సామాజిక సైన్యం-సోషల్ వర్క్
హైదరాబాద్‌లోని బస్తీలు, మురికివాడల్లో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి. బాలలకు ఉన్న హక్కులను గుర్తించాలి. బాలలను కార్మికులుగా కాకుండా దేశ భవిష్యత్ నిర్మాణానికి కారకులుగా మలచాలంటూ ప్రజలను చైత్యనం చేసే కార్యక్రమం..
హెచ్‌ఐవీ/ఎయిడ్స్, మహిళలు/బాలికల అక్రమ రవాణాపై నగరంలో రెండురోజుల అంతర్జాతీయ సదస్సు. సంబంధిత రంగంలోని జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ప్రసంగిస్తారు. సమస్య మూలాలను, నివారించే మార్గాలను వివరిస్తారు. తమ కార్యకలాపాలకు మద్దతుగా సంతకాల సేకరణ, ప్రజలను భాగస్వామ్యులను చేయడం, జాతీయ స్థాయి సదస్సులు నిర్వహించడం వంటివి చేపడతారు.
ఇక్కడ పేర్కొన్నవి కొన్ని ఉదాహరణలు మాత్రమే..!
సామాజికంగా తమ బాధ్యతను గుర్తెరిగి చేపడుతున్న కార్యక్రమాలివి. నవ భారతాన్ని నిర్మించే దిశగా యువ భారతం చేస్తున్న స్ఫూర్తిదాయక ప్రయత్నం.. ప్రజల్ని పట్టిపీడించే సాంఘిక సమస్యలపై యువత గళమెత్తుతున్నారు.. ప్రజల్లో చైతన్యం పెంపొందించే దిశగా ఒక సామాజిక సైన్యంలా కదులుతున్నారు సామాజిక కార్యకర్తలు. సమస్యలపై స్పందించడానికే పరిమితం కాకుండా.. సమస్య మూలాలను అధ్యయనం చేయడానికి ఉపయోగ పడేవే సోషల్ వర్క్ కోర్సులు. సామాజిక కార్యక్రమాల విస్తృతి పెరుగుతుండటంతో సదరు కోర్సులకు డిమాండ్ అధికమవుతోంది. అధికశాతం మంది సాంకేతిక విద్య వెంట పరుగులు తీస్తున్న తరణంలో.. కెరీర్‌కు కొండంత అండగా నిలుస్తున్న సోషల్ వర్క్ కోర్సులను ఎంచుకోవడానికి సిటీ యువత ఎంతో ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో.. సిటీలో సోషల్ వర్క్ కోర్సులు, ఆయా కోర్సులతో కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం..
భిన్నమైనవి:
గత ఐదారేళ్లుగా స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు సామాజిక కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఆ సేవా కార్యక్రమాలు యువతలో స్ఫూర్తిని నింపుతున్నాయి. దాంతోపాటే ఆ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి సంబంధిత నిపుణుల అవసరం ఏర్పడుతోంది. దీంతో యువతలో సోషల్ వర్క్ కోర్సుల పట్ల ఆదరణ క్రమంగా పెరుగుతోంది. సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వాటి ద్వారా సమస్యలపై జరుగుతున్న చర్చ కూడా సోషల్ వర్క్ పట్ల యువతలో ఆసక్తికి మరో కారణం.అయితే సోషల్ వర్క్ కోర్సులు ఇతర కోర్సులకు భిన్నమైనవి. స్పందించే గుణం, సామాజిక బాధ్యత, ప్రజలను చైతన్యపరచడం, అవసరమైనప్పుడు అండగా నిలవడం, సమాజం ఆశిస్తున్న మార్పు దిశగా ప్రతి ఒక్కరూ కృషిచేసేలా చూడటం వంటి అంశాలకు సోషల్ వర్క్ కోర్సులు ప్రాధాన్యతను ఇస్తాయి.
కోర్సులివే:
సామాజిక సమస్యలు, మానవ హక్కులు, వాటితో ముడిపడి ఉన్న అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే సోషల్ వర్క్. నగరంలోని ప్రముఖ కాలేజీలు బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ స్థాయిలో సోషల్ వర్క్ కోర్సులను అందిస్తున్నాయి. బ్యాచిలర్‌స డిగ్రీ స్థాయిలోని కోర్సును బీఎస్‌డబ్ల్యూ (బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్) అని, మాస్టర్‌స డిగ్రీ కోర్సును ఎంఎస్‌డబ్ల్యూ (మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్) అని వ్యవహరిస్తారు. ఈ విభాగానికి సంబంధించి ఎంబీఏ రూరల్ డెవలప్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులో చేరడానికి ఇంటర్మీడియెట్, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి బ్యాచిలర్‌స డిగ్రీ ఉండాలి. ఈ కోర్సుల్లో క్రిమినాలజీ అండ్ జస్టిస్, కమ్యూనిటీ హెల్త్, మెంటల్ హెల్త్, అర్బన్ డెవలప్‌మెంట్, సైక్రియాటిక్ సోషల్ వర్క్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రంగంలో పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టోరల్ స్టడీస్ అవకాశాలున్నాయి. సంబంధిత స్పెషలైజేషన్లలో రీసెర్చ్ చేయడం ద్వారా
అద్భుత అవకాశాలను అందుకోవచ్చు.
నైపుణ్యాలు తప్పనిసరి:
సోషల్ వర్క్ కోర్సుల ద్వారా కెరీర్‌లో రాణించాలంటే.. కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. సామాజిక కార్యక్రమాల్లో సమిష్టిగా, జట్టుగా, సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా సోషల్ వర్క్‌లో క్షేత్రస్థాయి అధ్యయనానికి ప్రాధాన్యం ఉంటుంది. అప్పుడే అనుకున్న ఫలితాలను సాధించవచ్చు. కాబట్టి పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలు, సమాజాన్ని అవగాహన చేసుకోవడం, భాగస్వామ్యాలను నిర్మించే నేర్పు, వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించగలగడం, కమ్యూనికేషన్ స్కిల్స్, నిర్ణయాత్మక సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, భిన్న పరిసరాలకనుగుణంగా ఒదిగిపోవడం, ఎదుటి వారి సమస్యలను వినే ఓర్పు, విశాల దృక్పథం, ప్రశ్నించే తత్వం వంటి నైపుణ్యాలు ఈ కెరీర్‌లో రాణించేందుకు చాలా అవసరం.
హోదాలు:
సోషల్ వర్క్ అభ్యర్థులకు పని చేసే సంస్థ, నిర్వహించే ప్రాజెక్ట్‌లను బట్టి వివిధ హోదాలు ఉంటాయి. అవి.. కెపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, ఫీల్డ్ కో-ఆర్డినేటర్, అకడమిక్ రిసోర్సెస్ కో-ఆర్డినేటర్, ప్రోగ్రామ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్, కమ్యూనికేషన్ మేనేజర్, ప్రోగ్రామ్ అసోసియేట్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్. పీహెచ్‌డీ పూర్తిచేసి అకడమిక్‌తోపాటు వివిధ రంగాల్లో డేటా అనలిస్ట్, సర్వే రీసెర్చర్, ప్రాజెక్టు మేనేజర్ వంటి ఉన్నత ఉద్యోగావకాశాలను చేజిక్కించుకోవచ్చు.
వేతనాలు:
వేతనాల విషయానికొస్తే.. పని చేస్తున్న సంస్థను బట్టి ప్రారంభ స్థాయిలో ఉండే కో-ఆర్డినేటర్, ఎగ్జిక్యూటివ్‌లకు రూ.15 నుంచి 20 వేల మధ్య వేతనం లభిస్తుంది. తర్వాత హోదా, అనుభవం, పనితీరు ఆధారంగా రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పైగానే సంపాదించవచ్చు.
త్వరగా:
సోషల్ వర్క్ కోర్సుతో త్వరగా ఉద్యోగంలో స్థిరపడాలంటే.. కంపెనీలు ఆశిస్తున్న నైపుణ్యాలు, అనుభవాన్ని పెంచుకోవాలి. ఇందుకోసం ఏదైనా సంస్థ అందించే ఇంటర్న్‌షిప్ లేదా ఏదైనా ఎన్‌జీవో చేపట్టే ప్రాజెక్ట్‌లో స్వచ్ఛందంగా పని చేయాలి. తద్వారా అనుభవం వస్తుంది. దాంతోపాటు సంబంధిత రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిరంతరం గమనిస్తుండాలి. ఇందుకోసం ఆన్‌లైన్ సోర్స్, పత్రికలను ఉపయోగించుకోవాలి.
అవకాశాలు
ఇటీవలి కాలంలో ఈ కోర్సును పూర్తి చేసిన వారికి పబ్లిక్, ప్రైవేట్, ఎన్‌జీవో సంస్థల్లో అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశాభివృద్ధిలో కార్పొరేట్ సంస్థల పాత్ర పెరగడం.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) చట్టం అమల్లోకి రావడంతో సోషల్ వర్క్ కోర్సులను పూర్తిచేసిన వారికి అవకాశాలు రెట్టింపు అయ్యాయి. ప్రస్త్తుత అవసరాల రీత్యా ఈ రంగంలో నిష్ణాతులైన అభ్యర్థుల అవసరం వేలల్లో ఉంది.
కోర్సులను అందిస్తున్న సంస్థలు
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
వెబ్‌సైట్: www.osmania.ac.in
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్-హైదరాబాద్; వెబ్‌సైట్: www.tiss.edu
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ -హైదరాబాద్
వెబ్‌సైట్: www.nird.org.in
సెంటర్ ఫర్ సోషల్ ఇనిషియేటివ్ అండ్ మేనేజ్‌మెంట్; వెబ్‌సైట్: www.csim.in
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)- దూర విద్యా విధానంలో సోషల్ వర్క్ కోర్సును అందిస్తుంది.
వెబ్‌సైట్: www.ignou.ac.in
సేవా దృక్పథం ఉన్నవారికి సరైన కోర్సులు
శ్రీ‘‘సమాజం పట్ల బాధ్యత, సేవా దృక్పథం ఉన్నవారికి సోషల్ వర్క్ కెరీర్ సరిగ్గా సరిపోతుంది. దేశంలోని పలు యూనివర్సిటీలు, విద్యా సంస్థలు మాస్టర్స్ స్థాయిలో ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఆసక్తి ఉన్నవారు ఈ విభాగంలో ఎంఫిల్, పీహెచ్‌డీ కూడా చేయడానికి అవకాశం ఉంది. సమాజంలోని సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ కోర్సుల్లో చేరిన వారు అధ్యయనం చేస్తారు. సామాజిక అభివృద్ధికి ఉపయోగపడే నైపుణ్యాలను వారు సొంతం చేసుకుంటారు.
సోషల్‌వర్క్ కోర్సులు పూర్తి చేసిన వారికి పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగాల్లోనూ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సోషల్ వర్కర్లు వివిధ వర్గాల ప్రజలతో మమేకమై జీవనం కొనసాగిస్తారు. చిన్న పిల్లల దగ్గర్నుంచి యువత, వృద్ధుల చుట్టూ వీరి కెరీర్ కొనసాగుతుంది. గ్రామీణ, పట్టణ, గిరిజనులు తేడా లేకుండా సమాజ అభివృద్ధికి పాటుపడడమే వారి లక్ష్యంగా ఉండాలి. మార్పు కోసం పనిచేసే తత్వం, కొత్త వ్యక్తులతో మాట్లాడే నేర్పు, కలిసి పనిచే సే నైపుణ్యాలు ఉన్నవారు సోషల్ వర్క్ కెరీర్‌ను ఎంపిక చేసుకోవచ్చ్ణు
- ప్రొఫెసర్. లక్ష్మీ లింగం, డిప్యూటీ డెరైక్టర్, టిస్-హైదరాబాద్ క్యాంపస్