(వెబ్ స్పెషల్): నోబెల్ శాంతి బహుమతి.. ప్రపంచ శాంతికి కృషి చేసిన ఎందరికో ఈ బహుమతిని ప్రదానం చేశారు. మరి భారత్, ఆఫ్రికా దేశాల్లో శాంతియుత పోరాటాలు చేసిన జాతిపిత, మహాత్మగాంధీని ఈ బహుమతిని ఎందుకు వరించలేదు. ఈ ప్రశ్నే గాంధీ జయంతి(అక్టోబర్ 2న) సందర్భంగా కోట్లాది మంది భారతీయులను తొలుస్తోంది. అందుకు గల కారణాలు తెలుసుకుందాం. నోబెల్ శాంతి పురస్కారంతో గౌరవించడం రెడ్ క్రాస్ స్థాపకులు జీన్ హెన్రీ డ్యూనెంట్ నుంచి ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు 19 సార్లు ఈ పురస్కారాన్ని ప్రకటించలేదు. ఇక 27 సార్లు ఈ పురస్కారాన్ని వ్యక్తుల కంటే సంస్థలకు ఇవ్వడమే సబబని భావించారు. ఒక్కసారి నోబెల్ బహుమతిని ప్రదానం చేసిన తర్వాత తిరిగి వెనక్కు తీసుకోరు. అందుకే బహుమతికి ఎంపిక చేసే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇక జాతిపితకు ఈ పురస్కారం దక్కకపోవడం పట్ల పలు వివరణలు వినిపిస్తాయి. ముఖ్యంగా గాంధీజీకి ఈ పురస్కారం ఇచ్చి ఆంగ్లేయ పాలకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోకూడదని నోబెల్ కమిటీ భావించిందనే వాదన ఎక్కువగా ప్రచారంలో ఉంది.(చదవండి: నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ నామినేట్)
నాలుగు సార్లు నామినేట్ అయిన గాంధీ
నోబెల్ శాంతి పురస్కారానికి గాంధీ నాలుగు సార్లు నామినేట్ అయ్యారు. ఆయనను వరసగా 1937, 1939లో నామినేట్ చేశారు. 1947లో కూడా ఆయన నామినేట్ అయ్యారు. చివరగా 1948లో గాంధీని నామినేట్ చేశారు. కానీ తర్వాత రెండు రోజులకే ఆయన హత్యకు గురయ్యారు. మొదటిసారి ఒక నార్వే ఎంపీ గాంధీ పేరును సూచించారు. పురస్కారం ఇచ్చే సమయంలో కమిటీ ఆయనను పట్టించుకోలేదు. దీని గురించి నోబెల్ కమిటీలోని జాకబ్ వార్మూలర్ అనే సలహాదారు గాంధీకి నోబెల్ పురస్కారం ఇవ్వకపోవడం గురించి తన అభిప్రాయం రాశారు. ‘గాంధీ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తను చేస్తున్న అహింసా ఉద్యమం ఎప్పుడో ఒకప్పుడు హింసాత్మకంగా మారొచ్చని తెలిసినా దానిని వీడలేదు’ అని పేర్కొన్నారు. అంతేకాక ‘దక్షిణాఫ్రికాలో, భారత్‌లో ఆయన కేవలం తన దేశస్తుల కోసమే పోరాడారు. నల్లజాతి వారికోసం ఆయన ఏం చేయలేదు’ అని రాసుకొచ్చారు. (చదవండి: సరైన నేతకు ‘నోబెల్ శాంతి’)
1947లో మరోసారి..
1947 లో నోబెల్ కోసం గాంధీని బీజీ ఖేర్, జీవీ మౌలాంకర్, జీపీ పంత్ నామినేట్ చేశారు. ఆ సమయంలో కమిటీ ఛైర్మన్ గున్నార్ జాన్ ఇద్దరు సభ్యులు, క్రిస్టియన్ కన్జర్వేటివ్ హర్మన్ స్మిట్ ఇంజిబ్రేట్సెన్, క్రిస్టియన్ లిబరల్ క్రిస్టియన్ ఒఫ్టెడల్ గాంధీ వైపు మొగ్గు చూపారు, కాని మిగతా ముగ్గురు - లేబర్ రాజకీయ నాయకుడు మార్టిన్ ట్రాన్మాల్, మాజీ విదేశాంగ మంత్రి బిర్గర్ బ్రాడ్‌ల్యాండ్‌లు వ్యతిరేకించారు. దేశ విభజన సమయంలో చెలరేగిన అల్లర్లు.. గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ఆయనకు ఆ ఏడాది పురస్కరం లభించలేదు. దేశ విభజన వల్ల భారత్-పాక్‌ల మధ్య యుద్ధం తప్పక వస్తుందని కమిటీ భావించింది. దాంతో గాంధీకి పురస్కారం దక్కలేదు. దాంతో అది మానవ హక్కుల ఉద్యమం ‘క్వేకర్’కు లభించింది.
1948లో మరోసారి.. ఒట్టిదే
నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ చివరి తేదీకి రెండు రోజుల ముందు గాంధీ హత్య జరిగింది. ఆ సమయానికే నోబెల్ కమిటీకి గాంధీ తరఫున ఆరు సిఫార్సులు అందాయి. వాటిలో 1946, 47 అవార్డు గ్రహీతలు ది క్వేకర్స్, ఎమిలీ గ్రీన్ బాల్చ్ ఉన్నారు. కానీ అదే ఏడాది గాంధీ మరణించారు. దాంతో కొత్త సమస్య తెరమీదకు వచ్చింది. అప్పటి వరకు మరణానంతరం ఎవరికీ నోబెల్ పురస్కారం ఇవ్వలేదు. దాంతో మరో సారి నోబెల్ ఆశ నిరాశ అయ్యింది. అయితే ప్రస్తుతం మరణించిన తర్వాత కూడా ఇస్తున్నారు. దీంతో పాటు మరో ప్రశ్న కూడా ఎదురయ్యింది. శాంతి పురస్కారం నగదు ఎవరికి చెల్లించాలి అని. ఎందుకంటే అప్పటికి గాంధీ పేరు మీద ట్రస్టుగానీ, సంఘం గానీ లేదు. ఆయనకంటూ ఎలాంటి ఆస్తులు కూడా లేవు. దీనికి సంబంధించి ఆయన ఎలాంటి వీలునామా కూడా రాయలేదు. దాంతో మరోసారి నోబెల్ చేజారింది. (చదవండి: గాంధీజీ కళ్లజోడు.. జీవితాన్నే మార్చేసింది!)
ఇక ఆ ఏడాది ఎవరికి నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వలేదు. దీని గురించి కమిటీ ‘జీవించి ఉన్న ఏ అభ్యర్థినీ శాంతి పురస్కారానికి తగిన వారుగా భావించలేదు’ ప్రకటించింది. ఇక్కడ 'జీవించి ఉన్న' అనే మాట చాలా ముఖ్యమైనది. దానిని బట్టి, మరణానంతరం ఎవరికైనా పురస్కారం ఇచ్చే అవకాశం ఉండుంటే, అది కచ్చితంగా గాంధీకి తప్ప వేరే వారికి దక్కేది కాదనేది స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment