బాల కార్మిక వ్యవస్థ చరిత్రలో కలవాలి
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సత్యార్థి
న్యూఢిల్లీ: బాల కార్మిక వ్యవస్థ చరిత్ర పుటల్లో కలసిపోవాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి ఆకాంక్షించారు. దీని కోసం విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని విన్నవించారు. నోబెల్ బహుమతి అందుకుని ఆదివారం భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించేందుకు రూపొందించిన ‘బాల కార్మిక వ్యవస్థ(నిషేధం, నియంత్రణ) సవరణ బిల్లు’ను వెంటనే ఆమోదించి చట్టం చేయాలని కోరారు. బిల్లు ఆమోదం పొందకపోతే ఈ శాసనకర్తలను చరిత్ర క్షమించబోదన్నారు. ‘‘కీలకమైన ఆ బిల్లు ఆమోదం పొందేందుకు సహకరించాల్సిందిగా పార్లమెంటేరియన్లందరికీ, ఇతర నాయకులందరికీ నేను విన్నవించుకుంటున్నాను.
మహాత్మాగాంధీ సత్యాన్ని, అహింసను, శాంతిని ఓ ప్రజా ఉద్యమంగా మలిచారు. నేను మీ దయాగుణాన్ని ఓ ప్రజా ఉద్యమంగా మార్చాలని కోరుతున్నాను’ అని ఆయన పిలుపునిచ్చారు. ఓస్లోలో నోబెల్ ప్రదాన కార్యక్రమంలో పోడియంలో కూర్చొని ఉన్నప్పుడు తనకు నిరంతరం మహాత్ముడే గుర్తొస్తూ ఉన్నాడని, ఆయనే నేరుగా వెళ్లి తన అవార్డు అందుకున్నట్లుగా భావించానన్నారు. నోబెల్ బహుమతి సొమ్ములో ప్రతి పైసా పేద పిల్లల కోసమే వెచ్చిస్తానని చెప్పారు. ఆయన భారత్‌లో దిగీ దిగగానే ట్వీటర్‌లో ‘జై హింద్’ అంటూ ట్వీట్ చేశారు.