Child labor System
-
బాల్యానికి భరోసా ఏదీ?
‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా, పాలు మరచి ఎన్నాళ్ళయ్యిందో, ఓ పాల బుగ్గల జీతగాడా, కొలువుదీరి ఎన్నాళ్ళయ్యిందో’ అంటూ... ప్రజాకవి సుద్దాల హనుమంతు రాసిన ఈ పాట భారతదేశంలో శతాబ్దాల తరబడి బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతున్న బాలల జీవన చిత్రాన్ని ప్రతిబింబిస్తుంది. బడిలో ఉండాల్సిన పిల్లలను, ఆట పాటలతో గడపాల్సిన బాల్యాన్ని బందీ చేయడం ఒక అనాగరిక చర్య. ఇది మన భారతదేశ సమస్య మాత్రమే కాదు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న చాలా దేశాల సమస్య కూడా.ప్రపంచవ్యాప్తంగా 28.7 కోట్ల మంది పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది ‘వరల్డ్ డే అగెనెస్ట్ చైల్డ్ లేబర్’ ఉద్యోగుల భద్రత, ఆరోగ్యాలను మెరుగుపరచవలసిన అవసరాన్నీ, చిన్నారి బాల కార్మికుల పరిస్థితులను మెరుగుపరచవలసిన అవసరాన్నీ నొక్కి చెబుతోంది. పిల్లలందరికీ విద్య, ఆరోగ్యాలను పొందడానికి హక్కు ఉంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది బాలలు వీటికి దూరమవుతున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లలు అనాథలు కావడం, కుటుంబ పేదరికం, నిరక్షరాస్యత, తదితర కారణాల వల్ల బాలలు కార్మికులుగా మారుతున్నారు.కర్మాగారాలలో, హోటళ్లలో, రైల్వే – బస్ స్టేషన్లలో, వీధుల్లో బాలకార్మికులు కనిపిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో పనులు చేస్తూ బతుకు బండిని లాగుతున్నారు. పట్టణాలు, నగరాలలో బాలకార్మికులు భిక్షాటన చేస్తున్నారు. కొంతమంది చెడువ్యసనాలకు బానిసలై దొంగతనాలూ, హత్యలకూ పాల్పడుతున్నారు. బాల కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఫలితాలు శూన్యం అని చెప్పవచ్చు.బడికి వెళ్లాల్సిన బాల్యం బందీగా మారుతోంది. దీనికి కారణం ఎవరు? రోడ్డుపై విసిరేసిన ఎంగిలి విస్తరాకులూ, చిత్తుకాగితాలు ఏరుకుంటూ... చితికిపోయిన బతుకులు ఈడ్చుకుంటూ మెతుకు కోసం జీవిత పోరాటం చేస్తున్నారు వీరు. ఇటుకలు మోస్తూ, ఇనుమును కరిగిస్తూ, బిక్షమెత్తుకొంటూ, పంక్చర్ లేస్తూ, పేపర్ వేస్తూ, పాలు, పల్లీలమ్ముతూ, కంపెనీల్లో పనిచేస్తూ, పశువులు కాస్తూ, కలుపులు తీస్తూ, పాలిష్ చేస్తూ, పెయింట్లు వేస్తూ బతుకును వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితులను కళ్లారా చూస్తున్న ఐక్యరాజ్యసమితి 2002లో బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది.అయినా ప్రపంచంలోని వివిధ దేశాలలో బాలకార్మికుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప, తగ్గడం లేదు. సమాజంలో భాగమైన మనమందరం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు నడుం బిగిద్దాం. – ముద్దం నరసింహ స్వామి; జర్నలిస్టు, హైదరాబాద్ (రేపు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా) -
కూతురు కోసం ఓ తల్లి ఆరాటం
సాక్షి, మచిలీపట్నం: తప్పిపోయిన కూతురు పదేళ్ల తర్వాత ప్రత్యక్షమవడంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు. పేగు తెంచుకు పుట్టిన కన్న కూతుర్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఆ తల్లి ఆరాటపడుతోంది. కూలి పని చేసుకుని పెంచుకుంటా కుమార్తెను అప్పగించండంటూ ఉన్నతాధికారులను వేడుకుంటోంది. సంబంధిత వివరాలు ఇలా ఉన్నాయి... కృష్ణా జిల్లా తిరువూరు భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన గాయం నాగమణికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పదేళ్ల క్రితం ఆమెతో భర్త గొడవపడి ఇద్దరు కుమార్తెలను, ఓ కుమారుడుని తీసుకుని ఇంటి నుంచి వెళ్లి పోయాడు. మద్యానికి బానిసైన భర్త కన్నబిడ్డలను వదిలేయడంతో వారిలో ఇద్దరు తల్లి వద్దకు చేరుకున్నారు. తప్పిపోయిన బాలిక అమూల్య కోసం ఆ తల్లి గాలించినా ఫలితం లేకుండా పోయింది. కాగా, ఐదేళ్ల అమూల్యను ఓ మహిళ చేరదీసి చేవూరి కృష్ణవేణి పేరుతో మచిలీపట్నంలోని బాలసదన్‌లో చేర్పించింది. అక్కడ ఏడో తరగతి వరకు చదివిన అమూల్య ప్రస్తుతం ఎ.కొండూరులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీవీబీ)లో 8వ తరగతి చదువుతోంది. కోవిడ్ నేపథ్యంలో కేజీవీబీ మూసివేయగా.. రాజ్యలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు ఆశ్రయం ఇచ్చారు. తన కుటుంబ వివరాలు చెప్పడంతో ఆ ఉపాధ్యాయురాలు అమూల్యను వెంటబెట్టుకుని తిరువూరులో గాలించారు. చివరకు తల్లి ఆచూకీ తెలిసింది. తన బిడ్డను అప్పగించమని కేజీబీవీ అధికారిని ఆ తల్లి వేడుకోగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీని సంప్రదించాలని సూచించారు. డీఎన్ఏ పరీక్షలో నిర్ధారిస్తేనే.. ఐసీడీఎస్ అధికారులు, తహసీల్దార్ అమూల్యగా నిర్ధారిస్తూ ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. అయితే డీఎన్ఏ పరీక్ష చేస్తే కానీ అమూల్యను నాగమణి కుమార్తెగా నిర్ధారించలేమని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చెప్పింది. దీంతో ఆ తల్లి కన్న కూతురు కోసం అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తన కుమార్తెను అప్పగించాలని వేడుకుంటోంది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ‘స్పందన’లో వినతిపత్రం సమర్పించింది. గుర్తిస్తే అప్పగించవచ్చు ఐదేళ్ల ప్రాయంలో తప్పిపోయిన పిల్లలకు కొంతమేర తల్లిదండ్రులను గుర్తించే జ్ఞాపకశక్తి ఉంటుంది. ఇటువంటి కేసుల్లో తల్లిదండ్రులను గుర్తిస్తే బంధువులు, చుట్టుపక్కల వారిని విచారించి వాస్తవమైతే లిఖిత పూర్వకంగా అంగీకారం తీసుకుని అప్పగించవచ్చు. భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తే డీఎన్ఏ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవచ్చు. – డి.ఆంజనేయరెడ్డి, డైరెక్టర్, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ -
సామాజిక సైన్యం-సోషల్ వర్క్
హైదరాబాద్‌లోని బస్తీలు, మురికివాడల్లో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి. బాలలకు ఉన్న హక్కులను గుర్తించాలి. బాలలను కార్మికులుగా కాకుండా దేశ భవిష్యత్ నిర్మాణానికి కారకులుగా మలచాలంటూ ప్రజలను చైత్యనం చేసే కార్యక్రమం.. హెచ్ఐవీ/ఎయిడ్స్, మహిళలు/బాలికల అక్రమ రవాణాపై నగరంలో రెండురోజుల అంతర్జాతీయ సదస్సు. సంబంధిత రంగంలోని జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ప్రసంగిస్తారు. సమస్య మూలాలను, నివారించే మార్గాలను వివరిస్తారు. తమ కార్యకలాపాలకు మద్దతుగా సంతకాల సేకరణ, ప్రజలను భాగస్వామ్యులను చేయడం, జాతీయ స్థాయి సదస్సులు నిర్వహించడం వంటివి చేపడతారు. ఇక్కడ పేర్కొన్నవి కొన్ని ఉదాహరణలు మాత్రమే..! సామాజికంగా తమ బాధ్యతను గుర్తెరిగి చేపడుతున్న కార్యక్రమాలివి. నవ భారతాన్ని నిర్మించే దిశగా యువ భారతం చేస్తున్న స్ఫూర్తిదాయక ప్రయత్నం.. ప్రజల్ని పట్టిపీడించే సాంఘిక సమస్యలపై యువత గళమెత్తుతున్నారు.. ప్రజల్లో చైతన్యం పెంపొందించే దిశగా ఒక సామాజిక సైన్యంలా కదులుతున్నారు సామాజిక కార్యకర్తలు. సమస్యలపై స్పందించడానికే పరిమితం కాకుండా.. సమస్య మూలాలను అధ్యయనం చేయడానికి ఉపయోగ పడేవే సోషల్ వర్క్ కోర్సులు. సామాజిక కార్యక్రమాల విస్తృతి పెరుగుతుండటంతో సదరు కోర్సులకు డిమాండ్ అధికమవుతోంది. అధికశాతం మంది సాంకేతిక విద్య వెంట పరుగులు తీస్తున్న తరణంలో.. కెరీర్‌కు కొండంత అండగా నిలుస్తున్న సోషల్ వర్క్ కోర్సులను ఎంచుకోవడానికి సిటీ యువత ఎంతో ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో.. సిటీలో సోషల్ వర్క్ కోర్సులు, ఆయా కోర్సులతో కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం.. భిన్నమైనవి: గత ఐదారేళ్లుగా స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు సామాజిక కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఆ సేవా కార్యక్రమాలు యువతలో స్ఫూర్తిని నింపుతున్నాయి. దాంతోపాటే ఆ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి సంబంధిత నిపుణుల అవసరం ఏర్పడుతోంది. దీంతో యువతలో సోషల్ వర్క్ కోర్సుల పట్ల ఆదరణ క్రమంగా పెరుగుతోంది. సామాజిక మాధ్యమాలు ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటి ద్వారా సమస్యలపై జరుగుతున్న చర్చ కూడా సోషల్ వర్క్ పట్ల యువతలో ఆసక్తికి మరో కారణం.అయితే సోషల్ వర్క్ కోర్సులు ఇతర కోర్సులకు భిన్నమైనవి. స్పందించే గుణం, సామాజిక బాధ్యత, ప్రజలను చైతన్యపరచడం, అవసరమైనప్పుడు అండగా నిలవడం, సమాజం ఆశిస్తున్న మార్పు దిశగా ప్రతి ఒక్కరూ కృషిచేసేలా చూడటం వంటి అంశాలకు సోషల్ వర్క్ కోర్సులు ప్రాధాన్యతను ఇస్తాయి. కోర్సులివే: సామాజిక సమస్యలు, మానవ హక్కులు, వాటితో ముడిపడి ఉన్న అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే సోషల్ వర్క్. నగరంలోని ప్రముఖ కాలేజీలు బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ స్థాయిలో సోషల్ వర్క్ కోర్సులను అందిస్తున్నాయి. బ్యాచిలర్‌స డిగ్రీ స్థాయిలోని కోర్సును బీఎస్‌డబ్ల్యూ (బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్) అని, మాస్టర్స డిగ్రీ కోర్సును ఎంఎస్‌డబ్ల్యూ (మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్) అని వ్యవహరిస్తారు. ఈ విభాగానికి సంబంధించి ఎంబీఏ రూరల్ డెవలప్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులో చేరడానికి ఇంటర్మీడియెట్, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి బ్యాచిలర్‌స డిగ్రీ ఉండాలి. ఈ కోర్సుల్లో క్రిమినాలజీ అండ్ జస్టిస్, కమ్యూనిటీ హెల్త్, మెంటల్ హెల్త్, అర్బన్ డెవలప్మెంట్, సైక్రియాటిక్ సోషల్ వర్క్, కమ్యూనిటీ డెవలప్మెంట్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రంగంలో పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ స్టడీస్ అవకాశాలున్నాయి. సంబంధిత స్పెషలైజేషన్లలో రీసెర్చ్ చేయడం ద్వారా అద్భుత అవకాశాలను అందుకోవచ్చు. నైపుణ్యాలు తప్పనిసరి: సోషల్ వర్క్ కోర్సుల ద్వారా కెరీర్లో రాణించాలంటే.. కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. సామాజిక కార్యక్రమాల్లో సమిష్టిగా, జట్టుగా, సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా సోషల్ వర్క్‌లో క్షేత్రస్థాయి అధ్యయనానికి ప్రాధాన్యం ఉంటుంది. అప్పుడే అనుకున్న ఫలితాలను సాధించవచ్చు. కాబట్టి పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలు, సమాజాన్ని అవగాహన చేసుకోవడం, భాగస్వామ్యాలను నిర్మించే నేర్పు, వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించగలగడం, కమ్యూనికేషన్ స్కిల్స్, నిర్ణయాత్మక సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, భిన్న పరిసరాలకనుగుణంగా ఒదిగిపోవడం, ఎదుటి వారి సమస్యలను వినే ఓర్పు, విశాల దృక్పథం, ప్రశ్నించే తత్వం వంటి నైపుణ్యాలు ఈ కెరీర్లో రాణించేందుకు చాలా అవసరం. హోదాలు: సోషల్ వర్క్ అభ్యర్థులకు పని చేసే సంస్థ, నిర్వహించే ప్రాజెక్ట్‌లను బట్టి వివిధ హోదాలు ఉంటాయి. అవి.. కెపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, ఫీల్డ్ కో-ఆర్డినేటర్, అకడమిక్ రిసోర్సెస్ కో-ఆర్డినేటర్, ప్రోగ్రామ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్, కమ్యూనికేషన్ మేనేజర్, ప్రోగ్రామ్ అసోసియేట్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్. పీహెచ్డీ పూర్తిచేసి అకడమిక్‌తోపాటు వివిధ రంగాల్లో డేటా అనలిస్ట్, సర్వే రీసెర్చర్, ప్రాజెక్టు మేనేజర్ వంటి ఉన్నత ఉద్యోగావకాశాలను చేజిక్కించుకోవచ్చు. వేతనాలు: వేతనాల విషయానికొస్తే.. పని చేస్తున్న సంస్థను బట్టి ప్రారంభ స్థాయిలో ఉండే కో-ఆర్డినేటర్, ఎగ్జిక్యూటివ్‌లకు రూ.15 నుంచి 20 వేల మధ్య వేతనం లభిస్తుంది. తర్వాత హోదా, అనుభవం, పనితీరు ఆధారంగా రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పైగానే సంపాదించవచ్చు. త్వరగా: సోషల్ వర్క్ కోర్సుతో త్వరగా ఉద్యోగంలో స్థిరపడాలంటే.. కంపెనీలు ఆశిస్తున్న నైపుణ్యాలు, అనుభవాన్ని పెంచుకోవాలి. ఇందుకోసం ఏదైనా సంస్థ అందించే ఇంటర్న్‌షిప్ లేదా ఏదైనా ఎన్జీవో చేపట్టే ప్రాజెక్ట్‌లో స్వచ్ఛందంగా పని చేయాలి. తద్వారా అనుభవం వస్తుంది. దాంతోపాటు సంబంధిత రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిరంతరం గమనిస్తుండాలి. ఇందుకోసం ఆన్లైన్ సోర్స్, పత్రికలను ఉపయోగించుకోవాలి. అవకాశాలు ఇటీవలి కాలంలో ఈ కోర్సును పూర్తి చేసిన వారికి పబ్లిక్, ప్రైవేట్, ఎన్జీవో సంస్థల్లో అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశాభివృద్ధిలో కార్పొరేట్ సంస్థల పాత్ర పెరగడం.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) చట్టం అమల్లోకి రావడంతో సోషల్ వర్క్ కోర్సులను పూర్తిచేసిన వారికి అవకాశాలు రెట్టింపు అయ్యాయి. ప్రస్త్తుత అవసరాల రీత్యా ఈ రంగంలో నిష్ణాతులైన అభ్యర్థుల అవసరం వేలల్లో ఉంది. కోర్సులను అందిస్తున్న సంస్థలు ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్ వెబ్సైట్: www.osmania.ac.in టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్-హైదరాబాద్; వెబ్సైట్: www.tiss.edu నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ -హైదరాబాద్ వెబ్సైట్: www.nird.org.in సెంటర్ ఫర్ సోషల్ ఇనిషియేటివ్ అండ్ మేనేజ్మెంట్; వెబ్సైట్: www.csim.in ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)- దూర విద్యా విధానంలో సోషల్ వర్క్ కోర్సును అందిస్తుంది. వెబ్సైట్: www.ignou.ac.in సేవా దృక్పథం ఉన్నవారికి సరైన కోర్సులు శ్రీ‘‘సమాజం పట్ల బాధ్యత, సేవా దృక్పథం ఉన్నవారికి సోషల్ వర్క్ కెరీర్ సరిగ్గా సరిపోతుంది. దేశంలోని పలు యూనివర్సిటీలు, విద్యా సంస్థలు మాస్టర్స్ స్థాయిలో ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఆసక్తి ఉన్నవారు ఈ విభాగంలో ఎంఫిల్, పీహెచ్డీ కూడా చేయడానికి అవకాశం ఉంది. సమాజంలోని సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ కోర్సుల్లో చేరిన వారు అధ్యయనం చేస్తారు. సామాజిక అభివృద్ధికి ఉపయోగపడే నైపుణ్యాలను వారు సొంతం చేసుకుంటారు. సోషల్‌వర్క్ కోర్సులు పూర్తి చేసిన వారికి పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగాల్లోనూ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సోషల్ వర్కర్లు వివిధ వర్గాల ప్రజలతో మమేకమై జీవనం కొనసాగిస్తారు. చిన్న పిల్లల దగ్గర్నుంచి యువత, వృద్ధుల చుట్టూ వీరి కెరీర్ కొనసాగుతుంది. గ్రామీణ, పట్టణ, గిరిజనులు తేడా లేకుండా సమాజ అభివృద్ధికి పాటుపడడమే వారి లక్ష్యంగా ఉండాలి. మార్పు కోసం పనిచేసే తత్వం, కొత్త వ్యక్తులతో మాట్లాడే నేర్పు, కలిసి పనిచే సే నైపుణ్యాలు ఉన్నవారు సోషల్ వర్క్ కెరీర్‌ను ఎంపిక చేసుకోవచ్చ్ణు - ప్రొఫెసర్. లక్ష్మీ లింగం, డిప్యూటీ డెరైక్టర్, టిస్-హైదరాబాద్ క్యాంపస్ -
చట్టాలకు పదును పెట్టాలి
సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలో బాల కార్మిక వ్యవస్థను రూపు మాపేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలకు మరింత పదను పెట్టాల్సిన అవసరం ఉందని, అలాగే నూతన చట్టాలను కఠినతరం చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కంఠీరవ స్టేడియం గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం చట్టంలో ఉన్న లొసుగుల వల్ల బాల కార్మిక వ్యవస్థను అరికట్టలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. చట్టాల్లో మార్పులు తీసుకురావడం ద్వారా 2017 నాటికి రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. అనంరతం ప్రభుత్వ వసతి గృహల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న పలువురు చిన్నారులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. విశ్రాంత ఐపీఎస్ అధికారి కెంపయ్యకు రాష్ట్ర నిఘా విభాగం సలహాదారుగా నియమించనున్నట్లు వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడి ఫ్రీడం పార్కు నుంచి కంఠీరవ స్టేడియం వరకూ రాష్ట్ర కార్మికశాఖ కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ‘వాకథాన్’ నిర్వహించింది. ఇందులో మంత్రి పరమేశ్వర్ నాయక్‌తో పాటు గతంలో బాలకార్మికులుగా ఉంటూ ప్రస్తుతం వివిధ ప్రభుత్వ వసతి పాఠశాలల్లో చదువుకుంటున్న చిన్నారులు, ఎమ్మెల్సీ, శాండిల్‌వుడ్ నటి తారతో పాటు పలువురు సామాజిక వేత్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన డోలు కుణిత, బాల కార్మిక వ్యవస్థను నిరసిస్తూ వేసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. -
ఆపన్న హస్తం
ఖాళీ సమయాన్ని సామాజిక సేవకు వెచ్చిస్తున్న విద్యార్థులు ఏ పనీ లేకపోతే సరదాగా సినిమాకో షికారుకో వెళదామని అనేకమంది అనుకుంటారు. మరికొందరు ముసుగుతన్ని నిద్ర పోతుంటారు. ఈ ధోరణిలో క్రమేణా మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం అనేకమంది తమ ఖాళీ సమయాన్ని సామాజిక సేవ కోసం వినియోగిస్తున్నారు. ఇటువంటి వారిలో సాధారణ పౌరులకంటే విద్యార్థుల సంఖ్యే అధికంగా ఉంది. న్యూఢిల్లీ : నిన్నమొన్నటిదాకా ఖాళీ సమయంలో సినిమాలకు వెళ్లడమో లేక ఆటలాడుకోవడమో చేస్తున్న విద్యార్థులు ఇప్పుడు సామాజిక సేవపై ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయమై కోల్‌కతానుంచి నగరానికి వచ్చి 11వ తరగతి చదువుతున్న అనుక్ష మండల్ మాట్లాడుతూ ‘భవిష్యత్తులో ఏదో మేలు జరుగుతుందనే ఆశతో మంచి పనులు చేయొద్దు. ఇతరులు మీ నుంచి స్ఫూర్తి పొందేందుకు మాత్రమే చేయాలి’ అని అంది. కాగా సీక్రెట్ శాంటా క్లాజ్ వేషం ధరించిన అనుక్ష గత ఏడాది డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా బుద్ధిమాంద్య సమస్యతో బాధపడుతున్న విద్యార్థులతో కాలక్షేపం చేసింది. వారికి ఆ రోజంతా వినోదం కల్పించాడు. 2012లో శీతాకాలంలో వీధులే ఆవాసాలుగా కాలం గడుపుతున్న 500 మంది అనాథలకు దుప్పట్లను పంచిపెట్టింది. వీటిని కొనుగోలు చేసేందుకు తన స్నేహితులతోపాటు బంధువుల వద్దనుంచి ఈ చిన్నారి రూ. 55 వేలను విరాళాల రూపంలో సేకరించింది. ఇందుకోసం తన స్నేహితురాళ్లను ఎంచుకుని వారిని ఐదు బృందాలుగా విభజించింది. వారందరినీ నగరంలోని వివిధ ప్రాంతాలకు రాత్రిపూట పంపించి రహదార్ల పక్కన నిద్రిస్తున్న అనాథలకు దుప్పట్లను పంపిణీ చేసింది. ఈ విషయమై అనుక్ష మాట్లాడుతూ ‘శీతాకాలంలో రాత్రివేళల్లో రహదార్లపై నిద్రిస్తున్న అనేకమంది చనిపోతున్నారనే విషయం నా దృష్టికొచ్చింది. వారికి ఏదో ఒకటి చేయాలని నాకనిపించింది. వాస్తవానికి మా అమ్మ కూడా తన చిన్నతనంలో బడి కి వెళ్లే సమయంలో సామాజిక సేవ చేసింది. ఈ నేపథ్యంలో నా ఆలోచనను ఆమె ముందుంచా. దీంతో కొన్ని కంపెనీలతోపాటు స్నేహితులను ఆర్థిక సహాయం చేయాలని కోరాల్సిందిగా చెప్పింది. నాతో కలసి రావాలంటూ డిసెంబర్ 27వ తేదీన కొంతమందిని కోరా. వారి తో నగరంలోని వివిధ ప్రాంతాల్లో రాత్రిపూట సంచరించా. కొంతమంది అనాథలు ఫుట్‌పాత్‌లపై నిద్రించడం కనిపించింది. అటువంటి వారందరికీ దుప్పట్లు అందజేశాం. ఇలా చేయడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది’ అని చెప్పింది. ‘10 ఏళ్ల వయసులో ఉండగా చెన్నై ఆస్పత్రి సమీపంలో జరిగిన ఘటన నాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన అనేక ఘటనలు కూడా స్ఫూర్తిదాయకంగా నిలి చాయి. ఎనిమిదేళ్ల వయసులోనే నాకు మధుమేహం ఉందని వైద్యపరీక్షల్లో తేలింది. అంత చిన్న వయసులో ఈ వ్యాధిబారినపడిన చిన్నారులకు చికిత్స చేసేందుకు అప్పట్లో కోల్‌కతాలో ప్రత్యేక వైద్యులెవరూ లేరు. దీంతో చెన్నైలోని ఓ ఆస్పత్రికి వెళ్లాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులకు అక్కడి వైద్యులు ఇంజెక్షన్లు ఇవ్వడం నా కంటపడింది. అయితే వాస్తవానికి ఆ ఇంజెక్షన్లను కొనుగోలు చేసే శక్తి వారి కుటుంబీకులకు లేదు. ఈ ఘటనే నాకు స్ఫూర్తి నిచ్చింది. ఇటువంటి వారికి జీవితంలో మున్ముందు ఏదో ఒకటి చేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నా’ అని తెలిపింది. అమెరికాలో ఇటీవల జరిగిన పురస్కార ప్రదాన కార్యక్ర మానికి హాజరైన వారిలో అనుష్క కూడా ఉంది. కాగా గుర్గావ్కు చెందిన 12వ తరగతి విద్యార్థిని మేనక కూడా సామాజిక సేవ చేస్తోంది. తన ఇంటికి సమీపంలోని మురికివాడకుచెందిన చిన్నారులకు ఆంగ్లం నేర్పుతోంది. ఈ విషయమై ఆ చిన్నారి ఖాళీ సమయంలో ఆంగ్లం నేర్పుతున్నానని తెలిపింది. ఆ ప్రాంతానికి నీటి సరఫరా బాగా తక్కువని, దీంతో నీటి పొదుపు గురించి కూడా వారికి వివరిస్తున్నానని తెలిపింది. ఇదిలాఉంచితే మేనక నీటి పొదుపుపై కూడా మురికివాడ వాసులకు అవగాహన కల్పిస్తోంది. ఢిల్లీకి చెందిన ఆకాశ్పవార్ అనే మరో విద్యార్థి బాల్యవివాహాలతోపాటు బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. అనేక సంవత్సరాలుగా ఇందుకు సంబంధించిన కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాడు.