స్కూల్ అనగానే క్లాస్‌రూమ్‌లు, బల్లలు, బ్లాక్‌బోర్డులు, పాఠాలు చెప్పే టీచర్లు గుర్తుకొస్తారు. కానీ యూరప్‌లోని నెదర్‌ల్యాండ్స్ దేశంలో ఉన్న ‘అగోరా స్కూల్’లో మాత్రం అవేమీ ఉండవు. అక్కడున్న పిల్లలంతా తమకు నచ్చిన ఆటలు ఆడుకోవచ్చు, నచ్చినట్లు ఉండొచ్చు. అక్కడ గదుల్లో బల్లలు, కుర్చీలుంటాయి. కానీ అవేవీ మనకు మామూలు స్కూళ్లలో కనిపించేలా ఉండవు. అక్కడ పిల్లలు చూసేందుకు టీవీ, వాడేందుకు కంప్యూటర్లు ఉంటాయి.
అక్కడ తరగతులకు బదులుగా గ్రూప్‌లు మాత్రమే ఉంటాయి. ఒక్కో గ్రూప్‌లో 17 మంది దాకా ఉంటారు. రకరకాల వయసున్నవారు ఒకచోట చేరతారు. స్కూల్‌కి రాగానే ఆ రోజు వారు చేయాల్సిన పనులను, పూర్తి చేయాల్సిన లక్ష్యాలను రాసుకుంటారు. ఇవి కూడా అందరికీ ఒకేలా ఉండవు. ఎవరికి తగ్గట్టు వారికి వేరుగా ఉంటాయి. ఒకరు సంగీతం నేర్చుకోవాలనుకుంటే మరొకరు పుస్తకం చదవాలన్నది పనిగా పెట్టుకుంటారు. మరొకరు ఆ రోజుకు ఒక బొమ్మ గీయడాన్ని లక్ష్యంగా మార్చుకుంటారు. టీచర్లు వారు చేయాలనుకున్న పనిలో సాయం చేస్తారు... కొట్టడం, కోప్పడటం లాంటివి చేయరు.
ఆటల మీదే కాకుండా ఇతర అంశాల మీద దృష్టి పెట్టేవారు కూడా ఉంటారు. అలాంటి వారి కోసం అక్కడ రకరకాల విభాగాలున్నాయి. వంట నేర్చుకోవడం, శిల్పాలు చేయడం, చెక్కతో కళాకృతులు తయారు చేయడం, చిత్రలేఖనం, రోబోలు తయారు చేయడం.. ఇలా ఎవరికి నచ్చిన పని వారు నేర్చుకునే అవకాశం కల్పిస్తారు. కేవలం చదువుకోవాలనుకునేవారి కోసం ‘సైలెంట్ రూమ్స్’ ఉంటాయి. అందులోకి వెళ్లి, కూర్చుని నచ్చిన పుస్తకాలు చదువుకోవచ్చు.
రొటీన్ స్కూళ్లకు భిన్నంగా పిల్లలకు సృజనాత్మక విద్య నేర్పించాలనుకునే వారి కోసం 2014లో ఈ స్కూల్‌ని స్థాపించారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా పిల్లలు ఈ స్కూల్లో ఉంటారు. మొత్తం మూడు దేశాల్లో ఈ స్కూళ్లను మొదలుపెట్టారు. ప్రస్తుతం 1800 మందికిపైగా పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment