మంగళవారం ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో సత్యార్థితో సెల్ఫీ దిగుతున్న విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ‘ఏడెనిమిదేళ్ల క్రితం హరియాణాలోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్న బాల కార్మికులు, వారి తల్లిదండ్రులకు నేను విముక్తి కల్పించాను. పిల్లలను నా కారులో తీసు కెళుతూ తినేందుకు అరటిపండ్లు ఇచ్చాను. బానిసత్వంలోనే పుట్టి పెరిగిన వారికి అరటిపండ్లంటే కూడా తెలియదు. అవి అరటిపండ్లని, తినాలని చెపితే.. తొక్క తీయకుండానే తినడంతో రుచించక కింద పడేశారు. అప్పుడు అరటిపండ్లు ఎలా తినాలో నేను వారికి చెప్పాను. అరటిపండు రుచి తెలుసుకున్న ఓ పాప నా భుజం మీద చేయ్యేసి ‘పెహలే క్యో నహీ ఆయే?’ (ముందే ఎందుకు రాలేదు?) అని అడిగింది.
ఇది ఆ పాప అడిగిన ప్రశ్న కాదు.. బాలకార్మిక వ్యవస్థలో మగ్గుతున్న లక్షలాది మంది చిన్నారులు అడుగుతున్న ప్రశ్న. నాతోపాటు ఈ సమాజాన్ని అడిగిన ప్రశ్న. అందుకే అఖిల భారత సర్వీసు అధికారులు (ఐఏఎస్)గా చిన్నారుల కలలను నిజం చేయడానికి మీరంతా కంకణబద్ధులు కావాలి. కలెక్టర్లుగా మీ జిల్లాలను ముందుండి నడిపించే నాయకులుగా పనిచేయాలి’అని నోబెల్ పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి పిలుపునిచ్చారు. పేద చిన్నారుల దరి చేరని అభివృద్ధికి అర్థం లేదని, చిన్నారుల ముఖాల్లో విరబూయాల్సిన భావి నవ్వులకు మీరే బాధ్యత తీసుకోవాలని కోరారు. మంగళవారం రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్)లో ‘బాలల హక్కులు– కలెక్టర్ల పాత్ర’ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని దేశంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 45 మంది ఐఏఎస్ అధికారులను, ఎన్‌ఐఆర్‌డీపీఆర్ బృంద సభ్యులను, భారతీయ విద్యాభవన్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి
దేశంలో చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) లెక్కలు చెబుతున్నాయని.. వాటిని అరికట్టడమే ఐఏఎస్ అధికారుల ముందున్న పెద్ద సవాల్ అని సత్యార్థి అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన మన రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు సంక్రమించాయని, కానీ ఆ హక్కులను కల్పించడంలో వ్యవస్థ విఫల మవుతోందని చెప్పారు. జిల్లా కలెక్టర్లుగా మీరంతా రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రభు త్వ పథకాలనే కాకుండా చట్టాలనూ పకడ్బం దీగా అమలు చేయాలని ఆయన కోరారు.
గ్రీన్ ట్రిబ్యునల్ తరహాలో బాలల ట్రిబ్యునల్
పలువురు సభికులు అడిగిన ప్రశ్నలకు కైలాశ్ సమాధానమిస్తూ.. బాలల హక్కుల పరిరక్షణ కోసం గ్రీన్ ట్రిబ్యునల్ తరహాలో బాలల ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తాను కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కోరామని.. శిశుగృహ, జువెనైల్ హోమ్స్‌లో ఉంటున్న వారితో పాటు దేశంలోని ప్రతి చిన్నారికి గుర్తింపు కార్డు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐఆర్‌డీపీఆర్ డైరెక్టర్ జనరల్ డబ్ల్యూఆర్ రెడ్డి, డాక్టర్ జ్ఞానముద్ర తదితరులు పాల్గొన్నారు.
అవకాశాన్ని బాధ్యతగా మార్పుకోవాలి..
నవభారత నిర్మాణం జరుగుతున్న క్రమంలో నవభారత్ అంటే మౌలిక సదుపాయాలతో కూడిన డిజిటల్, టెక్నికల్ సమాజం కాదని, సాధికారతతో కూడిన పౌరుల పునాదులపై నవభారత సమాజ నిర్మాణం జరగాలని కైలాశ్ కోరారు. పాలనతో పాటు సామాజిక మార్పు తేవడంలో కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించి ముందుకెళ్లాల న్నారు. ‘మీరు పనిచేసిన చోట మీ అడుగుజాడలను వదిలి వెళ్లండి. మీరు ప్రభుత్వ ఉన్నతాధికారి మాత్ర మే కాదు. మీ జిల్లాను ముందుండి నడిపించే నాయ కుడనే విషయాన్ని మర్చిపోకండి’అని ఐఏఎస్ అధికా రులను కోరారు. మనదేశంలోని యువతకు అద్భుతమైన ప్రతిభాపాటవా లున్నాయని, అవకాశం వచ్చినప్పుడల్లా మన దేశ యువత తమను తాము నిరూపించుకుంటోందని కైలాశ్ అన్నారు. అలాంటి యువతలో ఒకరిగా వచ్చిన కొత్త కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులు తమ అవకాశాన్ని బాధ్యతగా మలుచుకుని ముందుకు సాగాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment