Child Labor
-
చాక్లెట్లు దొంగలించిందని చంపేశారు !
రావల్పిండి: పాకిస్తాన్లో పేదరికం కారణంగా చిన్నతనంలోనే బాలకార్మికులుగా ఇంటిపని చేసే చిన్నారుల్లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో చాక్లెట్లు దొంగతనం చేసిందని ఆరోపిస్తూ 13 ఏళ్ల బాలికను ఆ ఇంటి యాజమానులు చితకబాదడంతో గాయాలపాలై ఆ అమ్మాయి చనిపోయిన ఘటన ఆగ్నేయ పాకిస్తాన్లో గత బుధవారం సాయంత్రం జరిగింది. రావల్పిండిలో నమోదైన ఈ కేసులో యజమాని రషీద్ షఫీఖ్, ఆయన భార్య సనా, వాళ్ల ఖురాన్ బోధకుడినీ పోలీసులు అరెస్ట్‌చేశారు. బాలిక కాళ్లు, చేతులు, చీలమండ పలు చోట్ల విరిగినట్లు పోస్ట్‌మార్టమ్ ప్రాథమిక నివేదికలో తేలింది. సమగ్ర నివేదిక ఇంకా రావాల్సి ఉంది. బాలిక ఇఖ్రా పనిచేస్తున్న యజమాని దంపతులకు 8 మంది సంతానం. వాళ్ల బాగోగులు, ఇంటి పనులు చూసుకునేందుకు రెండేళ్ల క్రితం వాళ్లింట్లో ఇఖ్రా పనికి కుదిరింది. జీతంగా నెలకు దాదాపు రూ.2,430 ఇచ్చేవారు. చాక్లెట్లు దొంగతనం చేసిందని ఆరోపిస్తూ ఇఖ్రాను దారుణంగా హింసించారని పోలీసులు అనుమానిస్తున్నారు. తలకు తీవ్రగాయమైనట్లు సంబంధిత వీడియోల్లో తెలుస్తోంది. అన్నపానీయాలు ఇవ్వకుండా కడుపు మార్చారని, కట్టేసి కొట్టారని, చపాతీలు చేసే కర్రతో కొట్టడంతో పుర్రె పగిలిందని వార్తలొచ్చాయి. బాలిక మరణవార్త తెల్సి దేశవ్యాప్తంగా వేలాది మంది బాలల హక్కుల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇఖ్రాకు న్యాయం జరగాలని డిమాండ్‌చేశారు. తన బిడ్డ మరణాన్ని 45 ఏళ్ల రైతు సనా ఉల్లాహ్ ఏడుస్తూ చెప్పారు. ‘‘నా కుమార్తె ఆరోగ్యం బాలేదని పోలీసులు ఫోన్‌చేసి ఆస్పత్రికి రమ్మన్నారు. వచ్చి చూస్తే ఆస్పత్రి బెడ్‌పై ఇఖ్రా చలనంలేకుండా పడి ఉంది. కొద్దిసేపటికి ప్రాణాలు కోల్పోయింది. నాకున్న అప్పు తీర్చుకునేందుకు గతిలేక ఇఖ్రాను పనికి పంపించాను’’అంటూ తండ్రి దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చారు. తండ్రి అప్పులు తీర్చేందుకు, ఇంట్లో ఖర్చులకు పనికొస్తాయనే ఉద్దేశ్యంతో ఇఖ్రా ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే పనులకు వెళ్లడం మొదలెట్టింది. పేదరికంలో మగ్గిపోతున్న బాలకార్మికుల కుటుంబాలు ఇలాంటి సందర్భాల్లో న్యాయం కోసం తుదికంటా పోరాటం చేయడం పాకిస్తాన్లో చాలా అరుదు. నిందితులను దేవుడే క్షమిస్తాడని మనసును రాయి చేసుకుని ఆ దోషులు నష్టపరిహారంగా ఇచ్చే ఏంతో కొంత మొత్తాలను తీసుకుని కోర్టుల బయటే రాజీ కుదుర్చుకోవడం పాకిస్తాన్లో పరిపాటిగా మారింది. ఇఖ్రా కేసు సైతం చివరకు ఇలాంటి ‘పరిష్కారం’దిశలో పయనిస్తుందని పలువురు సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం పాకిస్తాన్లో 33,00,000 మంది బాలకార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లో ఇంటిపనుల్లో నిమగ్నమైన మొత్తం 85 లక్షల మంది కార్మికుల్లో అత్యధిక శాతం మంది మహిళలు, బాలికలేనని అంతర్జాతీయ కార్మిక సంఘం(ఐఎల్ఓ) పేర్కొంది. -
బాల్యానికి భరోసా ఏదీ?
‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా, పాలు మరచి ఎన్నాళ్ళయ్యిందో, ఓ పాల బుగ్గల జీతగాడా, కొలువుదీరి ఎన్నాళ్ళయ్యిందో’ అంటూ... ప్రజాకవి సుద్దాల హనుమంతు రాసిన ఈ పాట భారతదేశంలో శతాబ్దాల తరబడి బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతున్న బాలల జీవన చిత్రాన్ని ప్రతిబింబిస్తుంది. బడిలో ఉండాల్సిన పిల్లలను, ఆట పాటలతో గడపాల్సిన బాల్యాన్ని బందీ చేయడం ఒక అనాగరిక చర్య. ఇది మన భారతదేశ సమస్య మాత్రమే కాదు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న చాలా దేశాల సమస్య కూడా.ప్రపంచవ్యాప్తంగా 28.7 కోట్ల మంది పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది ‘వరల్డ్ డే అగెనెస్ట్ చైల్డ్ లేబర్’ ఉద్యోగుల భద్రత, ఆరోగ్యాలను మెరుగుపరచవలసిన అవసరాన్నీ, చిన్నారి బాల కార్మికుల పరిస్థితులను మెరుగుపరచవలసిన అవసరాన్నీ నొక్కి చెబుతోంది. పిల్లలందరికీ విద్య, ఆరోగ్యాలను పొందడానికి హక్కు ఉంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది బాలలు వీటికి దూరమవుతున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లలు అనాథలు కావడం, కుటుంబ పేదరికం, నిరక్షరాస్యత, తదితర కారణాల వల్ల బాలలు కార్మికులుగా మారుతున్నారు.కర్మాగారాలలో, హోటళ్లలో, రైల్వే – బస్ స్టేషన్లలో, వీధుల్లో బాలకార్మికులు కనిపిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో పనులు చేస్తూ బతుకు బండిని లాగుతున్నారు. పట్టణాలు, నగరాలలో బాలకార్మికులు భిక్షాటన చేస్తున్నారు. కొంతమంది చెడువ్యసనాలకు బానిసలై దొంగతనాలూ, హత్యలకూ పాల్పడుతున్నారు. బాల కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఫలితాలు శూన్యం అని చెప్పవచ్చు.బడికి వెళ్లాల్సిన బాల్యం బందీగా మారుతోంది. దీనికి కారణం ఎవరు? రోడ్డుపై విసిరేసిన ఎంగిలి విస్తరాకులూ, చిత్తుకాగితాలు ఏరుకుంటూ... చితికిపోయిన బతుకులు ఈడ్చుకుంటూ మెతుకు కోసం జీవిత పోరాటం చేస్తున్నారు వీరు. ఇటుకలు మోస్తూ, ఇనుమును కరిగిస్తూ, బిక్షమెత్తుకొంటూ, పంక్చర్ లేస్తూ, పేపర్ వేస్తూ, పాలు, పల్లీలమ్ముతూ, కంపెనీల్లో పనిచేస్తూ, పశువులు కాస్తూ, కలుపులు తీస్తూ, పాలిష్ చేస్తూ, పెయింట్లు వేస్తూ బతుకును వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితులను కళ్లారా చూస్తున్న ఐక్యరాజ్యసమితి 2002లో బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది.అయినా ప్రపంచంలోని వివిధ దేశాలలో బాలకార్మికుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప, తగ్గడం లేదు. సమాజంలో భాగమైన మనమందరం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు నడుం బిగిద్దాం. – ముద్దం నరసింహ స్వామి; జర్నలిస్టు, హైదరాబాద్ (రేపు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా) -
సరిగ్గా 22 ఏళ్ల క్రితం.. మెగాస్టార్ ట్వీట్ వైరల్!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిష నటిస్తోంది. అయితే ఇవాళ మేడే సందర్భంగా మెగాస్టార్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.సరిగ్గా 22 ఏళ్ల క్రితం అంతర్జాతీయ కార్మిక సంస్థ చేసిన వీడియోను పోస్ట్ చేశారు. పసి పిల్లలను పనివాళ్లుగా చేయొద్దని ఆ వీడియోను రూపొందించారు. ఇవాళ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కావడంతో మెగాస్టార్ వీడియోను పంచుకున్నారు. ఈ రోజుకీ సంబంధించిన వీడియో కావడంతో షేర్ చేస్తున్నాను అంటూ మెగాస్టార్ ట్విటర్లో రాసుకొచ్చారు. సే నో టూ చైల్డ్ లేబర్.. హ్యాపీ మే డే టూ ఆల్ అంటూ పోస్ట్ చేశారు. 22 సంవత్సరాల క్రితం ... పసి పిల్లలని పని పిల్లలుగా చేయొద్దని International Labour Organisation, ILO కోసం చేసిన "చిన్ని చేతులు" campaign. ఈ రోజుకీ relevant అనిపించి share చేస్తున్నాను. Say NO to Child Labour.Happy May Day to all !International #LaborDay #MayDay pic.twitter.com/q5EqvxeoY6— Chiranjeevi Konidela (@KChiruTweets) May 1, 2024 -
బాలల కోసం బహువిధ రక్షణ
సాక్షి, అమరావతి: వీధి బాలల రక్షణ, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఇందుకోసం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ పథకం (ఐసీపీఎస్)కింద వివిధ రూపాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందుకోసం గ్రామ, మండల, పట్టణ, రైల్వే స్టేషన్ స్థాయిల్లో 10,541 రక్షణ కమిటీలను నియమించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 7,201 బాల్య వివాహాలను నివారించింది. పోక్సో చట్టం కింద నమోదైన 6,038 లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు రక్షణ కల్పించింది. 13,703 మంది బాల కార్మికులకు పని నుంచి విముక్తి కల్పించింది. తల్లిదండ్రులు, సంరక్షకులు లేని బాలలను హోమ్స్‌కు తరలించి వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దే బాధ్యతను ప్రభుత్వమే చేపట్టింది. 3,793 మంది యాచించే పిల్లలను గుర్తించి వారి రక్షణ కోసం చర్యలు చేపట్టింది. హెచ్ఐవీ, శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలున్న 843 మంది పిల్లల్ని గుర్తించి సహకారం అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. రాష్ట్రంలో 14 శిశు గృహ కేంద్రాలు ఉండగా.. వాటిలో 127 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ప్రభుత్వ సంరక్షణలో ఉన్న అనాథ పిల్లల్లో 675 మంది పిల్లలను వారి సంరక్షణ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకొచ్చే కుటుంబాలకు దత్తత ఇవ్వబోతోంది. పిల్లల హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు చదువు అనేది పిల్లల ప్రాథమిక హక్కు. ఆ హక్కుకు భంగం కలిగించేందుకు ఎవరు ప్రయత్నించినా శిక్షార్హులవుతారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్నాం. అనాథ పిల్లలు ఎక్కడ దొరికినా శిశు గృహ కేంద్రాలకు తరలించి ప్రభుత్వమే వారి ఆలనా, పాలనా చూస్తోంది. – కృతికా శుక్లా, డైరెక్టర్, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ -
చిన్నారులపై చిన్న చూపు!
సాక్షి, అమరావతి: చిన్నారుల సంరక్షణకు నిధుల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి చిన్నచూపు చూసింది. గత ఆర్థిక సంవత్సరం మహిళా, శిశు సంక్షేమానికి రూ.30,000 కోట్లు కేటాయించిన కేంద్రం.. తాజా బడ్జెట్లో మాత్రం రూ.24,435 కోట్లే కేటాయించింది. అంతే కాకుండా 15వ ఆర్థిక సంఘం సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పథకాలకు కూడా కత్తెర వేశారు. అలాగే రెండు, మూడు పథకాలను కలిపి ఒక మిషన్ కిందకు తీసుకొచ్చారు. మహిళలు, పిల్లలకు సంబంధించి మూడు ముఖ్యమైన మిషన్లు.. వాత్సల్య(పిల్లల రక్షణ, సంరక్షణ, సంక్షేమ), శక్తి(మహిళల రక్షణ, సంక్షేమం), సంబల్(ఉజ్వల హోమ్స్, వన్‌స్టాఫ్ సెంటర్స్, హెల్ప్‌లైన్స్, స్వధార్)ను ఏర్పాటు చేశారు. మిషన్ వాత్సల్యలో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ పథకం(ఐసీపీఎస్) ఒక భాగం. గత బడ్జెట్లో ఐసీపీఎస్‌కు రూ.1,500 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈసారి రూ.900 కోట్లే కేటాయించింది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో–2019 నివేదిక ప్రకారం మన దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక బాలుడు లేదా బాలిక అదృశ్యమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారి రక్షణకు సంబంధించిన మిషన్ వాత్సల్యకు నిధుల కోత విధించారు. అలాగే కరోనా విజృంభణ సమయంలో సంరక్షణ గృహాల్లో ఉన్న 1,48,788 మంది పిల్లలను వారి సంబంధీకుల వద్దకు పంపించారు. అయితే లాక్డౌన్ దెబ్బకు వీరిని పోషించాల్సిన వారు ఉపాధి కోల్పోవడంతో.. ఈ చిన్నారుల్లో అత్యధిక మంది బాలకార్మీకులుగా మారిపోయారు. మరోవైపు స్కూల్ ఎడ్యుకేషన్‌కు కూడా గత ఆర్థిక సంవత్సరం కన్నా 9.71 శాతం తక్కువ నిధులు కేటాయించారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారుల సంరక్షణ, అభివృద్ధి ఎలా సాధ్యమని విద్యా రంగ నిఫుణులు ప్రశ్నిస్తున్నారు. -
వెట్టిచాకిరి నుంచి చిన్నారులకు విముక్తి..
సాక్షి, హైదరాబాద్: ఎర్రకుంటలోని గాజుల కర్మాగారంపై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 20 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలను మీడియాకు వెల్లడించారు. గయా, బీహార్‌కి చెందిన పిల్లలతో గాజుల తయారీలో పని చేయిస్తున్నారని పేర్కొన్నారు. బీహార్ నుండి అక్రమంగా పిల్లలను తరలించారని, వారికి కనీసం సరైన భోజనం సదుపాయం కూడా కల్పించడంలేదని, అర్ధరాత్రి వరకు కూడా వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నలుగురు ఆర్గనైజర్లను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. మెడికల్ పరీక్షలు నిర్వహించిన అనంతరం 20 మంది చిన్నారులను వారి స్వస్థలాలకు పంపిస్తామని సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు గంజాయి ముఠా అరెస్ట్.. గంజాయి సరఫరా చేస్తున్న హర్యానాకి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. సీపీ మహేష్ భగవత్ వివరాలను మీడియాకు వెల్లడిస్తూ.. ఒక్కొక్కటి 5.5 కేజీల ప్యాకెట్లగా కంటైనర్‌లో సరఫరా చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. మొత్తం 1010 కేజీల 194 ప్యాకెట్ల గంజాయితో పాటు ఒక కంటైనర్, నాలుగు వేలు నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. -
ఆపరేషన్ ముస్కాన్‌లో 3,636 మంది బాలల గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు శనివారం ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించి 3,636 మంది బాలబాలికలను రక్షించారు. వీరిలో బాలురు 3,039 మంది, బాలికలు 597 మంది ఉన్నారు. రాష్ట్రంలో తప్పిపోయిన పిల్లలను గుర్తించి.. వారిని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చేందుకు, అనాథలకు పునరావాసం కల్పించేందుకు రెండురోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి రోజు శనివారం ఈ ఆపరేషన్‌లో పోలీసులతోపాటు మహిళా శిశు సంక్షేమ, కార్మిక, విద్యా, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, క్రీడా శాఖలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, శిశు సంరక్షణ కమిటీలు కూడా భాగస్వాములయ్యాయి. ప్రత్యేక బృందాలు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, జనసామర్థ్యం కలిగిన జంక్షన్లు, చౌరస్తాలు, నిర్మాణ స్థలాలు, హోటళ్లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లను తనిఖీ చేసి చిన్నారులను గుర్తించాయి. ఆపరేషన్ ముస్కాన్ అంటే.. తల్లిదండ్రులు లేక కొందరు, ఇంటి నుంచి పారిపోయి వచ్చినవారు మరికొందరు అనాథల్లా జీవితం గడుపుతుంటారు. ఇలాంటివారిని రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో బహిరంగ ప్రదేశాల్లో గుర్తించడానికి పోలీసు బృందాలు, బాలల స్వచ్ఛంద సంస్థలు చేపట్టే కార్యక్రమాన్నే ఆపరేషన్ ముస్కాన్ అంటారు. ఆపరేషన్ ముస్కాన్ ఇలా.. - ఈ కార్యక్రమం కోసం ప్రతి సబ్ డివిజన్లో ఒక ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బృందంలో ఒక మహిళ సిబ్బంది ఉండేలా చర్యలు చేపట్టారు. - బృంద సభ్యులు పోలీస్ యూనిఫాం ధరించకుండా సివిల్ డ్రస్‌లో ఉంటారు. - తనిఖీల సందర్భంగా గుర్తించిన పిల్లల ఫొటోలతో కూడిన సమాచారాన్ని చైల్డ్ ట్రాక్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. - గుర్తించిన పిల్లలను 24 గంటల్లోపు ఆయా జిల్లాల్లోని శిశు సంరక్షణ కమిటీలకు అప్పగిస్తారు. - సరైన చిరునామా లభించని పిల్లలను షెల్టర్ హోమ్‌లలో ఉంచుతారు. - హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల్లో బాల కార్మికులు దొరికినట్లైతే యజమానులపై బాలకార్మిక నిషేధ చట్టం, వెట్టిచాకిరి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. -
వెట్టి చాకిరి కేసులో 17 ఏళ్ల జైలు
యాకుత్‌పురా: బాలలతో వెట్టి చాకిరి చేయించిన కేసులో బిహార్‌కు చెందిన నిందితుడికి 17 ఏళ్ల జైలు శిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నాంపల్లిలోని 4వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి డి.హేమంత్ కుమార్ బుధవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. భవానీ నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. బిహార్‌కు చెందిన షంషీర్ ఖాన్ (38) బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి నషేమాన్‌నగర్ ఒవైసీ పాఠశాల ప్రాంతంలో గాజుల తయారీ కార్ఖానా నిర్వహిస్తున్నాడు. బిహార్‌కు చెందిన మైనర్ బాలలను నగరానికి తీసుకొచ్చి తన కార్ఖానా లో పనిచేయించాడు. 2016 జనవరి 2న అప్పటి భవానీ నగర్ ఎస్ఐ ప్రసాద్‌రావు, కార్మిక శాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. దాడుల్లో గాజుల కార్ఖానాలో 11 మంది మైనర్ బాలలు పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అప్పటినుంచి కోర్టులో కొనసాగుతున్న కేసుపై ఈ మేరకు తీర్పు వెలువడింది. దీంతో నిందితుడిని జైలుకు తరలించారు. -
సత్యార్థి సోల్జర్
‘కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్’ తో కలిసి దేశవ్యాప్తంగా పని చేస్తున్న పిల్లల హక్కుల కార్యకర్తలలో హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చందన మర్రిపల్లి ఒకరు. సత్యార్థి ఫౌండేషన్ ‘బచ్పన్ బచావో ఆందోళన్’ చేపట్టి దాదాపుగా భారత్ దేశమంతటా పర్యటించింది. బాల కార్మికులను, అపహరణకు గురయిన పిల్లలను గుర్తించి వారిని పనుల్లో నుంచి తప్పించి బడుల్లోకి పంపిస్తోంది. లైంగిక దోపిడీకి బలవుతున్న బాల్యానికి సంరక్షించడానికి తాపత్రయ పడుతోంది. ఈ పర్యటనల క్రమంలో ప్రత్యక్షానుభంతో తాను తెలుసుకున్న అనేక సంగతులను చందన ‘సాక్షి’ ఫ్యామిలీతో పంచుకున్నారు. ‘‘బచ్పన్ బచావో ఆందోళన్ (బిబిఎ)లో భాగంగా 2017లో భారత్ యాత్ర నిర్వహించాం. ఆ యాత్ర కన్యాకుమారి నుంచి తెలంగాణ మీదుగా కాశ్మీర్ వరకు ఆగింది. ఏడు మార్గాలుగా సాగిన మా భారత్ యాత్ర 22 రాష్ట్రాలు, యూటీలను సందర్శించింది. ఆ పర్యటనలో సమాజానికి ‘పిల్లల మీద దాడి జరగకూడదు, పిల్లలు అపహరణకు గురి కాకూడదు’ అని పిలుపునిచ్చాం. ‘చైల్డ్ రేప్‌కి శిక్ష కఠినంగా ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. భారత్ యాత్ర తర్వాత ఇచ్చిన నివేదిక కారణంగానే 16వ లోక్‌సభ యాంటీ ట్రాఫికింగ్ బిల్‌కు చట్టం రూపం వచ్చింది. బిబిఎ కి 14 రాష్ట్రాల్లో పటిష్టమైన నెట్వర్క్ ఉంది. మా కార్యకర్తలు చురుగ్గా పని చేస్తూ తమ దృష్టికి వచ్చిన విషయాలను పోర్టల్‌లో పోస్ట్ చేస్తారు. అలా మాకు ఒడిషా నుంచి పెద్దసంఖ్యలో బాలకార్మికులు తెలంగాణకు తరలి వచ్చినట్లు తెలిసింది. ఒడిషా వాళ్లు ఎక్కడెక్కడ పనులు చేస్తున్నారనే కోణంలో స్థానికంగా విచారించినప్పుడు.. వాళ్లంతా ఇటుకలు తయారు చేసే బట్టీల్లో పనిచేయడానికి వచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత ఇటుక బట్టీల మీద నిఘా పెట్టాం. ఆ నిఘాలో మేము ఊహించిన వాటితోపాటు ఊహించని నిజాలూ బయటపడ్డాయి. పేదరికం చేసే ఒప్పందం ఇటుక బట్టీలు జనావాసాలకు దూరంగా ఉంటాయి. ఆ బట్టీల్లో పని చేయడానికి శ్రామికులను బయటి నుంచి తీసుకువస్తుంటారు బట్టీల యజమానులు. ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన ఇటుకలు చేసే శ్రామికులు ఇటుక బట్టీల పక్కనే ఇటుకల్లేని గుడారాల్లో తలదాచుకుంటారు. పాములు, తేళ్లు ఆ గుడారాల చుట్టూ సంచరిస్తూనే ఉంటాయి. వాటి బారి నుంచి తమను తాము కాచుకుంటూ బతుకీడుస్తుంటారు. ఇదంతా ఒక ఎత్తయితే శ్రామికుల కుటుంబాల్లోని పిల్లలతో కూడా పని చేయించుకునేటట్లు ఒప్పందం చేసుకుంటున్నారు! ఇది ఇటుక బట్టీల యజమానులకు– శ్రామికుల కుటుంబాలకు మధ్య జరిగే ఒడంబడిక. పేదరికం శాసిస్తున్న జీవితాల్లో ఆ పేదరికమే దగ్గరుండి మరీ చేయించే కట్టుబానిసత్వాలు ఇవన్నీ. అలా కుటుంబం మొత్తం పని చేస్తుంటారు. పదేళ్ల పిల్లలను కూడా ఒక తలకాయగా లెక్కించేసి ముందుగానే కొంత డబ్బు అడ్వాన్స్‌గా ఇచ్చేస్తారు. అలా బడిలో బలపంతో అక్షరాలు దిద్దాల్సిన బాల్యం తన ప్రమేయం లేకుండానే ఇటుక రాళ్లను పేర్చడానికి అలవాటు పడిపోతుంది. పద్నాలుగేళ్ల వయసు వచ్చే వరకు పిల్లలను బడికి పంపించాలని, పనులకు పంపించకూడదని మన దగ్గర చట్టాలన్నాయి. అయినా పనుల్లో చేర్చేది తల్లిదండ్రులే అయినప్పుడు ఆపగలిగింది ఎవరనేదే ప్రశ్న. ఒకవేళ తల్లిదండ్రులు సెలవుల్లో పిల్లలకు ఏదో పని నేర్పించాలనుకుంటే దానికీ నిబంధనలున్నాయి. రాత్రి ఏడుగంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు పిల్లల చేత ఎట్టి పరిస్థితుల్లోనూ పని చేయించరాదు. కానీ ఇటుకబట్టీల్లో పనులు పగటి పూటకంటే రాత్రిళ్లే ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే ప్రమాదకరమైన పని ప్రదేశాల్లో పిల్లల చేత పని చేయించరాదనే నిబంధన చాలా స్పష్టంగా ఉంది. బట్టీల మధ్య ఇరుగ్గా ఉండే సందుల్లో సులువుగా నడుస్తూ ఇటుకలను తిరగేయడం వంటి పనులు పెద్దవాళ్ల కంటే పిల్లలే బాగా చేస్తారని ఆ పనులు పిల్లల చేతనే చేయించడం చూశాం. ఇంతకంటే అసలైన ఘోరం, అమానవీయం మరొకటుంది ఇక్కడ! చీకటే నాలుగ్గోడలు! ఇటుక బట్టీల దగ్గర నివాసం ఉండే శ్రామికుల కోసం టాయిలెట్లు ఉండవు. రాత్రి కావడమే వాళ్లకు నాలుగ్గోడలు. స్నానం చేయాలన్నా, ఇతర కాలకృత్యాలైనా తెల్లవారకముందే పూర్తవ్వాలి. లేకుంటే మళ్లీ రాత్రి జనం నిద్రకు ఉపక్రమించిన తర్వాతే. అప్పుడు కూడా ఏజెంట్ల నిఘా కళ్ల నీడల్లో సంచరించాల్సిందే. టీనేజ్‌లో ఉన్న ఆడపిల్లలు దూరంగా వెళ్తుంటే... వాళ్ల కదలికలను గమనిస్తూ టార్చ్ లైట్ వేస్తుంటాడు ఏజెంట్. ఇదేం పని అని అడిగితే ఆ అమ్మాయిలు ఎటూ పారిపోకుండా చూస్తున్నామంటారు. పిల్లల బాల్యాన్ని పనిగంటలుగా మార్చి కొనుగోలు చేసిన వ్యాపారి కబంధ హస్తాల్లో నుంచి బయటపడడం అంత సులభం కూడా కాదు. అయినా వాళ్ల ప్రతి కదలిక మీదా ఓ కన్ను ఉంటుంది. ఇంతే కచ్చితంగా శ్రామికుల సదుపాయాలు కల్పిస్తున్నారా అంటే ఒక్కటీ కనిపించవు. శ్రామికులను కుటుంబాలతోపాటు పనిలో పెట్టుకున్నప్పుడు పాటించాల్సిన లేబర్ ‘లా’ను పట్టించుకోవడం ఎక్కడా కనిపించలేదు మాకు. శ్రామికులు సౌకర్యంగా నివసించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ యజమానులే చేయాలి. పిల్లల కోసం స్పెషల్ స్కూల్ కూడా నిర్వహించాలి. అది కూడా ఏ ప్రాంతం నుంచి శ్రామికులను తీసుకువచ్చారో ఆ భాషలోనే చదువు చెప్పించాల్సి ఉంటుంది. రెండు నెలల కిందట కూడా ఇలాంటి దయనీయ స్థితిలో దాదాపుగా వెట్టిచాకిరి చేస్తున్న పిల్లలను సంరక్షించాం. బాండెడ్ లేబర్ యాక్ట్‌ని ఉల్లంఘిస్తే పని చేయించుకున్న యజమానులతోపాటు తల్లిదండ్రులకూ శిక్ష ఉంటుందని చెప్పిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అసలైన దయనీయం పిల్లల బాల్యాన్ని తుంచేయడంలో సమాజం బాధ్యత కూడా ఎక్కువే. ఒక కాలనీలో పిల్లలు స్కూలు ఎగ్గొట్టి అల్లరిచిల్లరగా తిరుగుతుంటే ఆ కాలనీ వాళ్లు చూసి కూడా వాళ్ల అమ్మానాన్నలకు చెప్పరు. హైదరాబాద్ సిటీలో ఓ బస్తీలో పిల్లలు మద్యం తాగుతున్నట్లు కాలనీలో అందరికీ తెలుసు. కానీ ఒక్కరు కూడా వాళ్ల అమ్మానాన్నలకు చెప్పలేదు, అధికారులకూ చెప్పలేదు. పిల్లల సంరక్షణ కోసం మన దగ్గర చట్టాలున్నాయి. కానీ సంబంధిత డిపార్ట్మెంట్లకు సమాచారం చేరడం లేదు. ఆ గ్యాప్‌ని భర్తీ చేయడానికి సత్యార్థి ఫౌండేషన్ పని చేస్తోంది. మాకు సమాచారం వచ్చిన వెంటనే ముందుగా వెళ్లి పరిస్థితిని గమనిస్తాం. ఆ తర్వాత ప్రభుత్వ శాఖలకు తెలియచేసి వారి సమన్వయంతో ఆ పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, పిల్లల్ని బడికి పంపేలా చూడడం వంటివి మా వంతు బాధ్యతగా చేస్తున్నాం. లీగల్ అవేర్నెస్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాం. మా విజ్ఞప్తి ఒక్కటే... ‘పిల్లలు అపహరణకు గురయినట్లు తెలిసినా, పిల్లల చేత పని చేయించడాన్ని చూసినా, పిల్లలు ఇతర వేధింపులకు బలవుతున్నట్లు తెలిసినా, వ్యసనాల బారిన పడుతున్నట్లు గమనించినా వెంటనే మాకు తెలియచేయండి’ అని అర్థిస్తుంటాం.ఈ ఏడాది ఫిబ్రవరిలో కరీంనగర్లో సమావేశంలో కైలాష్ సత్యార్థి గారు పాల్గొన్నారు. మేము చేసుకున్న తీర్మానాల్లో ముఖ్యమైనవి.. బడికి పోవాల్సిన వయసులో ఉన్న పిల్లలు పనికి పోతున్నట్లు ఒక్క కేసు కూడా లేని రోజు కోసమే మా పోరాటం. పిల్లలందరూ బడిలో ఉండాలనేది మా ఫౌండేషన్ ఆశయం’’ అని ముగించారు చందన. – వాకామంజులారెడ్డి ఫొటోలు : నాగరాజు బాల్యం విలువైనది మాది రాజన్న సిరిసిల్ల జిల్లా (ఒకప్పటి కరీంనగర్ జిల్లా)లోని రుద్రంగి గ్రామం. మా ఊర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి మహిళను నేను. ఆడపిల్లలను చదివించడంలో అంతటి వెనుకబాటుకు గురయి ఉంది మా గ్రామం. నాన్న టీచర్, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి కావడం, అమ్మకు చదువుకోవాలనే కోరిక ఉండి కూడా చదువుకోలేకపోవడంతో నన్ను చదివించి తాను సంతోషపడడం... నన్ను పీజీ వరకు తీసుకెళ్లింది. పిల్లల్ని పనికి పంపించకుండా బడికి పంపించడం అంటే ఇటు సూర్యుడు అటు ఉదయించినంత గందరగోళమన్నమాట. మా నాన్న మా ఊరి ఉద్యమకారుడనే చెప్పాలి. టీచర్‌గా ఆయన బడికి వచ్చిన పిల్లలకు పాఠాలు చెప్పి ఊరుకోలేదు. ప్రతి ఇంటికీ తిరిగి పిల్లల్ని బడికి పంపించమని పెద్దవాళ్లను బతిమిలాడి మరీ తీసుకెళ్లేవారు. నా చిన్నప్పుడు నాన్నను అలా చూశాను. పీజీలో సోషల్ వర్క్ చేశాను. దాంతో నా కెరీర్‌ని కూడా సామాజిక కార్యకర్తగానే మలుచుకున్నాను. మొదట ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్, హెచ్ఐవి ప్రాజెక్ట్‌లతో పని చేశాను. ప్రస్తుతం సత్యార్థి ఫౌండేషన్‌తో కలిసి పని చేస్తున్నాను. బాల్యం విలువైనది. పిల్లల కోసం పనిచేయడం సంతోషంగా నాకు ఉంది. చందన మర్రిపల్లి, పిల్లల హక్కుల కార్యకర్త, చీఫ్ కో ఆర్డినేటర్(తెలంగాణ), సత్యార్థి ఫౌండేషన్ -
చిన్నారులు.. చిరునగవులు
సాక్షి, హైదరాబాద్: వీధి బాలలు, అనాథలు, తప్పిపోయిన చిన్నారులను చేరదీసి వారికి రక్షణ కల్పించేందుకు చేపట్టిన ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ వంటి కార్యక్రమాలు ఫలించి ఎందరో చిన్నారుల ముఖాల్లో నవ్వులు పూయిస్తున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం రావడం... ఫలితంగా బాలకార్మికులు, వీధిబాలలు, భిక్షాటన చేయించడం తగ్గుముఖం పడుతున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి పిల్లల సంఖ్య తక్కువగా నమోదైంది. ప్రతీ ఏటా జనవరిలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోలీస్, లేబర్, జీహెచ్ఎంసీ తదితర శాఖల సమన్వయంతో నిర్వహించే ఈ ఆపరేషన్ స్మైల్ లో ఈ సంవత్సరం 2,425 మంది చిన్నారులను అధికారులు గుర్తించి చేరదీశారు. అందులో 2,168 చిన్నారులను సేకరించిన వివరాల ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మరో 66 మంది పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో ఆయా ప్రభుత్వాలతో చర్చలు జరిపి వారికి అప్పగించగా...మరో 191 మంది చిన్నారులను ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్పించారు. ప్రతీ ఏటా జూలైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తారు. ఐదేళ్లలో 23 వేల చిన్నారులకు రక్షణ హైదరాబాద్‌లోని పలు దుకాణాల యజమానులు చిన్నారులను పనిలో పెట్టుకుంటున్నారని పలు ఫిర్యాదులు రావడంతో 2014–15 సంవత్సరంలో పోలీస్ అధికారులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. చార్మినార్‌లోని బ్యాంగిల్ ఇండస్ట్రీలో దాడులు నిర్వహించి 356 మంది చిన్నారులను గుర్తించారు. వారిని పనిలో నుంచి తొలగించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరికొందర్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించారు. స్మైల్, ముస్కాన్ కార్యక్రమాల ద్వారా ఈ ఐదేళ్లలో ఇప్పటివరకు 23,476 మంది చిన్నారులను అధికారులు గుర్తించి చేరదీశారు. వీరిలో కుటుంబ సభ్యుల వివరాలు చెప్పిన వారికి ఇంటికి పంపించారు. అనాథపిల్లలను కస్తూర్భా గాంధీ పాఠశాలలు, వసతిగృహాల్లో చేర్పించారు. పరిస్థితి మారుతోంది రాష్ట్రంలో బాలకార్మికులు, వీధిబాలలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్‌ల ద్వారా రాష్ట్రానికి చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా దొరుకుతున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు తెలిపిన వారిని ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక వాహనంలో ఇంటికి పంపిస్తున్నాం. చట్టాలు, ప్రభుత్వం తీసుకునే చర్యలపై ప్రచారం చేయడం, క్షేత్రస్థాయి నుంచి కూడా ఫిర్యాదులు రావడంతో చాలాచోట్ల పరిస్థితి మారింది. గణాంకాల్లోనూ పిల్లల సంఖ్య తగ్గుతూ రావడం శుభపరిణామం. –కేఆర్ఎస్ లక్ష్మీదేవి, సంయుక్త సంచాలకులు, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ -
బుగ్గిపాలవుతున్న బాల్యం!
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: అక్షరాలు దిద్దాల్సిన చిట్టిచేతులు కర్మాగారాల్లో నిలిగిపోతున్నాయి.. ఆడి, పాడాల్సిన వయసులో కఠినమైన పనులు చేస్తున్నాయి.. తాత్కాలిక అవసరాల కోసం తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకుండా పనులకు వెంట తీసుకెళ్లడంతో బాల్యం బుగ్గిపాలవుతోంది. పిల్లలందరూ బడిలో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఎంత ప్రయత్నించినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదు. పెరుగుతున్న బాలకార్మికుల సంఖ్య విద్యాశాఖ అధికారులు గత నెల చివరివారం నుంచి చేపట్టిన ఇంటింటి సర్వేలో జిల్లా వ్యాప్తంగా ఎంత మంది బడిబయటి పిల్లలు ఉన్నారో లెక్క తేలింది. కానీ వాస్తవానికి ఇంకా అందుకు రెట్టింపుస్థాయిలోనే ఉంటారన్నది అందరికి తెలిసిందే. పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ అయిన విద్యార్థులు, ఎన్రోల్మెంట్ కాని విద్యార్థులుగా గుర్తించి సర్వే చేశారు. అందులో భాగంగా 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు వయస్సు ఉండి, ఇటు అంగన్వాడీలో గానీ, అటు ప్రభుత్వ పాఠశాలకు గానీ వెళ్లకుండా ఇంటి వద్ద ఉండడం లేదా ఏదైనా పనికి వెళ్లే విద్యార్థులను బడిబయట పిల్లలుగా గుర్తించారు. సర్వేలో భాగంగా మొత్తం 1,075 మంది బడిబయటి పిల్లలున్నట్లు గుర్తించారు. 6 నుంచి 14 సంవత్సరాలున్న వారిలో 500 మంది బాలికలు, 674 మంది బాలురు ఉన్నారు. అందులో అధికంగా నారాయణపేట మండలంలో 235 మంది ఉన్నారు. వీరిలో 84 మంది బాలికలు, 151 మంది బాలురు. తర్వాతి స్థానంలో నవాబ్‌పేట మండలంలో 121 మంది బడిబయటి పిల్లలు ఉన్నారు. వీరిలో బాలికలు 55 మంది, బాలురు 66 మంది ఉన్నారు. అసలు మిడ్జిల్ మండలంలో బడిబయటి పిల్లలే లేరని అధికారులు రిపోర్టు ఇవ్వడం ఆలోచించాల్సిన విషయం. ఇక బాలానగర్‌లో 8, భూత్పూర్లో 11 మంది ఉండగా మహబూబ్‌నగర్ అర్బన్‌లో 33 మంది బడిబయటి పిల్లలు ఉన్నారు. వీరిలో బాలురు 19 మంది, బాలికలు 14 మంది ఉన్నారు. వారితో పాటు మెప్మా, డీఆర్డీఏ అధికారుల, పలు ఎన్జీఓ సంస్థలు వారు కూడా సర్వేలు నిర్వహించారు. బడిబాట పట్టించేందుకు ప్రయత్నం బడిబయటి పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యాశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా విద్యార్థులకు సీజనల్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటకే దాదాపు 14 హాస్టళ్ల ఏర్పాటు కోసం అధికారులు ప్రతిపాధనలు సిద్ధం చేశారు. ఈ సర్వే ఆధారంగా వచ్చిన రిపోర్టుతో బడిబయటి పిల్లలు ఉన్న దగ్గర హాస్టల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా వర్క్‌సైడ్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తల్లిదండ్రులు పనిచేసే ప్రాంతంలో పిల్లలకు అక్కడే చదువు చెప్పించే విధంగా కృషి చేస్తున్నారు. అనంతరం పిల్లల తల్లిదండ్రులను కౌన్సెలింగ్ చేసి పిల్లల్ని బాలసదన్, కేజీబీవీల్లో వసతి ఏర్పాటు చేసి విద్యను అందించేందుకు ఒప్పిస్తారు. ఐసీడీఎస్‌తో పాటు, పోలీస్ శాఖల సమన్వయంతో మరింత మంది పిల్లలను గుర్తించి పాఠశాలలకు పంపిచేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సంచార జీవుల కోసం.. బడి బయటి పిల్లలు ప్రధానంగా చదువుకు దూరం కావడానికి తల్లిదండ్రులు ఎంచుకున్న పలు వృత్తులే కారణం. జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతూ సంచార జీవనం చేస్తున్న వారికి పిల్లలు పూర్తి స్థాయిలో చదువుకోవడానికి నోచుకోవడం లేదు. మరీ ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని బండమీద పల్లెవద్ద ఉన్న బుడగజంగాల కాలనీ, అప్పన్నపల్లితో పాటు వివి«ధ ప్రాంతాల్లో వీరు నివసిస్తున్నారు. అయితే వీరు వెంట్రుకల సేకరణ, చెత్త కాగితాలు సేకరణతో పాటు పలు వృత్తిపరమైన పనులు చేస్తుంటారు. వీరు పిల్లలను సరిగ్గా బడికి పంపించకుండా పనిలో నిమగ్నమై వెట్టి చేయిస్తున్నారు. మధ్యాహ్నం వేళ పిల్లలను పట్టణంలో పలు ప్రాంతాలకు పంపించి ఆహార సేకరణ చేయిస్తున్నారు. ఇవేకాకుండా ఇటుబట్టీలు, బొగ్గుబట్టీలు, బొంతలు కుట్టడం, వివిధ పెద్దపెద్ద భవనాల వద్ద ఉపాధి కోసం పనిచేసే వారి పిల్లలు కూడా బడికి దూరమవుతున్నారు. గిరిజన తండాలు, గూడేలు చాలా వరకు వ్యవసాయ పనులు పూర్తి అవగానే ఊర్లకు ఊర్లే ఖాళీచేసి వృత్తి, ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తుంటారు. వీరి పిల్లల్ని కూడా బడికి పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
అక్రమ రవాణా బాధితులకు అండ
సాక్షి, అమరావతి: యువతులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టడం, బాలలను అక్రమంగా తరలించడం, బాల కార్మికులుగా మార్చడం వంటి దురాగతాలపై కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాస్త్రం సంధించింది. ఈ మేరకు మానవ అక్రమ రవాణా నిరోధక బిల్లు–2018ను తీసుకొస్తోంది. దేశవ్యాప్తంగా మానవ అక్రమ ఆందోళనకర రీతిలో పెరిగిపోతోంది. అక్రమ రవాణాలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నాయి. బాలకార్మికుల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మానవ అక్రమ రవాణా నిరోధక బిల్లు–2018ను జూలై 26న లోక్‌సభలో ప్రవేశపెట్టడంతో ఆమోదం లభించింది. మంగళవారం రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉండగా సభ వాయిదా పడిన నేపథ్యంలో బుధవారం ప్రవేశపెట్టనున్నారు. మానవ అక్రమ రవాణా కేసుల్లో బాధితులకు న్యాయం జరగకపోవడం, పునరావాసంలో జాప్యం వంటి సమస్యలపై సుప్రీంకోర్టుకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు 2015లో కేంద్ర ప్రభుత్వానికి పలు మార్గదర్శకాలు జారీ చేస్తూ తీర్పు వెలువరించింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో బాధితులకు పరిహారం, పునరావాసంలో తీవ్ర జాప్యం జరుగుతోందని సుప్రీంకోర్టు గుర్తించింది. అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి చట్ట సవరణ చేయడం ద్వారా బాధితులకు సత్వరం న్యాయం చేకూర్చాలని సూచించింది. ఈ నేపథ్యంలో కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ గత మూడేళ్లలో దాదాపు 32 పర్యాయాలుముసాయిదా బిల్లులు తయారు చేసి ప్రజాభిప్రాయాన్ని కోరింది. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన తుదిబిల్లు ఎట్టకేలకు అవాంతరాలను అధిగమించి ఆమోదం పొందింది. ఇక రాజ్యసభలో ఆమోదించడమే తరువాయి. కేటుగాళ్లకు కఠిన శిక్షలు మానవ అక్రమ రవాణా నిరోధక బిల్లు చట్టరూపం దాల్చి, అమల్లోకి వస్తే మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పునరావాస మూలనిధి(రిహాబిలిటేషన్ ఫండ్) ఏర్పాటు చేస్తుంది. అక్రమ రవాణాకు పాల్పడిన దుండగుల(ట్రాఫికర్ల) నుంచి తక్షణం అపరాధ రుసుం వసూలు చేసి బాధితులకు అందజేస్తారు. 18 ఏళ్ల లోపు బాలలను కార్మికులుగా మారిస్తే, అక్రమంగా తరలిస్తే కఠిన శిక్షలు తప్పవు. ఇలాంటి కేసుల్లో నాలుగు నెలల్లోనే విచారణ పూర్తి చేసి దోషులను శిక్షలు విధించడంతోపాటు బాధితులకు తక్షణ న్యాయం చేయాల్సి ఉంటుంది. ఈ కేసుల పురోగతిని పర్యవేక్షించడానికి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు. బాధితులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావడం శుభపరిణామమని ‘హెల్ప్’ సంస్థ రాష్ట్ర కార్యదర్శి ఎన్వీఎస్ రామ్మోహన్ చెప్పారు. ఇది గొప్ప విజయం ‘‘దేశంలోని వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న బాలలు, మహిళలతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 8 లక్షల మంది బాధితులు సాధించుకున్న గొప్ప విజయం ఇది. కొత్త చట్టంతో ట్రాఫికర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుంది. బాధితులకు న్యాయం, పునరావాసం లభిస్తాయి. 18 ఏళ్లలోపు వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తే కఠిన శిక్షలుంటాయి’’ – వి.విజయనిర్మల, విముక్తి సంస్థ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు -
మొక్కుబడిగా ‘స్మైల్’
కొత్తగూడెం: బాలలకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించి, పాఠశాలల్లో చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు జిల్లాలో మొక్కుబడిగా సాగుతున్నాయి. అన్ని శాఖల అధికారులు కలిసి ప్రతి ఏటా జనవరిలో ‘ఆపరేషన్ స్మైల్’, జూలైలో ‘ఆపరేషన్ ముస్కాన్’ పేర రెండు విడతలుగా స్పెషల్ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నారు. బడి బయట బాలలను గుర్తించి పాఠశాలల్లో చేరుస్తున్నారు. ఆ తర్వాత పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో తిరిగి బాలలు బలవంతంగా పనుల్లో కూరుకుపోతున్నారు. దీంతో ప్రభుత్వాల లక్ష్యం నెరవేరడంలేదు. పట్టింపు అంతంత మాత్రమే..! జనవరి నెలమొత్తం జరగాల్సిన ఆపరేషన్ స్మైల్ జిల్లాలో జనవరి 12వ తేదీ వరకు పట్టాలు ఎక్కడంలేదు. జనవరి 31కే ముగిస్తున్నారు. ఈ యేడాది మేడారం ప్రత్యేక విధుల పేరుతో ముగించేశారు. జిల్లా ఉన్నతాధికారులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో డ్రైవ్‌లు ఫలితాలినివ్వడంలేదు. ప్రధానంగా బాల కార్మికులను గుర్తించి వారికి శాశ్వత ప్రాతిపదికన విద్యను అందించాల్సి ఉండగా, బృందాలు కేవలం డ్రాపవుట్స్పైనే దృష్టి సారించి కేసులను నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డివిజన్ల వారీగా విద్యాశాఖ అధికారులతో చైల్డ్‌లైన్ అధికారులు నిరంతరం హాజరును సమీక్షించాల్సి ఉండగా, ఆ ఊసే లేకపోవడం శోచనీయం. దీంతో బాలకార్మికులు, డ్రాపవుట్స్ యథాస్థితికి చేరుకుంటున్నారు. స్మైల్, ముస్కాన్ అమలు ఇలా.. జిల్లాను ఐదు డివిజన్లుగా విభజించి ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ చేపడుతున్నారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం డివిజన్లుకాగా, ఒక్కో డివిజన్లో ఒక ఎస్సై, మహిళా కానిస్టేబుల్, సీడబ్ల్యూసీ సభ్యులు, ఇద్దరు పురుష కానిస్టేబుల్‌తో పాటు కార్మిక శాఖ అధికారి కలిసి స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తారు. బడిబయట పిల్లలను గుర్తించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పాఠశాలల్లో చేర్పిస్తారు. బాల కార్మికులతో పనులు చేయిస్తున్న వారిపై కేసులను నమోదు చేస్తారు. 14 సంవత్సరాల లోపు వెట్టి చాకిరీ చేయిస్తున్న వారిపై కార్మిక శాఖ అధికారులు ఐఆర్ చట్టం కింద, 18 సంవత్సరాల లోపు చాకిరీ చేయించే వారిపై జేజే యాక్ట్, 2015 ప్రకారం కేసులను నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తారు. ఈ ఏడాది 167 కేసులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2015లో 578, 2016లో 385 కేసులు నమోదు చేశారు. జిల్లా విభజన తరువాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో 2017 జనవరిలో 152 కేసులు, జూలైలో 138 కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది 2018 జనవరి 12న చేపట్టిన ఆపరేషన్ స్మైల్‌లో 167 కేసులను నమోదు చేశారు. భద్రాచలం డివిజన్లో 23, పాల్వంచలో 64, కొత్తగూడెం 18, మణుగూరు 13, ఇల్లందు డివిజన్లో 49 కేసులను నమోదు చేశారు. వీరు గుర్తించిన కేసులలో ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు 20, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 147 మంది ఉన్నారు. వీటిలో అత్యధికంగా డ్రాపవుట్స్, పిల్లలతో భిక్షాటన చేసే కేసులే ఉండటం గమనార్హం. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి తప్పిపోయి, పారిపోయి వచ్చిన పిల్లలు వెట్టి చాకిరీకి గురవుతున్నారు. భాష రాకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, హోటల్స్, వ్యాపార దుకాణాల్లో మగ్గిపోతున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి భారత రాజ్యాంగం కల్పించిన 21(ఏ) ఆర్టికల్ ప్రకారం, 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం... ప్రతీ విద్యార్థికి విద్య అందేలా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరిగేలా ప్రక్షాళన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ స్పెషల్ డ్రైవ్‌లలో గుర్తించిన బాల కార్మికులను, డ్రాపవుట్స్‌ను పాఠశాలల్లో చేరుస్తున్నాం. అంతేకాకుండా ఆ విద్యార్థులపై తగిన శ్రద్ధ వహిస్తున్నాం. విద్యార్థులకు న్యాయం జరిగేలా సిబ్బందితో పర్యవేక్షిస్తున్నాం. –ఝాన్సీ లక్ష్మీబాయి, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి -
తమ అభిమాన హీరోని కలవాలని కొందరు..
తమ అభిమాన కథానాయకుడిని కలవాలని కొందరు.. అసాధ్యమని తెలియక హీరోలు కావాలని ఇంకొందరు.. అమ్మానాన్న మందలించారని మరికొందరు.. ఇంట్లో నుంచి కాలుబయట పెట్టి వీధిన పడుతున్నారు.. తిరిగి ఇంటికెళ్లలేక రోడ్డుమీదే బతికేస్తున్నారు.. మాదకద్రవ్యాలు సరఫరా చేసే ముఠాల చేతికి చిక్కి.. యాచక వృత్తిలోకి బలవంతంగా దించేవారికి దొరికి.. బంగారు భవిష్యత్తును చేజేతులా పాడుచేసుకుంటున్నారు! సాక్షి, ముంబై: వీధిబాలల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. 2017లో ఒక్క ముంబై నగరంలోనే పోలీసులు దాదాపు 700 మంది వీధిబాలలను కాపాడారు. ఇంకా పోలీసులకు చిక్కకుండా రోడ్లపై తిరుగుతున్నవారు మరెందరో ఉన్నారు. వీరంతా అనాథలు కారని, రకరకాల కారణాలతో ఇంట్లో నుంచి బయటకు వచ్చినవారేనని పోలీసులు చెబుతున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మానాన్న మందలించారనే కోపంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి, ఎక్కడికి వెళ్లాలలో తెలియక రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే బతుకున్న 706 మంది చిన్నారులను 2017లో గుర్తించి, తిరిగి ఇంటికి పంపడమో, వసతి గృహాల్లో చేర్చడమో చేశారు. ముంబై శివారు ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలోనే 528 మందిని గుర్తించగా వారిలో 360 మంది బాలలు, 168 మంది బాలికలు ఉన్నారు. ఇక ముంబైలోని రైల్వే స్టేషన్లలో 178 మందిని గుర్తించగా వారిలో 115 బాలలు, 63 మంది బాలికలున్నారు. వీరంతా 13 నుంచి 18 ఏళ్లలోపు వయసు వారే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చినవారే ఎక్కువగా ఉన్నారట. సమాచారం అందిస్తే సరి.. పిల్లలెవరైనా తప్పిపోతే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆధార్ నంబర్ వంటి వివరాల ఆధారంగా కూడా తల్లిదండ్రులను గుర్తిస్తున్నామని, అయితే చాలామంది పిల్లలు తిరిగి ఇంటికెళ్లేందుకు భయపడుతున్నారని, అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా తిరిగి ఇంటికి పంపుతున్నామని చెబుతున్నారు. దొరకనివారి పరిస్థితి... రైల్వే పోలీసులు గుర్తించిన పిల్లలు ఎలాగోలా తల్లిదండ్రుల వద్దకు చేరడమో.. ఇష్టంలేనివారిని వసతిగృహాల్లో చేర్చడమో జరుగుతోంది. మరి మిగతావారి పరిస్థితి ఏంటి? దీనిపై ఆర్పీఎఫ్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ అనుప్‌కుమార్ మాట్లాడుతూ... చాలామంది పిల్లలపై మాదకద్రవ్యాల ముఠాలు, యాచకవృత్తిలోకి పిల్లల్ని దింపే ముఠాలు నిఘాపెట్టాయి. రైళ్లలో నుంచి ఒంటరిగా దిగే పిల్లలకు మాయమాటలు చెప్పి, తీసుకెళ్లి బలవంతంగా బాలకార్మికులుగా, యాచకులుగా, మాదకద్రవ్యాలు సరఫరా చేసేవారిగా మార్చేస్తున్నారు. -
భావి ‘నవ్వు’లకు బాధ్యులు మీరే
సాక్షి, హైదరాబాద్: ‘ఏడెనిమిదేళ్ల క్రితం హరియాణాలోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్న బాల కార్మికులు, వారి తల్లిదండ్రులకు నేను విముక్తి కల్పించాను. పిల్లలను నా కారులో తీసు కెళుతూ తినేందుకు అరటిపండ్లు ఇచ్చాను. బానిసత్వంలోనే పుట్టి పెరిగిన వారికి అరటిపండ్లంటే కూడా తెలియదు. అవి అరటిపండ్లని, తినాలని చెపితే.. తొక్క తీయకుండానే తినడంతో రుచించక కింద పడేశారు. అప్పుడు అరటిపండ్లు ఎలా తినాలో నేను వారికి చెప్పాను. అరటిపండు రుచి తెలుసుకున్న ఓ పాప నా భుజం మీద చేయ్యేసి ‘పెహలే క్యో నహీ ఆయే?’ (ముందే ఎందుకు రాలేదు?) అని అడిగింది. ఇది ఆ పాప అడిగిన ప్రశ్న కాదు.. బాలకార్మిక వ్యవస్థలో మగ్గుతున్న లక్షలాది మంది చిన్నారులు అడుగుతున్న ప్రశ్న. నాతోపాటు ఈ సమాజాన్ని అడిగిన ప్రశ్న. అందుకే అఖిల భారత సర్వీసు అధికారులు (ఐఏఎస్)గా చిన్నారుల కలలను నిజం చేయడానికి మీరంతా కంకణబద్ధులు కావాలి. కలెక్టర్లుగా మీ జిల్లాలను ముందుండి నడిపించే నాయకులుగా పనిచేయాలి’అని నోబెల్ పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి పిలుపునిచ్చారు. పేద చిన్నారుల దరి చేరని అభివృద్ధికి అర్థం లేదని, చిన్నారుల ముఖాల్లో విరబూయాల్సిన భావి నవ్వులకు మీరే బాధ్యత తీసుకోవాలని కోరారు. మంగళవారం రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్)లో ‘బాలల హక్కులు– కలెక్టర్ల పాత్ర’ అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని దేశంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 45 మంది ఐఏఎస్ అధికారులను, ఎన్ఐఆర్డీపీఆర్ బృంద సభ్యులను, భారతీయ విద్యాభవన్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి దేశంలో చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) లెక్కలు చెబుతున్నాయని.. వాటిని అరికట్టడమే ఐఏఎస్ అధికారుల ముందున్న పెద్ద సవాల్ అని సత్యార్థి అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన మన రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు సంక్రమించాయని, కానీ ఆ హక్కులను కల్పించడంలో వ్యవస్థ విఫల మవుతోందని చెప్పారు. జిల్లా కలెక్టర్లుగా మీరంతా రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రభు త్వ పథకాలనే కాకుండా చట్టాలనూ పకడ్బం దీగా అమలు చేయాలని ఆయన కోరారు. గ్రీన్ ట్రిబ్యునల్ తరహాలో బాలల ట్రిబ్యునల్ పలువురు సభికులు అడిగిన ప్రశ్నలకు కైలాశ్ సమాధానమిస్తూ.. బాలల హక్కుల పరిరక్షణ కోసం గ్రీన్ ట్రిబ్యునల్ తరహాలో బాలల ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తాను కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కోరామని.. శిశుగృహ, జువెనైల్ హోమ్స్‌లో ఉంటున్న వారితో పాటు దేశంలోని ప్రతి చిన్నారికి గుర్తింపు కార్డు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఆర్డీపీఆర్ డైరెక్టర్ జనరల్ డబ్ల్యూఆర్ రెడ్డి, డాక్టర్ జ్ఞానముద్ర తదితరులు పాల్గొన్నారు. అవకాశాన్ని బాధ్యతగా మార్పుకోవాలి.. నవభారత నిర్మాణం జరుగుతున్న క్రమంలో నవభారత్ అంటే మౌలిక సదుపాయాలతో కూడిన డిజిటల్, టెక్నికల్ సమాజం కాదని, సాధికారతతో కూడిన పౌరుల పునాదులపై నవభారత సమాజ నిర్మాణం జరగాలని కైలాశ్ కోరారు. పాలనతో పాటు సామాజిక మార్పు తేవడంలో కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించి ముందుకెళ్లాల న్నారు. ‘మీరు పనిచేసిన చోట మీ అడుగుజాడలను వదిలి వెళ్లండి. మీరు ప్రభుత్వ ఉన్నతాధికారి మాత్ర మే కాదు. మీ జిల్లాను ముందుండి నడిపించే నాయ కుడనే విషయాన్ని మర్చిపోకండి’అని ఐఏఎస్ అధికా రులను కోరారు. మనదేశంలోని యువతకు అద్భుతమైన ప్రతిభాపాటవా లున్నాయని, అవకాశం వచ్చినప్పుడల్లా మన దేశ యువత తమను తాము నిరూపించుకుంటోందని కైలాశ్ అన్నారు. అలాంటి యువతలో ఒకరిగా వచ్చిన కొత్త కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులు తమ అవకాశాన్ని బాధ్యతగా మలుచుకుని ముందుకు సాగాలని సూచించారు. -
పాపం పసివాడు..
ఈ రెండింటిలో ప్రపంచంలో మొదటి స్థానంలో భారత్ సేవ్ ద చిల్డ్రన్ అంతర్జాతీయ సంస్థ నివేదికలో వెల్లడి బంగరు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన బాల్యం.. అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తోంది.. గనుల్లో, కార్ఖానాల్లో మగ్గిపోతోంది.. చితికిన కలలతో కొట్టుమిట్టాడుతోంది.. ఇది ‘ఎదగని’ భారతం వ్యథ.. ఆ భారతంలోని బాలల కథ... ఆడుతూపాడుతూ గడపాల్సిన బాల్యం.. అస్తవ్యస్తంగా మారుతోంది. సరైన ఆహారంలేక అలమటిస్తోంది.. తల్లిదండ్రులు శ్రమించాల్సిన చోట చిన్నారులే కార్మికులుగా మారుతున్నారు. పేదరికం.. నిరక్షరాస్యత.. మొదలైన సమస్యలతో కుటుంబ భారాన్ని తామే మోస్తున్నారు. దీంతో వయసుకు తగ్గ ఎదుగుదల లేని చిన్నారుల సంఖ్యలో మనదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి చిన్నారుల సంఖ్య 4.82 కోట్లు. అలాగే 3.1 కోట్ల మంది చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారట. ఇది కూడా ప్రపంచంలోనే అతి ఎక్కువ సంఖ్య కావడం గమనార్హం. సేవ్ ద చిల్డ్రన్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ తాజా సర్వేలో ఈ విస్తుగొలిపే గణాంకాలు వెల్లడయ్యాయి. 172 దేశాల్లో చేసిన సర్వేలో ఈ విషయాన్ని తేల్చారు. ఎండ్ ఆఫ్ చైల్డ్‌హుడ్ రిపోర్ట్ 2017 పేరిట సేవ్ ద చిల్డ్రన్ సంస్థ అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా జూన్ 1న దీనిని విడుదల చేసింది. బాల్యాన్ని కోల్పోతున్న 70 కోట్ల మంది.. వివిధ దేశాల్లో పలు కీలక అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు, పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపే పోషకాహార లోపం, విద్య అందకపోవడం, బాల కార్మికులు, బాల్య వివాహాలు, నెలలు నిండకుండానే జననాలు, శిశు భ్రూణహత్యలు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుని సర్వే నిర్వహించారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది చిన్నారులు వివిధ కారణాల వల్ల ముందుగానే తమ బాల్యాన్ని కోల్పోతున్నారని వెల్లడైంది. సరైన ఎదుగుదల లేని పిల్లలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్య, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని, త్వరగా అనారోగ్యం, వ్యాధుల బారిన పడుతున్నారని, వీటి వల్ల త్వరగా మరణిస్తున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ‘విద్య’కు దూరం.. ‘పని’కి దగ్గర.. దేశంలో ప్రాథమిక, మాధ్యమిక స్థాయి చిన్నారులు 18.6% మంది పాఠశాలకు వెళ్లడం లేదు. అప్పర్ సెకండరీ వయసు కలిగిన 4.7 కోట్ల మంది స్కూళ్లకు వెళ్లడం లేదు. దేశంలోని 4–14 ఏళ్ల వయసు పిల్లల్లో 11.8 శాతం మంది(3.1 కోట్లు) బాల కార్మికులుగా మారుతున్నారు. కుటుంబ పోషణ కోసం పనిలోకి వెళుతున్న వీరంతా చదువు, విశ్రాంతి, ఆటలు, వినోదాన్ని కోల్పోతున్నారు. -
రైల్వేస్టేషన్లో బాలకార్మికుల పట్టివేత
నెల్లూరు(అర్బన్): బీహార్ నుంచి బెంగళూరుకి బాలకార్మికులను తరలిస్తుండగా సోమవారం రాత్రి నెల్లూరు రైల్వేస్టేషన్లో పోలీసులు పట్టుకున్నారు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చైల్డ్‌హెల్ప్‌లైన్ 1098కి బాలలను తరలిస్తున్నట్టు ఫోన్ వచ్చింది. కాల్ రిసీవ్ చేసుకున్న కౌన్సిలర్ మదన్‌మిశ్రా వెంటనే బాలల సంరక్షణాధికారి సురేష్, ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారమిచ్చారు. సుమారు 10 గంటల ప్రాంతంలో బీహార్ నుంచి బెంగళూరు వెళ్తున్న రైలును పోలీసులు సోదాచేశారు. ఎఫ్–5బోగీలో ఒక బాలికతో పాటు 6 మంది బాలురు ఉండటంతో పట్టుకున్నారు. వారిని ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్తున్నారు. అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ రవిశంకర్, జీఆర్పీ సీఐ జి.దశరథరామారావులు విలేకరులతో మాట్లాడుతూ బీహార్‌లో తల్లిదండ్రులకు డబ్బులిచ్చి బెంగళూరులో పనిచేయించేందుకు ఇద్దరు వ్యక్తులు వారిని తరలిస్తున్నారని తెలిపారు. వారు కూడా పిల్లలకు బాగా తెలిసిన వారేనన్నారు. అయినప్పటికీ వెట్టిచాకిరి కోసం బాలలను బెంగళూరుకు తరలించడం నేరమన్నారు. అందుకే తాము వీరిని పట్టుకుని సీడబ్లు్యసీ కమిటీకి అప్పగిస్తున్నామని తెలిపారు. బాలలను పోలీసు సంరక్షణలో హోంకి తరలించారు. పిల్లలకు ఆహారాన్ని అందించారు. పట్టుబడిన బాలకార్మికుల్లో క్రాంతిథోరి(12)అనే బాలికతో పాటు శంకర్‌పున్‌థోరి(13),మోహన్‌థోరి(16),లాలన్‌కుమార్‌థోరి(14),నందకుమార్‌థోరి(12),రాహుల్‌కుమార్‌థోరి(12), అఖిలేష్‌కుమార్(12) ఉన్నారు. -
బాలకార్మికుల లెక్క తేల్చేద్దాం
జిల్లాల వారీగా సర్వే చేపట్టాలని కార్మిక శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: బాలల్ని పనిలో పెట్టుకోవడాన్ని నిషేధిస్తూ ప్రత్యేకంగా చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పటికీ ప్రభావం పెద్దగా కనిపించడంలేదు. చాలాచోట్ల 14 ఏళ్ల లోపు పిల్లలతో పనిచేయిస్తున్న సందర్భాలు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో బాల కార్మికుల వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా సర్వే చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో తొలుత ఇక్కడి నుంచే సర్వే ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో జిల్లాల వారీగా సర్వే చేపట్టేం దుకు కార్మికశాఖకు ఆదేశాలు జారీ చేసింది. బాలకార్మిక సర్వే నిమిత్తం జిల్లాల వారీగా సర్వే నిర్వహిస్తుండగా.. ఇందుకు ఒక్కో జిల్లాకు రూ.4లక్షలు కేటాయించింది. సర్వే వివరాల ఆధారంగా కొత్తగా జాతీయ బాలకార్మిక నిర్మూలన ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఇటీవల ప్రకటించారు. సరిగా పనిచేయని ప్రస్తుత ప్రాజెక్టులు.. పూర్వ జిల్లాల ప్రకారం రాష్ట్రంలో పదింటా 8 జిల్లాల్లో జాతీయ బాల కార్మిక నిర్మూలన ప్రాజెక్టులున్నాయి. వీటిలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ప్రాజెక్టులు ఐదేళ్లుగా కార్యక్రమాలు నిర్వహించడం లేదు. మిగతా ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టుల్లో అరకొరగా కార్యక్రమాలు సాగుతున్నాయి. నిర్మాణ రంగంతో పాటు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, కర్మాగారాల్లో పనిచేస్తున్నవారిలో ఎక్కువగా బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన వారున్నారు. ఈ క్రమంలో వారి పిల్లల్ని సైతం పనుల్లో పెడుతున్నట్లు అధికారుల ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. -
ఆపరేషన్ స్మైల్
తప్పిపోయిన పిల్లలు తల్లిదండ్రుల చెంతకు.. • బాల కార్మికులకు విముక్తి • స్పెషల్ డ్రైవ్‌లో 103 మంది గుర్తింపు తప్పిపోయిన పిల్లలు బాలకార్మికులుగా మారిపోతున్నారు. వారిని గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చడమే లక్ష్యంగా ఆపరేషన్ స్మైల్–3 నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 103 మంది బాలకార్మికులను గుర్తించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు బాలకార్మికులు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఇళ్లకు చేర్చుతున్నారు. కొందరిని చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌కు తీసుకెళ్తున్నారు. – సత్తుపల్లి హెల్ప్‌లైన్‌కు సమాచారమివ్వాలి ఆపరేషన్ స్మైల్–3తో అనాథ పిల్లలు, వీధి బాలలకు పునరావాసం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారి పిల్లలు చదువుకునేలా ప్రోత్సహిస్తున్నాం. చదువు లేనివారికి వృత్తి నైపుణ్యం పెంపొందించే కోర్సులు నేర్పిస్తున్నాం. ఎవరైనా బాలకార్మికులను గుర్తిస్తే చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098కు సమాచారం ఇవ్వాలి. –టి.విష్ణువందన , జిల్లా బాలల సంరక్షణాధికారిణి సత్తుపల్లి: బస్టాండ్లు.. రైల్వేస్టేషన్లు.. వీధుల్లో 18 సంవత్సరాలలోపు వయసు కలిగిన పిల్లలు యాచక వృత్తిలో ఉన్నా.. పనుల్లో ఉన్నా.. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రత్యేక డ్రైవ్ చేపట్టి గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తోంది. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కొందరు పిల్లలు వీధుల్లో అల్లరిచిల్లరగా తిరుగుతుండటం.. ఇళ్లల్లో పని చేస్తుండటం ప్రత్యేక బృందాల దృష్టికి వస్తున్నాయి. ఈ క్రమంలో కమిటీ సభ్యులు బాలల తల్లిదండ్రులను కలిసి కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఖమ్మం చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ ద్వారా 18 ఏళ్ల వయసు వచ్చే వరకు చదివించటం, భోజన సదుపాయంతో పాటు వసతి కల్పిస్తామని, నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లలను వీధుల్లోకి వదిలేయకుండా ఈ కేంద్రానికి తరలించాలని ప్రత్యేక బృందాలు చెబుతున్నాయి. పనుల్లో ఉన్న బాలబాలికలను.. రాజస్థాన్, ఒడిశా, బిహార్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి జిల్లాలో వివిధ పనులు చేస్తున్న బాలబాలికలను గుర్తించారు. వారి సొంత ప్రాంతాలను గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. సత్తుపల్లి డివిజన్లో సత్తుపల్లిలో 22 మంది, పెనుబల్లిలో 63 మంది బడిబయట పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. బడిబయట పిల్లలకు ఎంఈఓ, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ సహకారంతో కౌన్సెలింగ్ చేపడుతున్నారు. జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం.. మొదటివారంలో జిల్లాలో అనాథ పిల్లలతో అనాథాశ్రమాలు నడుపుతున్న కేంద్రాలను చైల్డ్వెల్ఫేర్ కమిటీ సభ్యులు పరిశీలించారు. రెండో వారంలో వీధి బాలలను గుర్తించి తల్లిదండ్రులతో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇక మూడో వారంలో 14 ఏళ్లలోపు బాలబాలికలు షాపుల్లో ఎక్కడైన పని చేస్తున్నట్లయితే.. యజమానులపై కార్మిక శాఖ అధికారి ద్వారా కేసు నమోదు చేస్తారు. నాలుగో వారంలో యాచక వృత్తిలో ఉన్న పిల్లలను గుర్తిస్తారు. పసిపిల్లలను జోలెలో వేసుకుని తిరుగుతూ యాచన చేస్తున్న వారిపై జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. సబ్ డివిజన్‌కో ప్రత్యేక బృందం.. జిల్లాలోని మూడు పోలీస్ సబ్ డివిజన్లకు ఒక్కో స్పెషల్ టీంను నియమించారు. ఈ ప్రత్యేక బృందాల్లో ఒక ఎస్ఐ, పోలీస్ సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు, మైనార్టీ సంక్షేమశాఖ, కార్మికశాఖ, విద్యాశాఖల అధికారులు ఉంటారు. ఆపరేషన్ స్మైల్–3 విజయవంతం కోసం ఈ బృందాలు సబ్‌డివిజన్ వారీగా పర్యవేక్షిస్తున్నాయి. ప్రత్యేక బృందాలు సబ్‌డివిజన్ వారీగా గస్తీ తిరుగుతూ వీధి బాలలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి. షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి విముక్తి కల్పించేందుకు ఈ బృందాలు కృషి చేస్తున్నాయి. మేం సహకరిస్తున్నాం.. బాలకార్మికుల వ్యవస్థను నిర్మూలించేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సంపూర్ణ సహకారం అందిస్తున్నాం. సత్తుపల్లి డివిజన్లో 37 మంది బాలురు, ఏడుగురు బాలికలను గుర్తించాం. పిల్లలను పనిలో పెట్టుకోవటం చట్టరీత్యానేరం. ఈ టీమ్‌లో పోలీస్‌శాఖ నుంచి ఒక ఎస్ఐ , కానిస్టేబుళ్లు ఉంటారన్నారు. –బల్లా రాజేష్, డీఎస్పీ, సత్తుపల్లి -
48 మంది బాలకార్మికులకు విముక్తి
కోదాడఅర్బన్ : దేశంలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు, తప్పిపోయిన పిల్లలను గుర్తించేందుకు, అనాథ పిల్లలకు రక్షణ కల్పించేందుకు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్–3లో భాగంగా ఇప్పటివరకు 48మంది బాలకార్మికులకు విముక్తి కల్పించినట్లు కోదాడ డీఎస్పీ ఎ.రమణారెడ్డి తెలిపారు. బుధవారం కోదాడ పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోదాడ సబ్‌డివిజన్ పరిధిలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్–3 కార్యక్రమ వివరాలను వెల్లడించారు. పోలీస్, రెవెన్యూ, కార్మిక, ఐసీడీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 1నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో పోలీస్‌శాఖ తరపున నేరేడుచర్ల ఎస్ఐతో పాటు ఒక మహిళా కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. కోదాడ సబ్‌డివిజన్ పరిధిలోని కోదాడ పట్టణ, రూరల్, హుజూర్నగర్, నేరేడేచర్ల, మునగాల పోలీస్స్టేషన్ల పరిధిలో మొత్తం 48 మంది బాల కార్మికులను గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 35మంది ఇటుకబట్టీల్లో పనిచేస్తున్నారని తెలిపారు. బాలకార్మిక వ్యవస్థ నుండి విముక్తి కల్పించిన తరువాత వారిని శిశుసంక్షే మ కమిటీ ఎదుట హాజరుపరిచి పాఠశాలకు పంపేలా చర్య లు తీసుకుంటామన్నారు. అనాథ విద్యార్థులను గుర్తించి వా రి రక్షణ, సంక్షేమానికి చర్యలు చేపడతామన్నారు. బాలకార్మికుల సమాచారం తెలిసినవారు 94407 00085 నంబర్‌కు గా నీ, 1098 హెల్ఫ్‌లైన్ నంబర్లో కానీ ఆ వివరాలను తెలి యపర్చాలని కోరారు. అదేవిధంగా తన మొబైల్ నంబర్ 83329 02421కు కూడా వివరాలు తెలియజేయవచ్చన్నారు. సమావేశంలో సీఐలు రజితారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, ఆపరేషన్ స్మైల్ ఇన్చార్జ్ ఎస్ఐ గోపి ఉన్నారు. పీఏపల్లిలో ముగ్గురు.. పెద్దఅడిశర్లపల్లి : ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా ఇటుకల బట్టిలో పనిచేస్తున్న ముగ్గురు బాల కార్మికులకు గుడిపల్లి పోలీసులు విముక్తి కల్పించారు. గుడిపల్లి ఎస్ఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పీఏపల్లి మండలంలోని అంగడిపేట ఎక్స్ రోడ్డు వద్ద ఇటుకల బట్టిలో పని చేస్తున్న ముగ్గురు బాల కార్మికులు రంజిత్, రాజేశ్, రజితను గుర్తించి విముక్తులను చేసి నిర్వాహకుడి అరెస్ట్ చేశామని తెలిపారు. ఎస్ఐ వెంట సిబ్బంది ఉన్నారు. -
బాలలతో పనిచేయిస్తే కఠిన చర్యలు
ఉప కార్మిక కమిషనర్ శ్రీనివాస్ నెల్లూరు (సెంట్రల్): 18 ఏళ్లలోపు వారితో పనిచేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉప కార్మిక కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న కార్మిక శాఖ కార్యాలయంలో బుధవారం ఆయన కార్మిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో 14 ఏళ్లలోపు బాలలతో పనిచేయిస్తే బాలకార్మిక చట్టాన్ని అనుసరించి చర్యలు తీసుకోవడం జరిగేదన్నారు. 1986 చట్టాన్ని అనుసరించి చేసిన కొత్త సవరణల ప్రకారం 18 ఏళ్ల లోపు వారితో పనులు చేయించడం నేరమన్నారు. జిల్లాలో బాల కార్మికుల గుర్తింపునకు ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మిక శాఖతో పాటు మహిళా శిశుసంక్షేమ శాఖ, బాలకార్మికుల నిర్మూలన సంస్థ, రాజీవ్ విద్యామిషన్ సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించనున్నట్లు వివరించారు. బాలకార్మికులతో పనిచేయిస్తుంటే 0861–2323114, 1098 నంబర్లకు సమాచారాన్ని అందించాలని కోరారు. -
ఇది అమానవీయమైన బిల్లు
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన బిల్లుపై ఎంపీ కవిత సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బాల కార్మిక వ్యవస్థ (నిషేధం, నియంత్రణ) సవరణ బిల్లు అమానవీయమైందని, దీనిని ముందు సెలెక్ట్ కమిటీకి పంపాలని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. మంగళవారం ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ‘2012లో చేసిన సవరణ చాలా బలహీనంగా ఉంది. దాన్ని బలోపేతం చేసి ఈ సవరణ తెస్తున్నారనుకుంటే... ఇది మరింత బలహీనంగా ఉంది. విద్యాహక్కు చట్టాన్ని ఈ సవరణ బిల్లు పరిగణనలోకి తీసుకోలేదు. కుటుంబ వ్యాపార సంస్థలో పనిచేసుకోవచ్చనే నిబంధన కూడా ఈ చట్టాన్ని బలహీన పరుస్తోంది. అలాగే 14 నుంచి 18 ఏళ్ల మధ్య కౌమార దశలో ఉన్న వారు పనిచేసుకోవచ్చని, కానీ ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేయరాదని పేర్కొన్నారు. ఇంతకుముందు ప్రమాదకర పరిశ్రమలను 83 రకాలుగా వర్గీకరించారు. కానీ వీటిని ఇప్పుడు కేవలం మూడింటికి కుదించారు. అందువల్ల ఈ బిల్లును వెంటనే పార్లమెంటు సెలెక్ట్ కమిటీకి పంపాలి. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉంది. పెద్దవాళ్లు పనిచేసే చోట వాతావరణం కూడా బాగుండడం లేదు. భద్రత, శుభ్రత కలిగి ఉండాలి. ఈ బిల్లు బాలికలను బాలకార్మికులుగా మార్చేదిగా ఉంది. ఒకవైపు బేటీ బచావో.. బేటీ పడావో అంటూ నినాదాలు ఇస్తారు. మరోవైపు ఇలా బాలకార్మికులుగా మారేం దుకు చట్టాల్లో అవకాశం కల్పిస్తారు. మీరు నినాదాన్నైనా పక్కనపెట్టండి... లేదంటే చట్టాన్నైనా పకడ్బందీగా మార్చండి. అన్నిరకాల మినహాయింపులు తొలగించాలి. 14ఏళ్ల లోపు పిల్లలను ఎక్కడా పనికి అనుమతించరాదు. రాజ్యసభలో కాంగ్రెస్ ఈ బిల్లును అడ్డుకుంటుందని అనుకున్నా. కానీ వారు అడ్డుకోలేదు. ఇది చాలా అమానవీయమైన బిల్లు. వాళ్లు అన్నిరకాల బిల్లులను అడ్డుకుంటారు. కానీ పిల్లల విషయానికి సంబంధించిన ఈ బిల్లును మాత్రం అడ్డుకోలేదు’ అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. -
బాలకార్మికులను పెట్టుకుంటే రెండేళ్ల జైలు
న్యూఢిల్లీ : ఎలాంటి వృత్తిలోనైనా 14 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలలను పనిలో పెట్టుకుంటే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా తెచ్చిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ‘బాల కార్మికుల(నిషేధ, నియంత్రణ) సవరణ బిల్లును ఇప్పటికే రాజ్యసభ ఆమోదించగా, మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. గతంలో ఆరు నెలలున్న జైలు శిక్షను రెండేళ్లకు పెంచారు. రూ.10 వేలు-20 వేలుగా జరిమానాను రూ.20 వేలు- 50 వేలకు పెంచారు. -
బాలలను పనిలో పెట్టుకుంటే మూడేళ్ల జైలు
- 14 ఏళ్లలోపు వారిని పనిలో పెట్టుకుంటే రూ.50 వేల జరిమానా - ప్రమాదకర పరిశ్రమల్లో 18 లోపు వారు పనిచేయడం నిషేధం - కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా అరికట్టడం కోసం ‘చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్ యాక్ట్’ తీసుకొచ్చినట్లు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఇకపై 14 ఏళ్ల లోపు వారిని పనిలో పెట్టుకుంటే మూడేళ్ల జైలుతో పాటు రూ.50 వేల జరిమానా విధిం చనున్నట్లు తెలిపారు. 18 ఏళ్ల లోపు వారు ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేయడానికి వీల్లేకుండా నిషేధం విధిం చినట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని ఈఎస్ఐసీ రీజనల్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. బాల కార్మిక చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందడం సంతోషంగా ఉందన్నారు. దీని ద్వారా 14 ఏళ్లలోపు వారిని పనిలో పెట్టుకోవడాన్ని పూర్తిగా నిషేధించి నట్లు చెప్పారు. వారి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో నిర్వహించే చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్లలో మాత్రం బడి వేళ లు ముగిశాక సహాయంగా పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా పిల్లల స్కిల్ డెవలప్ అయ్యే అవకాశం ఉంద న్నారు. ఈ చట్టం విద్యాహక్కు చట్టానికి సమానంగా ఉం టుందన్నారు. బాల కార్మికులను గుర్తించిన వెంటనే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం వారికి పునరావాసం కింద రూ.15 వేలు బ్యాంకు అకౌం ట్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. త్వరలో మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్‌కు పార్లమెంట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందన్నారు. దీంతో గర్భిణీలకు 6 నెలల వేతనంతో కూడిన సెలవు మంజూరు అవుతుందన్నారు. మిషన్ కాకతీయకు కేంద్రం రూ.150 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. -
చిన్నారులను పనిలో పెట్టుకుంటే జైలే
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి ఏఎస్పీ చందనదీప్తి తాండూరులో చైల్డ్‌లైన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ తాండూరు: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని తాండూరు ఏఎస్పీ చందనదీప్తి పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని తాండూరు చైల్డ్‌లైన్, ఎంవీఎఫ్ సంయుక్తంగా పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఫ్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని భద్రేశ్వర్ చౌక్‌లో ఏఎస్పీ చందనదీప్తి, మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి ర్యాలీని ప్రారంభించారు. పలు దుకాణాలకు వెళ్లి ఏఎస్పీ, మున్సిపల్ చైర్పర్సన్, చైల్డ్‌లైన్ ప్రతినిధులు యజమానులకు అవగాహన కల్పించారు. చిన్నారులను పనిలో పెట్టుకోబోమని వారినుంచి హామీ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ చందనదీప్తి మాట్లాడుతూ బాలల రక్షణ, సంరక్షణ చట్టం 2015, సెక్షన్ 79 ప్రకారం 18 ఏళ్లలోపు చిన్నారులను పనిలో పెట్టుకోవడం నేరమని, ఐదేళ్ల జైలుశిక్ష పడుతుందని వివరించారు. బడీడు పిల్లలందరినీ పాఠశాలలకు పంపేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు,వ్యాపారులు, విద్యావేత్తలు అందరూ కలిసి సమష్టికృషితో బాలకార్మిక వ్యవస్థ అంతానికి నడుం బిగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బాలకార్మిక రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. తాండూరు మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. 18ఏళ్లలోపు బాలబాలికలను పనిలో పెట్టుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చైల్డ్‌లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ వెంకటేశ్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న బాలలను రక్షించేందుకు తక్షణమే 1098కు సమాచారం ఇవ్వాలని కోరారు. బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య, కార్మిక శాఖ అధికారి శశివర్మ, చైల్డ్‌లైన్,ఎంవీఎఫ్, బాలల హక్కుల పరిరక్షణ సమితి, షేర్ సంస్థ, ప్రతినిధులు వెంకట్‌రెడ్డి, వెంకట్, నర్సింహులు, రాములు, జనార్దన్, సుదర్శన్, వెంకట్రావు, శ్రీనివాస్,రామేశ్వర్, ఆశీర్వాదం, నాగమణి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
బాల్యం... భారం
కఠిన చట్టాలున్నా అమలు కాని బాలకార్మిక నిర్మూలన సామాజిక చైతన్యంతోనే బాలల హక్కుల పరిరక్షణ నేడు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం పలకా, బలపం పట్టాల్సిన చేతులు.. ఇటుక బట్టీల్లో వెట్టిచాకిరీ చేస్తున్నాయి. భావి భారత పౌరులు.. హోటళ్లలో అంట్లు తోముతూ.. మెకానిక్ షాపుల్లో పనిచేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికీ అనేక గ్రామాల్లో పశువుల కాపరులుగా చిన్నారులను ఉపయోగించుకుంటున్నారంటే బాలకార్మిక వ్యవస్థ ఎంతగా వేళ్లూనుకుందే అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రుల నిరక్షరాస్యత, అవగాహన రాహిత్యంతో పాటు పేదరికం వల్ల పిల్లలు బడికి దూరమై.. వెట్టికి దగ్గరవుతున్నారు. నేడు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం... సిద్దిపేట రూరల్: జిల్లాలో బాలకార్మికుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆపరేషన్ స్మైల్ ప్రోగ్రాం ద్వారా 2015లో 242 మంది చిన్నారులను గుర్తించారు. వీరిని పాఠశాలల్లో చేర్పించడంతో పాటు, కొందరిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అదేవిధంగా ఈ ఏడాది జనవరిలో స్మైల్-2 కార్యక్రమంలో భాగంగా 183 మంది బాలకార్మికులను గుర్తించారు. ఇందులో 120 మందిని వివిధ పాఠశాలల్లో చేర్పించారు. మరో 63 మందిని వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. మరోవైపు చైల్డ్‌లేబర్ అధికారులు బాలకార్మికులను గుర్తిస్తూ, వారి తల్లిదండ్రుల్లో అవగాహన కలిగిస్తున్నారు. కొన్నిచోట్ల కేసులు నమోదు చేసి, విధించిన జరిమానా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. చట్టాల అమలుతోనే... బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం కఠినమైన చట్టాలు రూపొందించింది. 1986 జువనైల్ జస్టిస్ చట్టం (జేజే యాక్ట్) ప్రకారం బాలకార్మికులతో పనిచేయించే వారిని తక్షణం అరెస్ట్ చేయవచ్చు. నేరం రుజువైతే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. అన్ని పోలీస్స్టేషన్ల్లో ఫిర్యాదు చేసేందుకు బాలల హక్కుల పరిరక్షణ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఎవరైనా పిల్లలతో పనిచేయిస్తున్నట్టు కనిపిస్తే నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కర్మాగారాల్లో ఎక్కువగా... బాలకార్మికులు ఎక్కువగా వ్యవసాయ కూలీలు, ఇటుకబట్టీలు, పారిశ్రామికవాడలు, హోటళ్లు, మోటారు వాహనాల గ్యారేజీల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. మెదక్, పటాన్చెరు, హత్నూర, నర్సాపూర్, సంగారెడ్డి, నారాయణఖేడ్, సిద్దిపేట ప్రాంతాల్లోని ఇటుక బట్టీల్లో ఎక్కువగా ఒరిస్సా, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన చిన్నారులు పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల సమ్మతంతో పనిచేస్తున్నా బాలకార్మిక వ్యవస్థ కిందకే వస్తుంది. కార్మిక విభాగం అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది, రెవెన్యూ, పోలీసు సిబ్బంది తరచూ తనిఖీలు నిర్విహ ంచి వెట్టి నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో కొన్ని సంస్థలు పనిచేయలేకపోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. -
16 మంది బాల కార్మికులకు విముక్తి
దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో మంగళవారం రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వహేద్ కాలనీలోని గాజుల ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించి 16 బాల కార్మికులకు విముక్తి కల్పించారు. ఎస్సై గోవింద్ స్వామి తెలిపిన వివరాల ప్రకారం... యాకుత్‌పురా వహేద్ కాలనీలో బిహార్‌కు చెందిన మహ్మద్ అక్రం (20), ఆస్ఘర్ అజ్హార్ (18), ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహ్మద్ సద్దాం (25)లు గత కొన్ని నెలలుగా గాజుల ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. బిహర్‌కు చెందిన 16 ఏళ్ల లోపు మైనర్ బాలులతో పని చేయిస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్, రెయిన్‌బజార్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. చిన్నారులతో పని చేయిస్తున్న గాజుల ఫ్యాక్టరీ నిర్వాహకులు మహ్మద్ అక్రం, మహ్మద్ సద్దాం, ఆస్ఘర్ అజ్హార్లపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విముక్తి కల్పించిన బాలలను శిశువు సంరక్షణ కేంద్రానికి తరలించారు. దాడుల్లో దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఎస్సై నార్ల శ్రీశైలం, రెయిన్‌బజార్ ఎస్సైలు వి.సత్యనారాయణ, గోవింద్ స్వామి, జి.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ లో ఆపరేషన్ స్మైల్-2
హైదరాబాద్ లో పలు చోట్లు అధికారులు ఆపరేషన్ స్మైల్ -2 తనిఖీలు చేపట్టారు. వివిధ చోట్ల పనిచేస్తున్న 90 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. రెస్క్యూచేసిన బాలలు పాట్నాకు చెందిన వారు కావడంతో.. వారిని సికింద్రాబాద్ నుంచి సొంత రాష్ట్రాలకు పంపించినట్లు ఛైల్డ్ వెల్ఫేర్ అధికారులు తెలిపారు. హైదరాబాద్, బాల కార్మికులు, ఆపరేషన్ స్మైల్ -
బాలకార్మికులు పనికి రావొద్దు
స్పందించిన స్పిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దశాబ్దాల క్రితం మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటైన పలు స్పిన్నింగ్ మిల్లుల కార్మికుల సంక్షేమం కోసం ఏమాత్రం పట్టించుకోని తీరుపై ‘సాక్షి’లో కథనం వెలువడడంతో మిల్లుల యాజమాన్యాలు అంతర్మథనంలో పడ్డాయి. ఆమనగల్లు, మిడ్జిల్, కల్వకుర్తి, అడ్డాకుల ప్రాంతాల్లో ఉన్న స్పిన్నింగ్ మిల్లుల యజమానులు బాలకార్మికులను పనిలోకి రావద్దంటూ ఆదేశాలు జారీచేశారు. కార్మికులకు ఎవరికైనా పని కావాలంటే తమకు 18 సంవత్సరాలు నిండినట్లుగా ఆధార్ కార్డులో నమోదైతేనే పనిస్తామంటూ నిబంధనలు పెట్టారు. దీంతో సోమవారం ఆయా స్పిన్నింగ్ మిల్లుల్లో బాలకార్మికులు విధులకు హాజరుకాలేదు. అయితే బాలకార్మికుల స్థానంలో కొత్త కార్మికులను పెట్టుకోకపోవడంతో అనేక అనుమానాలకు తావి స్తోంది. కేవలం కొద్దిరోజులు బాలకార్మికులను పక్కనపెట్టి తర్వాత వారినే అదే తక్కువ వేతనంతో పనిలో పెట్టుకోవాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలకార్మికులను పనికి రావద్దని చెప్పిన యాజమాన్యాలు.. వారిని ప్రభుత్వానికి అప్పజెప్పకపోవడం, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు గాని చదువుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గం చూపెట్టకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ‘సాక్షి’లో వచ్చిన కథనం వల్ల వందలాది బాలకార్మికులకు మాత్రం పని భారం నుండి విముక్తి లభించినట్లయింది. -
12 మంది బాలకార్మికులకు విముక్తి
వివిధ పనులు చేస్తున్న బాలకార్మికులను పోలీసులు విముక్తి కల్పించారు. ఆపరేషన్ స్మైల్ల్లో భాగంగా ఎస్ఐ ఖలీల్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో పలు దుకాణాలతో పాటు పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో తనిఖీలు నిర్వహించారు.హోటల్‌తో పాటు అక్కడక్కడ చెత్త సేకరిస్తున్న బాలికాలను కూడా గుర్తించారు. మొత్తం 12 మంది బాలకార్మికులను గుర్తించి వారిని తాండూరు ఎమ్మార్సీ కార్యాలయంలో ఏంఈఓ శివకుమార్‌కు అప్పగించారు. వీరిలో 8 మంది బాలురు, 4గురు బాలికలు ఉన్నారని చెప్పారు. పట్టుబడిన బాలల్లో సగం మంది మధ్యలో బడి మానేసిన వారేన ని గుర్తించారు. బాల కార్మికుల తల్లిదండ్రులకు ఏంఈఓ శివకుమార్ కౌన్సెలింగ్ నిర్వహించారు. బడి మానేసిన పిల్లలను బడికి పంపిస్తామని తల్లిదండ్రులు హామి ఇచ్చారు. -
బాల్యం బందీ
వలస బాటపడుతున్న మత్స్యకార బాలలు ఇప్పుడు వంటపనికి... రాబోయే రోజుల్లో వేటకు ఆర్థిక అవసరాలకోసం తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్న వైనం పేదరికం కారణంగా చదువుకు దూరం వేళ్లూనుకుంటున్న బాలకార్మిక వ్యవస్థ పేదరికం వారిపాలిట శాపంగా మారుతోంది. ఏడాది పొడవునా పనిదొరక్క ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పిల్లల్ని వలసబాట పట్టించాల్సిన దుస్థితి దాపురించింది. చిన్నతనంలో వంటపనివారిగా... రాబోయే కాలంలో చేపలవేట కార్మికునిగా మార్చాల్సి వస్తోంది. విలువైన వారి బాల్యం బందీగా మార్చి చదువుకు దూరం చేస్తోంది. ఎచ్చెర్ల: జిల్లాలోని విశాల తీరప్రాంతంలో వేలాది మత్స్యకార కుటుంబాలకు వేటే జీవనాధారం. పరిస్థితుల ప్రభావం... ప్రకృతి సహకరించకపోవడం వారి పాలిట శాపంగా మారుతోంది. వేటకు దూరం కావాల్సి వస్తోంది. ఈ తరుణంలో తప్పనిసరి పరిస్థితుల్లో వారు వలస వెళ్లాల్సి వస్తోంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకు 194 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన తీరప్రాంతంలోని 12 మండలాల్లో 104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 98,450 మంది జనాభా ఉండగా, 53,469 మందికి చేపల వేటే ప్రధాన వృత్తి. 1225 ఇంజిన్ బోట్లు, 2598 సంప్రదాయ నాటుపడవలు వేటకు వినియోగిస్తున్నారు. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపల వేట నిషేధం అమలవుతుంది. ఈ రోజుల్లో జీవనభృతికోసం గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. అక్కడ చేపలు వేటాడితే కాంట్రాక్టర్లు రూ.20 వేల వరకు నెలకు జీతం చెల్లిస్తారు. ఇదే అదనుగా పిల్లల తరలింపు ఇదే తరుణంలో 15ఏళ్ల లోపు పిల్లలు చదువుకు స్వస్తి చెప్పి వలసలు వెళ్తున్నారు. వారి తల్లిదండ్రులు కాంట్రాక్టర్లనుంచి రూ.50 వేలు వరకు అడ్వాన్స్ తీసుకొని గుజరాత్‌లోని వీరావల్, సూరత్, మహారాష్ట్రలోని ముంబాయి, పూనే వంటి ప్రాంతాలకు పంపిస్తారు. వీరు అక్కడ వంట మనుషులుగా పనిచేస్తారు. అందుకు నెలకు రూ.5వేల వరకు జీతంగా వస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ వీరూ చేపల వేట నేర్చు కుని ఆ వృత్తిలోకి మారుతారు. ఈ విధంగా పిల్లల బాల్యం మసకబారుతోంది. చదువుకు దూరమై వలస కార్మికులుగా మారిపోతున్నారు. స్వచ్ఛంద సంస్థల సర్వేతో... ఎచ్చెర్ల మండలంలో డి.మత్స్యలేశం, బడేవానిపేట, బుడగట్లపాలెం అనే మూడు మత్స్యకార గ్రామ పంచాయతీలున్నాయి. ఇక్కడ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు నిర్మూలనకు పాటుపడుతోంది. పాఠశాలకు ఈ మధ్య విద్యార్థులు వెళ్లకపోవటాన్ని గుర్తించిన ఈ సంస్థ దీనిపై ఆరా తీయగా విద్యార్థులు వలస వెళ్లిన విషయం వెలుగు చూసింది. వెంటనే వారు జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయగా ఈ మూడు పంచాయతీల్లో 70 మంది విద్యార్థులను వలస వెళ్లకుండా ముస్కాన్, ఐసీడీఎస్, పోలీస్, చైల్డ్ ప్రొటెక్షన్ శాఖలు అడ్డుకున్నాయి. దీనిపై పిల్లల తల్లిదండ్రులు గుర్రుగా ఉన్నారు. అయితే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం ద్వారా వలసలను శాశ్వతంగా నివారించవచ్చన్నది నిపుణుల సూచన. బాలల భవిష్యత్తు దెబ్బ తింటుంది మత్స్యకార గ్రామాల్లో బాలకార్యిక వ్యవస్థ, బాల్య వివాహాలు రెండూ ప్రధాన సమస్యలు. ఈ రెండింటిపైనా ప్రజలను చైతన్య పరుస్తున్నాం. తల్లిదండ్రులు తమ ఆర్థిక అవసరాలకోసం పిల్లలను వలస పంపిస్తున్నారు. దీనివల్ల వారి భవిష్యత్తు దెబ్బ తింటుంది. చదువు విలువ సైతం ప్రజలకు తెలియటం లేదు. దీనిపై వారిని చైతన్యపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం అధికారులు చర్యలు చేపట్టాలి. 10వ తరగతి వరకు మత్స్యకార గ్రామాల్లో నిర్బంధ విద్య అమలు చేయాలి. - గురుగుబెల్లి నరసింహమూర్తి, హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్, కార్యదర్శి -
బాల కార్మికులున్నారంటూ సెటిల్మెంట్!
ఎస్ఓటీ పోలీసులమంటూ దబాయింపు దబ్బులు తీసుకొని వదిలేసిన వైనం శంషాబాద్ : హోటల్లో బాల కార్మికులున్నారని ఎస్ఓటీ పోలీసులుగా పరిచయం చేసుకున్న నలుగురు వ్యక్తులు యజమాని నుంచి డబ్బులు దండుకున్నారు. ఈ సంఘటన శనివారం శంషాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. శంషాబాద్ ప్రధాన చౌరస్తాలో కొనసాగుతున్న ఓ శాఖహార హోటల్ నుంచి పద్దెనిమిదేళ్లు నిండిన ముగ్గురు సిబ్బందితో పాటు కౌంటర్‌పై కూర్చున్న వ్యక్తిని శనివారం ఉదయం నలుగురు వ్యక్తులు ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న మైదానంలోని చెట్టుకిందికి తీసుకెళ్లారు. తాము ఎస్ఓటీ పోలీసులమని వారు పరిచయం చేసుకున్నారు. హోటల్లో పనిచేస్తున్న వారు బాలకార్మికులంటూ దబాయించారు. వారిని కనీసం స్టేషన్‌లోనికి తీసుకెళ్లకుండా చెట్టుకిందే బేరసారాలాడారు. అయితే, హోటల్ నుంచి తీసుకెళ్లిన సిబ్బంది అంతా కూడా పద్దెనిమిదేళ్ల వయస్సు పైబడిన వారే కావడంతో చేసేది లేక ఎంతో కొంత ఇవ్వాలని డిమాండ్ చేశారు. హోటల్ యజమానిని దబాయించడంతో అతడు కొంత మొత్తాన్ని ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చేశాడు. తాము బాలకార్మికులం కాకపోయినా బెదిరించి తీసుకెళ్లారని హోటల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తాము తప్పు చేసి ఉంటే పోలీస్‌స్టేషన్‌లోకి తీసుకెళ్లి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి కాని, దబాయించి డబ్బులు దండుకోవడం ఏంటి..? అని వారు వాపోయారు. కాగా, హోటల్లో బాలకార్మికులు ఉన్నారంటూ పోలీస్‌స్టేషన్ ఆవరణ వరకు తీసుకెళ్లింది ఇంతకు పోలీసులేనా లేక ఇతరులా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం శనివారం శంషాబాద్ పట్టణంలో చర్చనీయాంశమైంది. -
నిండైన చిరునవ్వుకు!
‘స్మైల్’ స్థానంలో ‘ఆపరేషన్ ముస్కాన్’ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కంకణం ఇందుకోసం రెండు ప్రత్యేక టీములు..! స్త్రీశిశు సంక్షేమశాఖ, పోలీసుశాఖ ఆధ్వర్యంలో కార్యాచరణ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ‘ఆపరేషన్ ముస్కాన్’ టీములు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు స్త్రీశిశు సంక్షేమ శాఖ, పోలీసుశాఖ సమన్వయంతో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం జిల్లా పోలీస్‌కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి కమిటీల ఏర్పాటుపై చర్చించారు.మిర్యాలగూడ టౌన్ : బాలకార్మికులను గుర్తించేందుకు గత సంవత్సరం జనవరిలో స్మైల్ టీంలను ఏర్పాటు చేశారు. ఈ టీములు హోటళ్లు, పరిశ్రమల్లో పనిచేసే బాలకార్మికులను గుర్తించడం, పారిపోయిన, తప్పిపోయిన పిల్లలను గుర్తించేందుకు ఏర్పాటయ్యాయి. స్మైల్ టీముల స్థానంలోనే తెలంగాణ ప్రభుత్వం ముస్త్కాన్ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కమిటీ ఏర్పాటు ఇలా.. జిల్లాలో రెండు ముస్కాన్ టీములు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఒకటి, స్త్రీశిశుసంక్షేమ శాఖ పీడీ ఆధ్వర్యంలో మరొక టీము ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క టీంలో ఆ రుగురు సభ్యులు ఉంటారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కమిటీలో ఒక ఎస్ఐ, ఒక మహిళా కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లు , ఒకరు జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది ఉంటారు. స్త్రీశిశుసంక్షేమ శాఖ పీడీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే టీములో జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది ఆరుగురు ఉంటారు. రెండు రోజుల్లో టీంలను ఏర్పాటు చేస్తారు. టీముల విధులు జిల్లాలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఫుట్‌పాత్‌లపై తప్పిపోయిన, పారిపోయిన పిల్లలను గుర్తించడం, పరిశ్రమలు, హోటళ్లలో పనిచేసేబాలకార్మికులను గుర్తించి వారిని తల్లిదండ్రులకు అప్పగించే బాధ్యత ఈ టీములకు ఉంది. ఒక వేళ అనాథపిల్లలను గుర్తించినట్లయితే వీరిని సంక్షేమ హాస్టళ్లలో చేర్పిస్తారు. పిల్లలను గుర్తించే కార్యక్రమం ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. 233 మంది బాలబాలికలను రక్షించాం : ఎస్పీ దుగ్గల్ నల్లగొండ టూటౌన్ : ఆపరేషన్ స్మైల్ ద్వారా జిల్లాలో 233 మంది బాల బాలికలను సంరక్షించి, నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ పేర్కొన్నారు. తప్పిపోయిన, బందీలుగా ఉన్న పిల్లలను సంరక్షించాలనే ఉద్దేశంతో బుధవారం ఆయన ఆపరేషన్ స్మైల్-2 (ముస్కాన్)ను ప్రారంభించి మాట్లాడారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం జిల్లాలో సబ్ డివిజనల్ వారీగా 5 పోలీసు సిబ్బందితో టీములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ టీం బృందాలు బస్టాండ్, రైల్వేస్టేషన్, హోటళ్లు, ల్యాడ్జిం గ్లు, చిన్న చిన్న పరిశ్రమలలో, రహదారుల వెంట గస్తీ నిర్వహిస్తూ గతంలో తప్పిపోయిన, నిర్బంధించిన వారిని రక్షించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ బి.గంగారాం పాల్గొన్నారు. -
బడిని ఇంటికి తెచ్చింది!
సహాయాన్ని అర్థించి వచ్చేవారికి సాయపడటం వేరు. అవసరంలో ఉన్నవారిని వెతుక్కుంటూ వెళ్లి మరీ సాయం చేయడం వేరు. మొదటిది చేయడానికి మంచి మనసుండాలి. రెండోది చేయడానికి మంచి మనసుతో పాటు గొప్ప ఔన్నత్యం కూడా ఉండాలి. ఆ రెండూ ఉన్న వ్యక్తి రజనీ పరాంజపే. ఓ ఉన్నత లక్ష్యంతో ఆవిడ వేసిన అడుగు... ఎందరో పేద చిన్నారులకు అక్షరభిక్ష పెట్టింది! మన దేశంలో ఉన్న అతి పెద్ద సమస్యల్లో నిరక్షరాస్యత ఒకటి. వేళకింత ముద్దే పెట్టలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు తమ బిడ్డలకు చదువులెలా చెప్పించగలరు! అందుకే పేద చిన్నారుల్లో కొందరు బాల కార్మికులుగా మారుతుంటే మరికొందరు దుర్వ్యసనాలకు బలైపోతున్నారు. అలాంటివారందరినీ చూసి ఓ అమ్మ మనసు చలించింది. నాలుగక్షరాలు నేర్పి ఆ చిన్నారుల భవితకు బంగారు బాట వేసేందుకు ఆమె పాదం పయనమయ్యింది. బడికెళ్లలేని పిల్లల దగ్గరకు బడినే తీసుకెళ్లింది. ముంబైకి చెందిన రజనీ పరాంజపే అందరిలాగా తన ఉద్యోగం, కాపురమే జీవితం అనుకోలేదు. ఉపాధ్యాయినిగా, ఓ ఇల్లాలిగా తన బాధ్యతలు నిర్వరిస్తూనే...పెళ్లయిన పదిహేనేళ్ల తర్వాత తనకెంతో ఇష్టమైన సోషల్వర్క కోర్సును పూర్తి చేశారు. సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆమె దృష్టి మురికివాడల్లోని పిల్లల మీద పడింది. చదువు లేక వారి అందమైన బాల్యం వీధుల పాలవుతుంటే చూసి తట్టుకోలేకపోయారు. వారి భవిష్యతుకు తానే బాటలు వేయాలనుకున్నారు. అయితే అది అంత తేలిక కాదు. ఎందుకంటే, మురికివాడల్లో ఉండేవారు రోజూ ఎక్కడ పని దొరికితే అక్కడకు వెళ్లిపోతుంటారు. పిల్లల్ని చదివించుకోవాలన్న ఆలోచనే ఉండదు వారికి. పైగా పిల్లలు ఇంటి దగ్గరుంటే ఇంటికి కాపలా ఉంటారు, మంచినీళ్లు పడతారు అనుకుంటుండంతో పిల్లల్ని బడికి రప్పించడం అంత సులువు కాదని అర్థమైందామెకి. దాంతో బడినే వాళ్ల దగ్గరకు తీసుకెళ్లాల నుకున్నారు. తన పూర్వ విద్యార్థి అయిన బీనాసేథ్ లష్కారీతో కలిసి 1989లో ‘డోర్ స్టెప్ స్కూల్’ని స్థాపించారు. ఇద్దరూ వాడవాడకీ తిరిగేవారు. ఎక్కడ చిన్నారులు కనబడితే అక్కడే పాఠాలు మొదలయ్యేవి. మొదట్లో ఇది అక్కడివాళ్లకి వింతగా అనిపించినా... పిల్లలకు జ్ఞానం పెరుగుతుండటం, వాళ్లు చిన్న చిన్న ఇంగ్లిషు పదాలు పలుకుతుండటం చూసి సంతోషమేసింది. దాంతో డోర్ స్టెప్ స్కూల్‌కి ఆదరణ పెరిగింది. వేల మంది పేద పిల్లలను చదువులతల్లి ఒడికి చేర్చింది. ప్రస్తుతం ఎంతోమంది వాలంటీర్లు, స్పాన్సర్లు రజని వేసిన బాటలో సాగుతున్నారు. రోడ్ల పక్కన, కుళాయిల దగ్గర, పొలం గట్ల మీద, రైల్లే ప్లాట్ఫాముల మీద ఎక్కడ పిల్లలు కనిపిస్తే అక్కడే చదువు చెప్తున్నారు. ఎన్ని ఆటంకా లొచ్చినా ఏదో ఒకరోజు తమ రాష్ట్రంలో వందశాతం అక్షరాస్యతను సాధిస్తామంటున్నారు. ఆశయం గొప్పదైనప్పుడు, ఆచరణలో ఆటంకాలు ఓ లెక్కా?! వాళ్లు తప్పకుండా అనుకున్నది సాధిస్తారు!! -
రెండేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు...
ఏడాదిగా జువైనల్ హోంలో ఉంటున్న బాలుడు అనుమానంతో హోంకు వచ్చిన తండ్రి.. కనిపించిన కుమారుడు సైదాబాద్: రెండేళ్ల క్రితం తప్పిపోయాడనుకున్న బాలుడు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయింది. పాతబస్తీలో పోలీసులు ఇటీవల చేపట్టిన కార్డన్ సర్చ్‌లో బాలకార్మికులు పట్టుబడిన విషయం తెలిసి ఓ బాలుడి తండ్రి తన కొడుకు వారిలో ఉన్నాడేమోనని సైదాబాద్‌లోని జువైనల్ హోంకు వచ్చాడు. అక్కడ తమ కుమారుడు కనిపించడంతో ఆనందభాష్పాలు రాల్చాడు. వివరాలు.. బీహార్‌కు చెందిన కాలురాం, శీలదేవి దంపతులు పదేళ్ల క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చారు. కాటేదాన్‌లో ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లాలుబాబురాం(8) రెండేళ్ల క్రితం కాటేదాన్‌లోని తన ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయాడు. కొడుకు కోసం స్థానికంగాను, బంధు,మిత్రుల ఇళ్లలోనూ వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మైలార్దేవుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు (405/2013) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి నుంచి కుమారుడి ఆచూకీ కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. కాగా, తప్పిపోయిన వీరి కుమారుడు లాలుబాబురాం ప్రకాశజిల్లా ఒంగోలులో రోడ్లపై తిరుగుతుండగా అక్కడి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు 2014లో సైదాబాద్‌లోని వీధి బాలుర సదనానికి తీసుకొచ్చి అప్పగించారు. అప్పటి నుంచి సైదాబాద్ బాలుర సదనంలోనే అతడు ఉంటున్నాడు. అయితే బీహార్‌కు చెందిన ఈ బాలుడి భాష అర్థం కాకపోవడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అతడి తల్లిదండ్రుల సమాచారం తెలుసుకోలేకపోయారు. -
అనాథలు, బాలకార్మికులకు వరం ‘స్మైల్’
మెదక్ రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపరేషన్ స్మైల్ పథకం అనాథ పిల్లలకు వరంలా మారింది. ఇందుకోసం పోలీసులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అనాథ పిల్లలును, బాలకార్మికులను గుర్తించి వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. జనవరి 1న ప్రారంభించిన ఈ పథకం ఈ నెలాఖరు వరకు కొనసాగుతుంది. కాగా ఇందుకోసం డివిజన్ స్థాయి అధికారిని ఏర్పాటు చేశారు. ఆ అధికారి సమక్షంలో నలుగురు పోలీసులు పనిచేస్తారు. కాగా మెదక్ డివిజన్‌స్థాయి అధికారిగా మెదక్ పట్టణానికి చెందిన సబ్ఇన్స్పెక్టర్ అంజయ్యను నియమించారు. అలాగే మెదక్ రూరల్ కానిస్టేబుల్ మల్లేశం, పట్టణ కానిస్టేబుల్ దుర్గపతి, టేక్మాల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, నారాయణఖేడ్‌కు చెందిన అహ్మద్ హుస్సేన్‌ను నియమించారు. వీరు తప్పిపోయిన పిల్లల కోసం ఆరా తీయడం, ఇటుక బట్టీలు, హోటళ్లు, కార్ఖానాల్లో, రైల్వేస్టేషన్లు, కోళ్లఫారాల్లో పని చేసే పిల్లలను గుర్తించి వారితల్లి తండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించి బడుల్లో చేర్పించడం చేస్తారు. ఒకవేళ అనాథపిల్లలు అయిఉంటే వారిని వెంటనే సంగారెడ్డి శిశువిహర్ తరలించటం లేదా, వసతిగృహాల్లో చేర్పించి చదువు చెప్పించటం వీరివిధి. ఈ పథకం కింద విధులు నిర్వహించే సిబ్బందికి గతనెలలో శిక్షణ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల మెదక్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన 14 బాలుడు మహేష్ చదువు మానేసి అదేగ్రామంలోని కోళ్లఫారంలో పనిచేస్తుండగా ఆపరేషన్‌స్మైల్ సిబ్బంది గుర్తించి వారి తల్లితండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించి మక్తభూపతిపూర్ ఉన్నతపాఠశాలలో చేర్పించారు. అలాగే నారాయణఖేడ్‌లో శివ అనే 10లోపు బాలుడు బస్టాండ్‌లో బిక్షాటన చేస్తుండగా గుర్తించి అక్కడే ఉన్న వసతి గృహంలో చేర్పించి బడికి పంపించామని ఆపరేషన్‌స్మైల్ డివిజన్ అధికారి అంజయ్య తెలిపారు. కాగా మెదక్ పట్టణం గాంధీనగర్‌కు చెందిన 12 ఏళ్ల మహి అనే బాలుడు ఈనెల21న స్నేహితుడితో కలిసి ఏడుపాయల జాతర వెళ్లి తప్పిపోయినట్లు తండ్రి తమకు ఫిర్యాదు చేశాడని అతని గురించి ఆరా తీస్తున్నట్లు సిబ్బంది ఒకరు తెలిపారు. బాలకార్మికులతో ఎవరు పనిచేయించిన వెంటనే తమదృష్టికి తేవాలని ఆపరేషన్‌స్మైల్ సిబ్బంది పేర్కొన్నారు. కార్ఖానాలు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో బాలకార్మికుల కోసం క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. -
బాల కార్మిక వ్యవస్థ చరిత్రలో కలవాలి
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సత్యార్థి న్యూఢిల్లీ: బాల కార్మిక వ్యవస్థ చరిత్ర పుటల్లో కలసిపోవాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి ఆకాంక్షించారు. దీని కోసం విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని విన్నవించారు. నోబెల్ బహుమతి అందుకుని ఆదివారం భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించేందుకు రూపొందించిన ‘బాల కార్మిక వ్యవస్థ(నిషేధం, నియంత్రణ) సవరణ బిల్లు’ను వెంటనే ఆమోదించి చట్టం చేయాలని కోరారు. బిల్లు ఆమోదం పొందకపోతే ఈ శాసనకర్తలను చరిత్ర క్షమించబోదన్నారు. ‘‘కీలకమైన ఆ బిల్లు ఆమోదం పొందేందుకు సహకరించాల్సిందిగా పార్లమెంటేరియన్లందరికీ, ఇతర నాయకులందరికీ నేను విన్నవించుకుంటున్నాను. మహాత్మాగాంధీ సత్యాన్ని, అహింసను, శాంతిని ఓ ప్రజా ఉద్యమంగా మలిచారు. నేను మీ దయాగుణాన్ని ఓ ప్రజా ఉద్యమంగా మార్చాలని కోరుతున్నాను’ అని ఆయన పిలుపునిచ్చారు. ఓస్లోలో నోబెల్ ప్రదాన కార్యక్రమంలో పోడియంలో కూర్చొని ఉన్నప్పుడు తనకు నిరంతరం మహాత్ముడే గుర్తొస్తూ ఉన్నాడని, ఆయనే నేరుగా వెళ్లి తన అవార్డు అందుకున్నట్లుగా భావించానన్నారు. నోబెల్ బహుమతి సొమ్ములో ప్రతి పైసా పేద పిల్లల కోసమే వెచ్చిస్తానని చెప్పారు. ఆయన భారత్‌లో దిగీ దిగగానే ట్వీటర్లో ‘జై హింద్’ అంటూ ట్వీట్ చేశారు. -
రెస్క్యూ రిస్కే
ఒంగోలు టౌన్ : బాలల హక్కుల రక్షణ, సంరక్షణకు కృషి చేస్తున్న కమిటీలకు కొత్త సమస్య వచ్చిపడింది. బాలల హక్కులకు విఘాతం కలిగినా, బాల కార్మికులు ఉన్నా వారిని అక్కడి నుంచి విముక్తులను చేసి తాత్కాలికంగా ఆశ్రయం కల్పించేందుకు కమిటీలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. బాలల హక్కులకు భంగం కలుగుతోందని సమాచారం అందుకున్న కమిటీలు అక్కడకు వెళ్లి రెస్క్యూ చేసినా వారికి షెల్టర్ కల్పించడంలో రిస్క్‌ను ఎదుర్కొంటున్నాయి. గతంలో జిల్లాలో గవర్నమెంట్ హోమ్ ఉండేది. ఆ హోమ్ ఉన్నంతకాలం బాలల హక్కులపై పనిచేస్తున్న కమిటీలు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్న బాలలు ఉంటే వెంటనే వారిని ఆ హోమ్‌లో చేర్పించేవారు. గవర్నమెంట్ హోమ్‌ను ఎత్తివేయడంతో రెస్క్యూ చేసి తీసుకొచ్చిన బాలలను ఉంచేందుకు గవర్నమెంట్ హోమ్ లేకపోవడంతో ఎన్జీఓ హోమ్సే దిక్కయ్యాయి. బాలల హక్కుల రక్షణ, సంరక్షణకు సంబంధించి రెండు కమిటీలు పనిచేస్తున్నాయి. బాలల సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో చైల్డ్‌లైన్(1098) ప్రతినిధులు, మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐసీపీఎస్ సిబ్బంది సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగుతున్నారు. బాల్య వివాహాలను నియంత్రించడంతో పాటు ఎక్కడైనా బాల కార్మికులు ఉన్నా, ఇంటి నుంచి అలిగి పారిపోయి వచ్చినా, తప్పిపోయిన బాలల కోసం ఈ కమిటీలు పనిచేస్తుంటాయి. 2007లో బాలల సంక్షేమ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్‌కు మేజిస్ట్రేట్ పవర్స్ కలిగి ఉంటాయి. బాలల హక్కులకు భంగం కలిగినా, వారు ఇబ్బంది పడుతున్నా సంబంధిత కమిటీల సభ్యులు వారిని తీసుకొచ్చి బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ ఎదుట హాజరు పరచాల్సి ఉంటుంది. బాలల సంక్షేమ కమిటీ ఎదుట హాజరు పరచిన తర్వాత చైర్మన్ ఆదేశాల మేరకు ఆ బాలలను తాత్కాలికంగా ఆశ్రయం కల్పిస్తారు. అందుకోసం రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో గవర్నమెంట్ హోమ్‌ను ఏర్పాటు చేశారు. చైల్డ్‌లైన్(1098) ఏర్పడిన 2012 సెప్టెంబర్ నుంచి 2013 ఏప్రిల్ వరకు 162 మంది బాలలను గుర్తించి గవర్నమెంట్ హోమ్‌కు తరలించారు. అందులో వారికి ఉచిత భోజన వసతి కల్పిస్తారు. బాలల తల్లిదండ్రులు, బంధువులు బాలల సంక్షేమ కమిటీ చైర్మన్‌ను కలిసి ఇకముందు తమ పిల్లలను బాల కార్మికులుగా లేదా హింసకు గురిచేయమం టూ వేడుకొని తమ ఇళ్లకు తీసుకెళ్తారు. ఇతర హోమ్లే ఆధారం రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న హోమ్‌కు నిధులు సరిగా విడుదల చేయకపోవడంతో ఎనిమిది నెలలపాటు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత దాన్ని ఎత్తివేయడంతో రెస్క్యూ చేసి తీసుకువచ్చిన బాలలకు తాత్కాలిక ఆశ్రయం కల్పించేందుకు కమిటీలు అష్టకష్టాలు పడుతున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఏడు ఎన్జీఓ హమ్‌లు నడుస్తున్నాయి. బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ ఆదేశాల మేరకు ఆ ఎన్జీఓ హోమ్‌ల్లో బాలలను చేర్పిస్తున్నప్పటికీ ఎంతకాలం వారిని ఈ విధంగా వాటిలో ఉంచుతారన్న ప్రశ్న వినిపిస్తోంది. రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో హోమ్‌ను ఎత్తివేసిన తర్వాత నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 136 మంది బాలలను గుర్తించి ఎన్జీఓ హోమ్స్‌కు తరలించారు. మే నుంచి నవంబర్ వరకు 51మంది బాలలను గుర్తించి ఎన్జీఓ హోమ్స్‌కు తరలించారు. బాల కార్మికులు, ఇళ్లల్లో నుంచి పారిపోయి వచ్చేవారు, తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన వారి సంఖ్య పెరిగిపోతున్నా గవర్నమెంట్ హోమ్ లేకపోవడంతో వారికి తాత్కాలిక ఆశ్రయం పూర్తి స్థాయిలో కల్పించలేకపోతున్నారు. ఇటీవల జరిగిన బాలల హక్కుల దినోత్సవంలో గవర్నమెంట్ హోమ్ లేని విషయాన్ని కలెక్టర్ విజయకుమార్ దృష్టికి బాలల సంక్షేమ కమిటీలు తీసుకొచ్చాయి. గవర్నమెంట్ హోమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆ హామీ కార్యరూపం దాల్చే వరకు బాలల హక్కుల కోసం పనిచేసే కమిటీలకు కష్టాలు తప్పేలా లేవు. -
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
రామచంద్రాపురం: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లో బాల సహాయ కేంద్రాన్ని ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల కార్మికులు ఎక్కడ కనిి పంచినా వెంటనే తమకు సమాచారం అందివ్వాలన్నారు. లేనిపక్షంలో స్ధానిక పోలీసులకు సమాచారం ఇచ్చినా చాలన్నారు. పిల్లలను పనికి పంపించిన తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేయవచ్చన్నారు. బాల కార్మికులతో పనిచేయించుకుంటే వారికి జరిమానాతో పాటు శిక్ష కూడా విధించవచ్చన్నారు. బాల నేరస్థులను పోలీస్‌స్టేషన్‌కు తీసుక వచ్చినపుడు వారితో పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలన్నారు. వారిని పోలీసులు యూనిఫాంలో కాకుండా సివిల్ డ్రెస్సులో సున్నితంగా విచారించాలన్నారు. అనంతరం వారిని జువనైల్ కోర్టుకు పంపిస్తామన్నారు. వారి పక్షాన వాదించేందుకు ఉచితంగా న్యాయవాది ఉంటారన్నారు. నేరం రుజువైతే జువనైల్ హోంకి తరలిస్తామన్నారు. బాలల హక్కులను కాపాడేందుకు జిల్లాలో ఐదుగురు ప్రతి నిధులను నియమించామన్నారు. కార్యక్రమంలో డీఎస్సీ ఎస్. సురేందర్‌రెడ్డి, సీఐ నరేందర్, ఎస్ఐ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాలలను నేరస్తులుగా చూడొద్దు జిన్నారం : బాలలను నేరస్తులుగా చూడకుండా, వారికి తగిన కౌన్సెలింగ్ఇచ్చి చేసిన తప్పును మళ్లీ చేయకుండా ఉండే విధంగా చూడాలని స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ దుర్గాప్రసాద్ పోలీసులకు సూచించారు. జిన్నారం మండలంలోని బొల్లారం పీఎస్‌లోనూతనంగా ఏర్పాటు చేసిన బాలల సహాయ కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బొల్లారం పీఎస్‌లో బాలల సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు. బాలలతో పనులు చేయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నారులు ఎలాంటితప్పు చేసినా వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాకుండా రిసెప్షన్ వద్దే కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. బాలలను నే రస్తులుగా చూడొద్దన్నారు. ఎలాంటి ఫిర్యాదులైనా 1098కు ఫోన్ చేయాలన్నారు. కార్యక్రమంలో రామచంద్రాపురం సీఐ నరేందర్, ఎస్ఐ ప్రశాంత్, సిబ్బంది పాల్గొన్నారు. -
దేవుని ప్రతిరూపాలు
స్వచ్ఛ బచ్ పన్ కైలాస్ సత్యార్థి గత నలభై ఏళ్లుగా ఏ దేవాలయానికీ వెళ్లకుండానే దైవ సన్నిధిలో గడుపుతున్నారు! ఆయన వయసిప్పుడు అరవై ఏళ్లు. ఇటీవలే నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన సత్యార్థి... బాలల హక్కుల పరిరక్షణ కోసం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఇంచుమించు తన ఇరవయ్యవయేట నుంచే పాటు పడుతున్నారు. 1980లో ఆయన స్థాపించిన ‘బచ్పన్ బచావో ఆందోళన్’ ఉద్యమం ఇప్పటి వరకు 144 దేశాలలోని ఎనభైమూడు వేల మందికి పైగా బాలల్ని దుర్భర పరిస్థితుల నుంచి బయటికి తెచ్చింది. దైవం, ఆథ్యాత్మికత అన్నవి సత్యార్థి దృష్టిలో సాధారణ అర్థాలకు పూర్తి భిన్నమైనవి. స్వేచ్ఛ ఆయన నమ్మిన దైవం. దేవుడే మనిషికి స్వేచ్ఛను ప్రసాదించాడు కాబట్టి స్వేచ్ఛకూడా దైవసమానమేనని ఆయన అంటారు. దేవుడిచ్చిన ఆ స్వేచ్ఛను కాపాడుకోడానికి పోరాడడం కూడా ఆయన ఉద్దేశంలో ఒక దైవకార్యమే. బాలల స్వేచ్ఛను కాపాడే ఉద్యమం చేపట్టిన నాటి నుంచీ బాలలే దైవంగా ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు సత్యార్థి. మత భావనలున్న మనిషిని కాదు నేను. గత నాలుగు దశాబ్దాల కాలంలో ఒక్కనాడైనా గుడిని గానీ, మసీదును గానీ, చర్చిని గానీ నేను సందర్శించలేదు. భక్తి ఉంటుంది. కానీ ఆలయాలకు వెళ్లి ఆరాధించను. బాలలే నా దేవుళ్లు. వారికి తమ స్వేచ్ఛను, బాల్యాన్ని తెచ్చివ్వడమే దైవానికి నేను చేసే ప్రార్థన. దేవుడికి నిజమైన ప్రతిరూపాలు బాలలే. వారికోసం పనిచేయడం నాకు దైవ సన్నిధిలో గడపడంలా ఉంటుంది అంటారు సత్యార్థి. -
సత్యార్థి కార్యాలయం కిటకిట
సాక్షి, న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త కైలాష్ సత్యార్థి నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికైన నేపథ్యంలో దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలోగల ఆయన కార్యాలయం సందర్శకులతో కిటకిటలాడుతోంది. పరిచయం ఉన్నవారు, పరిచయం లేనివారు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నిజానికి నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించేంతవరకు నగరంలో చాలామందికి ఆయన ఎవరో తెలియదు. కైలాష్ సత్యార్థి నేతృత్వంలోని ఎన్జీఓ బచ్పన్ బచావో ఆందోళన సంస్థ పేరు తరచూ వార్తాపత్రికల్లో కనిపించడమే తప్ప మీడియాలో పెద్దగా రాలేదు. బాలకార్మికుల విముక్తి కోసం, అక్రమ వ్యాపారుల కోరల్లోంచి బాలలను రక్షించడం కోసం జరిపిన కృషికి ఆయనకు ఎన్నో పురస్కారాలు లభించినప్పటికీ వాటిలో ప్రముఖ భారతీయ పురస్కారమేదీ లేదు. నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యేంతవరకు ఆయన ట్విటర్ అకౌంట్ ఫాలోయర్ల సంఖ్య 150 మాత్ర మే పురస్కారం వార్త తెలిసిన వెంటనే పరిస్థితి మారిపోయింది. శుక్రవారం సాయంత్రం నాటికి ఆయన ట్విటర్ ఫాలోయర్ల సంఖ్య 13,500కు పెరిగింది. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపాయినా బచ్పన్ బచావో ఆందోళన్ మూడు దశాబ్దాలుగా దేశమంతటా బాలకార్మికుల విముక్తి కలిగించడానికి కృషి చేస్తూనే ఉంది. ఈప్రయత్నంలో ఎన్నో సార్లు బెదిరంపులకు, దాడులకు గురైనా సత్యార్థి వెరవలేదు. నగర పరిధిలో మొత్తం ఏడు వేలమంది బాలకార్మికులకు ఈ సంస్థ విముక్తి కలిగించింది. సత్యార్థి, ఆయన నడిపే బచ్పన్ బచావో ఆందోళన్ తప్పిపోయిన పిల్లల ఆచూకీ తెలుసుకోవడం కోసం, ప్ల్లేస్మెంట్ ఏజెన్సీల ద్వారా ఇళ్లలో పనిచేసే పిల్లలను వేధింపుల బారినుంచి రక్షించడానికి పోరాటం కొనసాగిస్తున్నారు. తప్పిపోయిన పిల్లలకు సంబంధించిన అన్ని కేసులను తప్పనిసరిగా నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించడం వెనుక బచ్పన్ బచావో ఆందోళన్ కృషి ఎంతో ఉంది. -
వారం రోజులుగా మూతపడిన ఎన్సీఎల్పీ కార్యాలయం
కడప ఎడ్యుకేషన్: నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు (ఎన్సీఎల్పీ) కార్యాలయం వారం రోజులుగా మూత పడింది. జిల్లాలో స్వచ్ఛంద సంస్థల ద్వారా బాల కార్మికులను గుర్తించి వారికి ప్రత్యేక పాఠశాలల ద్వారా విద్యను అందించాలనేది ఈప్రాజెక్టు లక్ష్యం. అయితే ఆ కార్యాలయ ప్రాజెక్టు అధికారి కార్యకలాపాలను పూర్తిగా విస్మరించడంతో ఈ పరిస్థితి దాపురించిందనే విమర్శలున్నాయి. గత నెల 23న ‘సాక్షి’లో లక్ష్యం డ్రాపౌట్ అనే శీర్షికనవార్త ప్రచురితమైంది. స్పందించిన జిల్లా కలెక్టర్ రమణ, అడిషనల్ కలెక్టర్ రామారావు దీనిపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించినా ఆ అధికారి కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేసినట్లు తెలిసింది. అలాగే కార్యాలయ సిబ్బందికి కూడా ఏడాదిగా వేతనాల్లేక అవస్థలు పడుతున్నట్లు తెలిసింది. సిబ్బంది అప్పటి కలెక్టర్ కోన శశిధర్‌ను కలిసి విన్నవించుకోవడంతో ఆయన జీతాలివ్వాలని దేశించినా పీడీ పట్టించుకోలేదనే విమర్శలూ ఉన్నాయి. నేటికీ వారికి వేతనాలు అందలేదని తెలుస్తోంది. కాగా ఆ శాఖ పీడీ బాధ్యతలను వేరే శాఖకు చెందిన అధికారి తీసుకున్నప్పటి నుంచి ప్రాజెక్టు కార్యకలాపాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయనే విమర్శలున్నాయి. గతంలో జిల్లాలో 33 ప్రత్యేక పాఠశాలలకు రావాల్సిన నిధుల మంజూరు విషయంలో కూడా పీడీ నిర్లక్ష్యం ప్రదర్శించటంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకోవడంతో ఆయన స్పందించారు. ఆయన ఈ సమస్యను భారత ప్రభుత్వ కార్మికశాఖ దృష్టికి తీసుకెళ్లి నిధులను విడుదల చేయాలని కోరారు. అలాగే అవినాష్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కూడా కలిసి విషయం తెలిపారు. అయితే సమస్య పరిష్కారానికి ప్రాజెక్టు అధికారి చొరవ చూపనట్లు ఎన్జీఓలు ఆరోపిస్తున్నారు. ఆ ప్రాజెక్టు అధికారిని ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తక్షణం తొలగించి సమర్థవంతమైన అధికారిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సిబ్బంది జీతాలను విడుదల చేయాలని, అలాగే కార్యాలయంలో పూర్తిస్థాయి కార్యాకలాపాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎన్జీఓలు, ప్రజలు కోరుతున్నారు. -
సామాజిక సైన్యం-సోషల్ వర్క్
హైదరాబాద్‌లోని బస్తీలు, మురికివాడల్లో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి. బాలలకు ఉన్న హక్కులను గుర్తించాలి. బాలలను కార్మికులుగా కాకుండా దేశ భవిష్యత్ నిర్మాణానికి కారకులుగా మలచాలంటూ ప్రజలను చైత్యనం చేసే కార్యక్రమం.. హెచ్ఐవీ/ఎయిడ్స్, మహిళలు/బాలికల అక్రమ రవాణాపై నగరంలో రెండురోజుల అంతర్జాతీయ సదస్సు. సంబంధిత రంగంలోని జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ప్రసంగిస్తారు. సమస్య మూలాలను, నివారించే మార్గాలను వివరిస్తారు. తమ కార్యకలాపాలకు మద్దతుగా సంతకాల సేకరణ, ప్రజలను భాగస్వామ్యులను చేయడం, జాతీయ స్థాయి సదస్సులు నిర్వహించడం వంటివి చేపడతారు. ఇక్కడ పేర్కొన్నవి కొన్ని ఉదాహరణలు మాత్రమే..! సామాజికంగా తమ బాధ్యతను గుర్తెరిగి చేపడుతున్న కార్యక్రమాలివి. నవ భారతాన్ని నిర్మించే దిశగా యువ భారతం చేస్తున్న స్ఫూర్తిదాయక ప్రయత్నం.. ప్రజల్ని పట్టిపీడించే సాంఘిక సమస్యలపై యువత గళమెత్తుతున్నారు.. ప్రజల్లో చైతన్యం పెంపొందించే దిశగా ఒక సామాజిక సైన్యంలా కదులుతున్నారు సామాజిక కార్యకర్తలు. సమస్యలపై స్పందించడానికే పరిమితం కాకుండా.. సమస్య మూలాలను అధ్యయనం చేయడానికి ఉపయోగ పడేవే సోషల్ వర్క్ కోర్సులు. సామాజిక కార్యక్రమాల విస్తృతి పెరుగుతుండటంతో సదరు కోర్సులకు డిమాండ్ అధికమవుతోంది. అధికశాతం మంది సాంకేతిక విద్య వెంట పరుగులు తీస్తున్న తరణంలో.. కెరీర్‌కు కొండంత అండగా నిలుస్తున్న సోషల్ వర్క్ కోర్సులను ఎంచుకోవడానికి సిటీ యువత ఎంతో ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో.. సిటీలో సోషల్ వర్క్ కోర్సులు, ఆయా కోర్సులతో కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం.. భిన్నమైనవి: గత ఐదారేళ్లుగా స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు సామాజిక కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఆ సేవా కార్యక్రమాలు యువతలో స్ఫూర్తిని నింపుతున్నాయి. దాంతోపాటే ఆ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి సంబంధిత నిపుణుల అవసరం ఏర్పడుతోంది. దీంతో యువతలో సోషల్ వర్క్ కోర్సుల పట్ల ఆదరణ క్రమంగా పెరుగుతోంది. సామాజిక మాధ్యమాలు ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటి ద్వారా సమస్యలపై జరుగుతున్న చర్చ కూడా సోషల్ వర్క్ పట్ల యువతలో ఆసక్తికి మరో కారణం.అయితే సోషల్ వర్క్ కోర్సులు ఇతర కోర్సులకు భిన్నమైనవి. స్పందించే గుణం, సామాజిక బాధ్యత, ప్రజలను చైతన్యపరచడం, అవసరమైనప్పుడు అండగా నిలవడం, సమాజం ఆశిస్తున్న మార్పు దిశగా ప్రతి ఒక్కరూ కృషిచేసేలా చూడటం వంటి అంశాలకు సోషల్ వర్క్ కోర్సులు ప్రాధాన్యతను ఇస్తాయి. కోర్సులివే: సామాజిక సమస్యలు, మానవ హక్కులు, వాటితో ముడిపడి ఉన్న అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే సోషల్ వర్క్. నగరంలోని ప్రముఖ కాలేజీలు బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ స్థాయిలో సోషల్ వర్క్ కోర్సులను అందిస్తున్నాయి. బ్యాచిలర్‌స డిగ్రీ స్థాయిలోని కోర్సును బీఎస్‌డబ్ల్యూ (బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్) అని, మాస్టర్స డిగ్రీ కోర్సును ఎంఎస్‌డబ్ల్యూ (మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్) అని వ్యవహరిస్తారు. ఈ విభాగానికి సంబంధించి ఎంబీఏ రూరల్ డెవలప్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులో చేరడానికి ఇంటర్మీడియెట్, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి బ్యాచిలర్‌స డిగ్రీ ఉండాలి. ఈ కోర్సుల్లో క్రిమినాలజీ అండ్ జస్టిస్, కమ్యూనిటీ హెల్త్, మెంటల్ హెల్త్, అర్బన్ డెవలప్మెంట్, సైక్రియాటిక్ సోషల్ వర్క్, కమ్యూనిటీ డెవలప్మెంట్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రంగంలో పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ స్టడీస్ అవకాశాలున్నాయి. సంబంధిత స్పెషలైజేషన్లలో రీసెర్చ్ చేయడం ద్వారా అద్భుత అవకాశాలను అందుకోవచ్చు. నైపుణ్యాలు తప్పనిసరి: సోషల్ వర్క్ కోర్సుల ద్వారా కెరీర్లో రాణించాలంటే.. కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. సామాజిక కార్యక్రమాల్లో సమిష్టిగా, జట్టుగా, సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా సోషల్ వర్క్‌లో క్షేత్రస్థాయి అధ్యయనానికి ప్రాధాన్యం ఉంటుంది. అప్పుడే అనుకున్న ఫలితాలను సాధించవచ్చు. కాబట్టి పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలు, సమాజాన్ని అవగాహన చేసుకోవడం, భాగస్వామ్యాలను నిర్మించే నేర్పు, వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించగలగడం, కమ్యూనికేషన్ స్కిల్స్, నిర్ణయాత్మక సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, భిన్న పరిసరాలకనుగుణంగా ఒదిగిపోవడం, ఎదుటి వారి సమస్యలను వినే ఓర్పు, విశాల దృక్పథం, ప్రశ్నించే తత్వం వంటి నైపుణ్యాలు ఈ కెరీర్లో రాణించేందుకు చాలా అవసరం. హోదాలు: సోషల్ వర్క్ అభ్యర్థులకు పని చేసే సంస్థ, నిర్వహించే ప్రాజెక్ట్‌లను బట్టి వివిధ హోదాలు ఉంటాయి. అవి.. కెపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, ఫీల్డ్ కో-ఆర్డినేటర్, అకడమిక్ రిసోర్సెస్ కో-ఆర్డినేటర్, ప్రోగ్రామ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్, కమ్యూనికేషన్ మేనేజర్, ప్రోగ్రామ్ అసోసియేట్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్. పీహెచ్డీ పూర్తిచేసి అకడమిక్‌తోపాటు వివిధ రంగాల్లో డేటా అనలిస్ట్, సర్వే రీసెర్చర్, ప్రాజెక్టు మేనేజర్ వంటి ఉన్నత ఉద్యోగావకాశాలను చేజిక్కించుకోవచ్చు. వేతనాలు: వేతనాల విషయానికొస్తే.. పని చేస్తున్న సంస్థను బట్టి ప్రారంభ స్థాయిలో ఉండే కో-ఆర్డినేటర్, ఎగ్జిక్యూటివ్‌లకు రూ.15 నుంచి 20 వేల మధ్య వేతనం లభిస్తుంది. తర్వాత హోదా, అనుభవం, పనితీరు ఆధారంగా రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పైగానే సంపాదించవచ్చు. త్వరగా: సోషల్ వర్క్ కోర్సుతో త్వరగా ఉద్యోగంలో స్థిరపడాలంటే.. కంపెనీలు ఆశిస్తున్న నైపుణ్యాలు, అనుభవాన్ని పెంచుకోవాలి. ఇందుకోసం ఏదైనా సంస్థ అందించే ఇంటర్న్‌షిప్ లేదా ఏదైనా ఎన్జీవో చేపట్టే ప్రాజెక్ట్‌లో స్వచ్ఛందంగా పని చేయాలి. తద్వారా అనుభవం వస్తుంది. దాంతోపాటు సంబంధిత రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిరంతరం గమనిస్తుండాలి. ఇందుకోసం ఆన్లైన్ సోర్స్, పత్రికలను ఉపయోగించుకోవాలి. అవకాశాలు ఇటీవలి కాలంలో ఈ కోర్సును పూర్తి చేసిన వారికి పబ్లిక్, ప్రైవేట్, ఎన్జీవో సంస్థల్లో అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశాభివృద్ధిలో కార్పొరేట్ సంస్థల పాత్ర పెరగడం.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) చట్టం అమల్లోకి రావడంతో సోషల్ వర్క్ కోర్సులను పూర్తిచేసిన వారికి అవకాశాలు రెట్టింపు అయ్యాయి. ప్రస్త్తుత అవసరాల రీత్యా ఈ రంగంలో నిష్ణాతులైన అభ్యర్థుల అవసరం వేలల్లో ఉంది. కోర్సులను అందిస్తున్న సంస్థలు ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్ వెబ్సైట్: www.osmania.ac.in టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్-హైదరాబాద్; వెబ్సైట్: www.tiss.edu నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ -హైదరాబాద్ వెబ్సైట్: www.nird.org.in సెంటర్ ఫర్ సోషల్ ఇనిషియేటివ్ అండ్ మేనేజ్మెంట్; వెబ్సైట్: www.csim.in ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)- దూర విద్యా విధానంలో సోషల్ వర్క్ కోర్సును అందిస్తుంది. వెబ్సైట్: www.ignou.ac.in సేవా దృక్పథం ఉన్నవారికి సరైన కోర్సులు శ్రీ‘‘సమాజం పట్ల బాధ్యత, సేవా దృక్పథం ఉన్నవారికి సోషల్ వర్క్ కెరీర్ సరిగ్గా సరిపోతుంది. దేశంలోని పలు యూనివర్సిటీలు, విద్యా సంస్థలు మాస్టర్స్ స్థాయిలో ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఆసక్తి ఉన్నవారు ఈ విభాగంలో ఎంఫిల్, పీహెచ్డీ కూడా చేయడానికి అవకాశం ఉంది. సమాజంలోని సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ కోర్సుల్లో చేరిన వారు అధ్యయనం చేస్తారు. సామాజిక అభివృద్ధికి ఉపయోగపడే నైపుణ్యాలను వారు సొంతం చేసుకుంటారు. సోషల్‌వర్క్ కోర్సులు పూర్తి చేసిన వారికి పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగాల్లోనూ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సోషల్ వర్కర్లు వివిధ వర్గాల ప్రజలతో మమేకమై జీవనం కొనసాగిస్తారు. చిన్న పిల్లల దగ్గర్నుంచి యువత, వృద్ధుల చుట్టూ వీరి కెరీర్ కొనసాగుతుంది. గ్రామీణ, పట్టణ, గిరిజనులు తేడా లేకుండా సమాజ అభివృద్ధికి పాటుపడడమే వారి లక్ష్యంగా ఉండాలి. మార్పు కోసం పనిచేసే తత్వం, కొత్త వ్యక్తులతో మాట్లాడే నేర్పు, కలిసి పనిచే సే నైపుణ్యాలు ఉన్నవారు సోషల్ వర్క్ కెరీర్‌ను ఎంపిక చేసుకోవచ్చ్ణు - ప్రొఫెసర్. లక్ష్మీ లింగం, డిప్యూటీ డెరైక్టర్, టిస్-హైదరాబాద్ క్యాంపస్ -
బువ్వ పెట్టి... భవిత మారుస్తున్నారు!
బతుకు భారం.. భవిత ప్రశ్నార్థకం. చేతులకు మసి, బతుకుల్లో మురికి... ఇదీ స్ట్రీట్ చిల్డ్రన్స్ జీవితం. ఆ జీవితాలను పట్టించుకుని దగ్గరగా చూస్తే చలించని మనసుండదు. అయితే అలాంటి చాలా మనసులకు వారిని సంస్కరించే మార్గం గురించి తెలియదు. తెలిసినా తీరికలేదు. ఇలా నడుస్తున్న ప్రపంచంలో ‘వాళ్లు’ బుడతలను బుజ్జగించారు. వారి భవితను తీర్చిదిద్దే బాధ్యతను తీసుకొన్నారు. తర్వాత ఏమైందంటే... భారతదేశంలో బడిలేని వీధి ఉంటుందేమో కానీ, బాలకార్మికుడు లేని వీధి బహుశా ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో తమకు చేతనైనంత మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సంస్థ అనన్య ట్రస్ట్. 16 సంవత్సరాలుగా ఈ సంస్థ అనేక మంది పేదపిల్లలను, బాలకార్మికులుగా మారిన వారిని చేరదీస్తోంది. డాక్టర్ శశిరావు ఆధ్వర్యంలో బెంగళూరు పరిసరాల్లో ఈ స్వచ్ఛంద సంస్థ తన సేవలను కొనసాగిస్తోంది. ఉత్తమ పౌరులను అందిస్తోంది. వీధిబాలల్లో చదువుకోవాలనే తపన ఉంటుందని చెప్పలేం. బడి ప్రస్తావన లేనందుకు తామెంతో ఆనందంగా గడుపుతున్నామనే ఆలోచన ఉన్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. వారు పుట్టి పెరిగిన పరిస్థితులు అలాంటి మానసిక స్థితికి కారణమయ్యిండొచ్చు. మరి అలాంటి వారిని పిలవగానే బడికొస్తారా? అందుకే... అనన్య సంస్థ సభ్యులు స్ట్రీట్ చిల్డ్రన్ మానసిక స్థితి గురించి మొదట అధ్యయనం చేశారు. కొంతమంది వీధి బాలల్తో మాట్లాడారు. వారిని తీసుకొచ్చి.. చదువులు, పాఠశాల అనకుండా వారంటూ ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నించారు. వారిని విజ్ఞానవంతులుగా కాకుండా.. బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్ది తమ జీవితాలను తామే బాగు చేసుకొనే నైపుణ్యాన్ని నేర్పించడమే తమ బాధ్యత అనుకున్నారు. పుస్తకాలుండవు ఇక్కడ గురువు ఉంటాడు, పాఠం ఉంటుంది... కానీ పుస్తకాలుండవు. అది పాఠశాలే.. కానీ పిల్లలకు ప్రత్యేకమైన రూల్స్ ఉండవు. క్రమశిక్షణ పేరుతో శిక్షలుండవు. ఆటలు, పాటలు, కార్యక్రమాలన్నీ ఉంటాయి. వాటితో పాటు ఉత్తమ వ్యక్తిగా తీర్చిదిద్దే శిక్షణ ఉంటుంది. ఫలానా సబ్జెక్టుపై పట్టు పెంపొందించుకోవాలనే ఒత్తిడి ఉండదు. ఎవరికి నచ్చిన సబ్జెక్టు గురించి వారు ఆలోచించవచ్చు. అలా వారికి నచ్చిన అంశాలపైనే ఆటలు పాటలతోనే విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందిస్తూ వారిని తీర్చిదిద్దడం ఈ సంస్థ బాధ్యతగా తీసుకొంది. 1998లో మొదలు పెట్టిన ప్రయత్నం ఇప్పటికీ కొనసాగుతోంది. ఒక్కో పిల్లాడినీ ఎనిమిది నుంచి పదేళ్ల పాటు ఈ సంస్థ సంరక్షిస్తుంది. తర్వాత అతడిని ఒక పౌరుడిగా సంస్థ నుంచి బయటకు పంపుతుంది. ఇక్కడి బాలలకు వసతి, ఆహారం, బట్టలు, వైద్యం..అన్నీ ఈ సంస్థే చూసుకుంటుంది. వారు ఇంటికి వెళ్లి వస్తామంటే రవాణా కూడా ఇస్తుంది. అనన్యలో టీచింగ్ నాన్ టీచింగ్ కలుపుకొని మొత్తం పది మంది స్టాఫ్ ఉన్నారు. టీచర్లు కూడా సబ్జెక్టుల వారీగా కాదు.. పీహెచ్డీ స్థాయి వాళ్లు అంతా. పిల్లలకు అహ్లాదాన్ని కలిగిస్తూ బోధించడంలో, చెదిరిన చిన్నారుల మనసులను తీర్చిదిద్దడంలో వారు ప్రావీణ్యులు. గత పదహారేళ్లుగా నడుస్తున్న ఈ పాఠశాలలో ఇప్పటి వరకూ దాదాపు మూడువందల మంది పిల్లలు ఇక్కడికి బాల కార్మికులుగా ప్రవేశించి సొంత కాళ్లమీద నిలబడే స్థాయికి చేరుకొని వీడ్కోలు తీసుకున్నారు. అనన్య సంస్థ కార్యాచరణను చూసి కొంతమంది విదేశీయులు కూడా ఇక్కడ వలంటీర్లుగా మారారు. అనన్యతో కలిసి పనిచేస్తున్నారు. ఈ విధంగా బుడతలు చేరదీసి బువ్వను పెట్టి వారి భవితను తీర్చిదిద్దుతున్న అనన్య కృషి అభినందనీయమైనది. అసూయ కలిగేటంత స్పెషల్! మన స్కూళ్లలో పుస్తకాలు, మార్కుల వేట తప్ప ఏమీ ఉండదు. అలాంటిది ఆ బాధే లేకుండా నచ్చింది నేర్చుకునే అదృష్టం ఎక్కడ ఉంటుంది. అది కూడా ఉచితంగా! ఈ స్కూల్లో జీవిత పాఠాలే కాదు, యోగా, క్రీడలు, కంప్యూటరు, సామాజిక విద్యలు, వ్యక్తిత్వ వికాసాలు, కొన్ని వృత్తి పనులు, ఇంటి పనులు వంటి జీవితంలో పనికొచ్చేవన్నీ నేర్పుతారు. ఒక విధంగా ఇక్కడ లైఫ్ ట్రయల్ ఉంటుంది. మనిషి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. విశాలమైన స్థలంలో, ప్రకృతి ఒడిలో, ఒత్తిడిలేకుండా తిండి బట్టతో సహా ఇచ్చి చదివించే స్కూలును చూస్తుంటే కార్పొరేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు కూడా అసూయ కలిగినా ఆశ్చర్యమే లేదు. -
బాల్యానికి సంకెళ్లు..
బడిబాట పట్టాల్సిన బాలలు పనిబాట పడుతున్నారు.. పలకా బలపం పట్టాల్సిన చేతితో గిన్నెలు శుభ్రం చేస్తున్నారు.. పాఠాలు చదువుకోవాల్సిన సమయంలో చెత్తపేపర్లు ఏరుకుంటున్నారు.. ఇలా ఆటపాటలతో ఆహ్లాదంగా సాగాల్సిన బాల్యం చెత్తకుప్పల పాలవుతోంది.. - నగరంలో పెరిగిపోతున్న బాలకార్మికుల సంఖ్య నాలుగు వేలకు పైగా ఉన్నారని అంచనా - పేదరికం, నిరక్షరాస్యతే కారణమంటున్న అధికారులు పనిబాట పడుతున్న బాలలు - నేరమని తెలిసినా ప్రోత్సహిస్తున్న యజమానులు సాక్షి, ముంబై: నగరంలో బాల కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉందని ఓ సామాజిక సంస్థ నిర్వహించిన సర్వే ఆధారంగా తేలింది. దాదాపు 4 వేల మంది బాల కార్మికులు నగరంలో పనిచేస్తున్నారని సంస్థ గుర్తించింది. వీరిని పనిలో పెట్టుకున్న వారిపై నగర పోలీసులు గట్టి నిఘా ఉంచారు. ఈ సందర్భంగా ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. నగరంలో ఉన్న బాల కార్మికులకు విముక్తి కలిగించడానికి ఓ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. దీనిని త్వరలోనే అమలు చేయనున్నామన్నారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో పోలీసులు దాదాపు 100 మంది బాల కార్మికులను విముక్తి చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈ సంఖ్య ఎక్కువగానే ఉందని అధికారి తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ సర్వీస్ బ్రాంచ్ (ఎస్ఎస్బీ)డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేష్ పాటిల్ మాట్లాడుతూ.. ఈ ఏడాది దాదాపు నాలుగు వేల మంది చిన్నారులను బాలకార్మికుల నుంచి విముక్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ మేరకు ప్రతిరోజూ తాము కొన్ని ప్రాంతాలను తనిఖీ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా స్థానికుల సహాయం కూడా తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. బాల కార్మికులను గుర్తించి పునరావాసం కల్పించినప్పటికీ వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడం చేత తిరిగి అదే వృత్తిని ఎంచుకుంటున్నారని ఎస్ఎస్బీ అధికారులు విచారం వ్యక్తం చేశారు. ఇందులో ఎక్కువ శాతం బాలలు ఇండ్లలో పని చేసేవారేనన్నారు. అదేవిధంగా మరికొందరు లెదర్, జరీ, హోటళ్లలో పనిచేస్తుండగా, మరికొందరు చెత్తకుప్పల్లో కాగితాలు ఏరుకుంటూ ఉంటారని తెలిపారు. ఇదిలా ఉండగా కొందరు వ్యసనాలకు బానిసలైన తల్లిదండ్రులు డబ్బుల కోసం తమ పిల్లలతో బలవంతంగా భిక్షాటన చేయిస్తారని వారు తెలిపారు. బాలకార్మికుల్లో ఎక్కువ మంది వలస కుటుంబాలకు చెందినవారేనని చెప్పారు. వీరంతా మురికివాడల్లో ఉంటూ యజమానుల వద్ద తక్కువ వేతనం తీసుకుంటూ ఎక్కువ గంటలు పనిచేస్తారని తెలిపారు. అందుకే నేరమని తెలిసినా ఎక్కువ శాతం యజమానులు బాలకార్మికులను పనిలో పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని వివరించారు. బాలకార్మికుల్లో ఎక్కువశాతం బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచేకాక పక్క దేశమైన నేపాల్వాసులే ఉంటారని అధికారి తెలిపారు. వీరు ఐదు నుంచి 16 ఏళ్ల వయసు మధ్యలో ఉంటారని పేర్కొన్నారు. కాగా, బాలలను పనిలో పెట్టుకున్న వారికి చట్ట ప్రకారం రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 20 వేల నుంచి 50 వేల జరిమానా కూడా విధిస్తారు. -
దర్శకుడి ఇంట్లో బాలకార్మికులు
సీనియర్ దర్శకుడు, సంగీత దర్శకుడు గంగైయమరన్ ఇంట్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కమిటీ అధికారులు రెండు రోజులుగా విచారణ జరుపుతున్నారు. గంగైయమరన్ ఇంట్లో ఇద్దరు బాల కార్మికులు పని చేస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో అధికారులు విచారణ జరుపుతున్నారు. స్థానిక అడయారులోని వెంకటరత్నం నగర్లో దర్శకుడు గంగైయమరన్ నివసిస్తున్నారు. ఈయన ఇంట్లో ఇద్దరు బాలకార్మికులు పని చేస్తున్నట్లు ఆ సమీపంలోని యువతి ఒకరు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కమిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో మంగళవారం సాయంత్రం అధికారులు గంగైయమరన్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఆ సమయంలో పని పిల్లలు అక్కడే ఉన్నారు. అయితే వారి తల్లిదండ్రుల ఇష్టానుసారంగానే ఆ పిల్లల్ని పనికి చేర్చుకున్నట్లు గంగైయమరన్ కుటుంబ సభ్యులు అధికారులకు వెల్లడించారు. అధికారులు పని పిల్లల పుట్టిన తేదీ, సర్టిఫికెట్లు తీసుకురావాలని విల్లుపురంలో వున్న వారి తల్లిదండ్రులకు కబురు పంపారు. పని పిల్లల తల్లిదండ్రులు బుధవారం సాయంత్రం గంగైయమరన్ ఇంటికి చేరుకున్నారు. విచారణ కొనసాగుతోంది. -
పిల్లలను పనిలో పెట్టుకుంటే శిక్షార్హులు
సీనియర్ సివిల్ జడ్జి సీతారామకృష్ణారావు మార్కాపురం టౌన్ : వ్యాపార సంస్థలు, గృహాల్లో పద్నాలుగేళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా శిక్షార్హులవుతారని సీనియర్ సివిల్ జడ్జి కె.సీతారామకృష్ణారావు పేర్కొన్నారు. బుధవారం ఐసీడీఎస్ అర్బన్ కార్యాలయంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ వారోత్సవాలు సందర్భంగా అంగన్వాడీ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పదేళ్ల క్రితం బాల కార్మికులు ఎక్కువగా ఉండేవారని, ప్రస్తుతం కొంతమేర బాల కార్మికుల సంఖ్య తగ్గిందని చెప్పారు. పిల్లలను తప్పక బడికి పంపించేలా తల్లిదండ్రుల్లో చైతన్యం తేవాలని సూచించారు. చైల్డ్‌లై న్ జిల్లా కో-ఆర్డినేటర్ ఎం.కిశోర్ కుమార్ మాట్లాడుతూ దేశంలోని 250 పట్టణాల్లో చైల్డ్‌లైన్ కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో 13 మిలియన్ల మంది బాల కార్మికులు ఉన్నట్లు గుర్తించగా, అనధికారికంగా ఈ సంఖ్యకు ఎన్నోరెట్లు ఎక్కువగా బాల కార్మికులు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. బాలకార్మికులను అరికట్టడంలో అంగన్వాడీ సిబ్బంది పనితీరు బాగుందని ప్రశంసించారు. తప్పిపోయిన, వీధి బాలలు, ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలలు, బాల్యవివాహాలకు బలవుతున్న బాలలు, అంగవైకల్యం, భిక్షాటన చేస్తున్న బాలలు, అనాథ బాలలను గుర్తించి 1098 నంబర్‌కు ఫోన్ చేసినట్లయితే చైల్డ్‌లైన్ ద్వారా వారికి రక్షణ కల్పించి ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అర్బన్ సీడీపీఓ వై.ధనలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు, న్యాయవాది ఝాన్సీ, చైల్డ్ లైన్ బృంద సభ్యుడు సీతారామమూర్తి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. -
బడి బాటేదీ?
ఈ విద్యా సంవత్సరం లేనట్టే! పలు చోట్ల స్వచ్ఛందంగా నిర్వహణ విద్యార్థులు లేక మూతబడుతున్న సర్కారు స్కూళ్లు ఈసారి మరింత తగ్గనున్న సంఖ్య ప్రైవేట్ స్కూళ్లలో చేరుతున్న విద్యార్థులు ఏటా వేలాది మందిని పాఠశాలల్లో చేర్పించే బృహత్తర కార్యక్రమం ‘బడిబాట’ ఈ విద్యా సంవత్సరం లేనట్టేనని తేలిపోయింది. విద్యా, కార్మిక, మున్సిపల్, పోలీస్‌శాఖలు సంయుక్తంగా బడీడు, మధ్యలో చదువు మానేసిన పిల్లలను బడి ఒడికి చేర్చే ఈ కార్యక్రమంపై రాష్ట్ర విభజన ప్రతికూల ప్రభావం చూపింది. రాష్ట్ర, ఉద్యోగుల విభజన నేపథ్యంలో విద్యాశాఖ రెండుగా చీలిపోవడం.. డెరైక్టర్లు వేరుపడి ఇన్‌చార్జీలుగా కొనసాగడంతో బడిబాట మార్గదర్శకాలు, ఆదేశాలు జారీకాలేదు. దీంతో విద్యార్థుల సంఖ్య ఈసారి మరింతగా తగ్గే పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. - సాక్షి, కరీంనగర్ చదుకోవాల్సిన వయసులో ఎంతో మంది చిన్నారులు రైళ్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్లలో భిక్షాటన చేస్తూ కనిపిస్తున్నారు. కార్ఖానాలు, ఫ్యాక్టరీలు, ఇళ్లు, గోదాములు, హోటళ్లు, రెస్టారెంట్లలో బాలకార్మికులుగా పనిచేస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి బడిలో చేర్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఉపాధ్యాయులు, వివిధ శాఖల ఉద్యోగులు స్కూల్‌కు వెళ్లని, మధ్యలో చదువు మానేసినవారిని, అనాథలు, బాలకార్మికులు, వీధిబాలలను గుర్తించి వారిని బడిలో చేర్పిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రతీ విద్యాసంవత్సరం రెండు వేల మందికి పైగా చిన్నారులు పాఠశాల బాట పడుతున్నారు. గత విద్యా సంవత్సరం జూన్ 2 నుంచి 11వ వరకు జిల్లాలో బడిబాట నిర్వహించారు. ఈ విద్యాసంవత్సరం కూడా ఇదే నెలలో బడిబాట నిర్వహించాల్సి ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జగదీశ్వర్ (తెలంగాణ) నుంచి ఆదేశాలు అందకపోవడంతో బడిబాట ఖరారు కాలేదు. స్వచ్ఛందం ఫలితమిచ్చేనా..? బడిబాట నిర్వహణపై ఆదేశాలు రాకపోవడంతో జిల్లాలో స్వచ్ఛందంగా బడిబాట నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి లింగయ్య నిర్ణయించారు. ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఉపాధ్యాయులను ప్రోత్సహించాలని కోరారు. దీంతో జిల్లాలో కొందరు ప్రధానోపాధ్యాయులు స్కూళ్లకు వెళ్లి అడ్మిషన్లు తీసుకోవడంతోపాటు పాఠశాల పరిధిలో తిరిగి బడీడు పిల్లలను బడిలో చేర్పిస్తున్నారు. సింహభాగం హెచ్ఎంలు విద్యార్థులను స్కూల్ బాట పట్టించేందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కొనసాగుతున్న ప్రైవేట్ హవా... పాఠశాలల్లో పడిపోతున్న విద్యాప్రమాణాలు, అపరిష్కృతంగా ఉన్న సమస్యలు నిరుపేద విద్యార్థులను సర్కార్ స్కూళ్లకు దూరం చేస్తున్నాయని అధికారికంగా తేలింది. విద్యకు ప్రాముఖ్యత ఇచ్చే తల్లిదండ్రులు ఎంతోమంది తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గి క్రమంగా మూతబడుతున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభం కావడంతో జిల్లాలో చాలామంది ఆయా స్కూళ్లలో చేరిపోయారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లు గాలం వేస్తున్నాయి. దీంతో స్కూళ్లు తెరిచే నాటికీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఇంకా పడిపోయే ప్రమాదముంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందకపోయినా జిల్లాలో నిర్బంధంగా బడిబాటను అమలు చేస్తే.. సర్కారు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముండేదని ప్రభుత్వ ఉపాధ్యాయుడు కె.దయానంద్ అభిప్రాయపడ్డారు. -
2,325 మంది పిల్లలు బడికి దూరం
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: జిల్లాలో 2,325 మంది బడీడు పిల్లలు బడికి దూరంగా ఉన్నారని ఆర్వీఎం నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాని వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇది పొంతన లేని లెక్కేనని పరిశీలకులు చెబుతున్నారు. నిరుపేద పిల్లలకు విద్యను అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చింది. చట్టం వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకు ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. రాజీవ్ విద్యా మిషన్ అధికారులు బడికి దూరంగా ఉన్న పిల్లలను గుర్తించేందుకు నిర్వహిస్తున్న సర్వేలు మొక్కుబడిగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో 2,325 మంది పిల్లలు బడికి దూరంగా ఉన్నారని పట్టణాల్లో 322 మంది పిల్లలు పాఠశాలలకు వెళ్లడం లేదని ఆర్వీఎం తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదికకు, వాస్తవ పరిస్థితులకు ఏ మాత్రం పొంతన లేదని చెప్పవచ్చు. ఒక్క పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతాలలోనే వేలాదిగా బాలకార్మికులు వివిధ ప్రాంతాలలో పని చేస్తూ దర్శనమిస్తున్నారు. పని ప్రదేశాలలో తల్లిదండ్రులకు తోడుగా పిల్లలు పని చేయకుండా పని ప్రదేశంలోనే పాఠశాలలను నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తూవస్తోంది. ఈ నిధులతో పని ప్రదేశంలో ఉన్న పిల్లలకు విద్యా బోధన చేసేందుకు 20 మంది పిల్లలకు ఒక వలంటీర్‌ను నియమించనున్నారు. జిల్లాలో ప్రధానంగా ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు అధికంగా ఉండడంతో అదే భాషలో విధ్యాబోధన చేయించేందుకు వలంటీర్లను నియమించి గౌరవ వేతనంగా రూ.3 వేలు చెల్లిస్తారు. కాని రెండేళ్ళుగా వర్క్‌సైడ్ పాఠశాల నిర్వహణ కోసం నిధులు ఉన్నా అధికారులు పాఠశాలలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. అమలుకాని నిర్బంధ విద్య 6 నుంచి 14 సంవత్సరాలు గల పిల్లలకు ఉచిత విద్యను అందించాలనే ఉద్దేశంతో 2010 ఎప్రిల్ 1న బాలల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చారు. ఈ చట్టం ద్వారా కనీసం 8వ తరగతి వరకు ఉచిత విద్యను అందించాలనేది ప్రధాన ఉద్దేశం. బడికి దూరంగా ఉన్న పిల్లలను వారి వయస్సుకు తగిన తరగతిలో చేర్పించి ప్రత్యేక శిక్షణ ద్వారా విద్యను అందించి పాఠశాలలో కొనసాగేలా చూసే బాధ్యత సంబంధిత పాఠశాల హెచ్ఎంలతో పాటు స్థానిక విద్యా కమిటీలదేనని పేర్కొన్నారు. బడికి దూరంగా ఉన్న పిల్లలను చదవడం, రాయడం రాదనే కారణంతో పాఠశాలలో చేర్చుకునేందుకు నిరాకరించరాదని చట్టంలో పేర్కొన్నారు. చట్టాలు ఎన్ని ఉన్నా క్షేత్ర స్థాయిలో అమలు చేయకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేకపోతున్నాయి. బాలకార్మికుల సంఖ్య అధికమే.. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో బాలకార్మికులు దర్శనం ఇస్తున్నారు. ఇటుక క్వారీలు, క్రషర్ మిల్లర్స్, హోటల్స్, మెకానిక్ షెడ్లు, ఇలా ఎక్కడ చూసినా వారే కనిపిస్తున్నారు. బాలకార్మికులతో పని చేయించుకుంటే ఐదు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించే ఆవకాశం ఉంది. కాని సాక్షాత్తూ కార్మికశాఖ అధికారులు ఉండే ప్రాంతాలలోనే బాల కార్మికులు దర్శనమిస్తున్నారు. సంగారెడ్డిలోని డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయం సమీపంలోని వ్యాపార సంస్థలలో బాల కార్మికులు పనులు చేస్తున్నారు. నిత్యం ఈ ప్రాంతంలో కార్మిక శాఖ అధికారులు కార్యాలయాలకు వచ్చివెళ్ళే సమయాల్లో పని చేస్తూ కనిపిస్తున్నా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ఇలా మెకానిక్ షెడ్లు, హోటల్లో పని చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రోజురోజుకు బాల కార్మికుల సంఖ్య ఘననీయంగా పెరిగిందని చెప్పవచ్చు. -
అక్షరంపై నిర్లక్ష్యం
అధికారుల నిర్లక్ష్య వైఖరి మండలంలోని విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది.. చదువుకోవాలనే ఆసక్తి పిల్లల్లో ఉన్నా అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు.. అందుకే పుస్తకాలు పట్టి బడిలో ఉండాల్సిన బాలలు పలుగు, పారలు పట్టి పొలాల్లో శ్రమిస్తున్నారు.. ప్రమాదమని తెలిసినా నిర్మాణ రంగంలో పనులు చేస్తున్నారు.. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యాభివృద్ధికి తోడ్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు.. కోసిగి, న్యూస్‌లైన్ : కోసిగి మండలం రాష్ట్రంలోనే అక్షరాస్యతలో అత్యంత వెనుకబడిన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో అక్షరాస్యతను పెంచేందుకు కృషి చేయాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. విద్యాభివృద్ధిలో భాగంగా ప్రతి మండలంలో మోడల్ స్కూల్, హాస్టల్‌ను ఏర్పాటు చేసేందుకు 2011లో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మోడల్ స్కూల్ నిర్మాణం కోసం రూ.3 కోట్లు, హాస్టల్ కోసం రూ.1.50 కోట్ల బడ్జెట్‌ను 2011లోనే కేటాయించింది. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2013-14 విద్యా సంవత్సరం నాటికి జిల్లాలోని 32 మండలాల్లో మోడల్ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. అయితే కోసిగి మండలంలో భవనాల నిర్మాణానికి స్థలం లేకపోవడంతో పనులు త్వరగా మొదలు కాలేదు. విషయం తెలుసుకున్న కోసిగికి చెందిన నరసింహమూర్తి తన పొలంలో మూడు ఎకరాలను భవన నిర్మాణాల కోసం విరాళంగా అందజేశారు. దీంతో మోడల్‌స్కూల్, హాస్టల్ వస్తున్నాయని ప్రజలు ఎంతో సంతోషించారు. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా వారి ఆశ నెరవే రలేదు. 2013-14 విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి భవనాలు పూర్తికాలేదు. దీంతో ఆ ఏడాది అడ్మిషన్లు నిర్వహించలేదు. 2014-15 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి వస్తుందని అధికారులు, కాంట్రాక్టర్ చెప్పినా అది కూడా సాధ్యమయ్యేలా లేదు. మరో నెల రోజుల్లో తరగతులు మొదలు కావాల్సిన పరిస్థితుల్లోనూ ఇంకా పనులు చేస్తూనే ఉండడమే దానికి కారణం. పెరుగుతున్న బాలకార్మికులు మండలంలో బాలకార్మికులు రోజు రోజుకూ అధికమవుతున్నారు. 280 మంది బాలకార్మికులు ఉన్నట్లు అధికారులు రికార్డులు చూపిస్తున్నారు. అయితే దాదాపు 2 వేలకు మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం మోడల్ స్కూల్ నిర్మాణ పనులలో బాలకార్మికులు పనులు చేస్తున్నారు. అలాగే ప్రతి రోజూ రైళ్లలో పల్లీలు అమ్ముడం, సిమెంట్ పనులు, కట్టెల కొట్టుట, చిత్తుకాగితాలు ఏరడం తదితర పనులు బాలల జీవితాలు మగ్గిపోతున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం : ఆంజనేయులు, ఎంఈఓ మోడల్ స్కూల్ తరగతులు ప్రారంభించాలని జిల్లా ఉన్నతాధికారులను కోరాం. అయితే తరగతి గదులు నిర్మాణంలో ఉండడంతో అధికారులు విముఖత చూపుతున్నారు. కాంట్రాక్టర్లు త్వరితగతిన పనులు చేపడితే తరగతులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. -
బాలకార్మికులకు విముక్తి
వికారాబాద్, న్యూస్‌లైన్: ఓ బిస్కెట్ కంపెనీలో పనిచేస్తున్న బాల కార్మికులకు అధికారులు విముక్తి కల్పించారు. వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేట సమీపంలో ఉన్న జగదీశ్వర్ ఫుడ్స్ బిస్కెట్ కంపెనీలో చిన్న పిల్లలతో పనులు చేయిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు మండల విద్యాధికారి గోవర్ధన్ రెడ్డి, శివారెడ్డిపేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బీఎన్ రెడ్డి మంగళవారం కంపెనీకి చేరుకున్నారు. అక్కడ అబ్ధుల్ నవీద్, జావిద్‌పాషా, నవాజ్‌పాషా, సిద్ధిక్ అనే నలుగురు బాలకార్మికులు పనిచేస్తున్నట్లు గుర్తించారు. వారితో మాట్లాడుతుండగా సిద్దిక్ పారిపోయాడు. విషయాన్ని అధికారులు ఫోన్లో సబ్ కలెక్టర్ ఆమ్రపాలికి సమాచారం అందించారు. స్పందించిన ఆమె బాలకార్మికులను పనిలో పెట్టుకున్న యాజమాన్యంపై కేసులు నమోదు చేసి, పిల్లలను పాఠశాలలో చేర్పించాలని ఆదేశించారు. దీంతో అధికారులు సబ్‌కలెక్టర్ ఆదేశాల మేరకు పిల్లలను శివారెడ్డిపేట్ పాఠశాలలో చేర్పించారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం యాజమాన్యంపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. -
బడికెళ్లని బాల్యం
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: బడి ఈడు పిల్లలు పాఠశాలలకు వెళ్ళకుండా ఎక్కడ ఏపనిలో ఉన్నా వారిని బాలకార్మికులుగా పరిగణించాలని నిర్బంధ విద్యాహక్కు చట్టం స్పష్టం చేస్తోంది. ప్రతియేటా జూన్‌లో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించి, విద్యా పక్షోత్సవాలు, వారోత్సవాల పేరుతో హడావుడి చేస్తుండటం మినహా తల్లిదండ్రులకు ఉపాధి చూపి తద్వారా బాలకార్మికులను పాఠశాలలకు పంపాలనే కనీస బాధ్యతను విస్మరిస్తోంది. జిల్లాలో ఆరు నుంచి 14 ఏళ్ళలోపు వయసు కలిగిన బడిఈడు బాలలు 2,598 మంది ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతుండగా, క్షేత్రస్థాయిలో దీనికి రెట్టింపు సంఖ్యలో చిన్నారులు బాల కార్మికులుగా మగ్గుతున్నారని తెలుస్తోంది. గ్రామాల్లో పనులు లేక ఉపాధిని వెతుక్కుంటూ పేద కుటుంబాలు పట్టణాలు, నగరాలకు వలస వెళుతున్న కారణంగా వారి పిల్లలు విద్యకు దూరమవుతున్నారు. మరి కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు మరణించడంతో కుటుంబ బాధ్యతలు భుజానికెత్తుకోవాల్సి రావడం వల్ల చిన్నారులు బడికివెళ్లలేక పోతున్నారు. ఒక్కో మండలంలో ఒక్కో విధంగా జిల్లాలో మండలాల వారీగా ఎంఈవోలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సేకరించిన వివరాల ప్రకారం 2,598 మంది బాలలు బడికి దూరంగా మగ్గుతున్నారని తెలుస్తోంది. గత ఏడాది జూన్‌లో పాఠశాలలు తెరిచే సమయానికి జిల్లాలో 2881 మంది బాలలు బడికి దూరంగా ఉన్నట్టు రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) లెక్క తేల్చింది. అనంతరం నిర్వహించిన విద్యా పక్షోత్సవాల్లో వారిలో 2362 మందిని పాఠశాలల్లో చేర్పించామని అధికారులు చెబుతున్నారు. వీరిలో దాదాపు వెయ్యి మంది బాలికలను కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లో చేర్పించగా, మిగిలిన వారిని సమీప ప్రాంతాల్లోని పాఠశాలల్లో చేర్పించారు. అయితే తాజా లెక్కల ప్రకారం బడి ఈడు పిల్లలు 2,598 మంది ఉన్నారు. వీరిలో ఒక్కో మండలంలో ఒక్కో విధంగా ఉన్నారు. ఉదాహరణకు అత్యధికంగా బొల్లాపల్లిలో 154 మంది, చిలకలూరిపేటలో 142, రాజుపాలెంలో 134, నరసరావుపేటలో 132 ఉండగా, అత్యల్పంగా మాచర్లలో ఎనిమిది మంది, వట్టిచెరుకూరులో ఆరుగురు, తుళ్ళూరు, గురజాల, వేమూరులో నలుగురేసి చొప్పున ఉన్నారని ఆర్వీఎం లెక్కలు చెబుతున్నాయి. అమ్మానాన్మలతో పాటే కూలిపనులకు.. అమ్మానాన్నలిద్ధరూ కూలిపనులకు వెళతున్నారు. వారితో పాటే నేనూ బేల్దారి పనికి వెళుతున్నా. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్లనే పాఠశాలకు వెళ్ళడం లేదు. చిన్నప్పుడు ఒకటో తరగతి చదివినా ఇంట్లో సరిగా లేక మరలా స్కూల్ మానేశా. ఇప్పుడు మళ్ళీ చదవాలని లేదు. - యు. శ్రీను, గుంటూరు పనికి వెళుతున్నా.. నాన్న ఆటోడ్రైవర్ అమ్మ ఇం ట్లోనే ఉంటుంది. నాన్న ఒక్క డి వల్ల ఇల్లు గడవదని, నేనూ పని కి వెళుతున్నా. తమ్ముడిని చదువుకోమని హాస్టల్‌కు పంపాం. - టి. ప్రదీప్, గుంటూరు -
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి: ఎంవీఎఫ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్
ఆలంపల్లి, న్యూస్‌లైన్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఎంవీఎఫ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. వికారాబాద్ డైట్లో గురువారం సర్పంచులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. గ్రామంలో ఉన్న బడీడు పిల్లలను బడికి పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో విద్యాహక్కు చట్టం పకడ్బంధీగా అమలయ్యేలా చూడాలన్నారు. గ్రామాలు పూర్తి స్థాయిలో అక్షరాస్యత సాధించిన నాడే అన్ని విధాలా అభివృద్ధికి నోచుకుంటాయని పేర్కొన్నారు. బాలకార్మికులను పనుల్లో పెట్టుకుంటే వచ్చే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో ఎంవీఎఫ్ జిల్లా సమన్వయకర్త అమరేశ్వర్, వెంకటయ్య, మండల పరిధిలోని సర్పంచులు పాల్గొన్నారు. -
చదువుకోవాలని ఉంది
వంగూరు, న్యూస్‌లైన్: ‘మాచెల్లెల్ని గుర్తు తెలియని వారికి అమ్మేశారు.. నన్ను, మా అక్కను జీతం ఉంచారు మా అమ్మానాన్న.. చదువుకోవాలని ఉన్నా చదివించే వారు లేక గొర్రెలను కాస్తున్నా..’ అని ఓ బాలకార్మికురాలు అన్న మాటలు శనివారం అధికారులను ఆవేదనకు గురిచేశాయి. అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన బాలయ్య, ఎల్లమ్మ దంపతులకు అంజమ్మ, దివ్య, రాణి అనే ముగ్గురు కూతుళ్లు. వీరి తల్లిదండ్రులు కనీస బాధ్యత మరిచి కన్నప్రేమను దూరం చేసుకునే క్రమంలో చిన్నకూతురు రాణిని అమ్మేశారు. రెండోకూతురు దివ్యను వంగూరు మండలం సర్వారెడ్డిపల్లిలో గుండెమోని జంగయ్య అనే రైతు వద్ద ఏడాదికి రెండువేల జీతం చొప్పున కుదిర్చారు. మరో కూతురును ఇదే మండలంలో తిప్పారెడ్డిపల్లిలో ఒక రైతు వద్ద జీతం పెట్టారు. ఏడాదికి వీరిద్దరినుంచి వచ్చే జీతం తీసుకుంటూ నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలో కూలీపనలు చేసుకుంటూ తల్లిదండ్రులు జీవనం గడుపుతున్నారు. ఇదిలాఉండగా వంగూరు మండలం సర్వారెడ్డిపల్లిలో గొర్రెలకాపరిగా పనిచేస్తున్న దివ్యను శనివారం గ్రామస్తుల సమాచారం మేరకు అధికారులు కలిశారు. తహశీల్దార్ శ్రీనివాసులు సర్వారెడ్డిపల్లి గ్రామానికి వెళ్లి రైతు వద్ద ఉన్న దివ్య(12)ను పిలిపించుకుని ఆమెతో మాట్లాడారు. చదువుకోవాలని ఉందని దివ్య చెప్పడంతో తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంఈఓ శంకర్‌నాయక్‌లు దివ్యను వంగూరు మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా అమ్మాయిని కదిలిస్తే గుక్క తిప్పుకోకుండా అన్ని విషయాలు చెప్పేసింది. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి కన్నీటిగాధలు ఉండనేఉన్నాయి.