సాక్షి, న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త కైలాష్ సత్యార్థి నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికైన నేపథ్యంలో దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలోగల ఆయన కార్యాలయం సందర్శకులతో కిటకిటలాడుతోంది. పరిచయం ఉన్నవారు, పరిచయం లేనివారు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నిజానికి నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించేంతవరకు నగరంలో చాలామందికి ఆయన ఎవరో తెలియదు. కైలాష్ సత్యార్థి నేతృత్వంలోని ఎన్జీఓ బచ్‌పన్ బచావో ఆందోళన సంస్థ పేరు తరచూ వార్తాపత్రికల్లో కనిపించడమే తప్ప మీడియాలో పెద్దగా రాలేదు. బాలకార్మికుల విముక్తి కోసం, అక్రమ వ్యాపారుల కోరల్లోంచి బాలలను రక్షించడం కోసం జరిపిన కృషికి ఆయనకు ఎన్నో పురస్కారాలు లభించినప్పటికీ వాటిలో ప్రముఖ భారతీయ పురస్కారమేదీ లేదు. నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యేంతవరకు ఆయన ట్విటర్ అకౌంట్ ఫాలోయర్ల సంఖ్య 150 మాత్ర మే పురస్కారం వార్త తెలిసిన వెంటనే పరిస్థితి మారిపోయింది.
శుక్రవారం సాయంత్రం నాటికి ఆయన ట్విటర్ ఫాలోయర్ల సంఖ్య 13,500కు పెరిగింది. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపాయినా బచ్‌పన్ బచావో ఆందోళన్ మూడు దశాబ్దాలుగా దేశమంతటా బాలకార్మికుల విముక్తి కలిగించడానికి కృషి చేస్తూనే ఉంది. ఈప్రయత్నంలో ఎన్నో సార్లు బెదిరంపులకు, దాడులకు గురైనా సత్యార్థి వెరవలేదు. నగర పరిధిలో మొత్తం ఏడు వేలమంది బాలకార్మికులకు ఈ సంస్థ విముక్తి కలిగించింది. సత్యార్థి, ఆయన నడిపే బచ్‌పన్ బచావో ఆందోళన్ తప్పిపోయిన పిల్లల ఆచూకీ తెలుసుకోవడం కోసం, ప్ల్లేస్‌మెంట్ ఏజెన్సీల ద్వారా ఇళ్లలో పనిచేసే పిల్లలను వేధింపుల బారినుంచి రక్షించడానికి పోరాటం కొనసాగిస్తున్నారు. తప్పిపోయిన పిల్లలకు సంబంధించిన అన్ని కేసులను తప్పనిసరిగా నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించడం వెనుక బచ్‌పన్ బచావో ఆందోళన్ కృషి ఎంతో ఉంది.
సత్యార్థి కార్యాలయం కిటకిట
Published Sat, Oct 11 2014 10:45 PM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM
Advertisement