం సేవించే అలవాటు వల్ల లివర్‌ పూర్తిగా డ్యామేజీ అవుతుంది. లివర్‌ క్యాన్సర్‌ లేదా లివర్‌ సిర్రోసిస్‌ బారిన పడుతుంది. మీరు మద్యాన్ని మానివేసే సమయానికే మీ కాలేయం బాగా పాడైపోయి ఉండవచ్చు. కాలేయం క్షీణత అనేది మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశ (చైల్డ్‌ గ్రేడ్‌–ఏ)లో లివర్‌పై ట్యూమర్లు దాడి చేసినట్టు గుర్తించి, సరైన చికిత్స అందిస్తే దాదాపు 70 శాతం వరకు దానిని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పటికే ట్యూమర్లు మళ్లీ తిరగబడినా, లివర్‌కు మాత్రం ఐదేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రీట్‌మెంట్‌ ఇచ్చే అవకాశం ఉంది. రెండో దశలో ట్యూమర్ల పరిమాణం పెరిగి చికిత్సకు ఇబ్బందిగా మారుతుంది. అప్పుడు కేవలం కాలేయ మార్పిడి ద్వారానే పేషెంట్‌ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. అది కూడా ట్యూమర్లు ఐదు సెంటీమీటర్ల కంటే తక్కువ సైజులో ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఫలితం దాదాపు 70 – 80 శాతం మేరకు ఉంటుంది. ఇక చివరిదైన మూడోదశకు వస్తే... లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ తప్ప వేరే మార్గమే లేదు. ఈ పరిస్థితిలో పేషెంట్‌కి వివిధ స్టేజెస్‌లో, రకరకాల చికిత్స విధానాల్ని అవలంబించాల్సి  వస్తుంది. ట్యూమర్ల కారణంగా లివర్‌ పూర్తిగా చెడిపోవడం జరిగింది. కాబట్టి దాని చుట్టుపక్కల కూడా వాటి ప్రభావం ఉంటుంది. అలాగే ట్యూమర్ల వ్యాధిని కూడా నియంత్రించాలి. ఇందుకు పరిస్థితిని బట్టి లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ముందే కీమోథెరపీ లేదా రేడియోథెరపీలు చేసి కాలేయానికి ఉన్న ట్యూమర్లను పూర్తిగా తొలగించి, వాటిని నిర్వీర్యం చేస్తారు. దాంతో పేషెంట్‌ శరీరం కాలేయ మార్పిడి చేసే పరిస్థితికి చేరుకుంటుంది. అప్పుడు శస్త్రచికిత్స నిర్వహించి రోగికి మ్యాచ్‌ అయిన లివర్‌ను అమర్చుతారు. లివర్‌ లభ్యత రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీ బ్లడ్‌గ్రూప్‌నకు సరిపోలిన వారు ముందుకు రావాలి. దీన్ని ‘లైవ్‌ డోనార్‌’ అని అంటారు. ఇది సురక్షితమైన విధానం. రెండోది ‘కెడావర్‌ డోనార్‌’ అంటారు. దీనికి దాతలపై ఆధారపడాల్సి వస్తుంది. అది లభించినప్పుడు డాక్టర్లు సర్జరీని నిర్వహిస్తారు. ఇక ఆలస్యం చేయకుండా ముందుగా మీరు నిపుణులైన వైద్యుడిని సంప్రదించి లివర్‌ ఏ స్టేజ్‌లో ఉందో పరీక్షల ద్వారా తెలుసుకొని వెంటనే తగిన చికిత్సను పొందండి. 

మద్యంతో  కాలేయం దెబ్బతింది...  పరిష్కారం  చెప్పండి
మావారి వయసు 53 ఏళ్లు. గడచిన 25 ఏళ్ల నుంచి మద్యం అలవాటు ఉంది. రెండేళ్ల కిందట తీవ్ర అనారోగ్యానికి గురైతే ఆసుపత్రిలో చేర్పించాం. లివర్‌ దెబ్బతిన్నదని చెప్పారు. తాగడం మానేయమన్నారు. లేదంటే లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఆయన మానలేకపోయారు. ఇటీవల తరచూ చాలా నీరసంగా ఉంటుందంటున్నారు. ఎక్కువగా నిద్రపోతున్నారు. తిండి బాగా తగ్గించారు. మావారి సమస్యకు పరిష్కారం చెప్పండి. 
– ప్రసూన, షాద్‌నగర్‌ 

మితిమీరిన మద్యపానం వల్ల మీ భర్త కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నది. కాలేయం తనకు నష్టం కలిగిస్తున్న అలవాట్లు, వ్యాధులను గుర్తించి, వాటిని సరిచేసుకోడానికి రోగికి చాలా అవకాశం ఇస్తుంది. మద్యపానం వంటి అలవాట్ల వల్ల దెబ్బతిన్నా, తొలిదశలో యథావిధిగా పనిచేస్తుంది. కానీ నిర్లక్ష్యం చేసినా, నష్టం కలిగించే అలవాటును మానకపోయినా దాని పనితీరు పూర్తిగా దెబ్బతింటుంది. వ్యాధుల వల్ల కాలేయానికి జరిగిన నష్టాన్ని బట్టి దానిని మూడు స్థాయిలుగా గుర్తిస్తారు. వాటిని ఎ, బి, సి ‘చైల్డ్‌ పగ్‌ స్టేజెస్‌’ అంటారు. ‘ఎ’ చైల్డ్‌ స్థాయిలోనే డాక్టర్‌ వద్దకు రాగలిగితే మందులతో, అలవాట్లలో మార్పులతో చికిత్స చేసి, కాలేయ పనితీరును పూర్తి సాధారణ స్థాయికి పునరుద్ధరించవచ్చు. మొదటి రెండు (ఎ, బీ ఛైల్డ్‌ స్టేజెస్‌) స్థాయిల్లోనూ చాలావరకు తిరిగి కోలుకోవడానికి కాలేయం అవకాశం ఇస్తుంది. బీ, సీ స్థాయిలలో వస్తే వ్యాధి తీవ్రత, వ్యక్తి తట్టుకోగల శక్తిని అంచనావేసి, కాలేయమార్పిడి చికిత్సను సిఫార్సు చేస్తారు. మీరు తెలిపిన వివరాలు, లక్షణాల ప్రకారం రెండేళ్ల క్రితమే మీ భర్త కాలేయ వ్యాధి ‘బి’ స్థాయికి చేరుకున్నది. మద్యం మానలేకపోవడం వల్ల అది చివరిదశ ప్రారంభంలోకి ప్రవేశించినట్లు ఉన్నది. ఇప్పుడు మద్యం పూర్తిగా మానివేయడంతో పాటు కాలేయ మార్పిడి చికిత్స ఒక్కటే ఆయనను కాపాడగలదు. కాబట్టి మీరు ఆందోళన పడకుండా మీ డాక్టర్‌ను సంప్రదించి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు సిద్ధం కండి. 

కాలేయ క్యాన్సర్‌ వంశపారంపర్యమా? 
నా వయసు 24 ఏళ్లు. మా తాతగారి కాలం నుంచి కుటుంబంలో చాలామందికి  కామెర్ల వ్యాధి వచ్చినట్లు పెద్దలు చెబుతుంటారు. మా కుటుంబంలో చాలామంది కాలేయ క్యాన్సర్‌తోనే చనిపోయారు. నాకు కూడా చిన్నప్పుడు కామెర్లు వచ్చాయి. కామెర్లు వచ్చినవాళ్లందరికీ తర్వాత కాలేయ క్యాన్సర్‌ వస్తుందేమోనని ఆందోళనగా ఉంది.  నివారణ మార్గాలేమిటి? దయచేసి చెప్పండి. 
– జగన్నాథరావు, నిజామాబాద్‌ 

కామెర్లు వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. కానీ వంశపారంపర్యంగా వచ్చే ఫ్యాటీలివర్‌ మాత్రం చాలామందిలో ఒక రకమైన క్యాన్సర్‌కు కారణమవుతుంది. మితిమీరిన మద్యం అలవాటు (నాలుగైదేళ్లకు పైబడి), హెపటైటిస్‌ ఎ, బి, సి, ఇ... అనే వైరస్‌ల వల్ల చాలా ఎక్కువ మంది మొదట కామెర్ల వ్యాధికి గురవుతుంటారు. వీటిలోనూ హెపటైటిస్‌ – ఎ, ఇ వైరస్‌ల వల్ల హఠాత్తుగా కామెర్లు వచ్చి మరణించే ప్రమాదం ఉంటుంది. కామెర్ల వ్యాధిని గుర్తించడంలో ఆలస్యం చేసినా లేదా నాటు మందులు వాడినా కాలేయానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. అది దీర్ఘకాలంలో ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది.  కాలేయ క్యాన్సర్‌ అనగానే అది మితిమీరిన మద్యం అలవాటు వల్ల వచ్చే వ్యాధి అని చాలామంది అనుకుంటారు. కానీ ఒక రకం క్యాన్సర్‌ మాత్రమే ఇలా అదుపు లేని ఆల్కహాల్‌ వల్ల వస్తుంది. చాలారకాల కాలేయ క్యాన్సర్లకు హెపటైటిస్‌ వైరస్‌లు కారణం అవుతున్నాయి. హెపటైటిస్‌ సోకినా కొంతమంది దాన్ని చాలా ఏళ్ల వరకు గుర్తించలేకపోతుంటారు. అలాంటి సమయాల్లో 20 – 30 ఏళ్ల తర్వాత కాలేయ క్యాన్సర్‌ బయటపడుతుండవచ్చు. బహుశా మీ కుటుంబంలోనూ ఈ విధంగా ఎక్కువ మందికి క్యాన్సర్‌ వచ్చి ఉండవచ్చు. 

కామెర్లకు ఇప్పుడు మంచి ఫలితాలు ఇవ్వగల మంచి మందులు అందుబాటులోకి వచ్చాయి. కానీ దీర్ఘకాలం పాటు వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం పరిస్థితి విషమించే ప్రమాదం ఉన్నందున కామెర్లు వచ్చినవారు తప్పనిసరిగా డాక్టరుకు చూపించుకొని తగిన చికిత్స తీసుకోవాలి. ఇక కాలేయ క్యాన్సర్‌ విషయానికి వస్తే కలుషితమైన ఆహారపదార్థాలు తినడం, ఊబకాయం, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్, వంశపారంపర్యంగా వచ్చే ఫ్యాటీలివర్‌ డిసీజ్‌ వల్ల కాలేయం దెబ్బతిని... క్యాన్సర్‌ వస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది. శరీరంలో కొంత కొవ్వు ఉండటం సహజమే. కానీ శరీరపు బరువులో అది పది శాతాన్ని మించినప్పుడు ఫ్యాటీ లివర్‌ వస్తుంది. మధ్య వయసు, ఊబకాయం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువ. హీమోక్రొమటోసిస్‌ (శరీరంలో ఇనుము ధాతువు పెరిగిపోవడం), చాలాకాలంగా తగ్గకుండా ఉన్న హెపటైటిస్‌ వ్యాధుల వల్ల కూడా కాలేయానికి క్యాన్సర్‌ సోకవచ్చు. కారణం ఏదైనా సరే కామెర్లు కనిపించగానే తగిన పరీక్షలు చేయించుకొని, డాక్టర్లతో చికిత్స చేయించుకోవడం ద్వారా కాలేయం దెబ్బతినకుండా చూసుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో కాలేయ క్యాన్సర్‌ను నివారించుకోవచ్చు. 
డాక్టర్‌ బాలచంద్రన్‌ మీనన్,
సీనియర్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్, 
కాలేయ వ్యాధులు అండ్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ విభాగం, 
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement