
ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ మొదలైంది. హ్యారీ ఎస్.ట్రూమన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కమ్యూనిస్టు దేశాల దురుద్దేశాలను బట్టబయలు చేసేందుకు ‘రేడియో ఫ్రీ యూరప్’ ప్రారంభమైంది. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యం కలిగి ఉన్న ఈ రెండు అమెరికన్ రేడియో నెట్‌వర్క్‌లు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ‘డబ్బు దండగ’ అనే ఒకే ఒక కారణంతో మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏడెనిమిది దశాబ్దాల పాటు ఖండాంతర శ్రోతల్ని జాగృతం చేసిన ప్రసారాలు ఆగిపోవటం అంటే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రేడియో అభిమానుల మనసు మోగబోవటమే!
అమెరికా దగ్గర సొంత రేడియో లేని టైమ్‌లో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ దగ్గర రాబర్ట్ షేర్వుడ్ ఉన్నాడు. షేర్వుడ్ నాటక రచయిత. రూజ్వెల్ట్‌కు స్పీచ్ రైటర్. ‘‘మన చేతిలో కనుక ఒక రేడియో ఉంటే, ప్రపంచం మన మాట వింటుంది. మాటకు ఆలోచనను అంటించి సరిహద్దులను దాటిస్తే శతఘ్నిలా దూసుకెళ్లి దుర్బుద్ధి దేశాల తప్పుడు సమాచారాలను తుదముట్టిస్తుంది..’’ అన్నాడు షేర్వుడ్ ఓరోజు, రూజ్వెల్ట్‌తో!
షేర్వుడ్ ఆ మాట అనే నాటికే నెదర్లాండ్స్ దగ్గర రేడియో ఉంది. సోవియెట్ యూనియన్ దగ్గర రేడియో ఉంది. ఇటలీ, బ్రిటన్‌ల దగ్గరా రేడియోలు ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీల్లోనూ ఉన్నాయి. లేనిది ఒక్క అమెరికా దగ్గరే! ‘‘మనకూ ఒక రేడియో ఉండాలి మిస్టర్ ప్రెసిడెంట్...’’ అని 1939లో రాబర్ట్ షేర్వుడ్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్‌తో అనటానికి ముందు 1938లో, 1937లో కూడా అమెరికాకు ఒక అధికారిక రేడియో అవసరం అనే ప్రతిపాదనలు యు.ఎస్. ప్రతినిధుల సభ నుంచి వచ్చాయి. అయితే రేడియో ఏర్పాటుకు రూజ్వెల్ట్ అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. షేర్వుడ్ చెప్పాక కూడా, రెండేళ్ల సమయం తీసుకుని 1941 మధ్యలో యు.ఎస్. ఫారిన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఎఫ్.ఐ.ఎస్.)ను నెలకొల్పి, షేర్వుడ్‌ను తొలి డైరెక్టర్‌ని చేశారు.
ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించిన రెండు నెలల లోపే ఎఫ్.ఐ.ఎస్. ఆధ్వర్యంలో అమెరికా అధికారిక రేడియో ప్రసారాలు తొలిసారి జర్మన్ భాషలో ఐరోపా లక్ష్యంగా మొదలయ్యాయి. అనౌన్సర్ విలియమ్ హర్లాన్ హేల్ మాట్లాడుతూ, ‘‘ఇక నుంచి రోజూ మేము అమెరికా గురించి, యుద్ధం గురించి మీతో మాట్లాడతాం. వార్తలు మాకు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. కానీ మీకు నిజమే చెబుతాము...’’ అని అన్నారు. అలా 83 ఏళ్ల క్రితం 1942 ఫిబ్రవరి 1న వాషింగ్టన్ ప్రధాన కేంద్రంగా మొదలైందే ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ రేడియో నెట్‌వర్క్. దీనినే అమెరికా ఇప్పుడు మూసేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రేడియో ఫ్రీ యూరప్
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కట్టేయబోతున్న రెండో రేడియో.. ‘రేడియో ఫ్రీ యూరప్ / రేడియో లిబర్టీ’. ప్రస్తుతం చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఈ అమెరికా అధికారిక రేడియో నెట్ వర్క్– రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా నియంత్రణలోకి వచ్చిన జర్మనీలోని మ్యూనిక్‌లో – 1950 జూలై 4న చెకోస్లోవియాకు వార్తలను ప్రసారం చేయటంతో మొదలైంది. కమ్యూనిస్టు దేశాలలోని మీడియా నిష్పాక్షికంగా ఉండదని భావించిన అమెరికా.. తూర్పు ఐరోపా, సోవియట్ యూనియన్ ప్రజలకు రాజకీయ వాస్తవాలను అందించే ఉద్దేశంతో ఈ రేడియో నెట్‌వర్క్‌ను ప్రారంభించింది.
సోవియెట్ ఆధిపత్య దేశాలలోని కోట్లమంది శ్రోతల్ని 15 భాషల్లో తన ప్రసారాలతో అలరించింది. అయితే కొన్ని కమ్యూనిస్టు దేశాలు ప్రజలకు ఆ ప్రసారాలు చేరకుండా నిరోధించటానికి ప్రయత్నించాయి. అంతేకాదు, ఆర్.ఎఫ్.ఇ. సిబ్బంది కొందరు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆర్.ఎఫ్.ఇ. కార్యాలయంపై ఒకసారి బాంబు దాడి కూడా జరిగింది.
ఒక్క ఆంగ్లంలో మాత్రం ప్రసారాలు ఇవ్వని (ఇవ్వటం అనవసరం అనుకుని) ‘రేడియో ఫ్రీ యూరప్’ ప్రస్తుతం 30 స్థానిక భాషలలో 20కి పైగా ఐరోపా దేశాలకు ఆలకింపుగా ఉంది. 75 ఏళ్లుగా నిరవధికంగా నడుస్తున్న ఈ నెట్‌వర్క్ కూడా ‘ఇంత ఖర్చా!’ అనే ఆశ్చర్యంతో సమాప్తం కానుంది.
వేలమంది సిబ్బంది, వందల రేడియో స్టేషన్‌లతో నడుస్తున్న ఈ రెండు ఆడియో మీడియా హౌస్‌ల నిర్వహణకు ఏడాదికి అవుతున్న ఖర్చు కనీసం 100 కోట్ల డాలర్లకు పైమాటేనని అంచనా వేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) తక్షణం వీటిని మూసివేయాలని అమెరికా అధ్యక్షుడికి సిఫారసు చేసే ఉద్దేశంలో ఉంది. ట్రంప్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ‘డోజ్’ చీఫ్ ఎవరో తెలుసు కదా! అపర కుబేరుడు ఎలాన్ మస్క్.
Comments
Please login to add a commentAdd a comment