పాపం చిన్నోడు..
కాలేయ సమస్యతో నాలుగేళ్ల బాలుడి అవస్థ
మెరుగైన వైద్యానికి రూ.20 లక్షలు
ఆర్థిక స్థోమత లేక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
దాతల కోసం ఎదురుచూస్తున్న పేదకుటుంబం
పేద కుటుంబానికి పెద్ద కష్టమొచ్చింది. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ తమ ఇద్దరు సంతానాన్ని పోషించుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. ఇంతలో పిడుగులాంటి వార్త అందడంతో ఒక్కసారిగా చతికిలపడ్డారు. నాలుగేళ్ల బాబుకు కాలేయ మార్పిడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో తల్లడిల్లిపోతున్నారు. మెరుగైన వైద్యం చేయించాలంటే దాదాపు రూ.20 లక్షలు కావాల్సి ఉండడంతో ఏమి చేయాలో పాలుపోక.. దాతల కోసం ఎదురు చూస్తున్నారు. వివరాల ఇలా..
- ఖైరతాబాద్
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం యగువమెట్ట గ్రామానికి చెందిన పోకపూడి వెంకటేశ్వర్లు, మంజుల దంపతులు. వీరికి హేమలత(6), హరీష్(4) సంతానం. వ్యవసాయ కూలీగా పని చేస్తూ బతుకీడుస్తున్నారు. ఏడాదిన్నర కిందట బాబు హరీష్ అనారోగ్యం బారిన పడ్డాడు. వెంటనే నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాలలో చేర్పించి వరబీజం ఆపరేషన్ చేయించారు. ఆ తరువాత తరచూ పొట్ట ఉబ్బడం, ముందుకు రావడం ప్రారంభమైంది. ఓసారి ఆడుకుంటూ ఉండగా ముక్కులోంచి రక్తం కారడంతో పడిపోయాడు. హుటాహుటిన బాబును ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు లివర్ సమస్య ఉందని చెప్పారు. ఈనెల 12న హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ గ్లోబల్ హాస్పిటల్‌కు హరీష్‌ను తీసుకొచ్చి సీనియర్ హెపటాలజిస్ట్‌కు చూపించారు. పరీక్షలు చేసిన అనంతరం బాబుకు ‘క్రానిక్ లివర్ డిసీజ్’ ఉందని.. కాలేయం రాయిలాగా మారిందని... బాబు బతకాలంటే లివర్ మార్పిడి అత్యవసరమని తేల్చి చెప్పారు. లివర్ మార్పిడి చేయకుండా చికిత్స ద్వారా తగ్గించే దశ కూడా దాటిపోయిందన్నారు.
ఆపరేషన్‌తోపాటు ఆ తరువాత అయ్యే ఖర్చులకు రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. అంత ఖర్చు చేసే పరిస్థితి లేక ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దాతలెవరైనా ముందుకు వస్తే తమ బాబు బతుకుతాడని వారు అర్థిస్తున్నారు. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు... పోకపూడి మంజుల, సిండికేట్ బ్యాంక్, స్రావిపల్లి, నెల్లూరు జిల్లా అకౌంట్ నెం: 34812210029267, ఐఎఫ్‌ఎస్‌సీ: ఎస్‌వైఎన్‌డీ0003481’ ఖాతాలో జమచేయవచ్చని ఆ బాలుడి తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, మంజుల కోరుతున్నారు. ఫోన్ ద్వారా అయితే 9652248372 నంబర్ ద్వారా తమను సంప్రదించవచ్చని వారు సూచించారు.