‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా, పాలు మరచి ఎన్నాళ్ళయ్యిందో, ఓ పాల బుగ్గల జీతగాడా, కొలువుదీరి ఎన్నాళ్ళయ్యిందో’ అంటూ... ప్రజాకవి సుద్దాల హనుమంతు రాసిన ఈ పాట భారతదేశంలో శతాబ్దాల తరబడి బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతున్న బాలల జీవన చిత్రాన్ని ప్రతిబింబిస్తుంది. బడిలో ఉండాల్సిన పిల్లలను, ఆట పాటలతో గడపాల్సిన బాల్యాన్ని బందీ చేయడం ఒక అనాగరిక చర్య. ఇది మన భారతదేశ సమస్య మాత్రమే కాదు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న చాలా దేశాల సమస్య కూడా.
ప్రపంచవ్యాప్తంగా 28.7 కోట్ల మంది పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది ‘వరల్డ్ డే అగెనెస్ట్ చైల్డ్ లేబర్’ ఉద్యోగుల భద్రత, ఆరోగ్యాలను మెరుగుపరచవలసిన అవసరాన్నీ, చిన్నారి బాల కార్మికుల పరిస్థితులను మెరుగుపరచవలసిన అవసరాన్నీ నొక్కి చెబుతోంది. పిల్లలందరికీ విద్య, ఆరోగ్యాలను పొందడానికి హక్కు ఉంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది బాలలు వీటికి దూరమవుతున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లలు అనాథలు కావడం, కుటుంబ పేదరికం, నిరక్షరాస్యత, తదితర కారణాల వల్ల బాలలు కార్మికులుగా మారుతున్నారు.
కర్మాగారాలలో, హోటళ్లలో, రైల్వే – బస్ స్టేషన్లలో, వీధుల్లో బాలకార్మికులు కనిపిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో పనులు చేస్తూ బతుకు బండిని లాగుతున్నారు. పట్టణాలు, నగరాలలో బాలకార్మికులు భిక్షాటన చేస్తున్నారు. కొంతమంది చెడువ్యసనాలకు బానిసలై దొంగతనాలూ, హత్యలకూ పాల్పడుతున్నారు. బాల కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఫలితాలు శూన్యం అని చెప్పవచ్చు.
బడికి వెళ్లాల్సిన బాల్యం బందీగా మారుతోంది. దీనికి కారణం ఎవరు? రోడ్డుపై విసిరేసిన ఎంగిలి విస్తరాకులూ, చిత్తుకాగితాలు ఏరుకుంటూ... చితికిపోయిన బతుకులు ఈడ్చుకుంటూ మెతుకు కోసం జీవిత పోరాటం చేస్తున్నారు వీరు. ఇటుకలు మోస్తూ, ఇనుమును కరిగిస్తూ, బిక్షమెత్తుకొంటూ, పంక్చర్ లేస్తూ, పేపర్ వేస్తూ, పాలు, పల్లీలమ్ముతూ, కంపెనీల్లో పనిచేస్తూ, పశువులు కాస్తూ, కలుపులు తీస్తూ, పాలిష్ చేస్తూ, పెయింట్‌లు వేస్తూ బతుకును వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితులను కళ్లారా చూస్తున్న ఐక్యరాజ్యసమితి 2002లో బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది.
అయినా ప్రపంచంలోని వివిధ దేశాలలో బాలకార్మికుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప, తగ్గడం లేదు. సమాజంలో భాగమైన మనమందరం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు నడుం బిగిద్దాం. – ముద్దం నరసింహ స్వామి; జర్నలిస్టు, హైదరాబాద్ (రేపు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా)
Comments
Please login to add a commentAdd a comment