స్టాక్స్‌ బడిలో ‘టీనేజీ’ పాఠాలు! | Understanding the equity market from a young age essay | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌ బడిలో ‘టీనేజీ’ పాఠాలు!

Published Mon, Dec 16 2024 4:34 AM | Last Updated on Mon, Dec 16 2024 6:51 AM

Understanding the equity market from a young age essay

యుక్త వయసు నుంచే ఈక్విటీ మార్కెట్‌పై అవగాహన 

ముందస్తు పెట్టుబడితో కాంపౌండింగ్‌ 

దీర్ఘకాలంలో భారీ సంపద సృష్టి 

అందుబాటులో ఎన్నో కోర్సులు 

వర్చువల్‌ ట్రేడింగ్‌ వేదికలు 

పిల్లలకు నిపుణుల మార్గనిర్దేశం

పిల్లలు విద్యలో రాణిస్తుంటే తల్లిదండ్రుల ఆనందానికి హద్దులుండవు. వారి భవిష్యత్‌ బంగారమేనని మురిసిపోతుంటారు. తమ వారసులకు నాణ్యమైన విద్య, ఉపాధి మార్గం చూపడంతోనే తల్లిదండ్రుల బాధ్యత తీరిపోయినట్టు కాదు. సంపాదనను సంపదగా మార్చే విద్య కూడా వారికి చెప్పాలి. ఆర్ధిక అంశాలపై సమగ్రమైన అవగాహన వారిని స్థితిమంతులను చేస్తుంది. ఆర్ధిక సమస్యల్లో చిక్కుకోకుండా కాపాడుతుంది. 

ప్రతి ముగ్గురు అమెరికన్‌ ఈక్విటీ ఇన్వెస్టర్లలో ఒకరు 18 ఏళ్లకే ఈక్విటీల్లోకి అడుగు పెడుతున్నారు. మన దగ్గర 25 ఏళ్ల తర్వాతే ఎక్కువ మందికి ఈక్విటీల గురించి తెలుస్తోంది. స్టాక్స్‌ గొప్ప కాంపౌండింగ్‌ మెషిన్‌. ఎంత ముందుగా పెట్టుబడి మొదలు పెడితే, అన్ని రెట్లు అధిక ప్రతిఫలాన్ని ఇస్తుంది. గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని కమ్యూనిటీల్లో యుక్త వయసులోనే పిల్లలకు తల్లిదండ్రులు స్టాక్స్‌ పాఠాలు చెప్పడం మొదలు పెడతారు. పెట్టుబడుల వారసత్వాన్ని సైతం వారు ఎంతో కీలకంగా చూస్తారు. ఈ తరహా విధానం అందరికీ అనుసరణీయమేనన్నది నిపుణుల అభిప్రాయం.     

చిన్న నాటి నుంచే ఈక్విటీ పెట్టుబడుల పరిచయంతో భవిష్యత్తులో దాన్ని సంక్లిష్టంగా కాకుండా క్రమబద్ధంగా, సంపద సృష్టికి సులభమైన మార్గంగా చూడడం అలవడుతుందనేది ఈక్విరస్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఎండీ, సీఈవో అభిజిత్‌ భవే అభిప్రాయం. ‘‘ఆరంభానికి 16 ఏళ్ల వయసు అనువైనది. వాస్తవిక ఆర్ధిక విషయాలను వారు అప్పుడే అర్థం చేసుకోవడం మొదలవుతుంది. 

17 ఏళ్ల వయసుకు రిస్క్, రాబడి, దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధి తదితర అంశాలను అర్థం చేసుకోగలరు’’ అని అభిజిత్‌ భవే చెప్పారు. ‘‘టీనేజ్‌లో కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల ద్వారా పెట్టుబడుల గురించి వింటుంటారు. ఆ దశలోనే వారిలోని ఆసక్తిని గుర్తించి నేరి్పంచడం మొదలు పెట్టాలి. 15–16 ఏళ్లపుడు ఆరంభిస్తే.. 17–19 ఏళ్లు వచ్చే సరికి ఈక్విటీలను అర్థం చేసుకోగలరు. వీరిలో కొందరు కెరీర్‌గానూ మలుచుకునే అవకాశం ఉంటుంది’’ అని 5నాన్స్‌ డాట్‌ కామ్‌ వ్యవస్థాపకుడు దినేష్‌ రోహిరా సూచించారు. 

‘‘వారంతట వారే నేర్చుకునేలా పిల్లలను ప్రోత్సహించాలి. మెరుగైన మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు లేదా స్టాక్స్‌ను గుర్తించే అవకాశం కలి్పంచాలి. అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. నిర్ణయాలను నిందించకుండా, మంచి చెడుల పరంగా తీర్పు ఇవ్వకుండా తమ పెట్టుబడులు, తప్పిదాలు, విజయాల గురించి పంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. తమను తాము ఆవిష్కరించుకునే అవకావం ఇవ్వాలి’’ అని సెంటర్‌ ఫర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ లెరి్నంగ్‌ చైర్‌పర్సన్‌ ఉమా శశికాంత్‌ అన్నారు. ఇలా స్వేచ్ఛా వాతావరణం ఉంటే పిల్లలు సంతోషంగా పంచుకుంటారు.

 అప్పుడు వారి నిర్ణయాల్లోని లోపాలను ఎలా సరిచేసుకోవాలో వివరించి చెప్పొచ్చు. టీనేజ్‌ నుంచే వెన్నుతట్టి ప్రోత్సహించడం వల్ల సంపాదన మొదలయ్యే నాటికి వారు మెరికలుగా మారతారు. ‘‘ఈక్విటీల్లో కాంపౌండింగ్‌ (రాబడిపై రాబడి)కు సమయం కావాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ముందుగా ఈక్విటీ పెట్టుబడులను పరిచయడం చేయడం వల్ల, మార్కెట్లను మెరుగ్గా అర్థం చేసుకోగలిగి భవిష్యత్తులో అద్భుతమైన సంపదను సృష్టించుకోగలరు’’ అని రూపీ విత్‌ రుషబ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సరీ్వసెస్‌ వ్యవస్థాపకుడు రుషబ్‌ దేశాయ్‌ పేర్కొన్నారు.

ప్రాథమిక అంశాలు.. 
ఆర్ధిక అంశాలు, పెట్టుబడులు, వివిధ సాధనాల గురించి స్కూల్‌ పాఠాల్లో ఉండదు. కనుక వీటి గురించి చెప్పే బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలి. పదో తరగతి లేదా ఇంటర్‌లోకి వచి్చన వెంటనే ప్రాథమిక అంశాల గురించి అర్థమయ్యేలా వివరించి, కొన్ని కోర్సులను వారికి పరిచయం చేయాలి. దీంతో ఈక్విటీల గురించి మరింత లోతుగా నేర్చుకుంటారు. అయితే, మెజారిటీ తల్లిదండ్రులకు క్యాపిటల్‌ మార్కెట్లపై అవగాహన లేకపోవడం సమస్యగా పేర్కొన్నారు ఫిన్‌సేఫ్‌ ఇండియా వ్యవస్థాపకురాలు మృణ్‌ అగర్వాల్‌. అయినా సంకోచించకుండా, తమ పిల్లలను ఫైనాన్షియల్‌ ప్లానర్లు/ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్ల వద్దకు తీసుకెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్‌లైన్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

 ఒకవేళ తల్లిదండ్రులు స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టు అయితే, కంపెనీలు, వాటి ఈక్విటీ, ఆదాయం, లాభాలు, యాజమాన్యం, రుణభారం, వివిధ రకాల మ్యూచువల్‌ ఫండ్స్, వాటి పెట్టుబడుల విధానం, రిస్క్, రాబడులు, బేర్, బుల్‌ మార్కెట్లు, ఆటుపోట్లు (వోలటాలిటీ), పెట్టుబడుల్లో వైవిధ్యం, కాంపౌండింగ్, లక్ష్యాలను నిర్ణయించుకోవడం, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయడం తదితర అంశాల గురించి చెప్పాలి. ముందుగా పెట్టుబడులు ఆరంభించడం వల్ల రాబడిపై రాబడి (కాంపౌండింగ్‌) తోడయ్యి వచ్చే అద్భుత రాబడుల సూత్రాన్ని వివరించాలి. అధిక రాబడులు ఎప్పుడూ కూడా అధిక రిస్‌్కతో ఉంటాయన్న వాస్తవాన్ని తెలియజేయాలి. ఈ రిస్క్‌ను అధిగమించే వ్యూహాలపై అవగాహన కలి్పంచాలి.

పరిశోధన, అధ్యయనం 
17–19 ఏళ్ల వయసులో ప్రాథమిక అంశాలను దాటి లోతైన విశ్లేషణ, అధ్యయనాన్ని టీనేజర్లు ఆరంభించేలా చూడాలి. మార్కెట్లు, కంపెనీలను విశ్లేíÙంచే సామర్థ్యాలు కచ్చితంగా తెలియాలి. అప్పటికే ఎన్నో ఏళ్ల పాటు పెట్టుబడులు పెట్టిన అనుభవం, మార్కెట్లపై సమగ్రమైన అవగాహన ఉంటే తల్లిదండ్రులే వీటి గురించి వివరంగా చెప్పొచ్చు. లేదంటే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ కోర్సుల్లో వారిని చేర్పించాలి. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈతోపాటు మరికొన్ని సంస్థలు ఈక్విటీలు, పెట్టుబడులకు సంబంధించి పలు కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. నిపుణులు రాసిన చక్కని పుస్తకాలు కూడా ఉన్నాయి. పరిశ్రమకు చెందిన నిపుణులు వర్క్‌షాప్‌లు, వెబినార్లను నిర్వహిస్తుంటారు. వర్చువల్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు, వార్తా పత్రికలు సమాచార వేదికలుగా ఉపయోగపడతాయి. 

తొలుత ఆరంభ స్థాయి, తదనంతరం అడ్వాన్స్‌డ్‌ కోర్సుల్లో చేర్పించొచ్చు. ఆర్థిక అంశాలు, ఆర్ధిక వ్యవస్థల గురించి అవగాహన తప్పనిసరి. కంపెనీ ఆర్ధిక మూలాలు, కంపెనీ ఉత్పత్తులు లేదా సేవలు, వాటి ద్వారా ఆదాయం పొందుతున్న తీరు, కీలక రంగాలు, వాటి పనితీరు, అంతర్జాతీయ ధోరణులు మార్కెట్లపై ఎలా ప్రభావం చూపిస్తాయన్నది తెలియాలి. ఫండమెంటల్, టెక్నికల్‌ కోర్సులను నేరి్పంచాలి. ‘‘కంపెనీ బ్యాలన్స్‌ షీటును అర్థం చేసుకుని, విశ్లేషించే సామర్థ్యాలు అలవడితే, కంపెనీ నిధులను ఎలా వినియోగిస్తుందో తెలుసుకోగలిగితే అప్పుడు వారు తగిన కంపెనీని ఎంపిక చేసుకోగలరు. అప్పుడు అది పెట్టుబడి అవుతుందే కానీ, గ్యాంబ్లింగ్‌ కాబోదు. ఏమి చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నాం? అన్న స్పష్టత ఉండాలి’’ అని దినేష్‌ రోహిరా సూచించారు.  

రిస్క్‌లు/మోసాలు 
ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి రిస్‌్కలు, మోసాల గురించి వివరంగా చెప్పాలి. తప్పుడు సలహాలతో ఏర్పడే నష్టం, వేరొకరి సూచనను గుడ్డిగా అనుసరించడం వల్ల వచ్చే రిస్‌్కల గురించి, భావోద్వేగాల నియంత్రణ ప్రాధాన్యాన్ని అర్థమయ్యేలా వివరించాలి. వేగంగా డబ్బులు సంపాదించేయాలన్న ధోరణి అస్సలు పనికిరాదు. ఒకవేళ మీ పిల్లల్లో ఈ ధోరణిని గుర్తిస్తే వెంటనే దాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి.

 నేటి యువతరం ఎక్కువ మంది ఇదే ధోరణితో స్టాక్స్‌ వైపు అడుగులు వేస్తుండడాన్ని గమనించొచ్చు. క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడుల విధానానికి బదులు ట్రేడింగ్‌ వైపు మొగ్గు చూపిస్తున్నారు. డెరివేటివ్స్‌ లావాదేవీల్లో లాభం వచి్చనా, నష్టం వచి్చనా రూ.వేలు, రూ.లక్షల్లో ఉంటుంది. డెరివేటివ్స్‌ స్పెక్యులేటివ్‌ ఆధారితం. ఇందులో రిస్‌్కల పట్ల పిల్లల్లో అవగాహన తప్పనిసరి. కష్టార్జితాన్ని కాపాడుకుంటూ, మెరుగైన రాబడులు సంపాదించడమే కర్తవ్యంగా ఉండాలి. కానీ, స్వల్పకాలంలోనే సంపద కూడబెట్టడం అసాధ్యం అన్నది పిల్లలకు అర్థమయ్యేలా చేయాలి.  

వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్‌ తదితర ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వచ్చే స్టాక్‌ రికమండేషన్ల ఉచ్చులో పడకుండా, టిప్స్‌కు దూరంగా ఉండేలా చూడాలి. ‘‘అన్ని మార్గాల ద్వారా వస్తున్న సమాచారంతో ఈక్విటీ మార్కెట్లో డబ్బులు సంపాదించడం తేలికన్న భావన యువతలో సహజంగా ఏర్పడుతుంది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు అతిపెద్ద రిస్క్‌’’ అని మృణ్‌ అగర్వాల్‌ తెలిపారు. 

ఇతరులను గుడ్డిగా అనుసరిస్తే పెట్టుబడిని కూడా కోల్పోయే ప్రమాదం గురించి అర్థం కావాలి. నిజానికి సరైన రీతిలో వినియోగించుకుంటే సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్‌ వేదికల నుంచి ఎంతో కీలక సమాచారాన్ని పొందొచ్చు. సమాచార వడబోత గురించి టీనేజర్లకు తెలిస్తే తప్పటడుగులు వేయకుండా మెరుగైన రక్షణ ఏర్పడినట్టే. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, సెక్టోరల్‌/థీమ్యాటిక్‌ ఫండ్స్‌లో ఉండే అధిక రిస్‌్కపై అవగాహన కలి్పంచాలి. స్టాక్స్‌లో స్వల్పకాలిక అస్థిరతల ప్రభావంతో నియంత్రణ కోల్పోకుండా చూడాలి.  

పెట్టుబడులు–పర్యవేక్షణ 
టీనేజర్లలో స్టాక్స్, మ్యూచువల్‌ ఫండ్స్‌పై ఏ మేరకు అవగాహన, విజ్ఞానం వచ్చిందో కొంత పెట్టుబడి వారికి సమకూర్చి పరీక్షించొచ్చు. పిల్లలు అప్పటి వరకు దాచుకున్న పాకెట్‌ మనీ ఉంటే, దాన్ని కూడా పెట్టుబడిగా పెట్టేలా ప్రోత్సహించాలి. లేదంటే తల్లిదండ్రులే ఆరంభ పెట్టుబడి కింద రూ.10,000 సమకూర్చాలి. లావాదేవీలకు వీలుగా డీమ్యాట్, ట్రేడింగ్‌ ఖాతాలు వారి పేరిట తెరిపించాలి. 18 ఏళ్లు నిండగానే ఈ పనిచేయాలి. 18 ఏళ్లలోపే పిల్లలు వీటి గురించి మెరుగ్గా తెలుసుకున్నారని భావిస్తే, అప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరు తమ పేరిట ఖాతా తెరిచి, పిల్లలకు అందుబాటులో ఉంచాలి. 

మరోవైపు మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో పెట్టుబడులు పెట్టేలా చూడాలి. కొంత కాలానికి ఈ రెండింటి పనితీరును వారు పోల్చుకోగలరు. స్టాక్స్‌లో ఆటుపోట్లు ఎక్కువ. వీటిని ఫండ్స్‌ ఎలా అధిగమిస్తున్నాయన్నది తెలుసుకునే ఆసక్తి ఏర్పడుతుంది. ప్రతి 15 రోజులకు, నెల రోజులకు ఒకసారి పిల్లల పోర్ట్‌ఫోలియోను సమీక్షించి, అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ ప్రోత్సహించాలి. తప్పులను చూపించి నిందించడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు.

వర్చువల్‌ ట్రేడింగ్‌ వేదికలు 
నియోస్టాక్స్‌: వర్చువల్‌ ట్రేడింగ్‌కు సులభంగా, అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందులో రిజిస్టర్‌ చేసుకుని, సెక్యూరిటీలను ఎంపిక చేసుకుని ట్రేడింగ్‌ ప్రారంభించొచ్చు.  

స్టాక్‌ ట్రెయినర్‌ : మన దేశంతోపాటు ! అమెరికా సహా 15కు పైగా దేశాల స్టాక్స్‌ డేటాను ఈ ఆండ్రాయిడ్‌ యాప్‌ ఆఫర్‌ చేస్తోంది. వాటిలో వర్చువల్‌గా ట్రేడ్‌ చేసుకోవచ్చు. పనితీరును విశ్లేషించుకోవచ్చు.  

నేర్చుకునేందుకు వేదికలు.. 
ఎన్‌ఎస్‌ఈ అకాడమీ సర్టిఫికేషన్‌ ఇన్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌ (ఎన్‌సీఎఫ్‌ఎం):  నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) నిర్వహిస్తున్న అకాడమీ ఇది. ఆన్‌లైన్‌ ద్వారా ఎన్నో రకాల కోర్సులను అందిస్తోంది. బిగినర్, బేసిక్, ఇంటర్‌మీడియట్, అడ్వాన్స్‌డ్‌ ఇలా వివిధ దశల్లో వీటిని పొందొచ్చు. ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకుని, ఫీజు చెల్లించిన తర్వాత మెటీరియల్‌ పొందొచ్చు. సన్నద్ధమైన తర్వాత పరీక్షలు రాయవచ్చు. ఎన్‌ఎస్‌ఈ అకాడమీ డాట్‌ కామ్‌ పోర్టల్‌ను సంప్రదించాలి.  

బీఎస్‌ఈ ఇనిస్టిట్యూట్‌  
బీఎస్‌ఈ సబ్సిడరీ ఇది. మూడేళ్ల గ్రాడ్యుయేట్, ఏడాది, రెండేళ్ల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులను సైతం ఆఫర్‌ చేస్తోంది. ప్లస్‌2 తర్వాత వీటిలో చేరొచ్చు. రోజులు, వారాల నిడివితో స్టాక్‌ మార్కెట్లు, మ్యూచువల్‌ ఫండ్స్, డెరివేటివ్‌లపై స్వల్పకాలిక ప్రోగ్రామ్‌లు, కోర్సులను సైతం అందిస్తోంది.  

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్స్‌ (ఎన్‌ఐఎస్‌ఎం):  సెక్యూరిటీలపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో సెబీ అందిస్తోంది.  

ఉడెమీ : ఇదొక ఆన్‌లైన్‌ లెరి్నంగ్‌ ప్లాట్‌ఫామ్‌. ఉచిత కోర్సులు కూడా ఇక్కడ లభిస్తాయి. రూ.449 నుంచి చెల్లింపుల కోర్సులు కూడా ఉన్నాయి.

నేర్చుకోండి.. నేర్చుకోండి.. 
నేర్చుకోండి.. సరిగ్గా జీవించడమంటే అన్ని వేళలా నేర్చుకోవడమే.
– చార్లీ ముంగర్, విఖ్యాత ఇన్వెస్టర్‌   

– సాక్షి, బిజినెస్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement