రాహుల్, పూజ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. ఇద్దరికీ ఆఫీసులో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లపాటు వాళ్ల కాపురం అందంగా, ఆనందంగా సాగింది. ఆ తర్వాత అవగాహనలో సమస్యలు ఏర్పడ్డాయి, విభేదాలు పెరిగాయి. రాహుల్ తనకు తగినంత సమయం ఇవ్వడం లేదని పూజ భావిస్తోంది. ఆమె అవసరాలు తీర్చడాన్ని ఒత్తిడిగా రాహుల్ భావిస్తున్నాడు. ఈ విషయమై తరచూ గొడవలు పడుతున్నారు. ఆ గొడవలను వారికి వారు పరిష్కరించుకోలేక కౌన్సెలింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
మూలాలు బాల్యానుభవాల్లో..
మొదటి సెషన్‌లో విడివిడిగా రాహుల్, పూజలు తమ చిన్ననాటి అనుభవాలను వివరించారు. రాహుల్ చిన్నప్పుడు తన తల్లిదండ్రుల నుంచి ఎక్కువగా ఎమోషనల్ సపోర్ట్ పొందలేకపోయాడు. ఫలితంగా అతనిలో అవాయిడెంట్ అటాచ్‌మెంట్ ఏర్పడింది. దీంతో బంధాలలో సాన్నిహిత్యం కంటే స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటున్నాడు. పూజ బాల్యంలో తల్లిదండ్రుల నుంచి అనిశ్చితమైన ప్రేమను పొందింది. పూజ తల్లిదండ్రులు ఆమె ఎమోషనల్ అవసరాలను కొన్నిసార్లు తీర్చేవారు, మరికొన్నిసార్లు విస్మరించేవారు. ఫలితంగా ఆమెలో యాంగ్షియస్ అటాచ్‌మెంట్ ఏర్పడింది. తన భాగస్వామి కాస్త దూరంగా ఉంటే చాలు అభద్రతను, భయాన్ని అనుభవిస్తోంది. దాంతో నిత్యం తనతోనే ఉండాలని రాహుల్ పై ఒత్తిడి పెంచుతోంది. ఈ వ్యత్యాసాల కారణంగా చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారాయి. ఒకరినొకరు తీవ్రంగా ప్రేమిస్తున్నప్పటికీ అపార్థాలకు దారితీశాయి.
రెండు నెలల్లో సమస్యలు దూరం..
ఇద్దరితో మాట్లాడి, వారి అటాచ్‌మెంట్ స్టయిల్స్ గురించి, వాటివల్ల ఏర్పడుతున్న సమస్యల గురించి అర్థం చేసుకున్నాక, వాటిని బ్యాలెన్స్ చేయడానికి వారికి సూచించిన వ్యూహాలు కొన్ని..
1. రాహుల్ తన స్వేచ్ఛ కోసం చేసే పనులు ప్రేమను తిరస్కరించడం కాదని పూజ గుర్తించాలి. అలాగే తన నిరంతర ధ్రువీకరణ అవసరాన్ని పరిమితం చేసుకోవాలి.
2. ఇద్దరూ తమ భావోద్వేగాలను, అవసరాలను స్పష్టంగా, నిర్మాణాత్మకంగా కమ్యూనికేట్ చేయడం ప్రారంభించారు. ఉదాహరణకు, పూజకు ధ్రువీకరణ అవసరం ఉన్నప్పుడు, ఆమె ప్రశ్నల ద్వారా కాకుండా తన భావాలను చెప్పడం నేర్చుకుంది.
3. పూజకు ఇవ్వాల్సిన ఎమోషనల్
సపోర్ట్ ప్రాధాన్యాన్ని గుర్తించి రాహుల్.. ఆమెకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాడు.
అదే సమయంలో పూజ కూడా రాహుల్ స్వేచ్ఛకు గౌరవం ఇవ్వడం
తెలుసుకుంది.
4. ఇరువురూ తమ రోజువారీ జీవనంలో పరస్పర సహకారం, చిన్నచిన్న ఆనందాలను ఆస్వాదించేందుకు సమయం కేటాయించటం మొదలుపెట్టారు. ఉదాహరణకు, వారాంతాల్లో కలిసి వాకింగ్ చేయడం లేదా ఒక కొత్త హాబీని ఆరంభించడం లాంటివి.
రెండు నెలల కౌన్సెలింగ్ తర్వాత వారి సంబంధంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. దాంతో, వారి మధ్య గొడవలు తగ్గి, ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ పెరిగాయి.
అటాచ్‌మెంట్ థియరీ
మన చిన్ననాటి అనుభవాలు, పెంపకం విధానాలు మన ప్రస్తుత సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో వివరించే సిద్ధాంతమే అటాచ్‌మెంట్ థియరీ. బాల్యంలో తల్లిదండ్రులతో ఏర్పడే అనుబంధం, మన వ్యక్తిత్వానికి, భావోద్వేగ వ్యవహారానికి, ముఖ్యంగా ప్రేమ సంబంధాలకు మూలస్తంభం అవుతుంది. అయితే, ఈ అటాచ్‌మెంట్ శైలులు స్థిరమైనవి కావు, వాటిని మార్చుకోవచ్చు. ఇందులో మూడు రకాలున్నాయి.
సెక్యూర్ అటాచ్‌మెంట్
సెక్యూర్ అటాచ్‌మెంట్ కలిగిన వ్యక్తులు ప్రేమ, నమ్మకం, అనుబంధానికి ప్రాధాన్యమిస్తారు. ఇతరులతో సంబంధాలను బలంగా, స్వతంత్రంగా, అనురాగపూర్వకంగా నిర్వహించగలుగుతారు. ఉదాహరణకు ఒక సెక్యూర్ వ్యక్తి తన భాగస్వామి కొంత సమయం స్వతంత్రంగా గడపాలని కోరితే, దాన్ని సానుకూలంగా అర్థం చేసుకుంటాడు.
యాంగ్షియస్ అటాచ్‌మెంట్
యాంగ్షియస్ అటాచ్‌మెంట్ కలిగిన వ్యక్తులు సంబంధాల్లో ఎక్కువ భయాన్ని, అస్థిరతను అనుభవిస్తారు. వీరు ఎక్కువగా భావోద్వేగ ధ్రువీకరణ కోసం భాగస్వామిపై ఆధారపడతారు. ఉదాహరణకు భాగస్వామి తక్షణమే ఫోన్ కాల్‌కి ప్రతిస్పందించకపోతే, తనపై ప్రేమ లేదా శ్రద్ధ తగ్గిందని అనుమానపడతారు.
అవాయిడెంట్ అటాచ్‌మెంట్
అవాయిడెంట్ అటాచ్‌మెంట్ కలిగిన వ్యక్తులు స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యమిస్తారు. అనుబంధం, సాన్నిహిత్యాన్ని నివారించడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకు ఈ అటాచ్‌మెంట్ శైలి ఉన్న వ్యక్తి.. భాగస్వామి తనతో ఎక్కువ సమయం గడపాలని కోరితే.. తన స్వేచ్ఛను లాగేసుకుంటున్నట్లు భావిస్తాడు, ప్రతిఘటిస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment