వారం రోజులుగా మూతపడిన ఎన్‌సీఎల్‌పీ కార్యాలయం
కడప ఎడ్యుకేషన్:
నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు (ఎన్‌సీఎల్‌పీ) కార్యాలయం వారం రోజులుగా మూత పడింది. జిల్లాలో స్వచ్ఛంద సంస్థల ద్వారా బాల కార్మికులను గుర్తించి వారికి ప్రత్యేక పాఠశాలల ద్వారా విద్యను అందించాలనేది ఈప్రాజెక్టు లక్ష్యం. అయితే ఆ కార్యాలయ ప్రాజెక్టు అధికారి కార్యకలాపాలను పూర్తిగా విస్మరించడంతో ఈ పరిస్థితి దాపురించిందనే విమర్శలున్నాయి. గత నెల 23న ‘సాక్షి’లో లక్ష్యం డ్రాపౌట్ అనే శీర్షికనవార్త ప్రచురితమైంది. స్పందించిన జిల్లా కలెక్టర్ రమణ, అడిషనల్ కలెక్టర్ రామారావు దీనిపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించినా ఆ అధికారి కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేసినట్లు తెలిసింది. అలాగే కార్యాలయ సిబ్బందికి కూడా ఏడాదిగా వేతనాల్లేక అవస్థలు పడుతున్నట్లు తెలిసింది. సిబ్బంది అప్పటి కలెక్టర్ కోన శశిధర్‌ను కలిసి విన్నవించుకోవడంతో ఆయన జీతాలివ్వాలని దేశించినా పీడీ పట్టించుకోలేదనే విమర్శలూ ఉన్నాయి. నేటికీ వారికి వేతనాలు అందలేదని తెలుస్తోంది. కాగా ఆ శాఖ పీడీ బాధ్యతలను వేరే శాఖకు చెందిన అధికారి తీసుకున్నప్పటి నుంచి ప్రాజెక్టు కార్యకలాపాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయనే విమర్శలున్నాయి. గతంలో జిల్లాలో 33 ప్రత్యేక పాఠశాలలకు రావాల్సిన నిధుల మంజూరు విషయంలో కూడా పీడీ నిర్లక్ష్యం ప్రదర్శించటంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకోవడంతో ఆయన స్పందించారు. ఆయన ఈ సమస్యను భారత ప్రభుత్వ కార్మికశాఖ దృష్టికి తీసుకెళ్లి నిధులను విడుదల చేయాలని కోరారు. అలాగే అవినాష్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కూడా కలిసి విషయం తెలిపారు. అయితే సమస్య పరిష్కారానికి ప్రాజెక్టు అధికారి చొరవ చూపనట్లు ఎన్‌జీఓలు ఆరోపిస్తున్నారు. ఆ ప్రాజెక్టు అధికారిని ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తక్షణం తొలగించి సమర్థవంతమైన అధికారిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సిబ్బంది జీతాలను విడుదల చేయాలని, అలాగే కార్యాలయంలో పూర్తిస్థాయి కార్యాకలాపాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎన్‌జీఓలు, ప్రజలు కోరుతున్నారు.