నేడు గాంధీ జయంతి
‘రక్త మాంసాల దేహంతో అలా ఓ మనిషి ఈ నేలమీద నడయాడాడని చెబితే, ముందు తరాల వారు నమ్మరు’ అన్నాడు ఐన్‌స్టీన్. టాల్ స్టాయ్, జోసెఫ్ స్టాలిన్, విన్‌స్టన్ చర్చిల్, జె.ఎఫ్. కెన్నెడీ, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా దాకా... ఎందరో గాంధీజీ వల్ల ప్రభావితం అయ్యారు. గాంధీజీ ఆత్మకథ పిల్లలందరూ చదవాలి. లేదా కనీసం ఆయన పై వచ్చిన సినిమాలు చూడాలి. గాంధీపై వచ్చిన కొన్ని సినిమాలు. అలాగే గాంధీ గారి వల్ల వచ్చిన సినిమాలు
మోడర్న్ టైమ్స్: 1936లో వచ్చిన ఈ సినిమా నేటికీ గొప్ప క్లాసిక్‌గా నిలిచి ఉంది. యంత్రం కంటే మానవుడే గొప్పవాడు అని చెప్పే సినిమా అది. చార్లి చాప్లిన్ ఈ సినిమా తీసి నటించడానికి కారణం గాంధీ మహాత్ముడు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ లండన్ వెళ్లినప్పుడు అక్కడ చార్లీ చాప్లిన్‌ను కలిశాడు. అప్పటి వరకూ చార్లీ చాప్లిన్ యంత్రాలు మనుషులను శ్రమ నుంచి విముక్తి చేస్తాయని భావించాడు. కాని గాంధీజీ చెప్పిన మాటల వల్ల యంత్రాలు మనిషికి సహాయం చేయడం కంటే అతడికి పని కోల్పోయేలా చేయడమే గాక బానిసగా చేసుకుంటున్నాయని అర్థం చేసుకున్నాడు. ఆ ప్రభావంతోనే చాప్లిన్ మోడర్న్ టైమ్స్ తీశాడు.
ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మ: భారతదేశంలో గాంధీ అడుగు పెట్టి బ్రిటిష్ వారిపై పోరాడక ముందు దక్షిణాఫ్రికాలో ఆయన వర్ణ వివక్షపై పోరాడాడు. గాంధీలోని పోరాటగుణం, అన్యాయానికి వ్యతిరేకంగా నిలిచే సాహసం దక్షిణాఫ్రికాలోనే రూపుదిద్దుకున్నాయి. అక్కడ ఒక చలిరాత్రి ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్ నుంచి గాంధీని కిందకు దించి అవమానించారు, ఆయన దగ్గర టికెట్ ఉన్నా, నల్లవాళ్లు ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించకూడదని. ప్రతి వ్యక్తికీ ఆత్మగౌరవంతో, స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో, సమాన భావనతో జీవించే హక్కు ఉందని చాటడమే గాంధీజీ జీవన సందేశం. అది ‘ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మా’లో చూడవచ్చు. శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1996లో విడుదలైంది. రజత్ కపూర్ గాంధీగా నటించాడు.
లగే రహో మున్నాభాయ్: గాంధీజీ అంటే చౌరస్తాలో కనిపించే ఒక విగ్రహం కాదు, గాంధీ జయంతి రోజు స్కూళ్ల సెలవుకు కారణమయ్యే ఒక వ్యక్తి కాదు... గాంధీజీ అంటే జీవన మార్గదర్శి. జీవితం నిర్భయంగా సాగాలంటే గాంధీజీ అనుసరించిన మార్గంలో నడిస్తే చాలు. ఆశ, దురాశ, అవినీతి, ఆడంబరం... ఇవన్నీ లేకపోతే జీవితం సులభంగా ఉంటుందని చెప్పే సినిమా ‘లగే రహో మున్నాభాయ్’. 2006లో వచ్చిన ఈ సినిమా గాంధీజీని కొత్త తరానికి మరోసారి పరిచయం చేసింది. అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమాను రాజ్ కుమార్ హిరాణి సాధించాడు. వీధి రౌడీగా ఉండే ఒక వ్యక్తి గాంధీ ప్రభావంతో ఎలా మారాడనేది కథ. సంజయ్ దత్ హీరో.
గాంధీ మై ఫాదర్: ఇది మొదట తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. మహాత్ములు విశాల ప్రజానీకం కోసం ఎన్ని త్యాగాలు చేసినా కుటుంబం దృష్టికోణంలో వాళ్లేమిటి అనేది కూడా ముఖ్యమే. మహాత్మునిగా గాంధీజీ ఆరాధ్యనీయుడు. కాని సొంత కొడుకు దృష్టిలో ఆయన గొప్ప తండ్రిగా ఉన్నాడా? గాంధీ కుమారుడు హరిలాల్ తన తండ్రి గాంధీలా లేదా గాంధీ అనుయాయుల్లా ఏనాడూ వెలుగులోకి రాలేదు. తండ్రి మీద ఎన్నో ఫిర్యాదులు పెట్టుకున్నాడు. అతని ఆత్మకథ ఆధారంగా తీసిన సినిమా ‘గాంధీ మై ఫాదర్’. 2007లో వచ్చిన ఈ సినిమాలో గాంధీ కుమారుడు హరిలాల్‌గా అక్షయ్ ఖన్నా నటించాడు.
గాంధీ: మన మహాత్ముని సినిమాను మన దర్శకులు తీయలేకపోయినా బ్రిటిష్ డైరెక్టర్ తీశాడు. ఏ బ్రిటిషర్ల మీద గాంధీజీ పోరాడారో ఆ బ్రిటిష్ జాతి నుంచి అటెన్ బరో వచ్చి ఈ సినిమా తీసిప్రాయశ్చిత్తం చేసుకున్నాడని భావించాలి. గాంధీ జీవితంపై సినిమా తీసేందుకు 1952 తర్వాత నుంచి ప్రయత్నాలు జరిగాయి. రిచర్డ్ అటెన్ బరోనే 1960ల్లోనే ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు 1980 నవంబర్‌లో అటెన్ బరో ఈ సినిమా షూటింగ్‌ప్రారంభించారు.
1981 మే నెలలో షూటింగ్ పూర్తి అయింది. గాంధీ పాత్రను బెన్ కింగ్‌స్లే పోషించారు. నెహ్రూ పాత్రలో రోషన్ సేథ్, గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే పాత్రలో హర్‡్ష నాయర్ నటించారు. 1982 నవంబర్ 30న ఢిల్లీలో విడుదలైంది. ఆ తర్వాత ఈ సినిమాను అమెరికా, బ్రిటన్ లలో కూడా విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఈ సినిమాకు గొప్ప స్పందన వచ్చింది. గొప్ప కలెక్షన్లు సాధించింది. ఆస్కార్ పురస్కారాలను గెలుచుకుంది. మహాత్మాగాంధీని తెరపై కళ్లకు కట్టినట్లు చూపిన బెన్ కింగ్‌స్లేకి ఆస్కార్ అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment