పుణ్యదంపతులు పుత్లీ బాయి, కరంచంద్ గాంధీలకు 1869 అక్టోబర్ 2న జన్మించిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడై మన దేశానికి ఖ్యాతి తెచ్చిన వారిలో అగ్రగణ్యుడుగా నిలి చాడు. మానవాళికి ఎన్నో కొత్త మార్గాలతో తనదైన సరళిలో వెలుగు చూపిన పుణ్యపురుషుని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ మహాత్ముని జీవితం నుంచి మనం నేర్చుకోదగినవి ఎన్నో. జాతిని ఏకతాటిపై నడిపించే నాయకులకు ఆర్థిక, సామాజిక, నైతిక విధా నాలపై ఎంతటి అవగాహన ఉండాలో గమనిద్దాం.
మహాత్మా గాంధీ అనగానే మనకి స్వతంత్ర సమరం గుర్తుకొస్తుంది. స్వాతంత్య్రమనగానే గాంధీజీ గుర్తుకొస్తారు. అన్ని మత ధర్మాలను చదివి, మంచి విషయాలను ఏరుకొని తనదైన సరళిలో కొత్త కొత్త మార్గాలను సృష్టించారు. వారి విధానాలకు ఎంతో ప్రభావితులమైన మనకు ‘ఒక చెంప కొడితే మరో చెంప చూపడమ’నేది సనాతన ధర్మంలో లేని విషయం అంటే ఆశ్చర్యమేస్తుంది. మన ఆలోచనా విధానాలను ఆయన అంతగా ప్రభావితం చేశారు.
ఒక్క మనల్నే మిటి సమస్త ప్రపంచాన్నీ ఎంతో ప్రభావితం చేశారు. అందుకే ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ‘గాంధీజీ లాంటి వ్యక్తి రక్తమాంసాలతో ఈ నేలపై నడయాడారంటే ముందు తరాలవారు నమ్మలేకపోతారు’ అన్నారు. విదేశీ విశ్వవిద్యాలయా లలో గాంధీజీపై ఏకంగా కోర్సులే నిర్వహిస్తున్నారు (ఉదాహరణకు వర్జీనియా, కొలంబో, ఎడింబరో విశ్వవిద్యాలయాలు).
‘సత్యమేవ జయతే’ అన్నది ఎన్నోతరాలుగా తెలి సిన సత్యం. కానీ ఆచరణలో చూపి అది అందరికీ సాధ్యమని, సత్యాగ్రహం ఒక గొప్ప ఆయుధం అని నిరూపించారు గాంధీజీ. జీవన మార్గాలపై ఎన్నో ప్రయోగాలు చేసిన గాంధీజీ తన ఆత్మకథకు ‘మై ఎక్స్‌పరిమెంట్స్ విత్ ట్రూత్’ అని పేరుపెట్టారు. దానికి అదే సరైన పేరు. అప్పటికే మహాత్ముడిగా పేరొందిన గాంధీజీ (ఆ బిరుదును రవీంద్రనాథ్ టాగోర్ ఇచ్చారు), తన ఆత్మకథలో తన తప్పిదాలను ఎన్నో ప్రస్తావించారు.
చిన్నప్పుడు పొగతాగుతూ పట్టుబడి తండ్రి చేతిలో దెబ్బలుతిన్న విషయం ప్రస్తావించారు. పెళ్ళైన తరువాత విదేశాలకు వెళ్తు న్నప్పుడు తల్లితో మద్యం, మాంసం, మగువలను ముట్టనని ఒట్టువేసి వెళ్ళారు. మద్యం ఒకసారీ, మాంసం ఒకసారీ రుచి చూడడం చేశానని రాసు కొన్నారు. మగువ విషయంలోనూ ఒకానొకప్పుడు ఎంతో ఉద్వేగానికి గురై త్రుటిలో తప్పించుకొన్నాననీ రాసుకొన్నారు. మామూలు మనుషులైతే తప్పి పోయిన ఒట్టు గురించి ప్రస్తావనే చేసేవారు కాదేమో. అంతటి సత్యవాది కనుకనే ఆయన మహాత్ము డైనాడు.
అహింస గురించి బుద్ధుడు, అశోకుడు ఎంతో ప్రచారం చేశారు. కానీ అహంస ఒక తిరుగులేని గొప్ప ఆయుధం అని నిరూపించడం గాంధీకే సాధ్యమైంది. ఆయన చూపిన అహింస సత్యాగ్రహాలను వాడి మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా మహోన్నత చరితులుగా నిలిచారు. కొద్ది సంవత్సరాల క్రితం మండేలా కనుమూసినప్పుడు ఆయనను, ఆయన అనుసరించిన అహింసామార్గాన్ని శ్లాఘించని ప్రపంచ పత్రిక లేదు. అసంఖ్యాకులు పాల్గొనే ఉద్యమంలో అహింసా మార్గాన్ని మొదటిసారిగా ప్రయోగించి దానికి వెలుగు తెచ్చిన మహాత్ముడు మన గాంధీజీ.
రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశ లింగం వంటి సంఘసంస్కర్తలు అంటరాని తనాన్ని ఖండించారు. ఐతే వారి ప్రభావం కేవలం విద్యా వంతుల మీద మాత్రమే వున్నది. కానీ గాంధీజీ అస్పృశ్యతా నివారణ చేపట్టిన తరువాత అంటరాని తనం అమానుషమని చాలామంది గమనించారు. బాల్యవివాహాలను ఖండించారు. బాలవితంతువుల పునర్వివాహాలను ప్రోత్సహించారు. బోధించిన ప్రతి విషయాన్ని ఆచరణలో చూపే గాంధీజీ తత్వం, ఆయన ఏ ఉద్యమం చేపట్టినా విజయవంతం చేసేది.
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని నినదించి పల్లెసీమల బడుగు వర్గాల అభివృద్ధికి పాటుబడ్డారు. పదిమందికీ మేలుజరగని దేశాభివృద్ధి అర్థరహితమైన అభివృద్ధని కుటీర పరిశ్రమలను ప్రోత్సహించారు. విదేశీ వస్తువులను బహిష్కరించి తన స్వహస్తాలతో రాట్నం తిప్పి నూలు వడికి ఖద్దరు ధరించి స్వాతంత్య్ర సమరానికి రాట్నాన్ని చిహ్నం చేశారు. దేశ ఆర్థిక, సామాజిక, నైతిక పరిస్థితుల గురించి ఆలోచించే సమగ్ర సమదర్శకులు ఆయన.
అన్ని విషయాలనూ క్షుణ్ణంగా పరిశీలించే సంపూర్ణ మేధావిగా గాంధీజీ నిలిచారు. అనుక్షణం దైవస్మరణలో జీవితం గడిపే గాంధీజీకి తెలుగువారిలో ప్రముఖ నాస్తికవాదులుగా పేరొందిన గోరాకి సత్సంబంధాలుండేవి. మార్గాలు వేరైనా మానవతావాదులుగా ఒకటైన వారి స్నేహం ఎలాగుండేదంటే గోరా గారి పుత్రుడైన లవణంకు ప్రముఖ తెలుగుకవి గుర్రం జాషువా పుత్రిక హేమ లతతో వివాహం గాంధీ ఆశ్రమంలో వారి అభినం దనలతో జరిగింది. బాపూజీతో ఎన్నో అభిప్రాయ భేదాలున్న నేతాజీ గాంధీజీని అందరికన్నా ముందుగా జాతిపితగా అభివర్ణించారు.
వ్యాసకర్త: ప్రొఫెసర్ ఎమ్‌ఆర్‌కే కృష్ణారావు, గాయత్రీ విద్యాపరిషత్, వైజాగ్, మొబైల్: 93924 81282
Comments
Please login to add a commentAdd a comment