special school
-
నో క్లాసులు...నో పాఠాలు..దాని పేరే అగోరా స్కూల్!
స్కూల్ అనగానే క్లాస్‌రూమ్‌లు, బల్లలు, బ్లాక్‌బోర్డులు, పాఠాలు చెప్పే టీచర్లు గుర్తుకొస్తారు. కానీ యూరప్‌లోని నెదర్ల్యాండ్స్ దేశంలో ఉన్న ‘అగోరా స్కూల్’లో మాత్రం అవేమీ ఉండవు. అక్కడున్న పిల్లలంతా తమకు నచ్చిన ఆటలు ఆడుకోవచ్చు, నచ్చినట్లు ఉండొచ్చు. అక్కడ గదుల్లో బల్లలు, కుర్చీలుంటాయి. కానీ అవేవీ మనకు మామూలు స్కూళ్లలో కనిపించేలా ఉండవు. అక్కడ పిల్లలు చూసేందుకు టీవీ, వాడేందుకు కంప్యూటర్లు ఉంటాయి. అక్కడ తరగతులకు బదులుగా గ్రూప్‌లు మాత్రమే ఉంటాయి. ఒక్కో గ్రూప్‌లో 17 మంది దాకా ఉంటారు. రకరకాల వయసున్నవారు ఒకచోట చేరతారు. స్కూల్‌కి రాగానే ఆ రోజు వారు చేయాల్సిన పనులను, పూర్తి చేయాల్సిన లక్ష్యాలను రాసుకుంటారు. ఇవి కూడా అందరికీ ఒకేలా ఉండవు. ఎవరికి తగ్గట్టు వారికి వేరుగా ఉంటాయి. ఒకరు సంగీతం నేర్చుకోవాలనుకుంటే మరొకరు పుస్తకం చదవాలన్నది పనిగా పెట్టుకుంటారు. మరొకరు ఆ రోజుకు ఒక బొమ్మ గీయడాన్ని లక్ష్యంగా మార్చుకుంటారు. టీచర్లు వారు చేయాలనుకున్న పనిలో సాయం చేస్తారు... కొట్టడం, కోప్పడటం లాంటివి చేయరు. ఆటల మీదే కాకుండా ఇతర అంశాల మీద దృష్టి పెట్టేవారు కూడా ఉంటారు. అలాంటి వారి కోసం అక్కడ రకరకాల విభాగాలున్నాయి. వంట నేర్చుకోవడం, శిల్పాలు చేయడం, చెక్కతో కళాకృతులు తయారు చేయడం, చిత్రలేఖనం, రోబోలు తయారు చేయడం.. ఇలా ఎవరికి నచ్చిన పని వారు నేర్చుకునే అవకాశం కల్పిస్తారు. కేవలం చదువుకోవాలనుకునేవారి కోసం ‘సైలెంట్ రూమ్స్’ ఉంటాయి. అందులోకి వెళ్లి, కూర్చుని నచ్చిన పుస్తకాలు చదువుకోవచ్చు. రొటీన్ స్కూళ్లకు భిన్నంగా పిల్లలకు సృజనాత్మక విద్య నేర్పించాలనుకునే వారి కోసం 2014లో ఈ స్కూల్‌ని స్థాపించారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా పిల్లలు ఈ స్కూల్లో ఉంటారు. మొత్తం మూడు దేశాల్లో ఈ స్కూళ్లను మొదలుపెట్టారు. ప్రస్తుతం 1800 మందికిపైగా పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. -
భవిష్యత్తునిచ్చే విద్యమ్మ!
తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి బిడ్డ పుట్టేంత వరకు ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం కోసం చేయని ప్రయత్నమంటూ ఉండదు. కానీ దురదృష్టవశాత్తూ కొంతమంది.. జన్యులోపాలతో దివ్యాంగ శిశువులు పుడుతుంటారు. చిన్నదైనా పెద్దదైనా లోపం ఉన్నప్పటికీ తమ పిల్లల్ని ప్రేమగానే చూసుకుంటుంటారు తల్లిదండ్రులు. కానీ అన్ని అవయవాలు సరిగా ఉన్న పిల్లలు ప్రయోజకులు కాకపోతే భారంగా అనిపిస్తారు తల్లిదండ్రులకు. అటువంటిది మానసిక శారీరక లోపాలున్న పిల్లలు జీవితాంతం భారమే. ఇక ఆడపిల్లల పరిస్థితి మరింత దారుణం. వీరి కనీస అవసరాలు తీరాలన్నా ఇబ్బందే. అలాగ పేరెంట్స్‌కు భారమైన అమ్మాయిలను తల్లిలా లాలిస్తోంది విద్యఫడ్కే. దివ్యాంగ అమ్మాయిల కోసం ఏకంగా ఒక హోమ్‌ను ఏర్పాటు చేసి ఆత్మీయతానురాగాలను పంచుతోంది విద్య. విద్యా ఫడ్కే నాసిక్‌లోని దివ్యాంగ ప్రత్యేక ప్రత్యేక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తోంది. 32 ఏళ్లుగా దివ్యాంగ బాలబాలికలకు చదువు నేర్పిస్తోన్న విద్య.. తన వృత్తిలో భాగంగా తరచూ ఆయా పిల్లల తల్లిదండ్రులను కలుస్తుండేది. తమ పిల్లల భవిష్యత్‌పై ఆందోళన చెందుతోన్న ఆ తల్లిదండ్రులు... తమ తర్వాత ఈ పిల్లల పరిస్థితి ఏంటి... భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తుండేవారు. వసతి సదుపాయాలే గాక, అమ్మాయిల భద్రత గురించి కూడా వారు దిగులుపడుతుండేవారు. పదేపదే వారి బాధలు విన్న విద్యకు ఆ పిల్లలకోసం ఏదైనా చేయాలనిపించింది. ఈ క్రమంలోనే వారికి చదువుతోపాటు, వివిధ రకాల నైపుణ్యాలు నేర్పించి ఆనందం గా ఉంచే ఒక హోమ్ వంటిది ఉంటే బావుంటుందన్న ఆలోచన వచ్చింది. నలుగురితో... దివ్యాంగ పిల్లలకు మంచి హోం ఉంటే బావుంటుంది కానీ వారు దానిలో ఆనందంగా ఉండగలుగుతారా! అనే అనుమానం వచ్చింది విద్యకు. దీంతో ఓ నలుగురు అమ్మాయిలకోసం ప్రత్యేకంగా క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్‌లో భాగంగా నలుగురు అమ్మాయిలను నెలరోజులపాటు చూసుకుంది. నెలరోజుల తరువాత వారు ఇంటికి వెళ్లడానికి విముఖత చూపడమేగాక అక్కడే ఉండడానికి ఇష్టపడ్డారు. దీంతో 2016లో కొంతమంది దాతల సాయంతో నాసిక్‌లోని పింపల్గావ్ బాహులలో ‘ఘర్కుల్ పరివార్’ పేరిట హోంను ప్రారంభించింది. దివ్యాంగ అమ్మాయిలు, మహిళల కోసం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి హోం అదే కావడంతో మహారాష్ట్ర నలుమూల నుంచి అమ్మాయిలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడ వీరిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఈ హోమ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మాత్రమే ఇచ్చింది కానీ, ఏవిధమైన నిధులూ మంజూరు చేయలేదు. అయినా, దాతలు ఇచ్చే విరాళాలమీదే విద్య దీనిని నడిపిస్తోంది. యాక్టివ్‌గా ఉంచేందుకు... హోమ్‌లోని పిల్లల్ని మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంచేందుకు మెడిసినల్ వాటర్‌తో స్నానం చేయించడం, ఆరోగ్యవంతమైన అల్ఫాహారం, వివిధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం, వివిధ థెరపీల్లో భాగంగా సింగింగ్, డ్యాన్స్, యోగాలు రోజువారి దినచర్యలో భాగం. ఇవేగాక రోజువారి పనుల్లో అనేక కొత్త విషయాలను కూడా నేర్పిస్తున్నారు. వంటలో సాయం చేయడం, కూరగాయలు తరగడం, చపాతీ పిండి కలపడం వంటి వాటిని చేయిస్తున్నారు. వీరిలో కొంతమంది పెన్నులు తయారు చేయడం, డెకరేషన్ ఐటమ్స్ రూపొందిస్తున్నారు. మసాలా తయారీ, కుట్టు మిషన్, క్యాండిల్స్ తయారీ వంటి వాటిని నేర్పిస్తున్నారు. ఈ హోంలోని అమ్మాయిలంతా కలిసి రోజుకి ఎనిమిదివేల బాల్పెన్స్ను అసెంబుల్చేస్తున్నారు. వీరిలో కొంతమందికి ఎలా బిహేవ్ చేయాలన్న దానిపై కూడా తరచు శిక్షణ ఇచ్చి మంచి çనడవడికను నేర్పిస్తున్నారు. కష్టమైనా... ఇష్టంగానే! ‘‘మానసిక స్థితిగతులు సరిగా లేనివారు ఒక్కసారి చెబితే అర్థం చేసుకోరు. వారికి నేర్పించడానికి ఒకటికి పదిసార్లు చెప్పాల్సి ఉంటుంది. ఇది కష్టమే, కొన్నిసార్లు విసుగు కూడా వస్తుంది. కానీ మనమే విసుక్కుంటే వాళ్లకు తెలియదు. అందువల్ల మా కేర్ గివర్స్ ఎంతో సహనంతో వారికి నేర్పింస్తుంటారు. రెండేళ్ల కరోనా కాలమ్‌లో బాగా కష్టంగా అనిపించింది. కరోనా సమయంలో ఎక్కువమంది అమ్మాయిల ప్రవర్తనకు ఇబ్బందులకు గురై మమ్మల్ని ఆశ్రయించారు. ఆ సమయంలో హోమ్‌లో లేని పిల్లలకు ఆన్లైన్ ద్వారా బోధించాం. సరిగా మాటలు కూడా రాకుండా ఇక్కడకు వచ్చిన అమ్మాయిలు ఇప్పుడు చక్కగా పాటలు పాడడం, డ్యాన్స్ చేయడంతోపాటు పద్యాలు కూడా రాస్తున్నారు. మా సంస్థ తరపున అదితి అనే అమ్మాయి సింగపూర్‌లో జరిగే కాంపిటీషన్లో పాల్గొని బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ అమ్మాయి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండడమేగాక, సంస్థలో ఉన్న మరికొంతమంది అమ్మాయిలకు సింగింగ్, డ్యాన్స్ నేర్పిస్తుంది’ అని విద్యఫడ్కే వివరించారు. -
రాష్ట్రంలో మరో 296 మైనారిటీ గురుకులాలు
భీమారం (వరంగల్ అర్బన్): రాష్ట్రంలో మరో 296 మైనారిటీ గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోందని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ వెల్లడించారు. ఆదివారం ఆయన వరంగల్ అర్బన్ జిల్లా భీమారంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల విద్య కోసం 204 గురుకుల పాఠశాలలు, 8 జూని యర్ కాలేజీలు ప్రారంభించిందన్నారు. దేశంలో ఎక్కడ కూడా మైనారిటీ వర్గాలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు లేవన్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న జమ్మూ కశ్మీర్లో కూడా ముస్లింలకు గురుకుల వ్యవస్థ లేదని వివరించారు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థిపై ప్రభు త్వం రూ.1.31 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. -
వారం రోజులుగా మూతపడిన ఎన్సీఎల్పీ కార్యాలయం
కడప ఎడ్యుకేషన్: నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు (ఎన్సీఎల్పీ) కార్యాలయం వారం రోజులుగా మూత పడింది. జిల్లాలో స్వచ్ఛంద సంస్థల ద్వారా బాల కార్మికులను గుర్తించి వారికి ప్రత్యేక పాఠశాలల ద్వారా విద్యను అందించాలనేది ఈప్రాజెక్టు లక్ష్యం. అయితే ఆ కార్యాలయ ప్రాజెక్టు అధికారి కార్యకలాపాలను పూర్తిగా విస్మరించడంతో ఈ పరిస్థితి దాపురించిందనే విమర్శలున్నాయి. గత నెల 23న ‘సాక్షి’లో లక్ష్యం డ్రాపౌట్ అనే శీర్షికనవార్త ప్రచురితమైంది. స్పందించిన జిల్లా కలెక్టర్ రమణ, అడిషనల్ కలెక్టర్ రామారావు దీనిపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించినా ఆ అధికారి కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేసినట్లు తెలిసింది. అలాగే కార్యాలయ సిబ్బందికి కూడా ఏడాదిగా వేతనాల్లేక అవస్థలు పడుతున్నట్లు తెలిసింది. సిబ్బంది అప్పటి కలెక్టర్ కోన శశిధర్‌ను కలిసి విన్నవించుకోవడంతో ఆయన జీతాలివ్వాలని దేశించినా పీడీ పట్టించుకోలేదనే విమర్శలూ ఉన్నాయి. నేటికీ వారికి వేతనాలు అందలేదని తెలుస్తోంది. కాగా ఆ శాఖ పీడీ బాధ్యతలను వేరే శాఖకు చెందిన అధికారి తీసుకున్నప్పటి నుంచి ప్రాజెక్టు కార్యకలాపాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయనే విమర్శలున్నాయి. గతంలో జిల్లాలో 33 ప్రత్యేక పాఠశాలలకు రావాల్సిన నిధుల మంజూరు విషయంలో కూడా పీడీ నిర్లక్ష్యం ప్రదర్శించటంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకోవడంతో ఆయన స్పందించారు. ఆయన ఈ సమస్యను భారత ప్రభుత్వ కార్మికశాఖ దృష్టికి తీసుకెళ్లి నిధులను విడుదల చేయాలని కోరారు. అలాగే అవినాష్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కూడా కలిసి విషయం తెలిపారు. అయితే సమస్య పరిష్కారానికి ప్రాజెక్టు అధికారి చొరవ చూపనట్లు ఎన్జీఓలు ఆరోపిస్తున్నారు. ఆ ప్రాజెక్టు అధికారిని ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తక్షణం తొలగించి సమర్థవంతమైన అధికారిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సిబ్బంది జీతాలను విడుదల చేయాలని, అలాగే కార్యాలయంలో పూర్తిస్థాయి కార్యాకలాపాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎన్జీఓలు, ప్రజలు కోరుతున్నారు.